అతడొక్కడే
మిగిలి వున్నాడా

ఇంకెవరూ లేరని
నీ ప్రకటన చూసి
సముద్రం నవ్వుకుంటుంది

జీవితం నీకు ఆగిపోవచ్చు
అక్కడనుండే మరల
మేము మొదలవుతాం

చరిత్ర నువ్వు
తలకిందులుగా చదువుతావు
నీ చరిత్ర మట్టిలో కూరుకుపోయే
కుళ్ళిన శవం మాత్రమే

మేము చరిత్ర నిర్మాతలం
మా పేజీలన్నీ నెత్తుటి
రేఖలతో లిఖింప పడుతూ
చిరస్మరణీయమవుతాయి

జనం ప్రభంజనమయ్యే
రోజు మరల మొదలవుతోంది

అరణ్యం పచ్చగా
చిగురిస్తోంది
నదులన్నీ ప్రవహిస్తూనే వున్నాయి
పర్వత సానువలన్నీ
నిటారుగా నిలబడే వున్నాయి

సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు
వెన్నెలా విరగబూస్తోంది

నువ్వనుకుంటావు
ఓడిపోయింది తల్లి పేగాని

ఆ చివరి విలుకాడు నుండి
పెల్లుబికి వెళ్లువెత్తే
యుద్ధ భేరీ నాదం
నీ గుండెలను చీల్చుతుంది

కాలం మరల మరల
తిరిగి తిరిగి
ముందుకే నడుస్తుంది

ఇది
సత్యం చెప్పిన మాట
అతడు తిరిగి కొండబారిడి
వరి కంకులలో గింజ కడుతున్నాడు
చీకటి కొండల్లో దాచిన
బర్మారులో గంధకం
దట్టించి వస్తున్నాడు

మహేంద్ర గిరులలోనుంచి
నియాంగిరి పర్వత సానువులనుండి
నలుదిక్కులా ప్రవహిస్తున్నారు

అతడు
చివరి వాడూ కాదు
ఆమె
చివరిదీ కాదు
ఇది ఓటమీ కాదు
నీది గెలుపూ కాదు

జైలు గోడలు బద్దలు కొడుతూ
జంగ్ సైరన్ ఊదుతూ
యుద్ధ సన్నాహం చేస్తున్నారు
మరో కెరటం ఎగసి వస్తుంది
సాగరమెప్పుడూ ఇంకిపోదు....

Leave a Reply