ఐక్య ఉద్యమాలతో ఓడిద్దాం.. పోరాట కళా సాహిత్యాలను సృజిద్దాం

హిందుత్వ కార్పొరేట్‌ ఇండియాకు వ్యతిరేకంగా భారత ప్రజల పక్షాన నిలబడదాం

దండకారణ్యానికి తెలుగు రచయితలకు, మేధావులకు దగ్గరి సంబంధం ఉంది. తెలుగు ప్రాంతాల నుంచి విప్లవకారులు వచ్చాకనే సువిశాల బస్తర్‌లోని, గడ్చిరోలీలోని ఆదివాసీ కళలు బైటి ప్రాంతాలకు పరిచయం అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న యుద్ధం మమ్మల్ని సమూలంగా నిర్మూలించడంతోపాటు మా కళలను ధ్వంసం చేయడానికి కూడా నడుస్తున్నది.  కగార్‌ పేరుతో సాగుతున్న ఈ యుద్ధం మా ఒక్కరి మీదే జరుగుతున్నదని మేం అనుకోవడం లేదు. కార్పొరేట్‌ దుర్మార్గాన్ని, హిందుత్వ ఫాసిజాన్ని వ్యతిరేకిస్తున్న భారత ప్రజలందరి మీద ఈ యుద్ధం జరుగుతున్నది. బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు నుంచే దండకాణ్యంలో,  దేశమంతా కార్పొరేట్‌ హిందుత్వ యుద్ధం మొదలైంది. ఆదివాసీ ప్రాంతాల్లోని సహజ వనరుల్ని దోచుకోడానికి, మిగతా దేశంలోని కార్మికవర్గాన్ని పీల్చిపిప్పి చేయడానికి ప్రభుత్వం గతం కంటే దుర్మార్గమైన విధానాలను ప్రవేశపెట్టింది. దండకారణ్యంలో బతుకుతున్న మా ఆదివాసీ సమూహాలతోపాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న పీడిత సమూహాలన్నిటినీ కార్పొరేట్లు, హిందుత్వ శక్తులు దోచుకోడానికి ఉన్న అడ్డంకులను తొలగించుకోడానికి ఈ యుద్ధానికి ప్రభుత్వం తెగబడిరది.

కగార్‌ అనే ఈ అంతిమ యుద్ధం మా ఒక్కరి మీదే కాదని, దేశం మీదే పాలకులు చేస్తున్నారని ఆదివాసీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల మా అటవీ ప్రాంతాల్లాగే మైదాన ప్రాంతాల్లో కూడా సామ్రాజ్యవాద దళారీ కొర్పొరేట్‌ దోపిడీని సజావుగా సాగించుకోడానికి పోరాడుతున్న ప్రజలను భయపెట్టడానికి, లొంగదీసుకోడానికి ఈ కగార్‌ తీసుకొచ్చారు.

దీనికి వెనుక 2007 నుంచి ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ తీసుకొచ్చారు.  ఆ తర్వాత ఆపరేషన్‌ సమాధాన్‌ ప్రవేశపెట్టారు. ఇప్పుడు కగార్‌ అనే యుద్ధాన్ని నడుపుతున్నారు. 2011 నుండి భారత సైన్యాలు ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రంలోని నారాయణ్‌ పుర్‌ జిల్లా, మాడ్‌  ప్రాంతాన్ని తమ బలగాల సైనిక శిక్షణ కోసం కైవసం చేసుకోవడానికి ఎడతెరిపి లేకుండా ప్రయత్నిస్తున్నాయి. భారత సైన్యాలు కోరుతున్న ఈ ప్రాంతం దాదాపు 55 వేల హెక్టార్లు(1,34,778 ఎకరాలు).  ఇది అటవీ, జనావాస, పంట భూముల ప్రాంతం.   ఇది మాడ్‌ నడిగడ్డన సోన్‌పూర్‌ నుండి గార్ప మధ్య గల ప్రాంతం. వాళ్లకు ఈ ప్రాంతం కావాలి. అయితే దానికి అనేక రెట్లకు పైగా గ్రామపంచాయతీల పరిధిలోని భూభాగాన్ని ఖాళీ చేయించడానికి ఆగమేఘాల మీద సర్వే పనులు జరుగుతున్నాయి. 72 గ్రామాలు ఖాళీ చేయాలనే తాఖీదులు చేరుతున్నాయి. ఈ ప్రాంతంలోని ప్రజలకు దూరంగా ఎక్కడో పునరావాసం కల్పిస్తామని అంటున్నారు. కానీ, మాడ్‌ కొండలలోని  ప్రజలు మాత్రం తమ అడవులను, భూములను వదలడానికి సిద్ధంగా లేరు. వారు ఇప్పటికే  అధికారులకు తమ అభ్యంతరం వినిపించారు.  కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేవని తెలుస్తోంది.

2022 అక్టోబర్‌లో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్‌ఎస్‌ఎస్‌`బీజేపీ కేంద్ర ప్రభుత్వం విప్లవ ప్రతీఘాతుక సూరజ్‌కుండ్‌ వ్యూహాన్ని తయారు చేసింది. అంతర్జాతీయ, జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామల్లో భాగంగా 2024 జనవరి నుండి అపరేషన్‌ కగార్‌ మొదలు పెట్టారు.  మాడ్‌తో సహా యావత్‌ దండకారణ్య ప్రాంతంలో హోహరించిన భారత  సైనిక బలగాలతో ఆదివాసీ ప్రాంతాలన్నీ రక్తసిక్తమవుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాయపూర్‌లో జరిపిన ఏడు మావోయిస్టు ఉద్యమ రాష్ట్రాల పోలీసు అధికారుల సమావేశం నేపథ్యంలో  ఇక్కడి అడవుల నుండి ప్రజలను ఖాళీ చేయించే చర్యలను అర్థం చేసుకోవాలి. దేశంలో మావోయిస్టులను, మావోయిజాన్ని 2026 మార్చ్‌ నాటికి అంతమొందిస్తామని ఆ సమావేశం ప్రకటించింది. అందు కోసం ప్రస్తుత కగార్‌ దాడులను రెట్టింపు వేగంతో, తీవ్రతతో కొనసాగించాలనీ నిర్ణయించింది. ఈ దాడులను ‘మాడ్‌ బచావో’ కేంపెయిన్‌ పేరుతో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వారి లక్ష్యాన్ని చేరడానికి మాడ్‌ కొండలలో భారత సైన్యాల శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, మాడ్‌ ప్రాంతం నుండి ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించే వినాశకర చర్యలను చేపడుతున్నారు. తిరిగి మూడేళ్లకు మీ ప్రాంతాలకు మీరు చేరుకుంటారని ప్రజలను మభ్యపెడుతున్నారు. 

కార్పొరేట్‌ వర్గాల ప్రయోజనాల కోసం వివిధ ప్రాజెక్ట్‌ల పేరుతో దేశంలో నిర్వాసితులైన వారిలో ఆదివాసీలే అధిక సంఖ్యలో వున్నారు. దండకారణ్యంలో 1970లలో చేపట్టిన కిరండాల్‌ తవ్వకాలతో పెద్ద ఎత్తున ఆదివాసీలు నిర్వాసితులయ్యారు. ఇంచుమించు అదే సమయంలో మార్డూంలో అత్యంత రహస్యంగా భారత రక్షణ రంగ యూనిట్‌ను నిర్మించినపుడు ఆదివాసీలు నిర్వాసితులయ్యారు. 1980ల నాటికి మాడ్‌ కొండలపై నుండి ఆదివాసీలను మైదాన ప్రాంతాలకు తరమడానికి అన్ని సన్నాహాలు జరిగాయి. అడవుల నుండి మనుషులను తరిమివేసి పులులను పెంచి పోషించే ప్రభుత్వ విధానాలతో 1980లలోనే వర్తమాన బీజాపుర్‌ జిల్లా నేషనల్‌ పార్క్‌ ఏరియా నుండి పదుల గ్రామాలను ఖాళీ చేయించ పూనుకున్న పరిస్థితులలో  ఆదివాసీలు సంఘటితంగా దానిని ఎదుర్కొన్నారు.

తిరిగి ఇపుడు వారికి తమ గ్రామాలను ఖాళీ చేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక ఈమధ్య కాలంలో ముఖ్యంగా గత నాలుగేళ్ల నుండి అనేక కార్పొరేట్‌ వర్గాల ప్రయోజనాల కోసం వేగంగా కొనసాగిస్తున్న గనుల తవ్వకాలతో బృహత్‌ బస్తర్‌లో, గడ్చిరోలిలో వాతావరణ కాలుష్యం పెద్ద ఎత్తున ప్రబలుతూ ప్రజల పంట భూములు వల్లకాడై పోతున్నాయి. వారి ఆవాసాలు నివాస యోగ్యం కాకుండా పోతున్నాయి. పచ్చని అడవులు నాశనమవుతున్నాయి. 2030 నాటికి గడ్చిరోలీని పారిశ్రామిక జిల్లాగా మారుస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి  ప్రకటించాడు. ఈ పరిణామాలతో ఈ ప్రాంతాలలోని ఆదివాసీలు ఏ పట్టణాలకో, ఏ నగరాలకో, ఏ  మురికివాడల  జీవితాలకో బలి కానున్నారు. చాలా బాధాకరమైన విషయం ఏమంటే, ఈ ప్రాంతాలలోని ఆదివాసీ తెగలు భారత రాజ్యాంగం ప్రకారం అంతరించిపోతున్న తెగల జాబితాలోకి వస్తారు. కార్పొరేట్ల  ప్రయోజనాల కోసం ఆదివాసీల జీవితాన్ని ఫణంగా పెడుతూ వారి అస్థిత్వాన్నే ధ్వంసం చేస్తున్నారు.

గతంలో ఫాసిస్టు సల్వాజుడుం సమయంలో సుక్మా, దంతెవాడ, బీజాపుర్‌ జిల్లాలలోని వేలాది మంది ప్రజలను తమ అడవుల నుండి, గ్రామాల నుండి ‘సహాయ శిబిరాల’ పేరుతో రోడ్‌ సైడ్‌ కు నిర్మించిన అనేక ‘షెల్టర్‌’ లలోకి తరలించారు. ఆ షెల్టర్లన్నీ నరకకూపాలే. వాస్తవంగా అవన్నీ విప్లవోద్యమాలను అణచివేయడానికి దోపిడీ పాలకవర్గాలు అనుసరించే విధానాలలో భాగంగా ఏర్పరిచే కాన్‌ సెంట్రేషన్‌ క్యాంపులే అనుకోవాలి. అక్కడ ప్రజలకు ఎలాంటి అవకాశాలు వుండవు. మహిళల జీవితాలలో కనీస భద్రత కరువవుతుంది. అడవులలో స్వేచ్ఛగా తిరిగుతూ తమ దైనందిన అవసరాలను తీర్చుకునే ఆదివాసీలకు ‘సహాయ శిబిరాల’ జీవితాలు మృత్యుకుహరాల్లాంటివేనని తేలిపోయింది. బలవంతంగా ఆ శిబిరాలకు తరలించబడిన ప్రజలు అక్కడ వుండలేక వివిధ రూపాలలో తిరిగి తమ అడవులకు, గ్రామాలకు చేరుకున్నారు. వారికి విప్లవోద్యమంతో సహా అనేక మంది ప్రజాస్వామికవాదులు, ఆదివాసీ శ్రేయోభిలాషులు సహకరించారు.

ప్రస్తుతం మాడ్‌ కొండలలోని ప్రజలు కోరుతున్నదేంటి? అనేది ఇక్కడ కీలకమైన విషయం. వారు తమ ‘కొండలను ఖాళీ చేయం’ అంటున్నారు. వారు తమ భూములను వదలం  అంటున్నారు. వారు తమ అడవులను కాపాడుకోవాలంటున్నారు. వారు ప్రకృతి వనరులను మన దేశం కోసం, మన ప్రజల కోసం, భవిష్యత్‌ తరాల కోసం నిలుపుకోవాలంటున్నారు. మాడ్‌ కొండలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అన్ని చర్యలను తక్షణం నిలిపివేయాలని కోరుతున్నారు.  

కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల్ని అడవుల నుంచి బైటకి పంపించడానికి, నిర్మూలించడానికి కగార్‌ యుద్ధాన్ని తీసుకొని వచ్చాయి. ఇది ఆదివాసీ ప్రాంతలకు పరిమితం కాదు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను, నేలను, నదులను, గుట్టలను, నేల కడుపులో ఉన్న సంపదలను, ప్రజల ఆస్తులను తీసుకపోయి కార్పొరేట్లకు ఇవ్వడానికి ఈ యుద్ధం తీసుకొచ్చారు. దేశంలోని మెజరిటీ ప్రజల్ని హిందుత్వ కిందికి తీసుకొచ్చి ముస్లింలకు వ్యతిరేకంగా నిలబెడుతున్న మతోన్మాదుల ప్రయోజనాల కగార్‌ తీసుకొని వచ్చారు. సామ్రాజ్యవాదులకు అనుగుణంగా జరుగుతున్న ఈ యుద్ధం భారత పౌరుల మీద జరుగుతున్నది. వివిధ పీడిత సమూహాలు, ప్రజాస్వామిక శక్తులు ఈ కగార్‌ యుద్ధ స్వభావం తెలుసుకొని, దీన్ని ఓడిరచేందుకు విశాలమైన ఐక్య సంఘటన నిర్మించాల్సి ఉన్నది. 

తెలుగు సాహిత్యకారులు, మేధావులు, న్యాయవాదులు, పాత్రికేయులు, విద్యార్థులు, పీడిత అస్తిత్వాల నాయకులు అందరూ ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడాల్సి ఉన్నది.  ఒక సుందరమైన భవిష్యత్‌ను కోరుకుంటున్న వారంతా చేతులు కలిపి పోరాటాల్లోకి రావాలని కోరుతున్నాం. ఈ పోరాటాలకు మద్దతుగా సాహిత్యం రాయాలని, కళా రంగంలో యుద్ధ వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా చేయాలని అభ్యర్థిస్తున్నాం. ఈ దేశాన్ని కార్పొరేట్‌ హిందూ రాష్ట్రగా మార్చాలనే ఫాసిస్టు వ్యూహానికి వ్యతిరేకంగా ఈ దేశం ఈ నేల మీది సమస్త పీడిత ప్రజానీకానిదని చాటిచెప్పడానికి రచయితలు సాహిత్య రాజకీయరంగాల్లో కృషి చేయాలని ఆశిస్తున్నాం. ఈ దోపిడీ, అసమానతల, హింసాత్మక వ్యవస్థను దీర్ఘకాలికంగా పట్టి ఉంచుతున్న భావజాలం నుంచి సాహిత్యకారులు పూర్తిగా బైటపడి మౌలిక మార్పు కోసం ప్రజలు చేస్తున్న పోరాటంలో భాగం కావాలి. ఈ వ్యవస్థను, అసమ సామాజిక సంబంధాలను, అనేక సాంఘిక వివక్షలను ఎదిరించడానికి అవసరమైన విప్లవాత్మక దృక్పథాన్ని తెలుగు సాహిత్య మేధో కళారంగాల్లో విస్తరింపజేయాల్సి ఉన్నది. రాజ్యాంగవాదం, బూర్జువా యథాతధవాదం వంటి వాటి నుంచి బైటికి వచ్చి ప్రజలు దీర్ఘకాలికంగా పోరాడి సాధించుకున్న రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడుకుంటూనే అంతిమ విముక్తి దిశగా పని చేయాల్సిన అవసరం గతం కంటే ఎక్కువగా చరిత్ర నిర్దేశిస్తున్నది. తెలుగు సాహిత్యకారులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో, 1970లలో, 80లలో ఆరంభించి 2000 దాకా మహాద్భుతమైన రాజకీయ సాహిత్య సాంస్కృతిక పాత్ర నిర్వర్తించారు. అంతకంటే మరింత దృఢంగా ప్రజాస్వామిక, లౌకిక విలువల కోసం, కార్పొరేట్‌ హిందుత్వ  ఫాసిజానికి వ్యతిరేకంగా, భారత రాజ్యం ప్రజలపై చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన బాధ్యత పెరిగింది.  ఈ పోరాటంలో   తెలుగు ప్రజల్లాగే, భారత ప్రజల్లాగే తెలుగు సాహిత్యకారులకు, మేధావులకు చాలా పాత్ర ఉన్నది. దాన్ని కొనసాగించాలని కోరుతున్నాం.

దండకారణ్య మూలవాసీ రచయితలు, కళాకారులు

బస్తర్‌-గడ్చిరోలి 

(కర్నూలులో ఫిబ్రవరి  తేదీలలో జరిగిన విరసం సాహిత్య   పాఠశాలకు పంపిన సందేశం)

Leave a Reply