పోలింగ్‌ పాలకుల తలరాత మారుస్తుంది. కొత్త వాళ్లు అధికారంలోకి రావచ్చు. పాత వాళ్లే కొనసాగవచ్చు. అద్భుతాలు జరిగినా, జరగకపోయినా ఏదో ఒక రకంగా ‘పాలించడబడటం’ ప్రజలకు మామూలవుతుంది. వేడి చల్లారిపోవడం, కొత్తపోయి పాతపడటం  అంటే ఇదే.

కాకపోతే మొన్నటి సాధారణ ఎన్నికలకు కొంత ప్రత్యేకత ఉంది. ప్రధాన స్రవంతి పత్రికల్లో కూడా ఇది కనిపించింది. బీజేపీ కూటమికి, ఇండియా కూటమికి మధ్య భావజాల ఘర్షణగా కూడా  చూశాయి. నిజానికి ఇది దిన పత్రికలకు అందే వ్యవహారం కాదు. వాటి   స్థాయిని మించింది. అయినా ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రమాదకరమైన ఆలోచనలు బీజేపీకి ఉన్నాయని, కాంగ్రెస్‌ దానికి ప్రత్యామ్నాయమని పత్రికలు కూడా అనుకున్నాయి.

ఇక ఎన్నికల సమయంలో  ఫాసిజానికి వ్యతిరేకంగా రాజ్యాంగపరిరక్షణ పేరుతో మంచి ప్రతిస్పందనే వచ్చింది. మరోసారి బీజేపీ అధికారంలోకి  రాకూడదనే విలువైన ఆకాంక్ష అందులో ఉంది.   ఇందులో భాగమైన వాళ్లలో కొందరు ఫాసిజం పట్ల  పౌర సమాజం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరుకున్నారు. కానీ ఎక్కువ మంది  కాంగ్రెస్‌ గెలుపు కోసం చాలా శ్రమించారు. ఎన్నికల్లో బీజేపీని దించేయడమంటే  కాంగ్రెస్‌ను గెలిపించడమే.. కాబట్టి ఆ పని చాలా పెద్ద ఎత్తున చేశారు.

చివరికి ఫలితాలు మోదీ కోరుకున్నట్లు రాలేదు. రాహుల్‌కు అధికారాన్నీ ఇవ్వలేదు. ఈ గెలుపు ఓటములు చర్చ ఎలా ఉన్నా అసలు విషయం ఏమంటే ఎన్నికల ‘వేడి’ సహజంగానే చల్లారిపోయింది. ఇది మామూలే  అనిపించవచ్చు. కాకపోతే ఈసారి ఈ వేడికి కారణమైన ఫాసిస్టు వ్యతిరేకత కూడా ప్రస్తుతానికి చల్లారిపోయిందా? అనే సందేహం కలుగుతోంది. కనీసం ఫేస్‌బుక్‌ రాతల్లో కూడా ఎన్నికలనాటి ఫాసిస్టు వ్యతిరేక పదును కనిపించడం లేదు. ఇలాంటి వాళ్లలో చాలా మందికి పోరాటాల దీర్ఘకాలికత తెలుసు. ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలు స్థిమితంగా ఎట్లా సాగాలో కూడా తెలుసు. అలాంటి విషయాల మీద నలుగురికి బోధించగలరు. ఎన్నికలయ్యాయి కాబట్టి బహుశా వారంతా ప్రస్తుతానికి అన్నీ పక్కన పెట్టేసినట్లుంది. 400 సీట్లతో ఏకఛత్రాధిపత్యం చెలాయించాలనుకున్న మోదీని సంకీర్ణంలోకి తోసి వేయడంతో ఫాసిజం బెడద చాలా వరకు తీరిపోయిందనుకుంటున్నారా? అనుమానం.

ఫాసిస్టు పార్టీ  తిరగులేని మెజారిటీతో అధికారంలోకి  వచ్చినప్పుడే కాదు. అది  కోరుకున్నన్ని సీట్లు రానప్పుడు కూడా ‘ఫాసిజాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం?’ అనే ప్రశ్న ఎదురవుతుంది. బీజేపీకి ఫాసిస్టు భావజాల పునాది ఉండటమే కాదు.  హిందుత్వ ఫాసిస్టు దేశంగా ఇండియాను మార్చే వ్యూహం కూడా ఉన్నది. మిగతా పార్టీలకు ఇది లేకపోవచ్చు. కానీ ప్రతి ఎన్నికల పార్టీకి ఎంతో కొంత ఫాసిస్టు స్వభావం ఉంటుంది. ఎన్నికలయ్యాక సంకీర్ణ బీజేపీనే కాదు. మిగతా అన్ని ప్రభుత్వాల ఫాసిస్టు స్వభావం ఎట్లా బయటపడుతుందో సమాజం అప్రమత్తంగా ఉండాల్సిందే. కేంద్రంలోని బీజేపీ   రాష్ట్రాలలోని మిగతా పార్టీల ప్రభుత్వాలను దిగమింగడానికి పొంచి ఉన్నప్పటికీ  అటూ ఇటూ అన్ని ప్రభుత్వాల మీద ప్రజాస్వామిక విలువల వైపు నుంచి ఒత్తిడి పెట్టాల్సిందే. బైటికి ఏ పార్టీ ప్రభుత్వం ఎట్లా కనిపించినా తమ సొంత ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అది తెలియనప్పుడు బీజేపీ మీద, దాని భాగస్వామ్య పార్టీల ప్రభుత్వాల మీద ఉన్న విమర్శ మిగతా ప్రభుత్వాల మీద ఉండదు.   

తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బొటాబొటి మెజారిటీతో  గెలిచాక కొంతమంది మంది మేధావుల ఆలోచనల్లో ఇలాంటి అప్రమత్తత లోపించింది.  రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కేంద్రంలోని బీజేపీ ఎప్పుడైనా దెబ్బతీయవచ్చు… కాబట్టి ఆ ప్రభుత్వం మీద ప్రజల వైపు నుంచి అంత ఒత్తిడి పెట్టకూడదు…రేవంత్‌రెడ్డి తీర్చలేని డిమాండ్లను తీసికెళ్లి ఇరకాటాన పడెయ్యకూడదు… బీజేపీయేతర ప్రభుత్వాలను కాపాడుకోవడం కూడా ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో ఒక ముఖ్యమైన విషయం.. అనే అభిప్రాయం వచ్చింది. వాళ్లనుకున్నట్లే ఆ తర్వాత కేజ్రీవాల్‌ వ్యవహారం జరిగింది.  

మొన్న జులై 4వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఢల్లీి వెళ్లి మోదీని కలిశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు. ఆయనకు  శాలువాలు కప్పారు. సన్మానాలు చేశారు. అక్కడికి ఆగలేదు. తెలంగాణలో మావోయిస్టు బెడద తీర్చడానికి చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్రలోలాగా సైనిక క్యాంపులు పెట్టాలని రేవంత్‌రెడ్డి కేంద్ర హోం మంత్రిని కోరాడు. గోదావరి తీరం పొడవునా ఎక్కడెక్కడ అవసరమో చెప్పాడు. అప్పటికే కేసీఆర్‌ కాలం నుంచి ఉన్న క్యాంపులకు అదనంగా కావాలని ఆయన కేంద్రాన్ని విజ్ఞప్తి చేశాడు. మావోయిస్టు ఉద్యమ అణచివేతకు అవసరమైన సాంకేతికతకు కేంద్రం నిధులు కేటాయించాలని కూడా కోరాడు.

తెలంగాణ శాసన సభ ఎన్నికల ఆరు హామీలతోపాటు ఏడో హామీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రకటించాడు. ఏ డు నెలలు  గడిచాయి కాబట్టి జనం ఆ సంగతి మర్చిపోయి ఉంటారని ఆయన అనుకొని ఉండవచ్చు. లేదా ప్రజాస్వామ్య పునరుద్ధరణకు, మావోయిస్టు ఉద్యమ అణచివేతకు సంబంధం లేదని కూడా  అనవచ్చు. ఆయనే కాదు. ఆయన సీఎం కావడానికి (కేసీఆర్‌ను, బీజేపీని అడ్డుకోవడంలో భాగంగానే కావచ్చు) కృషి చేసిన మేధావులు కూడా ఇదే మాట అనవచ్చు. ప్రజాస్వామ్యానికి, ఫాసిజానికి సంబంధం లేని చర్చగా దీన్ని కొట్టిపడేయవచ్చు.

తెలంగాణలో ఊరేగింపులకు అనుమతి లేదు. చివరికి హాలు మీటింగులకు కూడా పోలీసు అనుమతి ఉండాల్సిందే అనే కేసీఆర్‌ విధానమే అమలవుతోంది.  యుఏపీకే కేసుల కింద రచయితలను అక్రమంగా అరెస్టు చేస్తునే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆపరేషన్‌ కగార్‌ను విమర్శిస్తూ ప్రదర్శించిన ఓ నాటికలో పిల్లలు నటించడం నేరమని పోలీసులు అన్నారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కేంద్రాన్ని కలిసి మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయడానికి మిగతా రాష్ట్రాల్లోలాగే తెలంగాణలో కూడా ఏర్పాట్లు చేయమని కోరి వచ్చాడు.

ప్రభుత్వమంటూ ఉన్నాక ఇవి చాలా మామూలు విషయాలని అనేవాళ్లు ఉండవచ్చు. ఇవి అంతగా పట్టించుకోవాల్సినవి కావని అనవచ్చు.  ప్రజాస్వామ్య సమస్యల దాకా, ఫాసిజం దాకా వీటిని తీసికెళ్ల కూడదని హితవు చెప్పేవాళ్లు కూడా ఉండవచ్చు.  కానీ పౌర హక్కులకు భంగం వాటిల్లడమంటే సమాజం తీవ్ర ప్రమాదంలో ఉన్నట్లే. ప్రభుత్వానికి, ప్రజలకు వైరుధ్యం తీవ్రమవుతున్నట్లే. ఏ పార్టీ ప్రభుత్వానికైనా తన లక్ష్యం పట్ల స్పష్టత ఉంటుంది. అది పెరిగిపోయే కొద్దీ ప్రజల మీద దాడులు తీవ్రమవుతాయి. అప్పుడు ప్రజలు తమకు ఏం కావాలో స్పష్టంగా ఎలుగెత్తి అరవాల్సిందే. ప్రభుత్వాలను నిలదీయాల్సిందే. ఎన్నికలు కేంద్రంగా ఆలోచించేవాళ్లకు  ఫాసిస్టు వ్యతిరేక పోరాటం మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడే. కానీ ప్రజలకు అది జీవన్మరణ  నిరంతర పోరాటం.

Leave a Reply