హైదరాబాద్ బుక్ ఫెయిర్ చివరిరోజు వీక్షణం స్టాల్‌లో అమ్మకానికి పెట్టిన ఓ పుస్తకం విషయంలో ఆ స్టాల్ నిర్వాహకుడు, వీక్షణం సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ పట్ల ఆర్ఎస్ఎస్ వ్యక్తుల దురుసు ప్రవర్తనను విప్లవ రచయితల సంఘం ఖండిస్తోంది. “తిరుపతి బాలాజీ బుద్ధ క్షేత్రమే” అనే ఆ పుస్తకాన్ని.. మన గతం పట్ల ఎరుకను పెంచడంలోభాగంగా ప్రచురించిన సమాంతరకు, అనువాదకుడు ఎ.ఎన్.నాగేశ్వరరావుకు అండగా తెలుగు సమాజం నిలబడాలని కోరుతున్నాం. బహుళత్వ విలువలను సాహిత్యంలో బలంగా ప్రతిపాదిస్తున్న మెర్సీ మార్గరేట్, స్కైబాబా వంటి రచయితలు తమ భావాల కారణంగా తరచూ వేధింపులకు గురవుతున్నారు. తన సంపాదకత్వంలో “ఉచ్చల జలధి తరంగ” పేరుతో కవితా సంకలనం ప్రచురించిన మెర్సీ గత వారం రోజులుగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. కాస్త వెనక్కి వెళితే, ఏడు నెలల క్రితం రచయితలు సమూహా నేతృత్వంలో వరంగల్‌లో ఏర్పాటుచేసుకున్న సదస్సును ఆర్ ఎస్ ఎస్ మూకలు తాగి వచ్చి భగ్నం చేయడానికి ప్రయత్నించాయి. అందువల్లే బుక్‌ఫెయిర్లో జరిగింది కేవలం విడి ఘటన కాదని వి.ర.సం. భావిస్తోంది. తెలంగాణలో ఆలోచనపరులపై కొనసాగుతున్న వేధింపులు, భౌతిక దాడుల పరంపరలో ఇదీ భాగమే. పైగా వీక్షణం స్టాల్‌లో తమ యాగీని సంఘ్ వ్యక్తులు సెల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టుచేశారు. వారిలో ఒకడు స్టాల్ నిర్వాహకునితో వాదులాడుతుంటే, అతడి వెంట వచ్చిన మిగతావారు దూరంగా నిలబడి దాన్నంతా వీడియో తీశారు. అప్పటినుంచి వేణుగోపాల్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. స్టాల్‌లో వాదనను చిత్రీకరించానికి ముందస్తుగా చేసి పెట్టుకున్న ఏర్పాట్లను చూస్తేనే, వేణుగోపాల్ ను ఉద్దేశపూర్వకంగానే సంఘ్ టార్గెట్ చేసిందనేది సుస్పష్టం. ప్రగతిశీల భావాల శిబిరానికి తన రచన, విశ్లేషణ, ప్రసంగం, పత్రిక నిర్వహణ ద్వారా కనీసం మూడు దశాబ్దాలుగా వేణుగోపాల్ దన్నుగా ఉన్నారు. అయితే, తెలంగాణలో ప్రగతిశీల సృజన, ఆచరణ, ఐక్య కార్యాచరణ ప్రయత్నాలు గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర ఒత్తిడిని ఈనాడు చవిచూస్తున్నాయి. గత ఏడాది కాలంగాను, అంతకుముందు కేసీఆర్ పాలించిన పదేళ్లలోను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలంగాణలో సాగుతున్న ఫక్తు కమండల్ పాలనే దీనికి కారణం. తెలంగాణలో కొద్ది రోజుల క్రితమే టీచరుతో విద్యార్థి కాళ్లు పట్టించిన ఘటన దీనంతటికీ వికృత వ్యక్తీకరణ. అయితే, ఈ క్రమమంతా ఇప్పుడు మరింత ప్రమాదకర స్థితికి చేరుకున్నదనే సంకేతాలను తాజా ఘటన అందిస్తోంది.
కె. జమనాదాస్ రాసిన Tirupati Balaji was a Buddist Shrine అనే పుస్తకం ఇప్పుడు తెలుగులోకి వచ్చి పదిమంది చేతుల్లోకి చేరిందిగానీ, ఆ పుస్తకం అంగ్ల ప్రతిలోని అంశాలు చర్చలో ఉన్నవే. ముఖ్యంగా నాస్తికులు, హేతువాదులు ఈ అంశాలపై సమాజ అవగాహనను విస్తృతం చేశారు. కాస్త చారిత్రక జ్ఞానం ఉన్న ఎవరైనా హైందవం కంటే బౌద్ధం ప్రాచీనమైనదని, దానికంటే సాంఖ్యం మరింత పురాతన తత్కమని గ్రహించడం కష్టం కాదు. హైందవ ధర్మవ్యాప్తిలో భాగంగా ఆది శంకరుడు, ఆయన శిష్యులు అటు ఉత్తరం నుంచి ఇటు దక్షిణం దాకా ఎన్నో బౌద్ధ క్షేత్రాలను, దేశీ అమ్మవార్ల ఆరాధనా స్థలాలను ఆలయాలుగా మార్చారనేది స్పష్టం. ఈ క్రమంలో తిరుపతి బాలాజీ రూపం ఓ బౌద్ధుడిది అనీ, ఆ విగ్రహంలో ఉన్నది అమ్మవారు కావచ్చుననే సందేహాలెన్నో ఉన్నాయి. వాటన్నింటినీ తీర్చేవిధంగాను, నాగరిక సమాజానికి తన గతం పట్ల ఉండాల్సిన సమ్యక్, శాస్త్రీయ అవగాహనను అందించేవిధంగాను తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే.. తయరైంది. ఈ పుస్తకానికి ఈనాటికీ ప్రాసంగికత ఉంది. తాజా ఘటనలో బయటపడిన సంఘ్ దురుసుతనంలోని ఉడుకుబోతుతనమే దీనికి తిరుగులేని నిదర్శనం.
ఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా, సంఘ్ రచ్చపై సోషల్మీడియాలో ఇంత చర్చ జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడం గర్హనీయం. తెలంగాణకు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణను ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. గద్దెనెక్కిన కొద్ది కాలానికే ఢిల్లీలో మోదీని కలిసి తిరుపతి వెంకటేశ్వరస్వామి విగ్రహం బహూకరించి వచ్చారు. అలాంటి నేత నుంచి పెద్దగా ఆశించేది ఏమీ ఉండదుగానీ, బుక్‌ఫెయిర్‌లో విక్రేతల వ్యాపారాలకు రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత మాత్రం రేవంత్ ప్రభుత్వానిదే. ఆ బాధ్యతను నెరవేర్చేలా ప్రభుత్వంపై తెలంగాణ సమాజం ఒత్తిడి తీసుకురావాలని కోరదాం. బుక్‌ఫెయిర్ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనపై
ముందుగా బుక్ ఫెయిర్ కమిటీ స్పందించాలి. నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కమిటీ ఫిర్యాదు చేయాలి. ఇప్పటికే ఈ పని కమిటీ చేసి ఉంటే సరే.. లేదంటే వేణుగోపాల్‌కు, తక్కిన ప్రగతిశీల ఆలోచనపరులకు మద్దతుగా ఇప్పుడైనా అందుకు కమిటీ పూనుకోవాలని విజ్ఞప్తి.
Attack /comments on venugopal garu -mercy Margaret garu /skybaba garu // is wrong —stupidity
Meaning less —
Agree with Krishna garu