ఇది చివరి అంకమని, అంతులేని నష్టమని అనేక వ్యాఖ్యానాలు ఒక పరంపరగా వస్తున్నాయి. ఈ విషయాన్ని హృదయగతం చేసుకున్నవారు బహువిధాలుగా స్పందించవచ్చు. ఈ దుఃఖ తీవ్రతకు కాస్త విరామం దొరికాక మనుషులు తమదైన సమయాలలోకి వెళ్ళిపోతారు. అమరత్వం చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోయి నిరంతరం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది . మానవ పోరాటమంతా ఇలానే నడిచింది . మనుషులు ఎండిన ఆకులలా రాలిపోతారు . నాలుగు దశాబ్దాలుగా విప్లంలో భాగమైనవారు , అడవితో స్నేహం చేసినవారు, అరణ్యం తమదే అనుకున్నవారు, ఒక నిర్మాణంలో ఉన్నవారు హఠాత్తుగా కాలంలో కలిసిపోతారు .
ఇవాళ చాలా అభిప్రాయాలు వస్తున్నాయి. కాలం చెల్లిన పోరాటం అని . హింసకు ప్రతి చర్య ఇలానే ఉంటుందని .జనజీవన స్రవంతిలో కలిసి ప్రజా పోరాటాలు చేయాలని .ఇదొక మేధోవర్గ సృజన శీలుర ఉవాచ.
హింసాత్మక చర్యను ఎలా అంచనా వేస్తాము? కేవలం శాంతి భద్రతల సమస్య అయితే ఊకదంపుడు ఆలోచనలు ప్రోది అవుతాయి. అర శతాబ్దపు కల్లోల కాలాన్ని గమనించకపోతే ఇలాంటి ప్రతిస్పందనలే వస్తాయి . వాస్తవం అనేది ఒకటి ఉంటుంది. ఇది ఊరేగింపు కాదు. ధర్నా ఎంత మాత్రం కాదు. ఇదొక సాయుధ పోరాటం . ఇక్కడ ప్రాణం మాత్రమే విలువైనది కాదు. ఆశయం గొప్పది. ఆశయపు వెలుగులో అనేక సమూహాలు ఉన్నాయి. వాటిని అనువర్తించుకున్న ప్రతిఘటనలు ఉన్నాయి. ఇవేవీ గమనంలో లేకుండా తీర్పులు ప్రకటిస్తాము.
భీమా కోరేగావ్ కుట్ర కేసులో అరెస్టు కాబడి దాదాపు ఏడేళ్ళ జైలు జీవితం తర్వాత బయటకు వచ్చిన వారి శరీర ఆకృతిలో మార్పులు ఉండవచ్చు. జైలు జీవితం అలానే ఉంటుంది. వారి చూసిన జైలు జీవితం, జీవన అనుభవం చుట్టూ మనుషులే ఉంటారు .కేవలం సైద్ధాంతికత మాత్రమే చాలదు .బహుశా తమ మాతృత్వ తొలినాళ్ళ చనుబాలతడి ఏదో మనుషులను సజీవ మానవులుగా నిలబెడుతుంది . వాళ్ళను ప్రాణంలేని బొమ్మ గా ఎవ్వరు చేయలేరు .
సుధీర్ దావ్లె , రోనావిల్సన్ విడుదలయిన వేళ బొడ్డపాడు అనే అమరుల గ్రామంలో గాయాల మధ్య శాశ్వతనిద్రలో చలపతి ఉన్నాడు . ఆయన బొందిలో ప్రాణం లేదు . అరణ్యంలో పాదాల చిరు సవ్వడి . మార్దవ గొంతుక మౌనంగా ఉన్నది . ఆయన అమరత్వం చట్టూ చేరిన వారు భారతదేశ పాలిత వర్గాల అణిచివేత చర్యల గురించి మాట్లాడారు . అర శతాబ్దం దాటిన పోరాట రూపాన్ని, దాని ప్రతిఫలనాన్ని అంచనా కట్టారు . అది ముందుకే పోతుందని ప్రకటించారు .
ఇవాళ మధ్య భారతంలో యుద్ధం జరుగుతున్నది . యుద్ధ సన్నివేశంలో కూడా నీతి ఉంటుంది. ఆ నీతిని వైరి పక్షాలు పాటించాల్సి ఉంటుంది. కానీ స్టేట్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. తుపాకీని ఉపయోగించి ఆదివాసులను చంపుతున్నది. పిల్లల్ని, వృద్ధుల్ని, పాలిచ్చే తల్లులను చంపుతుంది. అబద్ధాలని ప్రచారం చేస్తుంది. స్టేట్ ఎలాంటి హీనమైన స్థితిలో ఉన్నదో ఈ ఉదాహరణలు సరిపోతాయి.
మధ్య భారతంలో జరుగుతున్న సైనిక దాడులకు ఏడాది పూర్తయింది. 2026 ఎంతో దూరంలో లేదు. మావోయిస్టు, ఆదివాసుల రహిత భారతదేశం పెట్టుబడుల ‘కల ‘రాజ్యానిది . ఈ రెండు వర్గాలు లేకుంటే భారతదేశానికి మరింతగా పైసలు వచ్చి తీరుతాయి. మావోయిస్టులది శాంతి భద్రతల సమస్య కాదు. ఇక్కడ ప్రధానంగా ఆర్ధికం ముడిపడి ఉన్నది. దశాబ్దాల మావోయిస్టు ఆచరణలో హింస చాలా తక్కువ. న్యాయ, నైతిక , మానవీయ రాజకీయాలకు కేంద్రంగా మావోయిస్టు భావజాలం ఉన్నది. బాధిత ప్రజలకు రక్షణగా నిలబడ్డారు. భారత సమాజం దాని చలనం పట్ల అవగాహన ఉన్నది. వారి పంధా సాయుధమార్గం కావచ్చు. వారిది ఖచ్చితమైన సాంస్కృతిక రాజకీయ పంధా. ఆచరణలో ఇవాల్టి భారతదేశ జాతీయవాదం పట్ల వారికి విభేదమున్నది. రెండు పరస్పర విరుద్ధ అంశాలు. ఆర్థికము, సాంస్కృతిక జాతీయవాదం కలగలిసిన సన్నివేశంలో వైరుధ్యం ఇరువైపులా ఉన్నది. ఇక్కడ మనుషుల నిర్మూలన జరిగితే అంతిమంగా సైద్ధాంతిక అంశం కనుమరుగవుతుందా ? .ఈలోతైన భావన అర్థం కాకుంటే ఇది ఒక హింసాత్మక రణస్థలిగా మారిందనే భావన ప్రచలితమవుతుంది .
గరియాబంద్ ఘటనలో మీడియా, స్టేట్ ప్రవచించిన విషయం అం తా తప్పులు తడక. ఎంత మంది విప్లవకారులు చనిపోయారు? వారి సంఖ్య ఎంత? అంచనాలేదు .ఇందులో ఆదివాసుల ఎందరు? ఈ విషయంలో స్పష్టత లేదు. చివరకు మోతాదుకు మించిన సంఖ్య చెప్పినా అందులో సాధారణ ప్రజలు ఎవరు అనేది తేలలే దు. మితిమీరిన ప్రచారం ద్వారా అంతా అయిపోయిందనే భావనకు చోటు కలిపించి ప్రచారంలో పెడుతున్నాయి. మధ్యతరగతి ఆలోచనపరులు ఇక మావోయిస్టు రహిత భారతదేశం సాధ్యమే అనే నిర్ధారణ చేస్తున్నారు.
భారతదేశం ఇవాళ ఎదుర్కొంటున్న సవాల్ మావోయిస్టుల రాజకీయ పంధా నుండి కాదు. ఓటు ద్వారా అధికారాన్ని చలాయిస్తున్న పాలకవర్గాల ఆలోచన తీరు నుండి. అన్ని వర్గాల ప్రజలను అణిచివేతకు గురి చేయడం ద్వారా శాశ్వత అధికారాన్ని పొందవచ్చు అనే నియంతృత్వ భావనకు భారత ప్రజాస్వామ్యం చేరుకున్నది. ఆదివాసుల నిర్మూలన ఇవాల్టి సందర్భమైనా భారతదేశ భిన్నత్వాన్ని అంగీకరించడానికి బహుళ పార్టీల ప్రజాస్వామ్యాన్ని ఒప్పుకోవడానికి ఆర్ఎస్ఎస్ నిర్మిత ప్రజాస్వామ్యం అడ్డంకిగా భావిస్తున్నది. మోడీ షా నియంతృత్వం అన్ని రంగాలపై అలుముకుంది.పదేళ్ల కాలంలో భారతదేశం బహు విధాలుగా బద్దలవుతుంది. పార్లమెంటరీ పంధాలో పనిచేస్తున్న రాజకీయ పార్టీలను కూడా ఇది కొండచిలవలా ఆక్రమిస్తుంది. భిన్న సమూహాల ప్రజలు ఒక దేశాన్ని తమదిగా గుర్తించలేని ఒక దశ కొనసాగుతున్నది. ఈ దేశం తమది కాదేమోనని అభద్రత ప్రజలలో నెలకొంది. అదే సమయంలో చిన్నా, చితక పార్టీలు తమ మనుగడ ఇక ఎంత మాత్రం సాధ్యం కాదు అని భావనకు వచ్చి ఉన్నాయి. ప్రజాస్వామ్య భావన నుండి కూడా ఇవాల్టి భారతదేశ రాజకీయ స్వరూపాన్ని గమనించవలసివుంది. అనేక రంగుల జెండాలు అవనతం అవుతున్నాయి. అధికారం తోటి రాజకీయ పార్టీలను కూడా భయపెట్టే దశకు ఇవాల్టి పాలకవర్గం చేరుకున్నది. బహుళ పార్టీల ప్రజాస్వామ్యం కాదు కమలం గుర్తు మాత్రమే శాశ్వతము అనే భావనను, సమ్మతిని వ్యాప్తి చేస్తుంది. ఇదంతా భారత ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను బలహీనపరిచేది .దీనిని అన్వయించుకొని రాజకీయ పార్టీలు ప్రజలపక్షాన పని చేయ వలసి ఉంది.
ఏడాది కాలంగా జరుగుతున్న అణిచివేత చివరిదశకు చేరిందనేది కేంద్ర హోంమంత్రి ఉవాచ. నూతన టెక్నాలజీ, అడవిని దృశ్యమానం చేసి , మానవ హననాన్ని అమిత్ షా పై చేయిగా భావించవచ్చు. ఒక కాలం అన్నిటిని సహిస్తుంది. అయితే ఎద్దు ఎప్పుడూ ఒకే వైపు పడుకోదు అనే సామెత ఉన్నది.
నిరంతరం ప్రజాక్షేత్రంలో పనిచేసే ఒక ఉద్యమం చూపు, భవిష్యత్తు రాజకీయ దృశ్యం ఈ యుద్ధంలో కూడా కనిపిస్తున్నాయి . భయభ్రాంతులకు గురిచేసి ఒక ఆశయాన్ని కట్టడి చేయలేరు . ఇది అంతిమంగా ఇది అదివాసుల జీవన్మరణ సమస్య. ఈ దేశం మానవీయంగా మారుతుందా లేదా అనేది అసలు సమస్య . మనుషులను గుట్టలకొద్దీ చంపేసినంత మాత్రాన చరిత్ర సమాధాన పడుతుందా ?
29/1/2025