అమెరికాలో గత రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడిరది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసతం అక్కడికి వెళ్లిన వారిలో వేల మంది మాస్టర్ డిగ్రీని చేతపట్టుకొని రోడ్ల వెంట తిరగాల్సి వస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి ‘కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్( సిబిఐ) జనవరిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం నడుస్తున్న సంవత్సరం (2024) అమెరికా ఆర్థిక రంగంలో ప్రతికూల ఫలితాలను చవి చూస్తుందని వెల్లడిరచింది. ఫలితంగా 2024లో లక్షలాది ఉద్యోగాలకు కోత పడుతుందని తెలిపింది. అమెరికాలో నిరుద్యోగిత రేటు 2023లో 3.9 శాతం ఉండగా 2024లో 4.4 శాతానికి పెరుగుతుందని సిబిఐ వెల్లడిరచింది. టెక్ పరిశ్రమలో గత ఆరు మాసాలుగా 337 కంపెనీలు 90 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. గత సంవత్సరంతో పోల్చితే ఉద్యోగాల కోతతో 59 శాతం పెరుగుదల నమోదైందని లేఆఫ్ లీ అనే సంస్థ అంచనా వేసింది. గత రెండు సంవత్సరాలలో మొత్తం 2,62,915 మంది ఉద్యోగులు వివిధ సంస్థల్లో తొలగించబడ్డారు. దీనికి కారణం అమెరికా అప్పటిదాకా 3-4 శాతం వరకున్న వడ్డీ రేటును గరిష్టంగా ఎనిమిది శాతానికి పెంచేశాయి. అమెరికా చరిత్రలో వడ్డీ రేట్లు ఎప్పుడూ ఇంత ఎక్కువగా లేవు. దీని ప్రభావం పారిశ్రామికరంగంపై గట్టిగా పడిరది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ఒక్కసారిగా ఆర్డర్లు తగ్గిపోయాయి. చేయాల్సిన పనికంటే మానవ వనరుల సంఖ్య అధికంగా ఉండడంతో ఐటీ కంపెనీలు చేర్చుకున్న ఉద్యోగులను 2023 మార్చి నుంచి తొలగించడం మొదలుపెట్టాయి. అధిక జీతాలు పొందుతున్న ఉన్నతోద్యోగులను భారీగా తొలగించాయి. కొన్ని కంపెనీలు జీతాలను తగ్గించేశాయి.
ప్రతి యేటా మన దేశం నుంచి దాదాపు ఏడున్నర లక్షల మంది విద్యార్థులు చదువుకోవడానికి విదేశాలకు వెళ్తున్నారు. వీరిలో రెండున్నర లక్షల మంది విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. అమెరికాలోని సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకంతో మన దేశం నుంచి ప్రతి ఏడాది రెండు లక్షల మంది విద్యార్థులు అక్కడికి వెళుతుంటారు. ఇలా 2022-23 సంవత్సరంలో దాదాపు రెండు లక్షల మంది వెళ్లారు. వీరిలో తెలుగు విద్యార్థులు 45 వేల నుంచి 55 వేల మంది వరకు ఉంటారని కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు తెలిపారు. అమెరికా వెళుతున్న విద్యార్థుల్లో చాలామంది ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులను చదివేందుకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. రెండేళ్ల కిందటి వరకు అమెరికాలో ఎంఎస్ చేసిన వారిలో దాదాపు 85 శాతం మందికి అక్కడే ఉద్యోగాలు లభించాయి.
అమెరికాలో కొలువుల సంక్షోభం :
2024లో మే నాటికి 326 కంపెనీలు 98 వేల మందికి కత్తెర వేశాయి. పెద్ద కంపెనీలే కాదు స్టార్టప్స్ సైతం ఇదే బాట పట్టాయి. ఇక కొన్ని కంపెనీలైతే నష్టాలను భరించలేక ఏకంగా తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. డెల్ కంపెనీ గత ఏడాది 13 వేల మందికి పింక్ స్లిప్ ఇవ్వగా, ఈ ఏడాది 6వేల మందిని సాగనంపింది. టెస్లా కంపెనీలో ఎలాన్ మస్క్ రాత్రికి రాత్రే తమ ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్టు మెయిల్స్ పంపారు. దీంతో వందలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. మైక్రోసాఫ్ట్ 1,900 మందికి కోతపెట్టగా, తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయిన బైజూస్ 500 మందిని తొలగించింది. ఇంకా యాపిల్, డెల్, సోనీ, సిస్కో, స్విగ్గీ, యూట్యూబ్, గూగుల్, డుయోలింగో కంపెనీలు కూడా తమ సిబ్బందిని తగ్గించుకున్నాయి.
కొవిడ్ సమయంలో రెండుసార్లు విధించిన లాక్‌డౌన్ కారణంగా అమెరికాలోని అన్ని రకాల పరిశ్రమలు కుదేలయ్యాయి. వాటిని రక్షించుకోవడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడంతో 2021-22లో కంపెనీలకు భారీగా నిధులు అందాయి. బ్యాంకులూ తక్కువ వడ్డీకే రూ.వేల కోట్ల రుణాలివ్వడంతో అనేక కంపెనీలు పెద్దఎత్తున ఉపయోగించుకున్నాయి. ఫలితంగా ఐటీ కంపెనీలకు సైతం ఉద్యోగులను అదేస్థాయిలో తీసుకున్నాయి. కొవిడ్ ప్రభావం తగ్గిపోయాక అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలను నిలిపేసింది. పారిశ్రామికరంగం మాత్రం పెద్దగా పుంజుకోలేదు. లాక్‌డౌన్ సమయంలో వివిధ సంస్థలు, వ్యక్తులకిచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకాపోవడంతో బ్యాంకులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీంతో అవి రుణాలివ్వడం ఆపేశాయి. అప్పటిదాకా 3-4 శాతం వరకున్న వడ్డీ రేటును గరిష్టంగా ఎనిమిది శాతానికి పెంచేశాయి.
అమెరికా చరిత్రలో వడ్డీ రేట్లు ఎప్పుడూ ఇంత ఎక్కువగా లేవని ఆ దేశస్థులు చెబుతున్నారు. దీని ప్రభావం పారిశ్రామిక రంగంపై గట్టిగా పడిరది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ఒక్కసారిగా ఆర్డర్లు తగ్గిపోయాయి. చేయాల్సిన పనికంటే మానవ వనరుల సంఖ్య అధికంగా ఉండడంతో ఐటీ కంపెనీలు కొవిడ్ సమయంలో చేర్చుకున్న ఉద్యోగులను 2023 మార్చి నుంచి తొలగించడం మొదలుపెట్టాయి. అధిక జీతాలు పొందుతున్న ఉన్నతోద్యోగులను భారీగా తొలగించాయి. కొన్ని కంపెనీలు జీతాలను తగ్గించేశాయి. గతంలో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఐటీ కంపెనీలు ఇప్పుడు వందల సంఖ్యలోనే నియామకాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ భారత్ నుంచి వెళ్లిన వారిపై తీవ్రంగా చూపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వేలాది మందికి ఎంఎస్ పూర్తిచేసినా ఉద్యోగాలు లభించడం లేదు.
భారత్‌లో టెక్ ఉద్యోగుల గాబర :
మనదేశంలో ప్రతిష్టాత్మకమైన ఐఐఎం, ఐఐటీలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివితే చాలు.. మంచి కంపెనీల్లో ఉద్యోగాలు, రూ.లక్షల్లో వేతన ప్యాకేజీల్లాంటి మాటల్నే తరచూ వింటూ ఉంటాం. కానీ, ప్రస్తుతం నిరుద్యోగం పెరగడంతో అందుకు భిన్నమైన పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. మన దేశంలోని ఐఐటీల్లో విద్యనభ్యసించిన విద్యార్థుల్లో ఈ ఏడాది దాదాపు 38 శాతం మందికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ దక్కకపోవడం గమనార్హం. అత్యంత ఉన్నతమైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న ఉద్యోగ సంక్షోభం, మితిమీరిన సరఫరా సరిపోని నైపుణ్యాలు, ఆర్థిక మాంద్యం కారణాలుగా చెబుతున్నారు. భారత దేశ ఐటీ పరిశ్రమలో ప్రధాన కంపెనీలు టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 64000 మంది ఉద్యోగులను తొలగించారు. టెక్ ఉద్యోగాలు కోల్పోవడానికి అమెరికా ఆధారిత ఐటీ సలహాదారు మరో కోణాన్ని చూపుతున్నారు. అది కృత్రిమ మేధస్సు ప్రభావం అంటున్నారు. కృత్రిమ మేధస్సు(ఎఐ), మెషీన్ లర్నింగ్ (ఎంఎల్), ఆటోమేషన్ వల్ల ఉద్పాకత పెరుగుతుందని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. వీటి వాడకం వల్లే ఉద్యోగాల్లో కోత పడుతుందని లే ఆఫ్ లీ సంస్థ విశ్లేషించింది.
కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరైన అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఈ మధ్య విడుదల చేసిన సర్వే మేరకు దేశంలో 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లలో 42.3 శాతం నిరుద్యోగులేనని తేల్చింది. ఉన్నత మాధ్యమిక విద్య పూర్తి చేసిన వారిలో 21.4 శాతం నిరుద్యోగులు. ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చిన 2008 నుంచీ చూసుకుంటే కేంద్రంలో బిజెపి వచ్చాక నిరుద్యోగిత రేటు పెరిగిందని నేషనల్ శాంపిల్ సర్వే కుండబద్ధలు కొట్టింది. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలు గాలిలో కలిశాయి. చివరికి ఎక్కడిదాకా వచ్చిందంటే, విధిలేక వీధుల వెంట పకోడీలు అమ్ముకునే పని కూడా ఉపాధి, ఉద్యోగం కిందికే వస్తుందనే స్థాయికి ప్రధాని, బిజెపి పెద్దలు భాష్యాలు చెప్తున్నారు. ఈ చర్య నిరుద్యోగులను అపహాస్యం చేయడమే. దేశ జనభాలో 35 ఏళ్ల లోపు యువత 66 శాతం ఉంటుందని ఒక అంచనా. కోట్లాదిగా ఉన్న వీరికి ఉద్యోగ, ఉపాధి లేకపోతే బిజెపి ప్రచారం చేస్తున్నట్లు ‘అచ్చేదిన్’ ఎలా? మోడీ ఎంచుకున్న ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు ఉపాధి రహిత భారతాన్ని నిర్మిస్తున్నాయి. ఈ వాస్తవాన్ని బిజెపి సర్కారు సుతరాం అంగీకరించదు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంది. లాభాల్లో ఉన్న వాటిని కూడా కార్పొరేట్లకు అప్పనంగా ధారాదత్తం చేస్తోంది. దాంతో కొత్త ఉద్యోగాలేమోకానీ, ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి.
దేశంలో ఐటీ రంగంలో ప్రెషర్స్ అవకాశాల కల్పన తగ్గుదలకు సంబంధించి ఎక్స్-ఫెనో అనే హెచ్‌ఆర్ సంస్థ అధ్యయనం నిర్వహించింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు సంబంధించి గతేడాది నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు వివిధ కాలేజీల యాజమాన్యాలు చెప్పాయి. ఈసారి క్యాంపస్‌లకు వచ్చేందుకూ కంపెనీలు సుముఖతను వ్యక్తం చేయకపోవడం యాజమాన్యాలను, విద్యార్థులను కలవరపరుస్తోంది. దాదాపు 70 శాతం విద్యార్థులు ఐటీ ఉద్యోగాలనే కోరుకుంటున్నా… అందుకు తగ్గట్లు రిక్రూట్‌మెంట్ జరగకపోవడం వారిని నిరాశకు గురిచేస్తోంది. 2023లో కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులను కూడా కొన్ని కంపెనీలు ఇంకా ప్లేస్‌మెంట్స్‌కు పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. మొత్తంగా చూస్తే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 70-80 శాతం దాకా ఆన్‌క్యాంపస్ హైరింగ్ తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. ఏడాదికి 2 లక్షల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌ను సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైర్ చేయగా… ఇప్పుడది 60-70 వేలకు పడిపోయింది. ఇదేకాకుండా వివిధ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన 10 వేల మందికి పైగా విద్యార్థులు ఆఫర్ లెటర్స్‌తో ఉద్యోగాల్లో చేరేందుకు ఎదురుచూపులు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐఐటీలతో సహా ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌కు ప్లేస్‌మెంట్స్ గణనీయంగా తగ్గాయి.
గత సంవత్సరం వరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లు.. కార్పొరేట్ కంపెనీల ఫేవరెట్ క్యాంపస్‌లు. ఇక్కడి విద్యార్థులకు టాప్ కంపెనీలు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతూ.. లక్షల ప్యాకేజీ ఆఫర్లు ఇచ్చాయి. కానీ.. 2024 బ్యాచ్‌కు క్యాంపస్ డ్రైవ్స్‌లో కొంత అనిశ్చితి! పలు ఐఐటీ క్యాంపస్‌లకు ప్రముఖ కంపెనీలు అడుగు పెట్టని వైనం!! గతంలో ఒక్క క్యాంపస్‌లో పది మంది వరకు విద్యార్థులను నియమించుకునేవి. తాజాగా గరిష్టంగా రెండు ఆఫర్లకు పరిమితం చేశాయి. గత ఏడాది తొలి దశలోనే 1,128 ఆఫర్లు లభించగా.. ఈ ఏడాది తొలిదశ డ్రైవ్స్ ముగిసే నాటికి 989 మందికి మాత్రమే ఆఫర్లు దక్కాయి. గతేడాదితో పోల్చితే 15 నుంచి 30 శాతం వరకు ఆఫర్లలో తగ్గుదల కనిపించింది. అదే సమయంలో గత ఏడాదితో పోలిస్తే 10-20 శాతం మేరకు వేతనాలు కూడ తగ్గాయి.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. ఒకప్పుడు ఉద్యోగార్థుల కలల ప్రపంచం.. సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ వస్తే చాలు రెండు చేతులా సంపాదన, వీకెండ్ పార్టీలు, అప్పుడప్పుడూ టూర్లు. ఇక కరోనా వచ్చాక వర్క్ ఫ్రం హోం సౌలభ్యం ఆ కలలన్నీ ఇప్పుడు సన్నగిల్లుతున్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం, రాజకీయ సంక్షోభం వంటి కారణాలతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఎడాపెడా తొలగింపచేస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునే నెపంతో పింక్ స్లిప్ ఇచ్చేసి ఇంటికి పంపేస్తున్నాయి. ఇక కొత్తగా ప్లేస్‌మెంట్స్ ఇచ్చే విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఒకవేళ రిక్రూట్ చేసుకున్నా ఆఫర్ లెటర్ ఇవ్వడం లేదు. కరోనా సంక్షోభం తర్వాత ఐటీ రంగంలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. 2022, 2023 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 వేల కంపెనీలు 4 లక్షల పైచిలుకు ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఉద్యోగాల కోత 2024లోనూ కొనసాగుతోంది.
నిరుద్యోగ భారతం :
ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ప్రకారం 15-35 సంవత్సరాల వయస్సు వారు స్వయం ఉపాధి లేదా వేతనంతో కూడిన ఉపాధిలో లేనివారు నిరుద్యోగులేనని నిర్వచించింది. ప్రధాని మోడీ, ఆయన పార్టీ బిజెపి వల్లె వేస్తున్న ‘వికసిత భారత్’లో నిరుద్యోగం భయంకర స్థాయికి చేరుకుంది. ఈ కఠోర నిజం కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వశాఖ తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్)తో బహిర్గతమైంది. సదరు అధ్యయనం ప్రకారం దేశంలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసును కలిగిన గ్రాడ్యుయేట్లలో 83.4 శాతం మంది నిరుద్యోగంతో మగ్గుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని మోడీ సర్కార్ చేస్తున్న ప్రచార ఆర్భాటానికి.. ఉద్యోగ కల్పనకు సంబంధం లేకుండా పోయింది. ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తోంది. మూడోసారి అధికారంలోకి వచ్చినా.. యువతరం గురించి దృష్టిపెట్టడం లేదనటానికి తాజా నివేదికలు ధ్రువీకరిస్తున్నాయి. చదువుకుని అటు సర్కారు ఉద్యోగాలు రాక.. ఇటు ప్రైవేటు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
లింగ బేధంతో సంబంధం లేకుండా దేశంలో నిరుద్యోగం తాండవం చేస్తోంది. 2024 మే నెలలో నిరుద్యోగ స్థాయి రేటు 7 శాతం ఉండగా ప్రస్తుత ఏడాది జూన్‌లో నిరుద్యోగ రేటు ఏకంగా 9.2 శాతానికి ఎగిసి.. ఎనిమిది నెలల గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) ఓ రిపోర్ట్‌లో వెల్లడిరచింది. ఒక్క నెలలోనే అదనంగా 2.2 శాతం ఎగిసిపడటం.. ఆర్థిక వ్యవస్థలో డొల్లతనానికి.. మందగమనానికి నిదర్శనం. సిఎంఐఇ నిర్వహించిన కన్స్యూమర్ పిరమిడ్స్ హౌస్‌హోల్డ్ సర్వే రిపోర్ట్ ప్రకారం… 2023 జూన్‌లో నమోదయిన 8.5 శాతం నిరుద్యోగంతో పోల్చినా 2024 జూన్ నెలలో ఈ రేటు మరింత పెరిగింది. నిరుద్యోగుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. గతేడాది జూన్‌లో మహిళల్లో నిరుద్యోగం 15.1 శాతంగా ఉంటే… ఈ ఏడాది జూన్‌లో 18.5 శాతానికి ఎగిసింది. పురుషుల్లో నిరుద్యోగం 7.7 శాతం నుంచి 7.9 శాతానికి చేరింది.
పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ స్థాయి అధికంగా ఉన్నట్లు సిఎంఐఇ రిపోర్ట్ వెల్లడిరచింది. గడిచిన జూన్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల నిరుద్యోగం 8.2 శాతానికి ఎగిసింది. ఈ రేటు మేలో 5.4 శాతంగా ఉంది. అదే సమయంలో మహిళల నిరుద్యోగ సంఖ్య 12.0 శాతం నుంచి ఏకంగా 17.1 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో మేలో 8.6 శాతంగా ఉన్న స్థూల నిరుద్యోగ రేటు.. జూన్‌లో 8.9 శాతానికి పెరిగింది. దేశంలో ఆర్థిక మందగమనం వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న ధరలతో దేశీయంగా డిమాండ్ మందగించడంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదించడం వలన ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయంటున్నారు. దేశం పరిస్థితిని అంచనా వేయడానికి ఎకనామిక్స్ టైమ్స్ ఇటీవల ఒక సర్వే చేసింది. ఎన్‌డిఎ ప్రభుత్వానికి నిరుద్యోగం ప్రధాన సవాలు అని స్పష్టం చేసింది. దీనికి తోడు ద్రవ్యోల్బణం, అసమానతలు, రైతుల సమస్యలు, నిరంకుశత్వం పెరగడంపై ఆందోళన వ్యక్తమైంది. దేశంలో నిరుద్యోగం ప్రమాదకరస్థాయికి చేరిందని ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు కూడా గత నెలలో ఆందోళన వ్యక్తం చేశారు.
ముగింపు :
అమెరికాలో ఉద్యోగం చాలా మంది కల. అందులోనూ మన తెలుగువారు ఎక్కువ మందికి అగ్రరాజ్యంలో ఉద్యోగం చేయాలి.. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలి అని చాలా కలలు కంటారు. ఇందులో ఐటీ రంగంవారే ఎక్కువగా ఉంటారు. హెచ్‌ఐబి వీసా వచ్చినవాళ్లు, లక్షల కొద్దీ ప్యాకేజీలు తీసుకుంటున్న వాళ్లు కూడా ఇప్పుడు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అసలీ పరిస్థితి రావడానికి కారణాలేంటి? తెలివైనవాళ్లుగా పేరు తెచ్చుకుని.. అపార అనుభవాన్ని గడిరచిన వారికి ఇలాంటి సీన్ ఎందుకు ఎదురవుతోంది? అమెరికాలో యంఎస్ చదివి.. ఇప్పుడక్కడ జాబ్ లేని వారి పరిస్థితి ఏమిటి? ఎందుకు వారికి కొలువులు రావడం లేదు? ఉన్న ఉద్యోగం పోయి.. కొత్త ఉద్యోగం రాక అక్కడున్న వారిలో చాలామందికి దిక్కుతోచడం లేదు. ఓవైపు మంత్లీ మెయింటెనెన్స్ కోసం కొందరు.. గ్యాస్ స్టెషన్లు, హోటళ్లతో పాటు మరికొన్ని చోట్ల పనిచేస్తున్నారు. ఇప్పుడు వారిని మరో భయం వెంటాడుతోంది. అదే బ్యాంక్ లోన్ ఉన్నత చదువుల కోసం ఎంతో మంది ఎడ్యుకేషనల్ లోన్‌ను తీసుకున్నారు. ఇప్పుడు దానిని తీర్చాలంటే జాబ్ తప్పనిసరి.
అమెరికాలోని నిబంధనల ప్రకారం ఆ దేశంలో ఎంఎస్ పూర్తి చేసిన వెంటనే సంబంధిత యూనివర్సిటీ.. విద్యార్థి పేరిట ఓపీటీ ఐ20 (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్)ని విడుదల చేస్తుంది. ఇది వచ్చిన నెల రోజుల్లో ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)కి దరఖాస్తు చేయాలి. దీనికి ఆమోదం లభించిన మూడు నెలల్లో ఏదో ఒక ఉద్యోగంలో చేరాలి. లేనిపక్షంలో ఆ దేశాన్ని విడిచి పెట్టాలి. అయితే, విద్యార్థులు వర్సిటీ ఫీజుల కోసం రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బ్యాంకుల నుంచి విద్యారుణం తీసుకుంటారు. స్వదేశానికి వచ్చాక.. ఇక్కడ ఉద్యోగం దొరక్కపోతే ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది. అందుకే ఏదోఒక రూపంలో అమెరికాలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఎంఎస్ పూర్తికాకుండా ఉండటానికి ఒకట్రెండు సబ్జెక్టులను అలానే వదిలేస్తున్నారు. మరికొందరు యూనివర్సిటీ ప్రొఫెసర్ల దగ్గరే రీసెర్చ్ సహాయకులుగా చేరుతున్నారు. దీనికి ఎలాంటి జీతం ఉండదు. అయితే, ప్రొఫెసర్ ఇచ్చే పత్రంతో ఏడాదిపాటు అమెరికాలోనే ఉండొచ్చు. ఇంకొందరు కన్సల్టెంట్లను సంప్రదించి ఎక్కడో ఒకచోట పనిచేస్తున్నట్లు ధ్రువపత్రం తెచ్చుకుంటున్నారు. సమస్య ఇంతలా వేధిస్తున్నా, ఏటా అక్కడికి వెళ్లేవారి సంఖ్య మాత్రం తగ్గకపోవడం గమనార్హం.
AMERICAN DREAM —-ZERO—DIMINISHING
DHOORAPU KONDALU ?????
STUDY ,ANYWHERE -EVERY WHERE SAME
===============
BUCHIREDDY GANGULA