ప్రతి సంవత్సరం హిందీ సినిమా ప్రముఖుల ఆత్మకథలో, జ్ఞాపకాలో(memoir) ఒకటో రెండో వస్తూనే ఉంటాయి. దాన్ని పెంగ్విన్, హార్పర్ కాలిన్స్ లాంటివి ప్రచురించి మార్కెట్ లో అమ్ముతూనే ఉంటాయి. దానికి ఉన్న రీడర్షిప్, మార్కెట్ కూడా అలాంటిదే. సాహిత్యంలో సినిమా గురించిన రచన కూడా ఒక ప్రక్రియ(genre). భారతీయ ఇంగ్లీషు సాహిత్యం ఈ genre ని దాదాపు హిందీ సినిమాకి సంబంధించిన విషయంగానే ఉంచింది. భారతీయ ఇంగ్లీషు సాహిత్యంలో వేరే ఏ సమాజం నిర్లక్ష్యం కాబడనంతగా తెలుగు సమాజం నిర్లక్ష్యం అయింది. గత కొన్నేళ్లుగా ఇంగ్లీషులో తమిళ, మలయాళ, కన్నడ భాషల సాహిత్యం, సంస్కృతి, చరిత్రకి సంబంధించిన పుస్తకాలు ఈ రచయిత ఎన్నో చూశాడు. వాటి మధ్య తెలుగువాళ్ళు రాసిన, తెలుగు వాళ్ళకి సంబంధించిన పుస్తకం ఒక్కటీ లేకపోవడం ఈ రచయిత గమనిస్తూనే ఉన్నాడు. దానికి ఎన్నో కారణాలు చెప్పొచ్చు. ముఖ్యంగా దారుణంగా పడిపోయిన మన పాఠకుల సంఖ్య. ఇప్పుడిప్పుడు అది పెరుగుతుంది అంటున్నారు, సంతోషం.
ఎందుకో చదవడం అనేదాన్ని ఒక అలవాటుగా మెజారిటీ తెలుగుసమాజం ఎప్పుడో వదిలిపెట్టేసింది. ఒక్క తెలుగు పుస్తకాలే కాదు. ఏ పుస్తకాలూ చదవం మనం. అలాంటి సమయంలో ముకేష్ మంజునాథ్ రాసిన the age of heroes – the incredible world of telugu cinema అనే ఈ పుస్తకం నన్ను ఎంతో ఆనందపరిచింది.
ముకేష్ మంజునాథ్ అనే పేరు చూడగానే అనుపమ చోప్రా, భరద్వాజ్ రంగన్ లాంటి ఎవరో హిందీ సినిమా జర్నలిస్టు అనిపిస్తుంది. కానీ అతను అచ్చమైన పదహారణాల నిఖార్సైన రూపాయి కాసంత తెలుగువాడు. అతనిది అనంతపురం, రాయలసీమ. అయితే ప్రస్తుతం ఉండడం అయితే ముంబైలోనే.
ఇంగ్లీష్ లో పుస్తకం రాయడం మరీ కష్టం కాదు. కానీ, దాన్ని అంతర్జాతీయ ప్రచురణ సంస్థలు అయిన పెంగ్విన్, హార్పర్ కాలిన్స్, బ్లూమ్స్‌బరి లాంటివి యాక్సెప్ట్ చేసి పబ్లిష్ చెయ్యడం పెద్ద టాస్క్. ముకేష్ ఆ టాస్క్ ఈజీగా పూర్తి చేసి హార్పర్ కాలిన్స్ ద్వారా ఈ పుస్తకాన్ని ప్రచురించాడు. హార్పర్ కాలిన్స్, MAMI ఫిల్మ్ ఫెస్టివల్ సంయుక్తంగా నిర్వహించిన సినిమా రచన పోటీలో ఈ పుస్తకం ఎంపిక అయింది.
ఇది ప్రధానంగా తెలుగు సినిమా గురించి అని చెప్పినప్పటికీ, ఇందులో అంతకు మించిన ఎన్నో విషయాలని రచయిత ఏంతో చక్కగా వివరించాడు. ఇది తెలుగువారి గత డెబ్భై ఏళ్ళ చరిత్ర. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కోణాలని ఓ చక్కటి పర్సనల్ అప్రోచ్ తో రచయిత చెప్తూ ఉంటాడు. తన నానమ్మ వల్ల మొదలైన తెలుగుసినిమా అభిరుచి, ఎలా ఆ తర్వాత ఆసక్తిగా మారిందో, ఎలా పుస్తకం రాయడానికి దారితీసిందో చదివి తెలుసుకొని సంబర పడాల్సిందే.
ఎన్నో విషయాలని రచయిత ఎంతో సూక్ష్మ దృష్టితో గమనించి, మొత్తంగా తెలుగు సమాజపు మూడొందల అరవై డిగ్రీలని ఈ పుస్తకంలో చూపించాడు.
చదువుతున్నంత సేపూ చాలా విషయాలు మనకి తెలిసినవిగానే అనిపిస్తాయి కానీ ఆ శైలికి ముగ్ధులమై చివరిదాకా చదువుతాం. చివర్లో రచయిత ఒక మెరుపు మెరిపిస్తాడు. మన తెలుగు సినిమా ఎందుకు వేరే దక్షిణ భారతీయ సినిమాల కంటే ప్రత్యేకం, మన సినిమాల మీద ఉన్న సాంస్కృతిక ప్రభావాలు ఏంటి? అన్నదానికి ఈ రచయిత చెప్పిన సమాధానానికి నేను ఆశ్చర్యపోయా. మన సినిమా మూలాలు, మన జానపదా(folk tales)ల్లో ఉన్నాయని, ప్రతి తెలుగు సినిమా హీరో ఓ జానపద కథానాయకుడనీ, అది పాతాళ భైరవిలో ఎన్టీయార్ అయినా, బాహుబలిలో ప్రభాస్ అయినా, పుష్ప లో అల్లు అర్జున్ అయినా అదే చూపించారు అనీ, అదే మన బలం అనీ, మన ప్రత్యేకత అనీ చదివి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి అవుతాయి. అలాగే మన తెలుగువాళ్ళకి సినిమాలో హీరో చచ్చిపోతే నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ రమణ అనే తమిళ సినిమాలో హీరో విజయ్‌కాంత్ సినిమా చివరిలో చచ్చిపోతాడు. అదే సినిమా తెలుగు రీమేక్ ఠాగూర్ లో చిరంజీవి చనిపోడు. ఇది నిన్నా మొన్నటి విషయం కాదని, అసలు అందుకే తెలుగువాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి చనిపోయిన పొట్టి శ్రీరాములు గారిని మనం అమరజీవి అని పిలిచాం అనీ రచయిత చెప్పినదానికి థ్రిల్ అయిపోయా. ఇలాంటివి ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. అన్నింటికంటే నాకు గొప్పగా అనిపించింది, రచయిత నిష్పక్షపాతంగా విషయాన్ని mattar of fact లా చెప్పిన పద్ధతి.
వెండి తెర ఇలవేల్పుగా కొలవబడిన మన హీరోలు, ఆ తర్వాతి కాలంలో రాజకీయాల్లోకి వచ్చి కేవల మానవమాత్రులుగా మిగిలిపోయిన వైనం ఈ రచయిత ఎత్తి చూపుతాడు. అలాగే తెలుగు సినిమాని శాసిస్తున్న కుల సమీకరణాలు, హీరోని దేవుడిలా ఆరాధించే అభిమానుల అంతుచిక్కని మనస్తత్వాల గురించి రచయిత లోతుగా పరిశీలించాడు అనిపిస్తుంది.
ముందే చెప్పినట్టు అన్నీ తెలిసిన విషయాలే అనిపిస్తాయి. రచయిత కోణంలో అవి చదువుతూ మనకి ఏదో జ్ఞాపకం వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
ఎన్టీయార్, చిరంజీవిల తర్వాత ఆశ్చర్యంగా రచయిత ఆర్. నారాయణమూర్తి గారి గురించి ఎర్రసినిమా గురించీ, లేడీ అమితాబ్ గా పిలవబడిన విజయశాంతి గారి గురించి తెలుగు సినిమాకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించీ రచయిత చెప్పిన విధానం చదివి తీరాల్సిందే.
ఇది తెలుగువాళ్ళ గురించి రాసినా తెలుగు వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకునే వారికి కూడా ఎంతో పనికి వస్తుంది. నార్త్ ఇండియా వాళ్ళకి సౌత్ ఇండియన్స్ అందరూ మద్రాసీలు అనీ, వాళ్ళని చరిత్రలో చోళులు మాత్రమే పరిపాలించారని, వాళ్ళ అందరి మాతృభాష తమిళం అనీ ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. చదువుతో సంబంధం లేకుండా.
అందుకు సాంస్కృతికంగా తమిళుల చొరవ, చాలా విషయాల్లో వాళ్ళ పెత్తనం ఒక కారణం. అయితే కొన్నేళ్లుగా ఈ కథ మారుతూ వస్తుంది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు తెలుగువాళ్ళ అస్తిత్వాన్ని తెలుగు సినిమానే కాపాడుతుంది. బాహుబలితో మొదలై పుష్పా, ఆర్ ఆర్ ఆర్ ల మీదుగా తెలుగు సినిమా ప్రభ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెలుగుతుంది. ఇదే వెలుగులో ఇప్పుడు మనల్ని మనం చూపించుకోవాలి. మన చరిత్ర, మన సంస్కృతి, మన భాషా, మన సాహిత్యం ప్రపంచానికి తెలియాలి. వేరే భాషల నుంచి ఏంతో సాహిత్యం తెలుగులోకి వస్తుంది. కానీ, తెలుగు నుంచి ఇప్పటిదాకా ఎంత సాహిత్యం బయటికి వెళ్ళింది. ముఖ్యంగా ఇంగ్లీషులో తెలుగు సాహిత్యం అనువాదాలు ఎన్ని ఉన్నాయి. భారతీయ ఆంగ్ల సాహిత్యంలో మనకి ఉన్న వెనుకబాటు తనాన్ని ఇక మీదనైనా మనం అధిగమించాలి. అందుకు ఈ పుస్తకం ఒక మొదలు కావాలని కోరుకుంటున్నాను. ఇది కచ్చితంగా తెలుగువాళ్ళ వంతు.