కోహమెటా కొండపై ఉన్న తడి అటవీ ప్రాంతంలో పొడవాటి జుట్టు గుత్తి మెరిసిపోతోంది. ఇక్కడ తొమ్మిది గంటల పాటు జరిగిన ఆయుధ పోరాటంలో 35 మంది మరణించిన నాలుగు రోజుల తరువాత, వర్షం రక్తాన్ని తుడిచేసింది, ఖాళీ బుల్లెట్లతో సహా మిగితావన్నింటినీ కడిగేసింది; తాజాగా మెరుస్తున్నాయి.

అక్టోబరు 4 ఉదయం, నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సాయుధ విభాగం   పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన ఆరో నంబర్ కంపెనీని దక్షిణ ఛత్తీస్‌గఢ్ అడవులలో లోతట్టు ప్రాంతం  ఈ మూలలో  భారీ సంఖ్యలో  భద్రతా దళాలు చుట్టుముట్టాయి. . మావోయిస్టుల  సురక్షిత ప్రాంతంగా పరిగణించబడే ఈ ప్రాంతంలో భద్రతా దళాలకు ఎటువంటి నష్టం జరగకుండా యుద్ధం ముగిసింది; 35 మంది ఉద్యమకారులు   మరణించారు – వారిలో 13 మంది మహిళలు.

ఒక మహిళా మృతదేహాన్ని అడవిలో  నేలపైన లాక్కెళ్ళుతున్నప్పుడు ఆమె వెంట్రుకలు వూడిపోయాయా? “మేము మృతదేహాలను ప్యాక్ చేయడానికి ముందు వాటిని ఒకే చోటకు లాగి సేకరించాల్సి వచ్చింది” అని ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన పొడవుగా, సన్నగా ఉన్న ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి స్మృతిక్ రాజనాల అన్నాడు.

భద్రతా దళాలు 31 మృతదేహాలను ప్లాస్టిక్ కట్టల్లో వెదురు కర్రలపై ఉంచి, మరుసటి రోజు సాయంత్రం పోలీసు క్యాంపస్‌లోని పచ్చిక బయళ్లలో ప్రెస్ కెమెరాల కోసం ప్రదర్శించాయి. కుళ్ళిపోతున్న ముఖాల నుండి ప్లాస్టిక్ షీట్‌ను  తీసినప్పుడు, వారిలో ఒకరు 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలుడిలా కనిపించాడు.

 తాము పెట్టుబడిదారీ రాజ్య దోపిడి నుండి స్థానిక ఆదివాసీ జనాభాను రక్షించడానికి పోరాడుతున్నామని చెప్పే మావోయిస్టు గెరిల్లాలకు బస్తర్ ప్రాంతం అని కూడా పిలువబడే దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని పెద్ద ప్రాంతాలు, దశాబ్దాలుగా బలమైన కోటగా ఉన్నాయి. అడవిలో యుద్ధం  భద్రతా బలగాలకు మృత్యు ఉచ్చుగా మారింది. 2010లో, మావోయిస్టులు దంతెవాడ అడవుల్లో 76 మంది సిబ్బందితో కూడిన మొత్తం యూనిట్‌ను కొన్ని గంటల వ్యవధిలో మెరుపుదాడి చేసి హతమార్చారు – భారత భద్రతా బలగాలు అంతర్గత లేదా బాహ్య ఏ యుద్ధంలోనైనా ఒక రోజులో అనుభవించని అతిపెద్ద నష్టం అది.

పద్నాలుగు సంవత్సరాల తరువాత, భద్రతా బలగాలు తిరిగి దెబ్బకొట్టాయి. అక్టోబరు 4 న జరిగిన ఈ ఆపరేషన్ ఒక సంవత్సరం పాటు సాగిన ప్రచారానికి ముగింపు పలికింది. ఇందులో ఛత్తీస్‌గఢ్ పోలీసులు బస్తర్‌లో 189 మంది మావోయిస్టులను చంపినట్లు పేర్కొన్నారు; ఒక సంవత్సర కాలంలో భద్రతా బలగాలు చేసిన చర్యలో అతి పెద్ద సంఖ్య యిది.

కానీ భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఘర్షణలో  ఒక కీలకమైన వ్యత్యాసాన్ని ఇది దాచిపెడుతుంది. 2010లో, ఒక ఛత్తీస్‌గఢ్ పోలీసు కానిస్టేబుల్ మినహా, మరణించిన వారు కేరళ, ఉత్తరాఖండ్ మొదలైన సుదూర భారతదేశం అంతటా నుండి వచ్చిన కేంద్ర పారామిలిటరీ పురుషులు. 56 మంది ఉత్తర మైదానప్రాంతాలకు చెందినవారు, ఒక్క ఉత్తరప్రదేశ్ నుండే 44 మంది ఉన్నారు. అడవికి అన్యులైన వాళ్లు, వారు గెరిల్లా యుద్ధంలో ఏ రక్షణా లేనివారు.

దీనికి విరుద్ధంగా, అక్టోబర్ 4న జరిగిన యుద్ధంలో, ఛత్తీస్‌గఢ్ పోలీసుల ప్రకారం, జిల్లా రిజర్వ్ గార్డ్స్ పోరాడారు, మావోయిస్టులు తమ కేడర్లను రిక్రూట్ చేసుకొన్న అదే గ్రామాల నుండి దాదాపు పూర్తిగా స్థానిక ఆదివాసీ పురుషులు,  మహిళలతో కూడిన పోలీసు విభాగం.

ప్రధానంగా 700 మంది ఆదివాసీ సైన్యం 70 మంది ఆదివాసీ సైన్యాన్ని అధిగమించి, వారిలో సగం మందిని చంపింది.

ఈ ఏడాది కార్యకలాపాలను రాజ్యం తిరుగులేని విజయంగా అంచనా వేసింది. వాస్తవికత మరింత సంక్లిష్టమైనది. స్క్రోల్ కంట్రిబ్యూటర్ మాలినీ సుబ్రమణ్యం తన ప్రత్యక్ష రిపోర్టింగ్ ద్వారా, జర్నలిస్టులు, ఇతర కార్యకర్తల నివేదికలను క్రోడీకరించడం ద్వారా సేకరించిన డేటా, దాదాపు నాలుగింట ఒక వంతు కేసులలో, తాము సాయుధ ఉద్యమకారులన్న   పోలీసుల వాదనలను మృతుల కుటుంబాలు తిరస్కరించాయి.

అయినప్పటికీ, కనీసం ప్రధాన భద్రతా కార్యకలాపాలలో, చనిపోయిన మావోయిస్టుల పేర్లను, హోదాను పోలీసులు ఖచ్చితంగా గుర్తించగలిగారు, ఇప్పుడు తమ ప్రత్యర్థి గురించి మరింత ఖచ్చితమైన జ్ఞానం ఉందని సూచిస్తున్నారు. చనిపోయిన వారిలో నలుగురు మావోయిస్టు పార్టీలోని రెండవ అత్యున్నత స్థాయి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు. వారిలో ఒకరు, కామ్రేడ్ నీతి లేదా ఊర్మిళ పొట్టవి అక్టోబర్ 4 ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

మావోయిస్టులకు అత్యంత సురక్షితమైన ప్రదేశంగా భావించే అబూజ్ మాడ్ ప్రాంతంలో పోలీసులు దాడులు చేయడం మరో విశేషం. కేరళ రాష్ట్రం అంత విస్తీర్ణం కలిగిన బస్తర్‌లో గోవా రాష్ట్రం అంత విస్తీర్ణాన్ని కలిగిన సర్వే చేయని ప్రాంతం అబూజ్‌మాడ్. ఈ ఏడాది జరిగిన 189 హత్యల్లో 100 హత్యలు మాడ్ లోనే జరిగాయని బస్తర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ సుందర్‌రాజ్ పట్టిలింగం తెలిపాడు. నారాయణపుర్ జిల్లాలో గత మూడేళ్లలో నలుగురు మృతి చెందారు. ఈ ఏడాది ఈ సంఖ్య 52కి పెరిగింది.

మాడ్ అని కూడా పిలిచే అబూజ్‌మాడ్ అంటే తెలియని కొండలు అని అర్ధం. కొండలు రాజ్యానికి తెలియకపోవచ్చు కానీ, అక్కడ నివసించే వారికి కాదు. వారిలో కొందరిని రాజ్యం తరపున పోరాడటానికి చేర్చుకోవడంలో, పదోన్నతులు, ఆర్థిక బహుమతుల ద్వారా వారిని ప్రేరేపించడంలో ఛత్తీస్‌గఢ్ విజయం సాధించడం, యుద్ధంలో నిర్ణయాత్మక హద్దును ఇచ్చినట్లు కనిపిస్తోంది.

కానీ, ప్రభుత్వం చెబుతున్నట్టు ఇది నిజంగా యుద్ధ ముగింపుకు ఆరంభమా? బస్తర్‌కు రాబోయే అనార్థానికి సూచనా? అక్టోబరు 4న జరిగిన ఈ సైనిక చర్యకు ప్రణాళిక వేసి, పర్యవేక్షించిన దంతేవాడ పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ మాట్లాడుతూ “అమావాస్య, చంద్రుడు లేని రాత్రి” ఇంత కఠినమైన భూభాగం గుండా, అది కూడా చీకటిలో, వెళతామని మావోయిస్టులు ఊహించలేదు” అని అన్నాడు.

నారాయణపూర్, బిజాపుర్ సరిహద్దుల్లో ఇంద్రావతి నది మీదుగా దంతేవాడకు ఉత్తరాన ఉన్న మాడ్ దక్షిణ అంచున ఈ దాడులు జరిగాయి. అంతకు ముందు రోజు, రాష్ట్ర పోలీసు యూనిట్ అయిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ లోని సుమారు 700 మంది సిబ్బంది సమీప ప్రాంతాన్ని వరదలా ముంచెత్తారు. “తప్పుదారి పట్టించేలా చర్యలు తీసుకున్నాం. మరో  వైపుకు బలగాలు వెళ్తున్నాయని నక్సల్స్ భావించారు” అని రాయ్ అన్నారు.

ఈ కవచాన్ని ఉపయోగించి, అక్టోబర్ 3 రాత్రి, రాజనాలా దంతేవాడ నుండి జిల్లా రిజర్వ్ గార్డ్ యొక్క వందలాది మంది సిబ్బందికి నాయకత్వం వహించాడు, అదేవిధంగా నారాయణపూర్ నుండి పెద్ద బృందం వచ్చింది. డీఆర్జీలో భాగంగా లొంగిపోయిన మావోయిస్టులు గ్రామాలను, మావోయిస్టులు సాధారణంగా గస్తీ పెట్టిన ప్రదేశాలను తప్పించుకునేందుకు ఒక మార్గాన్ని రూపొందించారు. ఉదయం నాటికి, దళాలు సుమారు 5 కిలోమీటర్ల వ్యాసార్థాన్ని చుట్టుముట్టాయి.

ఈ కవర్‌ని ఉపయోగించి, అక్టోబర్ 3వ తేదీ రాత్రి, రాజనాల దంతేవాడ నుండి జిల్లా రిజర్వ్ గార్డ్‌ కు చెందిన వందలాది మంది సిబ్బందికి రాజనాల నాయకత్వం వహించాడు;  నారాయణపూర్ నుండి అంతే పెద్ద బృందం వచ్చింది. డి‌ఆర్‌జిలో భాగమైన లొంగిపోయిన మావోయిస్టుల గ్రామాలు, మావోయిస్టులు సాధారణంగా సెంట్రీలను ఉంచే ప్రదేశాలను తప్పించుకునే మార్గాన్ని ప్లాన్ చేయడంలో సహాయం చేసారు. ఉదయం నాటికి, దళాలు దాదాపు 5 కి.మీ-6 కి.మీ వ్యాసార్థాన్ని చుట్టుముట్టాయి.

ఉదయం 7 గంటల సమయంలో కోహమెట కొండకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవాడి అనే చిన్న గ్రామానికి చెందిన నివాసితులు తమ గ్రామంలోకి భద్రతా దళాలు ప్రవేశించడాన్ని చూశారు. భద్రతా దళాలు సమీపిస్తున్నప్పుడు, ప్రతికూల పరిణామాల భయంతో గ్రామస్తులు తరచూ తమ ఇళ్లను వదిలి పారిపోతారు. కానీ గవాడి నివాసులు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. “మేము అడవిలో దొరికితే మావోయిస్టులమని అనుకొని మమ్మల్ని చంపేస్తారు” అని ఒక నివాసి చెప్పారు.

సమీపంలోని తుల్తులి గ్రామానికి చెందిన నలుగురు నివాసితులు అదృష్టవంతులు కాదని, వారిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని గ్రామ సర్పంచ్ చెప్పారు. పోలీసులు దీనిని ఖండించారు. మరోవైపు గవాడీలో ఒక గంట తర్వాత గ్రామస్తులు డ్రోన్ శబ్దం విన్నారు. ఉదయం 11 గంటల సమయంలో మొదటి కాల్పుల శబ్దం వినిపించింది.

రోజు గడుస్తున్న కొద్దీ, చుట్టుముట్టడం కఠినతరం అయ్యింది – ఒక పాము ముడుచుకున్నట్లుగా వుందని, ఒక భద్రతా సిబ్బంది అంటే మరొకరు దానిని “చక్రవ్యూహం” అన్నారు. ఈ ప్రాంతంలో పలు చోట్ల రెండు పక్షాలు కాల్పులు జరిపినట్లు వారు తెలిపారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో హెలికాప్టర్ దిగి 10 నిమిషాల తర్వాత బయలుదేరడం గ్రామస్తులు చూశారు. “ఒక జవాన్ పై బుల్లెట్ దాడి జరిగింది. వెంటనే అతన్ని తీసుకెళ్ళాల్సి వచ్చింది” అని రాజనాల అన్నారు.

రాత్రి 8 గంటల వరకు ఆగి ఆగి కాల్పులు జరిగాయని గ్రామస్తులు తెలిపారు. రాత్రి చీకటి పడిన తర్వాత కొద్దిగా ముందుగానే ముగిసిందని రాజనాలా చెప్పారు. “నేను ఏమీ చూడలేక పోయాను కాబట్టి పెద్దగా ఏమీ చేయాలేకపోయాను”అని ఆయన అన్నారు. “ఆ ప్రాంతంలో ఉండటం ప్రమాదకరం. మావోయిస్టులు చీకటిలో దాగివుండవచ్చు.”

మృతదేహాలతో పాటు, బలగాలు ఒక ఇన్సాస్ లైట్ మెషిన్ గన్, ఎకె -47 రైఫిల్స్, సెల్ఫ్-లోడింగ్ రైఫిల్స్, ఇతర హై-కాలిబర్ ఆయుధాలను తీసుకువచ్చాయి. మావోయిస్టులు ఇంత భారీగా ఆయుధాలు కలిగి ఉంటే, వారు ఎందుకు బలగాలకు ఎటువంటి ప్రాణనష్టం కలిగించలేకపోయారు? “మాకు ఆధిపత్య స్థానం ఉంది” అని రాయ్ అన్నారు.

అక్టోబరు 13 న మావోయిస్టులు విడుదల చేసిన ఒక ప్రకటన ఈ యుద్ధానికి భిన్నమైన వివరణ ఇచ్చింది. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన కాల్పులు రాత్రి 9 గంటల వరకు 11 రౌండ్లలో విరామం లేకుండా కొనసాగాయి. ఈ కాల్పుల్లో 14 మంది మా సహచరులు అమరవీరులయ్యారు. గాయపడిన మరో 17 మందిని ఒకే చోట చేర్చి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కనికరం లేకుండా కాల్చి చంపారు.

ఈ ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పనప్పటికీ, యుద్ధ క్షేత్రం నుండి తప్పించుకున్న నలుగురు గాయపడిన తిరుగుబాటుదారులు మరణించినట్లు తెలుస్తోంది, తద్వారా 35 మంది మృతి చెందారు, పోలీసులు అంచనా వేసిన వారి కంటే నలుగురు ఎక్కువ.

ఈ ఏడాది మావోయిస్టుల ఎన్కౌంటర్లు, హత్యల గణన జనవరి 1 నుంచి ప్రారంభం కాదు; అధికారిక లెక్కల ప్రకారం 2023 డిసెంబర్ 13న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అని ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. ఈ ఏడాది కార్యాచరణ విజయాలను తమవేనని బిజెపి ప్రభుత్వం దూకుడుగా అంచనా వేసింది. కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఈ ఏడాది రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించి, 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని ప్రకటించారు.

ఈ నివేదిక కోసం ఇంటర్వ్యూ చేసిన పలువురు పోలీసు అధికారులు ఈ యుద్ధపూరిత వైఖరిని ప్రశంసించారు. “రాజకీయ నాయకులు ఇలా మాట్లాడినప్పుడు, వారి వెనుకదన్నుగా మేమున్నామని మాకు తెలుసు” అని ఒక అధికారి అన్నారు. కానీ ఈ ఏడాది మావోయిస్టులపై విజయం సాధించేందుకు మౌలిక సదుపాయాల కల్పనలో నెమ్మదిగా పురోగతి వుండడం ఒక కారణం అన్నారు. ఈ ప్రాంతంలో భద్రతా శిబిరాలు, రోడ్లు, వంతెనలు, మొబైల్ టవర్ల సంఖ్య పెరగడం వల్ల సమాచార ప్రవాహం మెరుగుపడిందని, మావోయిస్టులు స్వేచ్ఛగా తిరిగే ప్రాంతం తగ్గిందని వారు చెప్పారు.

2010 తో పోల్చితే సాంకేతికపరంగా కూడా, వారు ఇప్పుడు అరణ్య యుద్ధానికి బాగా సన్నద్ధమయ్యారు – వాకీ-టాకీల నుండి టీమ్‌లు టెక్స్ట్ ద్వారా ఉష్ణ సంతకాలను తీయగల వైమానిక డ్రోన్లకు నిశ్శబ్దంగా కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది; వారు అడవిలో కదులుతున్నప్పుడు తిరుగుబాటుదారులను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది.

దీనికి తోడు, కార్యకలాపాలను ఆదేశించే అధికారులు ఈ సంవత్సరం క్షేత్ర స్థాయిలో చేసిన అనేక వ్యూహాత్మక మార్పుల జాబితా తయారుచేశారు. ఒకటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ జిల్లాల పోలీసులు ఒకే ఏకీకృత వ్యూహంలో కార్యకలాపాలు నిర్వహించడానికి దళాలను మిళితం చేస్తున్నారు. నారాయణపుర్ పోలీస్ సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ “మేము ప్రతిచోటా కలిసి వెళ్తున్నాం.” దంతేవాడ నా జిల్లాకిందకు వస్తోంది, నేను కూడా అక్కడికి వెళ్తున్నాను.” దంతేవాడపోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ దీనికి అంగీకరించారు. జిల్లా సరిహద్దుల్లో ఉన్న శూన్యత నుంచి మావోయిస్టులు ఇకపై ప్రయోజనం పొందలేరని ఆయన అన్నారు.

కుమార్, రాయ్‌లు ఇద్దరూ 2019 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు చెందిన వారే కావడం వల్ల ఇది సహాయపడుతుంది. బీజాపుర్, సుక్మా జిల్లాల్లోని వారి సహోద్యోగులు కూడా ఒకే బ్యాచ్‌కు చెందినవారు లేదా సహ-శిక్షణ పొందినవారు. అయితే ఈ సైనిక చర్యలకు సంబంధించిన నిజమైన ఘనత జిల్లా రిజర్వ్ గార్డులకు దక్కుతుందని అధికారులు ఏకగ్రీవంగా అంగీకరించారు. “99 శాతం డిఆర్ జి” అని కుమార్ అన్నారు. రాయ్ వారిని “హంతక శక్తి” అని పిలిచాడు.

“వారు మా మార్గదర్శకులు. వారు మామమ్మల్ని లోపలకు తీసుకువెళ్తారు. వారికి అడవిలోని ప్రతి మూలా తెలుసు. కుమార్ ఇంకా ఇలా అన్నారు: “వారు చాలా సరళమైనవారు. నేను 20 మందితో 20 జట్లను లేదా 70 మందితో ఆరు జట్లను తయారు చేయగలను. గెరిల్లా యుద్ధం అసాధారణమైనది. అలవాటుపడటానికి వారు సహాయపడతారు” అన్నారు రాజనాల.

2011లో మావోయిస్ట్ వ్యతిరేక నిఘా సల్వా జుడుం ఉద్యమం నుండి ఆదివాసీ యువకులను ప్రత్యేక పోలీసు అధికారులు లేదా ఎస్‌పి‌ఓలుగా చేర్చడాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత జిల్లా రిజర్వ్ గార్డ్‌లు ఉనికిలోకి వచ్చారు. “తాత్కాలికంగా నియమించబడిన, గౌరవ వేతనం చెల్లించిన”, అనేక మంది “ఆవేశం, ద్వేషం, ప్రతీకారం తీర్చుకోవాలనే భావాలను” కలిగి ఉన్న చదువుకోని యువతను రాజ్యం ఉపయోగించడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

ఈ తీర్పుపై స్పందించిన రాజ్యం ఎస్‌పి‌ఓలను, ఇతర ఆదివాసీలను అధికారికంగా జిల్లా రిజర్వ్ గార్డులుగా నియమించి, వారికి కానిస్టేబుళ్ల జీతాలు చెల్లించింది. సుప్రీంకోర్టు కేసులో పిటిషనర్ అయిన సామాజిక శాస్త్రవేత్త నందిని సుందర్ 2021లో రాసిన పిటిషన్‌లో “రాష్ట్రం కేవలం ఎస్పీఓల పేరును మార్చింది” అని రాసారు. కోర్టులో ధిక్కార పిటిషన్ పెండింగ్‌లో ఉంది.

అయినప్పటికీ, జిల్లా రిజర్వ్ గార్డులు కొంతకాలంగా ఉన్నారు; ఈ సంవత్సరం మారింది ఏమిటి? దీనికి సంక్షిప్త సమాధానమేమిటంటే, డి‌ఆర్‌జి బలగాలు రెట్టింపు అయ్యాయి.

2022లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2,100 మంది స్థానికులను “బస్తర్ ఫైటర్స్”గా నియమించింది. నామకరణం మినహా, వారికి, పాత డి‌ఆర్‌జి సిబ్బందికి మధ్య ఎటువంటి తేడా లేదు. గత సంవత్సరం శిక్షణ పొంది, దళంలోకి తీసుకొన్న బస్తర్ ఫైటర్స్ ఇప్పుడు డి‌ఆర్‌జి టీమ్‌లలో భాగంగా ఉన్నారు. ప్రతి జిల్లాలో కనీసం 500 మంది ఆదివాసీ యోధులు ఉన్నారు. ఒక ఆపరేషన్ కోసం రెండు లేదా అంతకంటే ఎక్కువ జిల్లాల బలగాలను కలిపినప్పుడు, ఎదురులేనివిగా ఉంటాయి.

ఒక భద్రతా అధికారి చెప్పినట్లు: “మనకు ఎంత బలం ఉంటే అంత పెద్ద ప్రాంతాన్ని చుట్టుముట్టవచ్చు. ఒకసారి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాక, మనం నెమ్మదిగా లోపలికి చొచ్చుకుపోవచ్చు, అప్పుడు నక్సల్స్ ఆ ప్రాంతంలో చిక్కుకుపోతారు; అక్కడే కాల్పులు జరుగుతున్నాయి. 

2010లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా, ఇప్పుడు అదే విభాగంలో అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఉన్న వివేకానంద సిన్హా, 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయపూర్‌లోని తన కార్యాలయం నుంచి గత 14 ఏళ్లలో ఏం మారిందో వివరించారు. “మావోయిస్టులకు ఉన్న ఏకైక ప్రయోజనం ఏమిటంటే, వారు మట్టి పుత్రులు” అని ఆయన అన్నారు. ఇప్పుడు, మా వాళ్ళు కూడా ఈ నేల పుత్రులే. ఆయన ‘భూమికి చెందిన కుమారులు, కుమార్తెలు(కూడా)’ అని చెప్పాల్సింది. డి‌ఆర్‌జి సిబ్బందిలో నాలుగింట ఒక వంతు మంది మహిళలు వున్నారు.

యుద్ధ అనుభవజ్ఞుడైన ఇన్స్పెక్టర్ జనరల్ పి. సుందర్రాజ్ కూడా దీనికి అంగీకరించాడు. జిల్లా రిజర్వ్ గార్డులకు స్థానిక భూభాగం, భాష, ఆచారాల పట్ల ఉన్న పరిజ్ఞానం ఎంతో కీలకమని ఆయన అన్నారు. “ఒక సమావేశం జరిగినప్పుడు, అది పండుగ సమావేశమా లేక [మావోయిస్టు] సమావేశమా అని వారు వేరుచేసి చెప్పగలరు” అని ఆయన గతంలో చేసిన పొరపాట్లను పరోక్షంగా అంగీకరించాడు.

2012 లో, మావోయిస్టుల సమావేశంగా పొరపాటు పడి సెంట్రల్ పారామిలిటరీ దళాలు సర్కేగుడా గ్రామంలో ఒక పండుగ సమావేశంపై కాల్పులు జరిపాయి;  ఏడుగురు పిల్లలతో సహా 17 మంది గ్రామస్తులను చంపేసాయి. ఈ సంవత్సరం తీవ్రమైన తప్పులు జరగలేదు అని కాదు. బీజాపుర్ లోని పిడియా గ్రామంలో,  పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీ అనే పౌర హక్కుల సంస్థ కార్యకర్తలు నిర్వహించిన దర్యాప్తులో మే నెలలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించినవారు 11 మంది పౌరులు; పోలీసులు పేర్కొన్నట్లు మావోయిస్టులు కాదు అని తెలిసింది.

అక్టోబరు 4న జరిగిన ఎన్‌కౌంటర్ రిపోర్టు చేస్తున్నప్పుడు ఫిబ్రవరిలో నారాయణపూర్‌లోని గోమంగల్ గ్రామంలో హత్యకు గురైన ఇద్దరు వ్యక్తుల భార్యలను కలిశాం. పోలీసులు వారిని మావోయిస్టులుగా అభివర్ణించారు. కానీ కరో రామ్ ధ్రువ్, పిసో కోవాచీ కుటుంబ సభ్యులు వారు ప్లాస్టిక్ బకెట్లతో సల్ఫీ లేదా తాటి మద్యం సేకరించడానికి అడవిలోకి ప్రవేశించిన రైతులు అని చెప్పారు. మాతో పాటు వచ్చిన సోమారో, రాజూ అనే ఇద్దరు గ్రామస్తులు, బుతూటాల గాయాల గుర్తులు చూపించారు. ఈ హత్యలపై విచారణ జరపాలని, న్యాయం జరగాలని, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కుటుంబీకులు జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ రాశారు.

స్క్రోల్ కంట్రిబ్యూటర్ మాలినీ సుబ్రమణ్యం ఈ సంవత్సరం భద్రతా దాడిలో మరణించిన వారి వివరాలను తెలియజేసే మూడు-భాగాల సిరీస్‌లో డాక్యుమెంట్ చేసిన లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. అయితే, ఘర్షణను దీర్ఘకాలంగా  పరిశీలిస్తున్నవారికి, భద్రతా దళాల తప్పులు ఆశ్చర్యం కలిగించవు- అవి ఘర్షణలో పాత నమూనాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ సంవత్సరం కొత్తది ఏమిటంటే, చాలా ఎన్‌కౌంటర్‌లలో కనిపించే ఖచ్చితత్వం.

అక్టోబరు 4కి ముందు, ఏప్రిల్ 6న అబుజ్‌మాడ్ ఉత్తర అంచున ఉన్న కాంకేర్ జిల్లాలో ఛోటే బెథియా ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు అతిపెద్ద దెబ్బ తిన్నారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన 29 మంది తమ కార్యకర్తలేనని మావోయిస్టుల ప్రకటన పేర్కొంది. ఆశ్చర్యకరంగా, మావోయిస్టుల ప్రకటనలో చనిపోయిన క్యాడర్‌ల హోదాలు ఒకరోజు ముందు పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్‌తో సరిపోలాయి.

ఐదుగురు డి‌ఆర్‌జి సిబ్బందిలో ఒకరు లొంగిపోయిన తిరుగుబాటుదారులు; వారికి తమ మాజీ సహచరుల జీవనం, పని వ్యూహాల గురించి బాగా తెలుసు కాబట్టి పోలీసు అధికారులు ఈ ఖచ్చితత్వాన్ని సంపాదించారు. “ఒక నిర్దిష్ట మావోయిస్టు నాయకుడు ఈ విధంగా స్పందించే అవకాశం ఉందని, అతను లేదా ఆమె ఎలా తప్పించుకోగలరని వారు మాకు సమాచారం ఇస్తారు” అని ఒక అధికారి చెప్పారు.

2010లో జరిగిన ఆకస్మిక దాడితో భద్రతా బలగాల్లో నక్సల్స్ పట్ల తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని మరో అధికారి పేర్కొన్నారు. “నేను వారితో కలిసి పనిచేశాను, వారిని ఎలా ఓడించాలో నాకు తెలుసు, నేను మిమ్మల్ని నడిపిస్తాను’ అని చెప్పే వ్యక్తివుంటే మాత్రమే ఆ భయాన్ని అధిగమించగలరు.”

కార్యకలాపాలకు వారి కేంద్రీకృతతను గుర్తించి, ఛత్తీస్‌గఢ్ పోలీసులు జిల్లా రిజర్వ్ గార్డ్‌లను దూకుడుగా ప్రోత్సహించారు. “ఒక సాధారణ కానిస్టేబుల్ ఒక ర్యాంక్‌ను అధిరోహించడానికి 15-20 సంవత్సరాలు పడుతుంది, కానీ డి‌ఆర్‌జి కేవలం ఐదు-ఆరు సంవత్సరాలలో కానిస్టేబుల్ నుండి ఇన్‌స్పెక్టర్‌గా ఎదగగలడు” అని రాజనాల చెప్పారు. “ప్రతి సంవత్సరం వారు పదోన్నతి పొందుతున్నారు.”

ప్రోత్సాహక వ్యవస్థలో ప్రమోషన్లు ఒక భాగం మాత్రమే:

 స్క్రోల్ గతంలో నివేదించినట్లుగా , ఇతర ద్రవ్య బహుమతులు, కోట్లాది రూపాయలకు చేరుకుంటాయి . బహుమతులు గెలుచుకునే అవకాశం పోలీసులను తుపాకీ పేల్చడానికి తహతహలాడేవారిగా చేసిందని మృతుల కుటుంబాలు నమ్ముతున్నాయి. కొందరు చిత్రహింసలకు గురిచేసి, శరీరాలను ఛిద్రం చేశారని ఆరోపించారు. ఏప్రిల్ 6న కంకేర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన తన కొడుకు బైజ్‌నాథ్ పద్దా, మృతదేహాన్ని తీసుకున్నప్పుడు, అతని కుడి భుజం, ఎడమ తొడ తెగిపోయివున్నాయని తల్లి ముక్కే పెద్దా చెప్పింది. లొంగిపోయిన మావోయిస్టులు తమ మాజీ సహచరుల పట్ల చూపిన శత్రుత్వమే హింసకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.

హత్య చేయడం కంటే మావోయిస్టులు లొంగిపోవడమే మేలని పోలీసులు చెబుతున్నారు. నారాయణపూర్ పోలీసు సూపరింటెండెంట్ రెండు వారాల క్రితం తమ కుటుంబాన్ని కలిశాడని, అక్టోబరు 4న జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టు సీనియర్ నాయకుడు సురేష్ సలామ్ కుమార్తె చెప్పింది. తమ తండ్రిని లొంగిపోవాలని అడగాలని చెప్పాడని  సోమ్‌డే సలామ్ అనే కళాశాల విద్యార్థి చెప్పాడు; “కానీ అతను అలా చేయలేడని మాకు తెలుసు.”

ఈ సంవత్సరం ప్రారంభంలో స్క్రోల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక మావోయిస్టు కమాండర్, మాజీ గెరిల్లాలు పోలీసులలో చేరడం వల్ల దుస్తులకు వ్యూహాత్మక నష్టం జరిగిందని అంగీకరించాడు. “వారికీ చాలా నైపుణ్యం వుంది” అని ఆయన అన్నారు; అవినీతి ఆరోపణలు, “నైతిక లోపాల” కారణంగా వారిలో చాలా మందిని విడిచిపెట్టి వెళ్ళమని పార్టీ కోరవలసి వచ్చింది. “వారిలో చాలామంది వివాహం చేసుకున్నప్పటికీ రెండవ భాగస్వామిని తీసుకున్నారు. దీన్ని సహించబోమని మా పార్టీలోని మహిళలు స్పష్టం చేశారు.”

నారాయణపూర్‌లో మనకు అలాంటి ఉదాహరణ కనపడుతుంది. కోడెనార్ గ్రామ నివాసి తన బంధువు బుద్రు వర్తా తన భార్య, బిడ్డను వదిలి మావోయిస్టులలో చేరడానికి వెళ్ళాడు. కొన్ని సంవత్సరాల తరువాత, అతను రెండవ భార్యతో సీధో, సహ మాజీ సభ్యురాలితో గ్రామానికి తిరిగి వచ్చాడు. అయితే గ్రామ కమిటీ ఆమెను వదిలేయాలని పట్టుబట్టింది. వర్త, అతని భాగస్వామి లొంగిపోవడానికి, జిల్లా రిజర్వ్ గార్డ్స్‌లో చేరడానికి నారాయణపూర్ వెళ్ళిపోయారు.

ఈ సంవత్సరం దాడి బస్తర్ ప్రాంతంలో పెరుగుతున్న సైనికీకరణ నేపథ్యంలో వచ్చింది. ఈ సంవత్సరంలోనే, ఈ ప్రాంతంలో 22 కొత్త భద్రతా శిబిరాలను ఏర్పాటు చేసారు, వీటిలో చాలా వరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి కేంద్ర బలగాలు ఉన్నాయి.

రాజ్య ఆధిపత్యాన్ని నెలకొల్పడంలో కీలకమైన స్థలాన్ని పట్టుకోవడం వారి పాత్ర అని ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్‌రాజ్ అన్నారు. శిబిరానికి 5 కిలోమీటర్ల పరిధిలో మావోయిస్టులు సమావేశాలు నిర్వహించలేకపోతున్నారని ఆయన అన్నారు. “ఒక విప్లవ పార్టీకి తమ మూలాధారం నుండి సంపర్కం కోల్పోవడం ఇబ్బందిని కలిగిస్తుంది. వారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లడం ఇకపై సులభం కాదు. వారి మార్గం మూసుకుపోతోంది.”

అయితే, అభివృద్ధిని ప్రారంభించడమే శిబిరాలను తెరవడంలోని పెద్ద లక్ష్యం అని సుందర్‌రాజ్ త్వరగా జోడించాడు. “శిబిరం ఒక పూర్వగామి – దీనిని అనుసరించేవి రహదారి, విద్యుత్, మొబైల్ టవర్, రేషన్ దుకాణం, అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాల మొదలైనవి” అని అతను చెప్పాడు.

కానీ రాజ్య లక్ష్యాలు నిరపాయమైనవని కొందరు నమ్ముతున్నారు.

దేశంలోనే అత్యంత సంపన్నమైన అధిక నాణ్యత గల ఇనుప ఖనిజ నిక్షేపాలు బస్తర్‌లో వున్నాయి. గత దశాబ్దంలో, ఈ ప్రాంతంలో కనీసం రెండు కొత్త ఇనుప ఖనిజం గనులను ప్రారంభించారు. 2022లో, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో, రాష్ట్రంలో 108 సంభావ్య ఖనిజ బ్లాకులను ప్రచారం చేసింది. జాబితాలోని 28 ఇనుప ఖనిజం బ్లాక్‌లలో 21 బస్తర్‌లో ఉన్నాయి.

స్థానిక ప్రజల అవసరాల కోసం కాకుండా మైనింగ్ ప్రయోజనాల కోసం అనేక భద్రతా శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. “బస్తర్‌లోని పోలీసు శిబిరాలు ద్వంద్వ ప్రయోజనాన్ని అందిస్తాయి” అని కార్యకర్త, న్యాయవాది బేలా భాటియా ఇటీవల ప్రచురించిన తన పుస్తకంలో రాశారు. “ఒక వైపు, వారు మావోయిస్టు ఉద్యమాన్ని అణిచివేయడానికి సహాయం చేస్తాయి. మరోవైపు మైనింగ్ కార్యకలాపాలకు మార్గం సుగమం చేస్తాయి. మొదటి ప్రయోజనం మాత్రమే అధికారికంగా గుర్తించబడింది, కానీ రెండవది మరింత ముఖ్యమైనది కావచ్చు.

అక్టోబర్ 4 ఎన్‌కౌంటర్ జరిగిన నారాయణపూర్‌లోని ఓర్చా బ్లాక్‌లో, ఒక ప్రైవేట్ సంస్థ జయస్వాల్ నెకో 2021 నుండి ఆమ్‌దాయ్ కొండల నుండి ఇనుప ఖనిజాన్ని తవ్వుతోంది. గనిని తెరవడానికి ముందు భద్రతా శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

2020లో, సమీప గ్రామాల నివాసితులు ప్రతిపాదిత ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా గనికి వెళ్లే రహదారిని అడ్డుకున్నారు – కానీ ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు మరమ్మతులు చేయాలని కోరుతూ రోడ్డును కొన్ని రోజులకొకసారి దిగ్బంధిస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణీకుల బస్సులు చాలా తక్కువగా తిరుగుతాయి. మైనింగ్ ట్రక్కులు వదిలే ధూళి మేఘాలు తమ పొలాల దిగుబడిని తగ్గించాయని గ్రామస్తులు అంటున్నారు.

ఆదివాసీ భూములు, అడవులు, జీవనోపాధికి కోలుకోలేని నష్టం కలిగించే ఈ మైనింగ్ భయాలు ఇప్పుడు నారాయణపూర్‌లో మాడ్ బచావో మంచ్ (మాడ్‌ను రక్షించే వేదిక) అని పిలుస్తున్న ఒక పెద్ద నిరసన ఉద్యమానికి ప్రేరణనిచ్చాయి. ఓర్చాలోని 13 గ్రామ పంచాయతీలకు చెందిన 118 గ్రామాలు నిరవధిక నిరసనలో పాల్గొంటున్నట్లు దాని నిర్వాహకులు తెలిపారు. ఒక నది పక్కన నిర్మించిన విశాలమైన గుడిసెలతో వున్న నిరసన ప్రదేశానికి వెళ్ళినరోజు  – హాజరు రిజిస్టర్‌లో 90 గ్రామాలకు పైగా వున్నాయి.

“మాకు ఇరుకైన రోడ్లు కావాలి, విశాలమైన రోడ్లు కాదు” అని ఒక నిరసనకారుడు చెప్పాడు. “సైకిల్, బైక్, అంబులెన్స్, ట్రాక్టర్ వెళ్లగలిగే రోడ్లుకావాలి, ట్రక్కులు వెళ్ళేవి కాదు.”

నిరసన ఉద్యమానికి రాజ్య ప్రతిస్పందన ఊహించదగినదే: మంచ్ సమన్వయకర్త  లఖ్మా కొర్రంను ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులో అరెస్టు చేసారు.

మంచ్‌కు మావోయిస్టులకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అధికారికంగా పేర్కొన్నప్పటికీ, కొర్రమ్‌ను అరెస్టు చేసినప్పటి నుండి నాయకత్వ పగ్గాలు చేపట్టిన యువ సభ్యులు తమను కూడా అరెస్టు చేస్తారని  భయపడుతున్నారు. విమర్శకులు, పౌర హక్కుల ఉద్యమాలను అణచి వేయడానికి మావోయిస్టుల సంఘర్షణను సాకుగా తీసుకునే సుదీర్ఘ చరిత్ర ఛత్తీస్‌గఢ్‌కు ఉంది.

ఈ భయాలు ఉన్నప్పటికీ, మంచ్ మరింత మంది అనుచరులను ఆకర్షిస్తూనే ఉంది. తాజాగా చేరినవారు 52 గ్రామాలకు చెందిన వారు. తమ భూములను ఆర్మీ విన్యాస శ్రేణి కోసం సేకరించేందుకు కేటాయించారని వారు ఇటీవల తెలుసుకున్నారు. ఈ ప్రతిపాదన 2017 నాటిది అయినప్పటికీ, భూమికి సంబంధించిన వివరాలను అందించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరుతూ ఆగస్టు 7 నాటి రెవెన్యూ శాఖ లేఖతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ వార్త నంద ధృవ్‌ని భయాందోళనకు గురి చేసింది. భిలాయ్ నుండి గ్రాడ్యుయేట్ అయిన అతను తన స్వగ్రామమైన గోంగ్లాలో నివసిస్తున్నాడు; వ్యవసాయం చేస్తున్నాడు. మన భూమిని కోల్పోతే సర్వం కోల్పోతామని అతను అన్నాడు. “మేము, మాడ్ ప్రజలం, నగరంలో మనుగడ సాగించలేము.”

అయినా అతను నిరసన తెలియచేయడానికి జంకుతున్నాడు – మావోయిస్టుగా ముద్ర వేస్తారని భయపడుతున్నాడు.

మావోయిస్టులు చాలా తప్పు చేశారు. “కానీ, వారి కారణంగానే, మాడ్లోని జల్, జంగిల్, జమీన్ సురక్షితంగా ఉన్నాయి.”

సంఘర్షణలో రాజ్యం పైచేయి సాధించడంతో, మాడ్ ప్రజలు ఈ రక్షణను కోల్పోతున్నారని ఆందోళన చెందుతున్నారా? అని మేము నిరసన స్థలంలో గోటుల్ లేదా సాముదాయిక కేంద్రంలో చేరినన గ్రామస్తుల బృందాన్ని అడిగాము.

ఒక వ్యక్తి పరిహాసంగా అన్నాడు”మావోయిస్ట్‌లుగా మమ్మల్ని బెదిరించిన వ్యక్తులే ఇప్పుడు మమ్మల్ని డిఆర్‌జిలని వేధిస్తున్నారు.” ” భూమిని రక్షింఛేది తుపాకులు కాదు. ప్రజలు.”

మాలినీ సుబ్రమణ్యం రిపోర్టింగ్‌లో సహాయాన్నందించారు.

అక్టోబర్ 17, 2024 

తెలుగు: పద్మ కొండిపర్తి

https://scroll.in/article/1074542/where-is-indias-forgotten-war-headed?sfnsn=wiwspmo

Leave a Reply