(విరసం ఆవిర్భావ దినం సందర్భంగా జులై 6 న హైదరాబాదులో నిర్వహిస్తున్న సదస్సు సందర్భంగా విడుదల చేసిన కరపత్రం నుంచి …)

ఆపరేషన్‌ కగార్‌ను ఆపివేయాలని తెలంగాణలోని కాంగ్రెస్‌ పార్టీ వివిధ స్థాయి నాయకులు కోరుతున్నారు.  మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలనే ప్రజా ఉద్యమంలో భాగమవుతున్నారు. జాతీయస్థాయిలోనూ ఇదే వైఖరి వినిపిస్తోంది. మావోయిస్టు ఉద్యమాన్ని శాంతిభద్రతల సమస్యగా కాక సామాజిక సమస్యగా తమ ప్రభుత్వం చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే ఇవన్నీ నోటి మాటలుగానే ఉండిపోయాయి. బీజేపీ మతతత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని  కాంగ్రెస్‌  అధిష్టానం పదేపదే చెబుతోంది. సంఫ్‌ుపరివార్‌ నుంచి రాజ్యాంగాన్ని కాపాడతానని అంటోంది. సారాంశంలో   బీజేపీకంటే తమ పార్టీ భిన్నమైనదని  రాహుల్‌ గాంధీ  అంటున్నారు. కాబట్టి తన విభిన్నతను చాటుకోడానికైనా తాము అధికారంలో ఉన్న తెలంగాణలో  మావోయిస్టులతో కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధం కావాలి. ప్రజా ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్న కాంగ్రెస్‌ పార్టీ  ముందు తెలంగాణలో  ఆ పని చేయాలి. తద్వారా తన విశ్వసనీయతను చాటుకోవాలి.  బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే, ప్రచ్ఛన్న బీజేపీ పాలన కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్‌ కన్నా తాను భిన్నమని రుజువు చేసుకోవాలి.

మావోయిస్టు ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కేంద్రం నిర్వహిస్తున్న ఆపరేషన్‌ కగార్‌లో  తమ ప్రభుత్వం ఇందులో భాగం కాదని  తెలంగాణ ముఖ్యమంత్రి చెబుతున్నారు.  అయినప్పటికీ తెలంగాణలో గోదావరి తీరం పొడవునా పోలీసులు క్యాంపులు పని చేస్తున్నాయి. తెలంగాణ సరిహద్దుల్లో చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వ బలగాలు, కేంద్ర ప్రభుత్వం పంపిన వివిధ రకాల సైనికబలగాలు మోహరించి ఉన్నాయి. కర్రెగుట్టల ఆపరేషన్‌ దీనికి ఉదాహరణ. అట్లాగే వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న సైనిక చర్యల్లో తెలంగాణ నుంచి విప్లవోద్యమంలోకి వెళ్లిన వాళ్లు  ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణ ప్రాంత ఆదివాసులు తీవ్ర నిర్బంధాన్ని అనుభవిస్తున్నారు. ఈ మరణాలను, హింసను నివారించడానికైనా, బీజేపీ కొనసాగిస్తున్న అంతిమయుద్ధ వాతావరణంలో రాజకీయ మార్పు రావడానికైనా తెలంగాణలో కాల్పుల విరమణకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధం కావాలి.

తెలంగాణలో కాల్పుల విరమణకు సిద్ధం కావడానికి ఇంకో ముఖ్యమైన ప్రాతిపదిక ఉన్నది.  తెలంగాణ రాష్ట్ర సాధనలో మావోయిస్టు ఉద్యమం చాలా క్రియాశీలంగా పని చేసింది. తొలి దశ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ ఆకాంక్షలకు విప్లవోద్యమం దృఢంగా కట్టుబడి ఉండిరది. తెలంగాణలో ప్రజాస్వామిక చైతన్యం వెల్లివిరియడంలో విప్లవోద్యమం పాత్ర గణనీయమైనది. ఇవాళ కాల్పుల విరమణను కూడా అదే చైతన్యంతో తెలంగాణ సమాజం  స్వీకరించింది. గత రెండున్నర నెలలుగా ఒక్క బీజేపీ మినహా తెలంగాణలో అనేక ప్రజా సమూహాలు, రాజకీయ శక్తులు కాల్పుల విరమణ ఉద్యమంలో భాగమవుతున్నాయి. వందలాది ఆందోళనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ప్రకటన చేస్తేనే ఈ ప్రజాస్వామిక ఆకాంక్షను కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్తించినట్లు లెక్క. ఆ దిశగా  తెలంగాణ  ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించేలా ఒత్తిడి చేయవలసి ఉన్నది. ఈ ఉద్యమంలో దేశ ప్రజలపై జరుగుతున్న యుద్ధాన్ని నిలువరించాలనే రాజ్యాంగ విలువలు   ఉన్నాయి. ఫాసిస్టు వ్యతిరేక ప్రజాస్వామిక కోణం కూడా  ఉన్నది. ఇంత ప్రధానమైన విషయాన్ని విరసం తన ఆవిర్భావ సభలో చర్చనీయాంశం చేయాలనుకుంటోంది. అందరికీ స్వాగతం.

Leave a Reply