నక్సల్స్ సమస్యను శాంతిభద్రతల సమస్యగా చూసినంత వరకు అమిత్ షా చెప్పినట్లు 2026 మార్చి చివరికే కాకుండా మరో వందేళ్లకు కూడా సమగ్ర పరిష్కారం చేయడం ప్రభుత్వాలకు సాధ్యం కాదనీ, దాన్ని రాజకీయ, ఆర్ధిక, సామాజిక సమస్యగా గుర్తించితేనే సరైన పరిష్కారం లభిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివాసీల పై మారణకాండను ఆపాలనీ, ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని కోరుతూ వామపక్ష పార్టీలు, హక్కుల సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13, గురువారం ఉదయం విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిరసన సభ జరిగింది. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ ఆదాని, అంబానీ వంటి బడా కార్పొరేట్లకు అడవుల్లోని ఖనిజ సంపద అప్పగించే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసుల పై, మావోయిస్టుల పై దారుణ మారణకాండకు కేంద్ర ప్రభుత్వం ఒడిగట్టడాన్ని ఆయన ఖండించారు. రాజ్యాంగం ప్రకారం నడవాల్సిన ప్రభుత్వాలు చట్ట విరుద్ధంగా బుటకపు ఎన్కౌంటర్లకు పాల్పడడం దుర్మార్గమన్నారు. ఆరోపించారు. అందుకే ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నా, కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు పోకడలకు వ్యతిరేకంగా వామపక్షాలే కాకుండా కలసి వచ్చే ప్రజాస్వామిక శక్తులను కలుపుకొని విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మిద్దామని పిలుపు నిచ్చారు. మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యులు సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రిశ్వర్రావు మాట్లాడుతూ ఈ కగార్ మారణకాండకు అదాని, అంబాని వంటి కార్పొరేట్లే ప్రధాన కారకులనీ, వారి అజ్ఞలను మోడీ సర్కార్ అనుసరిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ పరిశ్రమల్ని కార్పొరేట్లకు అప్పగిస్తున్నట్లే, రైతుల్ని, కార్మికులను కార్పొరేట్లకు బానిసలుగా చేయడానికి నల్ల చట్టాల్ని తెస్తున్నట్లే, అడవుల్ని, అటవీ ఖనిజ సంపదను కూడా బడా కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతోనే “ఆపరేషన్ కగార్” తెచ్చారన్నారు. ఈ మారణకాండను నిలువరించడానికి విశాల ప్రజాస్వామిక ఉద్యమమే శరణ్యం అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కగార్ దాడులకు వ్యతిరేకంగా విశాల ఐక్య ఉద్యమాల అవసరం చాలా పెరిగిన్నారు. మోదీ ప్రభుత్వం ఆదివాసీలపై సాగిస్తున్న హత్యకాండ, ఉపా పేరుతో ప్రజాతంత్ర శక్తుల అణచివేత, బెయిల్ లేని నిర్భంధం వంటి మోదీ ప్రభుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా విశాల ఐక్య పోరాటాలకు సీపీఎం కలసి నడుస్తుందని చెప్పారు. ఆదివాసులపై సైనిక బలగాల దాడులు ఆపాలని, ఆపరేషన్ కగార్ నిలిపి వేయాలని తీర్మానించిన ఈ సభలో ప్రముఖ రైతు నాయకులు డాక్టర్ కొల్లా రాజమోహన్ రావు, ప్రముఖ పాత్రికేయులు డానీ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు D హరినాద్, సిపిఐ ఎంఎల్. న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎమ్.సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యదర్శి M వెంకటరెడ్డి, ఎం.సి.పి.ఐ.(యు) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఖాదర్ భాషా, సిపిఐ ఎం.ఎల్. రెడ్ ప్లాగ్ నాయకులు మరీదు ప్రసాద్, CLC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్, OPDR రాష్ట్ర అధ్యక్షులు హన్మంత రావు, OPDR జాతీయ నాయకులు సి భాస్కర్ రావు, విరసం రాష్ట్ర నాయకులు రివేరా, మానవ హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు రోహిత్, తెలంగాణ నిర్భంద వ్యతిరేక వేదిక నాయకులు రవిచంద్ర తదితరులు ప్రసంగాలు చేశారు. తొలుత వేదిక పైకి వక్తల్ని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నేత పొలారి పిలిచారు. ఈ సభలో అలిండియా ప్రోగ్రెస్సివ్ ఫోరమ్, కుల నిర్మూలన పోరాట సమితి (KNPS), ప్రగతిశీల మహిళా సంఘం (POW) దేశభక్తియుత ప్రజాతంత్ర ఉద్యమం (PDM), భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) వంటి సంఘాల నాయకులు తాజారావు, మస్తాన్ వలీ, కృష్ణ, బద్ద వెంకట్రావు, పద్మ, దుర్గ, ఐ.రాజేష్, ప్రమీలా తదితరులు పాల్గొన్నారు. ఈ సభకు వంద మందికి పైగా హాజరయ్యారు. ఈ నిరసన ఉద్యమాన్ని మున్ముందు విస్తరించాల్సి ఉందని సభ భావించింది.
పి. ప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి,
సీపీఐ ఎమ్ ఎల్ న్యూడెమోక్రసీ ఎపీ, విజయవాడ