Literature is a part of the history and it is like a reservoir of human experiences, emotions and struggle for development.It connects the people, brightens the behaviour and enlighten human aspirations… “
పలమనేరు బాలాజీ కథలు జీవితపు అట్టడుగు పొరలనుండి తవ్వి తీసిన పాఠాలు.
ఒకానొక ప్రదేశంలో జీవించిన వేర్వేరు మనుషుల పొట్ట నింపుకునే ప్రయత్నంలో ప్రాణం నిలుపుకునే ఆరాటం, వెంటాడుతున్న బతుకు భయం.
ఈ కథలు. కడుపు నిండిన వాళ్ళవి కాదు . కడుపు మండిన వాళ్ళ వెతలు. రెక్కాడితే కాని డొక్కాడని సామాన్యల పెనుగులాట. మైమరపించే , మత్తెక్కించే ప్రేమ గీతాలు కాదు. అనాగరికులుగా ముద్రవేయబడిన సామాన్యలు ప్రతినిత్యం పాలకుల పేరుతో చేస్తున్న అరాచక శక్తులపై నిర్లప్తంగా కొనసాగించిన తిరుగుబాట్ల వెతలు అంధకారంలో కాసింత వెలుతురు కోసం పెనుగులాట.
అయినప్పటికీ పాఠకులుగా ఈ కథల వెంట సాగిపోతూ ఉంటే,ఆయా పాత్రల రసాప్లావిత, అస్పష్ట అద్వితీయ ప్రేమాన్విత వ్యక్తీకరణ సంతోషంగా ఉంటుంది.
ఈ కథల్లో కొన్ని పాత్రలు జీవితం కంటే విలువైన వాళ్ళు .. బాలాజీ మాటల్లో నే
“లోయలు, జలపాతాలు,పర్వతాలు,
అగ్ని సరసులు
వాళ్ళ ముందు వెళ వెళబోతాయి.”
ఇందులో ఎరుకల జీవనగాథలున్నాయి. ఇప్పటికీ అవమానాలు పొందుతూ ఆత్మ గౌరవంకోసం,తమ అభివృద్ధి కోసం పోరాడుతున్నారు. ఇతర దళిత కులాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కళ్యాణరావు గారి అంటరాని వసంతం , చిలుకూరి దేవపుత్ర గారి పంచమం నవలలు, అరుణ ఎల్లి, నీలి నవలలు …. తెలుగు సాహిత్యం లో అద్భుతమైన రచనలు .. ఇప్పుడు బాలాజి కథల పుస్తకం కూడా తప్పకుండా అసంఖ్యాక పాఠకులు చదువుతారు . ఈ పుస్తకం పర్ స్పెక్టివ్స్ వాళ్ళు ప్రచురించారు .సంపాదకుడు ఎ.కె.ప్రభాకర్ ” ఎరుకల కాంభోజి రాగం” అనే పేరుతో ముందు మాట రాశారు . ఇందులోని ముందు మాటలు పుస్తకం లోని అతిముఖ్యమైన విషయాలను పాఠకులకు పరిచయం చేస్తాయి.
బాలాజి రచనాశైలి వలన పాఠకులు ప్రతిపాత్రకు దగ్గరవుతూ,వారి ఆలోచనల్లో ,అనుభవాలతో,అనభూతుల్లోభాగమవుతున్నట్లు అనిపిస్తుంది.
ఈ కథలన్నింటి అంతః సూత్రం మనిషిని మనిషి ప్రేమించాలని , కష్టాల్లో , బాధల్లో ఉన్నప్పుడు తప్పకుండా సహాయపడాలని , బ్రతకటానికి కావలసిన కాస్తంత ధైర్యం ఇవ్వాలనే మానవీయవిలువలు…సమాజ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పటమే.
1871 లో బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన క్రిమినల్ ట్రైబల్ యాక్ట్.. ద్వారా వందలాది జాతులను నేరజాతులుగా, కోట్లాదిమంది ప్రజలను నేరస్థులుగా ముద్ర వేశారు. కొన్ని కులాల ప్రజలను హీనంగా చూస్తూ,వారిపై దౌర్జన్యం చేయటం .. ఊర్లోకి రానివ్వకుండా పీడించటం లాంటి అమానవీయ ఆచరణ గురించీ ఇప్పటికే పౌర సమాజంలో ఉంది. తర తరాలుగా చదువుకు , ఊర్లో గుళ్ళో కి దూరం. నాగరికత కు దూరం . వ్యవసాయానికి దూరం . అలాంటి ఒక కులం గురించి ఎరుకల జీవితం గురించి బాలాజీ ఈ కథల్లో చెప్పారు. ఇందులో 18 కథలున్నాయి. పదకొండు నెలల జీతగాడు మొదలు ఏకలవ్య కాలనీ వరకు .. ప్రతి కథా అక్కడి ప్రజల గతం , వర్తమానం గురించి చెబుతాయి.
ప్రధానంగా తల్లి తండ్రుల నుండి పిల్లలు నేర్చుకోవాల్సిన సంస్కారం, ప్రభుత్వం ఉద్యోగులయిన తర్వాత ప్రజల పనుల పట్ల ఉండాల్సిన మానవీయ విలువలు, కృతజ్ఞత, సహాయం చేయటం లాంటివి ప్రేమ ,కరుణ చిరునామాగా ఉండాలని ఈ కథలు చెబుతాయి..
మహిళలను గురించి వారి వ్యక్తిత్వం గురించి బాలాజీ చాలా ఉన్నతంగా ఉదాత్తంగా చిత్రించారు .
“ఆయమ్మ అంతే ! ఒక మదర్ థెరీస్సా , అమరజీవి కాంతమ్మత్త, ఏనుగుల రాజ్యం లో , ఏకలవ్య కాలనీ ,గురి ” కథలు మంచి ఉదాహరణలు ..
చివరి కథ ఆ కులం నుంచి ప్రభుత్వ ఆఫీసర్ అయ్యాక తిరుమల ఆ కాలనీ అభివృద్ధికి కృషి చేయటం ..నీ స్వార్థం నీవు చూసుకోమని మిత్రుడు హెచ్చరిస్తున్నా.. తనలో దాగిన కృతజ్ఞతా భావంతో చేతనయిన సహాయం చేయటం .. కుటుంబంలో ఉండాల్సిన ప్రజాస్వామిక విలువలు, పిల్లల పెంపకం పై తల్లి తండ్రుల ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాలు పాఠకుల దృష్టికి తెచ్చారు… తన చేతుల మొరటుదనంలో ఆ గీతాల్లో దాగిన తమ పూర్వీకుల విషాద సంఘటనలను చాలా సున్నితంగా చెప్పటం బాలాజీ రచనా శైలిలోని ప్రత్యేకత.
ఎరుకల కాలనీ లో జీవించిన జయమ్మ ఒక మదర్ థెరిస్సా.కాంతమ్మత్త అమరజీవి . ఆదెమ్మ ( కట్టెలమ్మ) ధైర్యశాలి . ఎవరన్నా ఆమెకు భయం లేదు . . గురి కథలో మంజుల ఆత్మాభిమానం, పౌరుషం గల్గిన యువతి ,కష్టజీవి .
జయమ్మ భర్త ఏండ్ల తరబడి కూడబెట్టిన డబ్బుతో కొనిచ్చిన కమ్మలు , ఉంగరం, ముక్కు పుడక,గాజులు ..ఎప్పుడు ఎవరో ఒకరిని ఆదుకుంటూ తాకట్టులో ఉంటాయి. ఆమె విద్యావంతురాలు.తను పుస్తకాలు చదువుతూ పిల్లలకు కూడా మంచి విషయాలు చెబుతూ ఉంటుంది. కాలనీలో ఎవరికి కష్టం వచ్చినా అక్కడ ఆమె ఉంటుంది.
కాంతమ్మ అప్పట్లో నాలుగు లేదా ఐదవతరగతి చదివి ఉండొచ్చు.భర్త తోడులేకున్నా ఆమె ఒక చిన్న కొట్టు పెట్టుకొని అక్కడివారికి ఎన్నో విషయాల్లో అండగా ఉంటుంది . ఆడవాళ్ళ పై చేయి చేసుకునే మెగాళ్ళను దండిస్తుంది. జ్ణాపకశక్తి ఎక్కువ ఆమెకు. మహిళలంతా పరిశుభ్రంగా ఉండాలని,తమకు చేతనయిన సంపాదన ఉండాలనీ, పిల్లలను బాగా చదివించుకోవాలని చెబుతూ ఉంటుంది . మూలికా వైద్యం కూడా ఆమెకు తెలుసు .. ఇలా చెబుతూ పోతే ఆమె ఎంత ఉదాత్త మైన మనిషో అర్థం చేసుకోవాలంటే కథ చదవాల్సిందే.
ఇంక ఆదెమ్మ . ఆమె భర్తను పోరి అనేక విధాలుగా కష్టపడి రెండు ఎకరాల భూమిని కొని మామిడి తోట పెంచుతుంది , ఎంతో కష్టపడితే గాని అవి ఫలాలు ఇచ్చే సమయానికి ఏనుగులు ,తోటనేకాక మోటార్ ను కూడా ధ్వంసం చేస్తాయి. అటవీ అధికారులు రక్షించాల్సిన సమయంలో ఎరుకాలామె వ్యవసాయం చేస్తావా అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నిస్తే ఆమె ఆ దుఃఖంలో ధైర్యంగా వాళ్ళను దుమ్మెత్తి పోసిన తీరు హృద్యంగా ఉంది. మిమ్మల్ని అడుక్కునే కంటే ఆ ఏనుగునే అడుక్కుంటే మంచిది అంటుంది . ఈ కథ ఏనుగుల సంచారం వలన పంట నష్టం ప్రాణ నష్టం జరిగిన విషయాన్ని స్ఫురణకు తెచ్చారు బాలాజి.
చిత్తూరు జిల్లా లో కుప్పం ,పలమనేరు అటవీ ప్రాంతం చాలాఅందమైనది. ఎత్తయిన పీఠభూమి మీద ఉన్న ఎగుడు దిగుడు నేలలు.విస్తారమయిన చిట్టడవి. కానీ వెనుక బడిన ప్రాంతం.1984 వరకు చిత్తూరు అడవుల్లో ఏనుగుల సంచారం లేదు. పొరుగున ఉన్న హొసూరు నుంచి అవి ప్రవేశించాయి.వాటి విధ్వంసం మూలంగా జరిగిన పంట ,ప్రాణ నష్టం అంతా ఇంతా కాదు.. అప్పట్లో పౌరహక్కుల సంఘం ఈ విషయంలో ఎంతో కృషి చేసింది . అయినా ఇప్పటికీ ఎటువంటి పరిహారం వాళ్ళకు అందలేదు.
ఈ సామాజిక సమస్యను ఏనుగుల రాజ్యం కథలో ఆదెమ్మ ద్వారా చెప్పారు రచయిత. ఇంతకూ ఈ కథా సంపుటి మనకు ఏ విషయాలు ఆలోచించమని చెబుతోంది అంటే నేను అర్థం చేసుకున్న మేరకు ..
Right to life with dignity
Right to health
Right to education
Right to employment opportunities.
Right to equality…
ఇవి తరతరాలుగా అందని పంట గా మన కు కనబడుతున్న సత్యం.
*
ఏకలవ్య కాలనీ తన తల్లి తండ్రులు, బంధువుల కృషితో ఏర్పడింది. మొదట కాలనీనిఎరుకల కాలనీ , ఎస్టీ కాలనీ అని పిలిచేవారు. ఊరి బయట నివసించే వాళ్ళు అడవుల్లో కట్టెలు కొట్టుకోవడం, పందుల పెంపకం, బాతుల పెంపకం ..ఇలా ఎన్నో పనులు చేస్తూ బతికే వాళ్ళు .. ప్రభుత్వం ఇల్ల స్థలాలు ఇవ్వటంతో ఎంతో ప్రయత్నం మీదట కాలనీ ఏర్పడింది. ఇప్పుడు ఆ కాలనీలో కొన్ని ఇల్లు శిథిలమయ్యాయి.కొందరు వలసలు పోయారు . కొందరు అలాగే అక్కడ ఎటువంటి అభివృద్ధి కి నోచుకోలేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు.
ఉన్నత చదువులు చదివి ఆఫీసర్ అయినా కూడా తన కులం వాళ్ళు అందరినీ అభివృద్ధి వైపు ఆలోచించ మని , చదువుకోసం , రకరకాలుగా సహాయపడుతూ ప్రతి ఆదివారం కాలనీలో సమావేశం ఏర్పాటు చేసి అక్కడి వాళ్ళకు సహాయపడుతూ ఉంటాడు తిరుమల. అతని భార్య కూడా చిత్రకారిణి , కవయిత్రి . ఉద్యోగం, కుటుంబ బాధ్యతల్లో తన సృజనాత్మక శక్తిని పక్కన పెడుతుంది . భర్త ,కూతురి సహకారంతో తిరిగి తనకిష్టమైన పనులను ప్రారంభిస్తుంది. వాళ్ళ అమ్మాయి లాస్య కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచించటం , పుస్తకాలు చదవటం. ఇతరులకు సహాయం చేయటం , మనుషులను అర్థం చేసుకోవటం,8 వ తరగతికే ఇంత గొప్ప గా ప్రవర్తించటం అద్భుతం. అది రచయిత తల్లి తండ్రుల నుండి గ్రహించిన సంస్కారం .అలాగే లాస్య కూడా. ఇలాంటి పిల్లలు కదా ఈ సమాజానికి కావాల్సింది.ఇలాంటి ఆఫీసర్లు ఉంటే ప్రజలు ఇంత కష్టపడే అవసరం లేదు.
కృతజ్ఞత అనే భావన చాలా గొప్పది . కబాలి పాత్ర చిత్రణ లో ఈ భావన పాఠకుల మనసుల్లో ముద్ర వేస్తుంది . ఆత్మ గౌరవం కోసం యువకులంతా కాలనీ పేరు .. ఏకలవ్య కాలనీ అని పెట్టాలని పట్టు పడతారు . ఒంటికన్ను నారాయణప్ప తాత కూడా తన జీవితంలో జరిగిన దారుణ సంఘటన అనుభవం నుంచి కాలనీ పేరు ఏకలవ్య గా ఉండాలంటారు . అలా ఆ కాలనీ ఏకలవ్య కాలనీ గా ప్రసిద్ధి మౌతుంది.
ఈ అద్భుతమైన పరిణామం వెనుక తండ్రి , తల్లి వ్యక్తిత్వం ,వారి మంచి మనసు , ఇతరులను ఆదుకునే తీరు , పిల్లలను బాగా చదివించాలనే తండ్రి పట్టుదల … ఇవన్నీ కారణాలు.
రచయిత తండ్రి గురించి మొదటి కథలో చాలా వివరాలు ఉన్నాయి అదంతా చదవాలి. అప్పుడే ఈ సంక్లిష్ట సమాజం ఎలాంటి మలుపులు తిరుగుతోంది , మనుషుల మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి . అసలు మనుషులు అందరూ సమానమేనా మన సమాజంలో.. ఈ ప్రశ్న లు నిత్యం వెంటాడుతూనే ఉంటాయి. రాజ్యహింస , ఆత్మగౌరవం కోసం పోరాటం, అభివృద్ధి కోసం , ఉన్నత చదువుల కోసం ,మంచి భవిష్యత్తు కోసం ఒక మంచి మనిషి పడే తపన ఈ కథల పుస్తకం. తప్పకుండా చదువుతారు కదూ..
సాటి మనుషుల పట్ల ప్రేమ ,కరుణ లేకుంటే అది దుర్మార్గపు సంస్కృతిని పెంచి పోషిస్తుంది. స్వార్థం ఎప్పుడూ పెత్తనం చెలాయిస్తుంది.జీవనోత్సాహాన్ని నింపుకోవాలంటే , వెలుతురు వైపు నడవాలంటే లాస్య లాంటి పాపల స్నేహం మనకు కూడా కావాలి.
మంచి కథలను రాస్తున్న సోదరుడు పలమనేరు బాలాజీకీ ఆత్మీయ అభినందనలు….