దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నామని పదేపదే ప్రగల్భాలకు పోతోంది మోడీ ప్రభుత్వం. మోడీ మాటలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు భిన్నంగా దేశంలో భారీగా నిరుద్యోగం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. పిల్లలకు పోషకాహారం దొరకడం లేదు. ఫారెక్స్‌ నిల్వలు హరించుకుపోతున్నాయి. వాణిజ్య లోటు పెరిగిపోతోంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) ఐదు మాసాల కనిష్టానికి పడిపోయింది. 2015-2023 మధ్యకాలంలో 18 లక్షల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (యంఎస్‌యంఇ) మూతపడి 24 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. శ్రామిక శక్తి గణనీయంగా తగ్గింది. రుణభారం పెరిగిపోతోంది. విదేశీ నిధులు రావడం లేదు. రూపాయి మారక విలువ పడిపోయింది. ప్రజల ఆదాయాలు తగ్గడంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. పర్యవసానంగా పెదల సంఖ్య పెరిగిపోతోంది. నిజానికి ప్రజల ఆదాయాలు, జీవన ప్రమాణాల్లో మెరుగుదలే అభివృద్ధికి సరైన కొలమానం.

పేదరికం, రుణభారం అధిగమించకుండా ఆర్థికాభివృద్ధి అసాధ్యమని ప్రపంచ బ్యాంక్‌ అభివృద్ధి నివేదిక-2024 పేర్కొంది. కాలం చెల్లిపోయిన విధానాలపై ఆధారపడడం అభివృద్ధికి ఆటంకంగా ఉందని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. అమెరికా తలసరి ఆదాయంలో కేవలం మూడోవంతు చేరుకోవాలన్నా భారత్‌కు సుమారు 75 సంవత్సరాలు పడుతుందని బ్యాంక్‌ తెలిపింది. బ్రిటిష్‌ వలసవాదుల నుండి అధికార బదిలీ జరిగి 77 సంవత్సరాలు గడిచినా నిరుద్యోగం, పేదరికం, అసమానతలు, విద్యా, వైద్యం, జీవన భద్రత వంటి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఎన్ని సూచనలు చేసినా పాలకులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా బిజెపి ప్రభుత్వం సమస్యల తీవ్రతను పెంచుతుంది. ఫలితంగా సామాజిక అసంతృప్తి పెరుగుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ  అద్భుతంగా పురోగమిస్తోందని, వినియోగదారులు, ఉత్పత్తిదారులు భవిష్యత్తు పట్ల ఆశాజనకంగానూ, విశ్వాసంగాను ఉన్నారని ఆర్‌ఎస్‌ఎస్‌, గోడీ మీడియా విస్తృత్తంగా ప్రచారం సాగించడం ఆత్మవంచనకు పరాకాష్ట.

జిడిపిలో కొత్త ఎత్తులకు చేరుతున్న ఇండియా తలసరి ఆదాయం పరంగా 140 దేశాలకన్నా దిగువకు పరిమితమైంది. ఆక్స్‌ఫామ్‌ నివేదిక ప్రకారం జనాభాలో ఒక శాతం చేతుల్లో 40 శాతం దేశ సంపద పోగుపడిరది. ప్రజ్వరిల్లుతున్న ఆర్థిక అసమానతలు దాటికి ఎందరి జీవితాలో దుర్భరమవుతున్నాయి. సమానతల గురించి హురున్‌ లిస్ట్‌ ప్రకారం, 2012-22 మధ్యకాలంలో, అత్యంత సంపన్నులైన వ్యక్తులు లేదా కుటుంబాల (రూ.1000 కోట్లకు పై చిలుకు) సంఖ్య 10 రెట్లు (100 నుండి 1103కు) పెరిగింది. డాలర్‌ బిలియనీర్ల సంఖ్య కూడా దాదాపు నాలుగు రెట్లు (59 నుండి 221)కు పెరిగింది. ఈ జాబితాలో తాజా (2024) ఎడిషన్‌ ప్రకారం కేవలం ఒక్క ఏడాదిలోనే భారత్‌లో 94 మంది బిలియనీర్లు కొత్తగా తయారయ్యారు. చైనాలో ఈ సంఖ్య 55గా ఉంది. ఊహించినట్లుగానే ముఖేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీలు అత్యధికంగా సంపదను ఆర్జించారు. (ఒక్కొక్కరు 33 బిలియన్‌ డాలర్లు చొప్పున) బీజింగ్‌ (91)ను అధిగమించి ఈనాడు ముంబయిలో మరే ఇతర ఆసియా నగరంలో లేనంతగా అత్యధిక సంఖ్యలో కోటీశ్వరులు(92) ఉన్నారు. ఆసియా శత కోటీశ్వరుల రాజధానిగా పేరుగాంచింది. అదే సమయంలో ప్రపంచ దేశాల్లో పేద ప్రజల జనాభాలో ఎక్కువగా ఉన్నది ఇండియాలోనేనని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి తాజాగా వెల్లడిరచింది. విశ్వవ్యాప్తంగా 110 కోట్ల మంది పేదలుంటే, అందులో 23.4 కోట్ల మంది భారతీయులేనన్న చేదు వాస్తవం. మన ప్రగతి వెలుగుల మాటున కారుచీకట్లలో మగ్గిపోతున్న జీవితాలకు అద్దంపడుతోంది.

ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం మూడోసారి కూడా అధికారంలోకి వచ్చింది. స్వంత బలం లేకున్నా హంగ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం గాడిలో పడటం లేదు. ప్రజలు పీకల్లోతు అప్పుల్లో, కష్టాల్లో కూరుకుపోతున్నా సర్కారు కార్పొరేట్లకే జై కొడుతోంది. ఆర్థిక వృద్ధి అంటే సెన్సెక్స్‌ పరుగులు పెట్టడం కాదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదు.  ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగజారుతూనే ఉంది. ప్రజల వినియోగ వ్యయం గణనీయంగా పడిపోతోంది. దూరపు కొండలు ఎప్పుడూ నునుపే.  దూరం నుండి చూస్తే అంతా అందంగా, అద్భుతంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ‘మేడి పండు చూడ మేలిమై ఉండును… పొట్ట విప్పి చూడు పురుగులుండు’ అన్న చందంగా మన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది.. భారత ఆర్థిక  వ్యవస్థ  మందగించింది. ఆర్‌బిఐ అంచనాలు మించి జిడిపి పతనం కావడం ఆర్థిక వ్యవస్థ  పట్ల ఆందోళన కలిగిస్తోంది. జిడిపి పడిపోతుందంటే దేశంలో ఆర్థిక కార్యకలాపాలు సన్నగిల్లుతున్నాయని అర్థం.

రంగాల వారిగా పరిశీలిస్తే ఎన్‌డిఎ హయాంలో, ఉత్పత్తి పొందిక (వివిధ రంగాల వాటాలు వంటివి) ఏమాత్రం మారలేదు. ఉదాహరణకు, మన అధికారిక లెక్కలను బట్టి చూసినట్లైతే తయారీ రంగం వాటా దాదాపు 18 శాతతం (2011-12 ధరల వద్ద) దగ్గరే స్తంభించిపోయింది. ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా మారలేదు. 2017-18, 2022-23 మధ్యకాలంలో పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) ప్రకారం, 43 శాతం మంది కార్మికులు వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల్లో అసంఘటిత కార్మికులుగా పని చేస్తున్నారు. ముఖ్యంగా భారత్‌ తన తయారీ రంగాన్ని అభివృద్ధి పరుచుకోవడంలోని అశక్తత ఆందోళన కలిగిస్తోంది. ఈ రంగంలో వృద్ధి ఉంటేనే ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడతాయి. ఎన్‌డిఎ హయాంలో తయారీ రంగం అభివృద్ధి రేటు క్షీణతను నమోదు చేసింది. 2015-16లో, వార్షిక తయారీ రంగ వృద్ధి దాదాపు 13 శాతంగా ఉంది. కానీ ఆ తర్వాత 2019-20లో మైనస్‌ 3 శాతానికి క్షీణిస్తూ వచ్చింది. 2019-20 తర్వాత అభివృద్ధి  రేటు పెరిగినప్పటికీ, ఇది కొవిడ్‌ ముందు స్థాయికి చేరుకోవడమే. ఆ రికవరీ తర్వాత ఇక తిరోగమనం కొనసాగింది. అభివృద్ధి చెందిన లేదా తూర్పు ఆసియా దేశాల చారిత్రక అనుభవం మాదిరిగా కాకుండా, భారత్‌, తయారీ రంగంలో క్షీణతను నమోదు చేస్తోంది.

తయారీ అనేది పనిముట్లు, మానవ శ్రమ, యంత్రాలు, రసాయనలిలు ప్రాసెసింగ్‌ ద్వారా పూర్తయిన వస్తువులను సృష్టించడం, ముడి పదార్థాల నుండి విలువైన ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసిన తర్వాత పెద్ద పరిమాణంలో వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమను తయారీ పరిశ్రమ అంటారు. గ్లోబల్‌ మ్యాను ఫ్యాక్చరింగ్‌ అవుట్‌ పుట్‌లోని అగ్రతయారీ దేశాలుగా చైనా (31.6 శాతం) యునైటెడ్‌ స్టేట్స్‌ (15.9 శాతం), జపాన్‌ (6.5 శాతం), జర్మనీ (4.8 శాతం), భారతదేశం (2.9శాతం), దక్షిణ కొరియా (2.7 శాతం) ఉన్నాయి. భారతదేశంలో తయారీ కార్యకలాపాలు ఎలక్ట్రానిక్స్‌, ఆటోమోటివ్‌, టెక్స్‌టైల్స్‌, ఫార్మా స్యూటీకల్స్‌తో సహా అనేక పరిశ్రమలలో పెరుగుతున్నాయి. దేశం మొత్తం ఉత్పత్తిలో తయారీ రంగం వాటా 17 శాతం కాగా  2 కోట్లకు పైగా కార్మికులతో, తయారీ రంగం భారత ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భారతదేశం 2025 నాటికి స్థూల దేశీయోత్పత్తిలో తయారీ రంగం వాటాను 25 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఆ దిశలో అడుగులు పడడం లేదు. నిరాశ కలిగించే భారతదేశ తయారీ రంగ పని తీరులో ఎన్‌డిఎ వైఫల్యం, అలాగే బిజెపి ప్రభుత్వం చేపట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమ వైఫల్యం ప్రతిబింబిస్తోంది.

భారత ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నట్లు ప్రపంచంలో అత్యధిక జిడిపి (స్థూల జాతీయ ఉత్పత్తి) గల దేశాల్లో మనం 5వ స్థానంలో ఉన్నమాట నిజమే. మనదేశం త్వరలోనే జపాన్‌, జర్మనీని అధిగమించి మూడవ స్థానానికి చేరుకుంటామనేది అంకెల్లో నిజం కావచ్చును. జపాన్‌, జర్మనీ జనాభా రీత్యా, వైశాల్యం రీత్యా చాలా చిన్న దేశాలు. వాటి జిడిపిని అధిగమించడం అంత గొప్ప ఘనకార్యం మాత్రం కాదు. మొదటి స్థానంలో ఉన్న అమెరికా జిడిపి 29000 బిలియన్‌ డాలర్లు. తలసరి ఆదాయం 85 వేల డాలర్లు. రెండవ స్థానంలో ఉన్న చైనా జిడిపి 19000 బిలియన్‌ డాలర్లు. తలసరి ఆదాయం 14000 డాలర్లు. ప్రస్తుత భారత్‌ జిడిపి 3,942 బిలియన్‌ డాలర్లు. తలసరి ఆదాయం 2730 డాలర్లు. మూడో స్థానంలోకి వచ్చినా జిడిపిలో, తలసరి ఆదాయంతో ఎంతో దిగువలోనే ఉంటాం. అంటే దేశంలో జిడిపి ప్రజల జీవితాల్లో చిన్న మార్పు కూడ రాదన్నది యదార్థం. పెరిగిన సంపదను 200 మంది కుబేరుల చెంతకు చేరుతోంది తప్ప ప్రజలకు పంపిణి జరుగడం లేదు. యుఎన్‌డిపి ప్రపంచ మానవాభివృద్ధి సూచీలో మనం 134వ స్థానంలో, ఆకలి సూచీలో 105వ స్థానంలో ఉన్నాం.మొత్తం మీద మోడీ పాలన కార్పొరేట్ల చేత, కార్పొరేట్ల కోసం సాగుతున్న పాలనగా ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటోంది.

భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని వివిధ ప్రభుత్వ శాఖలు ఇటీవల విడుదల చేసిన వివిధ గణాంకాలు విధితం జేస్తున్నాయి. రూపాయి విలువ క్షీణించడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఉపాధి రహిత వృద్ధి, ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరుగడం, స్టాక్‌ మార్కెట్‌ నుండి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, విపరీతమైన విదేశీ రుణాలు, విదేశీ వాణిజ్య లోటు వంటివి మన ఆర్థిక వ్యవస్థ దుస్థితిని వెల్లడిస్తున్నాయి. ఏడు శాతం వృద్ధితో ఆర్థికాభివృద్ధిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నా 90 శాతం మంది ప్రజలకు దీని ప్రయోజనాలు అందడం లేదన్నది కఠోర వాస్తవం. ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన ధరల పెరుగుదల ప్రభుత్వ గణాంకాలకు అందనంత! పెరుగుతున్న నిరుద్యోగం, వేతన పెరుగుదల లేకపోవడం వలన ప్రజల కొనుగోలు  శక్తిని క్షీణింపజేసింది. ఏడు శాతం వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ చలనశీలంగా కాకుండా స్తబ్దుగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ  స్థిరత్వంపై విదేశీ పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారు. విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను భారతీయ స్టాక్‌ మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకుంటున్నారు. విదేశీ మదుపరులు అక్టోబర్‌ నెలలో  రూ.85,000 కోట్ల విలువైన షేర్లను వెనక్కి తీసుకున్నారు.

ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా 2008లో భారతీయ స్టాక్‌ మార్కెట్‌ నుండి విదేశీ పెట్టుబడులు ఉపసంహరించబడ్డాయి. అప్పట్లో అది పెద్ద ప్రభావం చూపింది. రూపాయి విలువ క్షీణతకు అది కూడా కారణమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి అత్యధికంగా నష్టపోయింది. మొన్నటిరోజు డాలర్‌ విలువ రూ.84.07 పైసలు. ఆ మారకపు విలువను కొనసాగించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ తన నిల్వల నుంచి పెద్ద మొత్తంలో డాలర్లను విడుదల చేస్తోంది. ఇది విదేశీ మారక నిల్వలను కూడా తగ్గిస్తుంది. మోడీ ప్రభుత్వం 2014 మేలో అధికారంలోకి వచ్చినప్పుడు డాలర్‌ మారకం విలువ రూ.59.44 పైసలు కాగా పదేళ్లలో దాదాపు రూ.25 పడిపోయి రూ.84కి దిగజారింది. విదేశీ వాణిజ్య లోటు కూడా పెరుగుతోంది. ఆగస్టులో వాణిజ్య లోటు 2,970 డాలర్లకు పెరిగింది. గతేడాది ఆగస్టులో ఇది 2,421 కోట్లు. భారతదేశ ఎగుమతులు చాలా బలహీన స్థితిలో ఉన్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజల కొనుగోలు శక్తిని కూడా తగ్గిస్తుంది. 40 నెలల్లో అత్యల్ప వృద్ధిరేటు (-) 6.5 శాతం నమోదైంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటుతో పోలిస్తే సెప్టెంబర్‌లో జిఎస్‌టి ఆదాయం పెద్దగా పెరగలేదు.

బొగ్గు, విద్యుత్‌, ముడిచమురు ప్రాసెసింగ్‌, మైనింగ్‌ వంటి ఎనిమిది కీలక రంగాల్లో ఉత్పత్తిపై ఆధారపడిన పారిశ్రామికోత్పత్తి సూచీ ఆగస్టులో ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే సెప్టెంబర్‌లో కార్ల విక్రయాలు 19 శాతం తగ్గాయి. సేవల రంగ సూచీ కూడా 10 నెలల కనిష్టానికి చేరింది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో గృహ రుణాల పంపిణీ తొమ్మిది శాతం పడిపోయింది. బలమైన చలనశీలమైన ఆర్థిక  వ్యవస్థకు అవసరమైన ఇటువంటి అంశాలు క్షీణిస్తున్నాయి. పేలవమైన ఆర్థిక  విధానాల ఫలితంగా మధ్యతరగతి, దిగువ తరగతుల వారి ఆదాయం తగ్గింది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కొనుగోలు శక్తి లేకపోవడం. కొనుగోలు శక్తి కొవిడ్‌ పూర్వ స్థాయికి చేరుకోలేదని చాలా సూచికలు చూపిస్తున్నాయి. కొనుగోలు శక్తిని పెంచుకోవాలంటే దిగువన ఉన్న 50 శాతం మంది చేతిలో ఎక్కువ డబ్బు ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇతర సంక్షేమ పథకాల కేటాయింపులు పెంచడం లేదు. దానికి బదులుగా, కార్పొరేట్లకు పన్ను మినహాయింపులతో సహా భారీ సబ్సిడీలు ఇస్తోంది. మాంద్యం నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు సంక్షేమ పథకాలను, సబ్సిడీలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావాలి. అలా చేయాలంటే ప్రజా ఒత్తిడి పెంచాలి.

ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార భద్రత పోషకాహార స్థితి తాజా నివేదిక 2024 ప్రకారం దేశ జనాభాలో 55.6 శాతం ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేదు. ఐదేళ్ల వయస్సు కంటే తక్కువ ఉన్న పిల్లల్లో వేస్టింగ్‌ 18.7 శాతం, స్టంటింగ్‌ 31.7 శాతం. తక్కువ బరువు 27.4 శాతం పిల్లలు ఉన్నారని తెలిపింది. 15 నుండి 49 మధ్య వయస్సు మహిళలో పోషకాహారలోపం 18.7 శాతం ఉంది. దేశ జనాభాలో సరైన ఆహార లభ్యంకాక 16.6 శాతం పోషకాహార లోపంతో ఉన్నారని,  కనీసం 38 శాతం అనారోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నారని ఈ యేడాది మే 29న విడుదల చేసిన గ్లోబల్‌ ఫుడ్‌ పాలసీ రిపోర్టు 2024 తెలిపింది. పోషకాహారం, ఆహారభద్రత, పేదరికం ఒకదానితో మరొకటి విడదీయరాని సంబంధం కలిగి ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్లో శారీరక, మానసిక అభిóవృద్ధి జరగక అభ్యాస సామర్థ్యాలు, విద్యాపనితీరు సరిగా జరుగదు. యుక్త వయస్సులో పోషకాహార లోపం వల్ల ఉత్పాదకత తగ్గి దేశ జిడిపి తగ్గుతుంది. రక్తహీనత తల్లులు అనారోగ్య శిశువులకు జన్మనిచ్చి పోషకాహార లోపం తరచుగా ఆర్థికంగా అట్టడుగు, వెనుకబడిన వర్గాలను ప్రభావితం చేస్తుంది. ఇది సామాజిక అసమానతలను పెంచుతుంది.

విస్తృత జనశ్రేయానికి పట్టం కట్టేందుకు ఐరాస 2000లో పదిహేడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశించింది. అందులో కీలకమైన వాటిని సాధించడంలో ఇండియా పరిస్థితి ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లు ఉంది. నాణ్యమైన విద్య, వైద్యం, తాగునీరు, పౌష్టికాహారం తదితరాలను అందిపుచ్చుకోగలుగుతున్న సామాన్యులెందరు ఉన్నారనే కీలకాంశాన్ని పరిశీలించాలి. ప్రభుత్వ వైద్యశాలల దయనీయ స్థితి వల్ల ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి రావడంతో చాలామంది పేదరికంలోకి జారిపోతున్నారు. పెరుగుతున్న ఖర్చులకు తగినట్లుగా ఆదాయాలు లేక పొదుపు తగ్గిపోయి అనేక కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. పెట్టుబడి ఖర్చులు కట్టుతప్పి, గిట్టుబాటు ధరలు లభించక అన్నదాతలెందరో కాడి వదిలేస్తున్నారు. రుణభారంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. జనాభాలో సగానికి పైగా ఉన్న యువతలో అత్యధికులు చదువుకు తగిన నైపుణ్యాలు కొరవడి ఉపాధి వేటలో ముఖం వేలాడేస్తున్నారు. చిన్నాచితకా కొలువులతో బతుకుబండి భారంగా వెళ్లదీస్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగలిగితే ఇండియా నిజంగా అభివృద్ధి చెందిన దేశం కాగలదు. విద్యావైద్యాలపై వ్యయాలను పెంచుతూ సమ్మిళిత సుస్థిరాభివృద్ధి విధానాలను ప్రభుత్వాలు ఆచరించాలి. నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధికి చేయూతలతో యువశక్తులను సద్వినియోగం చేసుకోగలగాలి. ‘దేశం సంపన్నమైనదే కానీ, ప్రజలే పేదలు’ అన్న అపప్రథ అప్పుడే తొలగిపోతుంది. మానవాభివృద్ధిలో బేలచూపులు చూస్తున్నంత కాలం మన దేశం నిజంగా సంపద్వంతం కాదు.

Leave a Reply