జవాబు లేని చోట
ప్రశ్నే నేరమవుతుంది.
తాము పుట్టి, అనాదిగా
ఆశ్రయ ముంటున్న
అడవుల్ని ధ్వంసం చేస్తున్నారు
దేనికనీ?
హద్దులు ఎరుగని తమ స్వేచ్ఛను
అంతం చేస్తున్నారు ఏమిటని ?
తామూ, తమ పూర్వీకులు
శ్వాసించి, శోషించి,
శోకించి, జీర్ణమైపోయిన
మట్టినీ తమకు కాకుండా దోస్తున్నారు
ఎందుకనీ ?
తామూ పవిత్రంగా భావించే
విశ్వాసాలు శిధిలమై పోతున్నాయి.
దేనికని?
వేన ఏళ్లుగా నాగరిక సమాజం
చొరబడి, తమను మరింతగా
లోపలికి తరుముతూ వుంటే...
కలలే కాదు..
కాళ్ళ కింద నేల కూడా కుదురుగా వుండడం లేదు.
తమను ఏరి వేసి, ఆశలను చేరిపేస్తున్న చోట...
ప్రశ్నిస్తున్న తమ బిడ్డలను
మాయంచేసి, మింగివేసి,
కడుపు కోతలను కానుకగా
ఇస్తున్న చోట...
ఎన్ని తంత్రాలు.. ఎన్ని మంత్రాలు !
వారిది కాని దాన్ని ' వారి సొంతం ' చేసుకోవడానికి ఎన్ని మంత్రాంగాలు.. ఎన్ని యుద్దాలు ...
మనిషి సామూహికం నుండి..
ఒంటరి తనానికి జారిపోతున్నప్పుడు...
చీమూ, నెత్తురు లేని సమాజం..
స్పందనను కోల్పోయినప్పుడు..
ఆదివాసీల హననాలు..
డిజిటల్ మీడియాలో
సింగిల్ కాలమ్ వార్తలవుతాయి!
లిప్త కాలంలో మాయమవుతాయి !
' జవాబు లేని ప్రశ్నలూ' నేరాలవుతాయి !!

Leave a Reply