జేబులో ఉన్న పది రూపాయలతో
ఇద్దరం అయిదు రూపాయల బువ్వ లొట్టలేసుకు తిన్నోళ్ళం
సాయంత్రం అయితే ఛాయి నీళ్లు తాగుతూ
సమాజాన్ని విశ్లేషించినోళ్లం
ధర్నాల దగ్గర ఒక్కటిగా హక్కులను నినదించినోళ్ళం
నాలుగు గోడల మధ్య విప్లవ నిర్మాణాన్ని చర్చినోళ్ళం
సభలలో సమావేశాల్లో ఒక్కటే విషయాన్ని మాట్లాడినోళ్ళం
ఎక్కడికి వెళ్ళినా ఒక్కటిగానే తిరిగినోళ్ళం
కానీ మా ఊరు అంబేద్కర్ బొమ్మ దగ్గర
ఆటో దిగి గానే
వాడు ఒక వాడ కి
నేను ఒక వాడకి పోవాలి
బోనాల పండుగోస్తే
వాళ్ల బోనాలు ముందు రోజు
మావి ఆ తెల్లారి
బతుకమ్మ దగ్గరైతే మా బతుకమ్మ
వాళ్ల వాటికి ఆమడ దూరంలోనే ఉండాలి
ఒక్కటేమిటి ఊరికి వెళితే
అడుగు అడుగునా కులం కండువా
మా భుజాన చేరుద్ది
తీసి దూరంగా విసిరేసిన
దాని పేలికలు మా ఒంటిని వదలవు
ఊరికి రావటం అంటే బట్టలతో పాటు
కులాన్ని బాగ్ లో మోసుకు రావాటమే

One thought on “కులం కండువా…

Leave a Reply