అల్లం రాజయ్య సాహిత్యం చదవడం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. రాజయ్య ప్రతి నవల చారిత్రక మట్టి పొరలలో నుండి పుట్టుకొస్తాయి. కాళ్ళ కింద దుమ్ములా పడి ఉంటారు అనుకుంటున్న మట్టిమనుసులు కళ్ళల్లో నలుసులై దొరలను,భూస్వాములను తద్వారా వారికి అండగా నిలబడ్డ రాజ్యంపై ఎదురు తిరిగిన చరిత్రకు అక్షరూపం ఇస్తాడు రాజయ్య. అది కొలిమంటున్నది కావచ్చు, వసంతగీతం కావచ్చు, ఊరు, అగ్నికణం, సైరన్ ఏదైనా కావచ్చు ప్రతిదీ కూడా ఉత్తర తెలంగాణాలో ఉవ్వెత్తున ఎగిసి పడిన పోరాటాల చరిత్రే. అదే వరవడిలో విముక్తి నవల కూడా పోరాటాల చరిత్ర రచనలో భాగంగా వచ్చింది. నక్సల్భరి ఆరంభం గురించి నక్సల్భరి  ద్వారా వచ్చిన నక్సలైట్ ఉద్యమాల గురించి చారు మజుందార్, కానూసన్యాల్, జంగల్ సంతాల్ గురించి చాలా సంవత్సరాలుగా వింటూ ఉన్నాం చదువుతూ ఉన్నాం. అసలైన నక్సల్బరీ పోరాటం గురించి సమగ్రంగా తెలిసేది కాదు. ఈ నవల చదివిన తర్వాత  సమగ్రమైన చరిత్ర పాఠకునికి తెలుస్తుంది. నవల ప్రక్రియకు ఉన్న గొప్పతనమే అది.పాఠకునికి ఆయా సంఘఠనలు,సందర్భాలు శాశ్వతంగా గుర్తుండి పోతాయి.అందుకే అల్లం రాజయ్య నవలలు చదివితే మనకు ఉత్తరతెలంగాణ,సింగరేణి ఉద్యమాల చరిత్ర తెలుస్తుంది.ఈ విముక్తి నవలలో రాజయ్య ఉద్యమకారుల స్వంత పేర్లతోనే చెపుతాడు కనక భారత దేశ చరిత్ర గతిని మార్చిన మహోజ్వల పోరాట చరిత్ర ,అందులో పాల్గొన్న వ్యక్తుల చరిత్ర మనకు గుర్తుండి పోతుంది. నాలుగు అధ్యాయాలగా విభజింపబడిన  ఈ నవల మొదటి అధ్యాయం కరీంనగర్ జిల్లా కొత్తగట్టు అనే గ్రామంలో 1966 మార్చి 23న తెలతెలవారుతుండగా ఇంకా మసక చీకట్లు వదలకముందే, తిమిర సంహారం జరగకముందే, ఇంకా నిద్ర నుండి లేవని పసిపిలగాడు ‘నల్లాఆదిరెడ్డి’ని కొమరమ్మ ముదిగారాబంగా నిద్ర లేపినప్పుడు మొదలవుతుంది. ఆ పిల్లవాడే భారతదేశ సాయుద పోరాట నాయకుడు అవుతాడని ఈ దేశ ప్రజల జీవితాలలో నిండి ఉన్న, నిక్షిప్తమై ఉన్న చీకట్లను తొలగించడానికి సాయుధుడై సాగిపోయి నాయకుడు అవుతాడని బహుశా కొత్తగట్టు వాసులు గాని ఆయన తండ్రి వీరారెడ్డి కానీ లేదా నిద్రలేపిన కొమరమ్మ గాని కనీసం కలలో కూడా ఊహించి ఉండరు. ఈ దేశంలోని పేదల బతుకులలో నెలకొన్న చీకట్లు  పారద్రోలే పోరాట నాయకుడు కనుకనే రాజయ్య సింబాలిక్ గా ఆ చీకట్లో నవల మొదలుపెట్టి ఉంటాడు కావొచ్చు. పురిటిలోనే తల్లి చనిపోతే ఈ గొల్ల కొమరమ్మనే తన కొడుకుకు ఒక స్థన్యం, ఆది రెడ్డికి ఒక స్థన్యం ఇచ్చి పెంచింది. ఈ విషయం చాలా సార్లు వరవరరావు ప్రసంగంలో విన్నప్పటికీ ఈ నవలలో మనం మరింత వివరంగా తెలుసుకుంటాం. ‘ఆదిరెడ్డి’కి చిన్ననాటి నుండి తన మస్తిస్కంలో అనేక మానవీయ ప్రశ్నలు మొదలవుతుంటాయి. వాటిని అడిగితే తండ్రి వీరారెడ్డి కోపగించుకునేవాడు.ఇలా ఉన్నావు ఎలా బ్రతుకుతావురా అనుకునేవాడు. కానీ ఆదిరెడ్డికి కలిగిన ఆ ప్రశ్నలే తర్వాత సాయుధ పోరాట నాయకున్ని చేశాయి. గొర్రె పిల్లను పక్కకు లాగి గొర్రె పాలు పిండుతున్న ఓదేలను చూసి ఆ పాలు దాని పిల్లవి కదా మనం పిండుకోవడమేమిటి అని అడుగుతాడు. నిజానికైతే ఆ ప్రశ్న సరి అయినది కానీ ఏదో మేరకు అంతో ఇంతో దోపిడీకి అలవాటు పడిన మనుషులం కదా ఆ ప్రశ్నలో ఉన్న లోతులను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనుషులంటే అందరూ కాదు మేం ఛత్తీస్గడ్ కు నిజనిర్ధానికి పోయినప్పుడు ఒక  గ్రామంలో దేవా ఇంటిదగ్గర రాత్రి పడుకున్నాం. ఉదయం ఆవులు ఉన్నాయి కదా పాలు దొరుకుతాయి  టీ తాగుతారా అని అడిగితే,వాటి పాలు వాటి పిల్లల హక్కు కదా మనం ఎలా తాగుతామని అడిగారు. ఆ.. ఆదివాసీ లాంటి స్వచ్చమైన మనసు ఆదిరెడ్డిది. బండిమీద మనసులు కూర్చుంటే  ఎద్దులు లాగడాన్ని కూడా ఆదిరెడ్డి పాపం అనుకుంటాడు. రాజెల్లవ్వ ఆకలితో చనిపోయింది అని తెలిసి మాదిగ వాడకుపోయిన ఆదిరెడ్డికి అక్కడ గుజ్జనగూళ్ల లాంటి గుడిసెలు, చింపిరి జుట్లు, బట్టలు సరిగా లేని మనుషులు, దరిద్రం తాండవిస్తున్న ఆ గూడెం, చూసి ఆదిరెడ్డి చెల్లించి పోతాడు. రాజెల్లవ్వ అంతకు ముందు రోజే ‘ఆదయ్య పటేలా చియ్యకురా మీరే తింటారా నీ బాంచన్ నోరు సప్పపడ్డది” అన్న మాటలు జ్ఞాపకం వచ్చి లోలోపల కుమిలి పోతాడు. మనసులో ఏదో అపరాధ భావంతో మాదిగ వాడను, ఎండకు ఆరబెట్టిన గొడ్డు మాంసపు నీసు వాసనను దాటుకుంటూ ఇంటికి వచ్చి వారి బ్రతుకుల గురించి రాజెల్లవ్వ ఆకలి చావు గురించి ఆలోచిస్తూ జ్వరపీడితుడైతాడు. ఆ ఎండాకాలం తర్వాత ఆరవ తరగతికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హుజురాబాద్ కు పోయిన ఆదిరెడ్డికి అక్కడ లింగయ్య సారు, శుక్లా సారు శిష్యరికంలోకి అరంగేట్రం చేస్తాడు. అప్పటికే ఆదిరెడ్డి అన్న సురేందర్,శనిగరం వెంకటేశ్వర్లు( సాహు )కూడా లింగయ్య సారు ప్రియ శిష్యులే. అక్కడితో మొదటి అధ్యాయం ముగుస్తుంది.

 .       *.         *              *.

ఆలోచనల సంఘర్షణ నుండే మార్పుకు బీజం పడుతుంది. ఆ ఆలోచనలు సాయుధ పోరాటం వైపు సాగిపోయి. అది సాయుధ సంఘర్షణ అయితే సార్థకం అవుతుంది.రష్యాలో స్టాలిన్ మరణానంతరం అధికారంలోకి వచ్చిన కృశ్చేవ్ శాంతియుత పోటీ, శాంతియుత సహజీవనం, శాంతియుత పరివర్తన, అనే అంశాల ద్వారా రష్యాను రివిజనిజం వైపు నడిపిస్తున్నకాలం అది.ఆనాటి వరకు ప్రపంచ విప్లవ పోరాటాలకు రష్యా ఒక భరోసాగా ఉండేది. కృశ్చెవ్ వచ్చాక  ఆ భారోస  పోయింది. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలోని చాలామంది యువతరం చైనా వైపు మావో వైపు చూడడం మొదలుపెట్టారు. సరిగ్గా భారతదేశంలో కూడా యువతరంలో భావ సంఘర్శణ మొదలైంది. అలా మొదలైన సంఘర్షణ కాజీపేట సెయింట్ గాబ్రియల్ స్కూల్ దగ్గర కూర్చున్న కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, డాక్టర్ కొల్లూరు చిరంజీవి, చందు, కరుణ, అనసూయమ్మ, ల మధ్య కూడా కొనసాగుతున్నది. తెలంగాణ సాయుధ పోరాట విరమణ తర్వాత ఎటూ తేల్చుకోలేని స్థితిలో, ఏ దారిలో పోవాలో తెలియని స్థితిలో వారి మధ్య ఆలోచనల సంఘర్షణ మొదలైంది. అప్పటికే కొండపల్లి సీతారామయ్య కమ్యూనిస్టు పార్టీ నుండి బహిష్కరణకు గురై ఉంటాడు. అందుకే ఆ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేడు. అలా అని ఊరికే ఉండలేకపోతున్నాడు. అలాంటి మానసిక సంఘర్షణలో వారి మధ్య ఆలోచనల ధార కొనసాగుతున్నది. రెండవ అధ్యాయం మొత్తం కొండపల్లి వర్తమానంలో నిలబడి గతాన్ని నెమరు వేసుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసే ఆలోచనల ధార, సంఘర్షణగ కొనసాగుతుంది. ఆలోచనల సంఘర్షణ కార్యరూపం దాల్చలేదు. బహుశా రెండో భాగంలో అదంతా ఇంకా సమగ్రంగా తెలుస్తుంది అనుకుంటా.

    *.       *        *

పశ్చిమబెంగాల్  సిలిగురి నగరంలో 1966 జనవరిలో భక్కపలుచని వ్యక్తి, రక్తహీనతతో, రంగు మారిన శరీరం కలిగిన, చురకైన చూపులు, పదునైన ఆలోచనలు, కలిగిన వ్యక్తి ఆచరణకు సిద్ధమవుతున్నాడు. ఆచరణ కోసం ఎనిమిది డాక్యుమెంట్లను తయారు చేసి వాటి ద్వారా వ్యక్తులను సిద్ధాంతికరించి సాయుధ పోరాటమే మన మార్గం, చైనా మార్గమే మన మార్గం అని నిక్కచ్చిగా చెప్పదలుచుకున్నాడు. ఈ కుళ్ళిపోయిన సమాజానికి సాయుధ పోరాటం ద్వారా శస్త్ర చికిత్స చేయాల్సిందే అని నమ్మిన వ్యక్తి, మరియు ఆయన సహచరులు కాను సన్యాల్, జంగల్ సంతాల్ లతో ఒక రహస్య ప్రదేశంలో సమావేశం ఏర్పాటు చేశాడు. అతడే ఈ దేశంలో ఒక దగ్గర జోతేదారుల,(పశ్చిమ బెంగాల్) మరో దగ్గర బుగతల(శ్రీకాకుళం), ఇంకో దగ్గర భూస్వాములు, దొరల(తెలంగాణ), కాళ్ళ కింద దుమ్ముగా పడి ఉండాల్సిన రైతు కూలీలు, కండ్లల్లో నలుసులుగా మార్చే ఉద్యమ రూపకర్త చారు మజుందార్.

విముక్తి నవల మొదటి భాగం చదవడం ద్వారా పాఠకునికి భారతదేశంలో గతంలో జరిగిన సాయుద పోరాటాల చరిత్ర, ఆ చరిత్ర వెలుగులో నక్సల్భరి పోరాట చరిత్ర సమగ్రంగా అర్థమవుతాయి. సరిగ్గా తెలంగాణ సాయుధ పోరాట విరమణ తర్వాత కొండపల్లి సీతారామయ్య, కే.జి సత్యమూర్తి, అప్పటి మెడికల్ కాలేజీ విద్యార్థిగా ఉన్న చిరంజీవి, ఎలాగైతే మదనపడి మానసిక ఘర్షణకు గురవుతుంటారో అలాగే తెభాగా రైతాంగ సాయుధ ఉద్యమం విరమణ తర్వాత  చారు మజుందార్, కను సన్యాల్, అదేవిధంగా ఘర్షణ పడతారు. మార్క్సిస్ట్  పార్టీలో ఉంటూనే ఆ పార్టీ విధానాలు నచ్చక రైతాంగ ఉద్యమాలకు ముఖ్యంగా చైనా తరహా, మావో తరహా సాయుధ పోరాట ప్రయత్నాలు చేస్తారు. ఆ క్రమంలోనే చారు బాబు 8 డాక్యుమెంట్లు రాస్తాడు. ఈ పుస్తకం చదవడం ద్వారా నేటి తరానికి ఆ డాక్యుమెంట్లపై మంచి అవగాహన కలుగుతుంది. అదేవిధంగా సిద్ధాంత అవగాహన కూడా కలుగుతుంది. ఎనిమిది డాక్యుమెంట్లు రాయడానికి చారు మజుందార్ మావోను, మార్క్స్ ను, ఏంగిల్స్ ను చదవడం, రాయడం, కొట్టివేయడం చేస్తూ ఉంటాడు. అంటే మనం కూడా ఒక విషయంపై రాయాలన్న అవగాహన పెంచుకోవాలన్న ఎలా చదవాలో తెలుస్తుంది.

1966 లో కూటమి (సంకీర్ణ) ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే భూసంస్కరణలు అనే కార్యక్రమం తీసుకుంది. భూమిలేని వారికి భూములు పంచుతామని,దున్నేవాడిదేభూమి అనే హామీని నెరవేర్చలేక పోయింది ఆ ప్రభుత్వం. ఏ ప్రభుత్వాలు అయినా అది కమ్యూనిస్టులైనా, మార్క్సిస్ట్ లైన, ఏ ప్రభుత్వమైనా ఉచితాలు ,లేదా సంస్కరణలు ప్రకటిస్తున్నదంటే అది ప్రజలలో పెరిగే అసంతృప్తిని చల్లార్చడానికి తప్ప ప్రజల మీద ప్రేమతో కాదు. ప్రజలలో అసంతృప్తి వెల్లువలు పెళ్ళుబకుండా వ్యాక్యూం లాగా వీటిని ఉపయోగించుకుంటారు. అందుకే ప్రభుత్వాలు భూములు పంచుతాం అంటుంది. భూములన్ని భూస్వాముల దగ్గర ఉన్నాయి. వాటికి రాజ్యాంగం ప్రకారమే హక్కు పత్రాలు ఉన్నాయి. వాటిని కాపాడడానికి ప్రభుత్వాలు పోలీసులు ఉన్నారు. ఇక భూములు ఎక్కడ నుంచి తెస్తారు అంటాడు చారు మజుందార్.

సరిగ్గా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో కూడా ఇక్కడి ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి అని ప్రకటించి ఆ తర్వాత భూమి ఎక్కడ నుంచి తేవాలి అని ప్రకటించింది. 1966లో పశ్చిమ బెంగాల్ కూటమి ప్రభుత్వం ఎలా ప్రకటించిందో సరిగ్గా 60 సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వాలు అలాగే మాట్లాడుతున్నాయి. తెలంగాణలో సాయుధ పోరాట సమయంలో దాదాపు 4వేల గ్రామాలలో భూస్వాముల, దొరల భూములను ప్రజలకు పంచారు. ఆ పోరాట విమరణ జరిగిన వెంటనే మళ్ళీ ఆ భూములు భూస్వాముల చేతుల్లోకి పోయాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి.  పీపుల్స్ వార్ ఉద్యమం బలంగా పనిచేసిన ప్రాంతాలలో కూడా భూస్వాముల భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచారు. 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త భూయాజమాన్య చట్టం తెచ్చి కొత్త పాసుబుక్కులు ఇచ్చి ఆ భూములలో భూస్వాములకు హక్కు కల్పించారు. ఇలాంటి పరిస్థితులే సిలిగిరి లో కూడా చారుమజుందార్ ఆయన అనుచరులు చర్చించుకున్నారు. సిలిగిరి డివిజన్లోని భరాజ్ హర్ జ్యోతే గ్రామం పై సాయుధ పోలీసు బలగాలు దాడి చేసి గ్రామంలోని గుడిసెలను కాల్చివేశారు. పశువులను, వడ్లను, బియ్యాన్ని కొల్లగొట్టారు పశువులను విప్పి గ్రామం నుండి బయటకు వెళ్ళగొట్టారు. గంటల తరబడి గ్రామంలో విధ్వంసంసృష్టించి దొరికిన వాళ్ళను దొరికి నట్లుగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇది 1967లో జరిగిన సంఘటన ఇది చదువుతుంటే నేడు ఛత్తీస్ ఘడ్ లో జరుగుతున్న దాడులను చదువుతున్నట్లే ఉంది. నక్సల్భరి ఉద్యమం పుట్టినప్పటి నుండి నేటి వరకు నక్సల్భరి విధ్వంసానికి,హింసకు గురి అవుతూనే వుంది. పై సంఘటన తరువాత మే ఇరవై ఐదు నాడు నక్సల్బరీ మార్కెట్ కు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రసాద్ జ్యోతి ప్రాథమిక పాఠశాల దగ్గర ‘క్రషిక్ సభ’ మహిళా రైతాంగ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడికి 200 మంది మహిళ కార్యకర్తలు కొంతమంది చంటి పిల్లలతో సహా హాజరై నారు. సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడికి ఒక .పోలీస్ అధికారి 11 మంది సాయుధులైనా పోలీసుల జీపు వస్తుంది. మహిళలు జీపును చుట్టుముట్టి  పోలీసుల తుపాకులు గుంజుకున్నారు. పోలీసు అధికారి ముందుకు వచ్చి “మేము వెళ్ళిపోతాం మా తుపాకులు మాకు ఇవ్వండి అని వొణికే గొంతులోతో వేడుకున్నాడు.  మేము మీ మీద దాడి చేయడానికి రాలేదు ఇక్కడ  ఇంతమంది ఎందుకు గుమికూడారో తెలుసుకుందామని వచ్చాం. మేము మీకు ఎలాంటి హాని తలపెట్టం నమ్మండి. మమ్మల్ని వదిలేస్తే మా దారిన మేము పోతాము”అని వేడుకున్నాడు. పోలీసులను నమ్మి తుపాకులు ఇచ్చి వెళ్లిపొమ్మని చెప్పిన ,మహిళలపైకి  కొంత దూరం పోయిన పోలీసు అధికారి ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చాడు. మొత్తం 18 రౌండ్లు కాల్చారు 11మంది చనిపోయారు. ఇది నక్సల్బరీ లో ఆరోజు జరిగిన సంఘటన. ఆ సంఘటన తర్వాత నక్సల్బరీ అనేది ఊరు పేరు కాకుండా ఒక ఉద్యమం పేరుగా దేశవ్యాపితమైంది. అలా దేశవ్యాపితం కావడానికి అక్కడ నాయకుల కృషి మనకు ఈ నవల ద్వారా రాజయ్య అవగాహన కల్పిస్తాడు. అదే సమయంలో శ్రీకాకుళంలో వెంపటాపు సత్యం, కైలాసం,ల పోరాటాలను కూడా నవల లో వివరిస్తాడు.

రాజయ్య నవలలో ఉండే గొప్పతనం, సౌందర్యం ఏంటంటే ఒక పెద్ద సంఘటనను చిన్న సామెత ద్వారా వివరిస్తాడు. ఆయన మొత్తం నవలల్లో స్థానిక సామెతలు లేకుండా ఏ నవల కూడా ముగియదు. విముక్తి నవల కూడా అంతే. ఇది మొదటి భాగం కాబట్టి 1966-1967 రెండు సంవత్సరాల కాలాన్ని తీసుకున్నాడు. కనుక ఆ సంవత్సరాలలో జరిగిన నక్సల్భరి  పోరాటాన్ని సవివరంగా వివరిస్తూ, అవే సంవత్సరాలలో కాజీపేట కేంద్రంగా సీతారామయ్య, సత్యమూర్తి, చిరంజీవి, చందు, కరుణ, అనసూయమ్మల సంఘర్షణను, ఆదిరెడ్డి లింగయ్య సారు, శుక్లా సారు, శిష్యరికం లో ఎదిగే క్రమాన్ని వివరిస్తూ, చివరిగా లింగయ్యసార్  శ్రీ శ్రీ కవిత్వం  ‘మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలుస్తుంది. పదండి ముందుకు పదండి  తోసుకు. దారినిండా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు. కనపడలేదా మరో ప్రపంచపు కణకణ మండే త్రేతాగ్ని.  అగ్ని కిరీటపు దగదగలు ఎర్రబావుటా నిగనిగలు. హోమోజ్వాల బుగ బుగలు అంటూ ముగిస్తాడు.

బహుశా .. దారినిండా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ తోసుకుపోయిన  అగ్ని కిరీట దగదగలను ఎర్రబావుట నిగనిగలను దాని కొనసాగింపుగా వచ్చే రెండో భాగంలో చదువుకుంటాం కావచ్చు. ఈ నవల చదివిన తర్వాత ప్రతి పాఠకుడు రెండవ భాగం కోసం ఎదురుచూస్తూఉంటాడు. త్వరలోనే రెండవభాగం రావాలని ,ఆ లోపే అందరూ సాహిత్య ప్రియులు ఈ మొదటి భాగం చదువాలని కోరుకుంటూ ..

Leave a Reply