2025 ఫిబ్రవరి 27 నాడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దంతేవాడ నుండి ప్రముఖ యువ ఆదివాసీ నాయకుడు రఘు మిడియామిని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అరెస్టు చేసింది. 2025 ఫిబ్రవరి 28నాడు ఎన్‌ఐఎ విడుదల చేసిన ఒక ప్రకటనలో, మూల్‌వాసీ బచావో మంచ్‌తో సంబంధం ఉన్న గజేంద్ర మాండవితో పాటు మరొక వ్యక్తిని 6 లక్షల రూపాయల నగదు, మూల్‌వాసీ బచావో మంచ్, మావోయిస్టుల కరపత్రాలతో అరెస్టు చేసినట్లు చెప్పింది.
25.03.23న గజేంద్ర మాండవిని అరెస్టు చేసిన తర్వాత 24.08.23న నమోదు చేసిన FIR నం.02-2023-NIA-RPR పై దర్యాప్తులో, రఘు మిడియామి మూల్‌వాసీ బచావో మంచ్ అధ్యక్షుడు, “భారత వ్యతిరేక” కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, మావోయిస్టులకు నిధులు ఏర్పాటు చేస్తున్నాడని తేలిందని ఎన్‌ఐఎ పేర్కొంది. మావోయిస్టు నెట్‌వర్క్‌లో భాగమని రఘు మిడియామిని బూటకపు అభియోగాల కింద అరెస్టు చేసినట్లు చాలా స్పష్టంగా ఉంది. అలాగే మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే బూటకపు అభియోగాల కింద ఆయన సహచరులు సుర్జు టేకం, సునీతా పోట్టం వంటి వారిపై కూడా ఇలాంటి బూటకపు అభియోగాల కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా, మూల్‌వాసీ బచావో మంచ్ అనేది ఒక ప్రజాస్వామిక సంస్థ, ఇది మూడు సంవత్సరాలకు పైగా తమ సమస్యలను పరిష్కరించుకోడానికి రాజ్యాంగ చట్రంలో పనిచేసింది. ఎన్‌ఐఎ పేర్కొన్నట్లుగా ఎటువంటి కుట్రకు పాల్పడలేదు; మావోయిస్టులతో సంబంధాలలో లేదు. FIRలో నిందితుడుగా రఘు పేరు లేదు. అబద్ధపు FIR దాఖలు చేసిన సంవత్సరం కంటే ఎక్కువ కాలం తర్వాత అతన్ని కావాలని ఇరికించారని పేర్కొనడం సముచితంగా ఉంటుంది. అతను ఒక వారం క్రితం తీవ్రమైన మోటార్ సైకిల్ ప్రమాదానికి గురయ్యాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఆకస్మిక, అనవసరమైన అరెస్టు అతన్ని మరింత ఇబ్బందిపాలు చేస్తుంది.
PESA చట్టం ప్రకారం తప్పనిసరి చేయబడిన మరియు 5వ షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగం ద్వారా రక్షించబడిన గ్రామసభ అనుమతి లేకుండా గిరిజన భూమిని స్వాధీనం చేసుకుని బస్తర్ గ్రామాలలో పారామిలిటరీ శిబిరాన్ని బలవంతంగా నిర్మించడాన్ని రఘు మిడియామి, సునీతా పోట్టం మరియు అనేక ఇతర యువ ఆదివాసీలతో కలిసి ప్రతిఘటించడం ప్రారంభించారని గుర్తుంచుకోవడం ముఖ్యం.
2025 మే 17 నాడు జరిగిన పోలీసు కాల్పుల్లో, ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో గర్భిణీ స్త్రీ, ఆమె కడుపులో ఉన్న బిడ్డతో సహా నలుగురు ఆదివాసీ రైతులు మరణించిన తర్వాత, వారి ఉద్యమం బస్తర్ అంతటా దావానలంలా వ్యాపించింది. ఈ ఘటన ఈ యువ ఆదివాసీ కార్యకర్తలు మూల్‌వాసీ బచావో మంచ్ ఏర్పాటు చేయడానికి దారితీసింది, దీనికి సుర్జు టేకం వంటి అనుభవజ్ఞులైన ఆదివాసీ నాయకులు మార్గదర్శకత్వం వహించారు.
ఈ సంస్థ, సిలంగేర్ గ్రామం (సుక్మా) నుండి వచ్చిన, అక్కడికి వచ్చిన ప్రజలు నిర్వహించిన వ్యవస్థీకృత ప్రతిఘటన; కార్పొరేట్ దోపిడీ, నిర్వాసిత్వం, మారణహోమం, లైంగిక హింసకు వ్యతిరేకంగా ఆదివాసీ రైతుల ఆగ్రహాన్ని దిశానిర్దేశం చేస్తూ, దక్షిణ బస్తర్ అంతటా 30 వరకు ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి, 2024 అక్టోబర్ 30నాడు “అభివృద్ధి వ్యతిరేకం” అనే బూటకపు వాదనతో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వ “అభివృద్ధి ప్రాజెక్టులకు” వ్యతిరేకంగా స్థానిక ప్రజలను రెచ్చగొట్టే చర్యతో అప్రజాస్వామికంగా, ఏకపక్షంగా నిషేధానికి గురయ్యే ముందు ఒక కొత్త పోరాట నమూనాగా పనిచేసింది.
కార్పొరేట్ మద్దతుతో ప్రజలపై జరుగుతున్న యుద్ధాన్ని ప్రపంచం దృష్టి నుండి దాచి, నిశ్శబ్దం చేయడానికి చేసిన ప్రయత్నంలో భాగమే ఈ అరెస్టులు అని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇది మధ్య భారత గ్రామాలలో సోని సోరి, హిడ్మే మార్కం, లింగారం కొడోపి, పట్టణ ప్రాంతాలలో జి.ఎన్. సాయిబాబా, హేమ్ మిశ్రా, సుధా భరద్వాజ్, మహేష్ రౌత్, ఫాదర్ స్టాన్ స్వామి మొదలైన వారిపై మావోయిస్టు సంబంధాలు లేదా అర్బన్ నక్సలిజం పేరుతో జరిగిన దాడికి కొనసాగింపు. ఈ అరెస్టుల ఏకైక లక్ష్యం గత 10 సంవత్సరాలుగా చేస్తున్నట్లుగా సాక్ష్యం లేకుండా, ఎటువంటి పరిశీలన లేకుండా యుద్ధాన్ని సృష్టించడం.
యువ ఆదివాసీ కార్యకర్త రఘు మిడియామి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే, బేషరతుగా విడుదల చేయాలి. బస్తర్ తదితర ఖనిజ సంపద కలిగిన మధ్య భారతదేశ ప్రాంతాల ప్రజలపై కార్పొరేట్ మద్దతుతో జరుగుతున్న ఈ యుద్ధాన్ని అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామిక శక్తులు ఐక్యంగా ప్రతిఘటించాలని కూడా మేము పిలుపునిస్తున్నాము.
28 ఫిబ్రవరి 2025