వియ్యుక్క కథలు 6 సంపుటాలు నా చేతికందినప్పటి నుంచీ 6 పుస్తకాలు చదివి వివరంగా సమీక్ష గానీ, వ్యాసం గానీ రాయాలనుకుంటూనే ఉన్నాను. పుస్తకం వచ్చిన వెంటనే వస్తే ఉన్నంత తాజాదనం ఉండదేమో అనే ఆలోచన వల్ల ఇప్పటికి ‘‘అమ్మతనం’’ కి సంబంధించిన 8 కథలను ప్రత్యేకంగా పరిశీలించే పనికి పూనుకున్నాను. ఇక విషయంలోకి వస్తే ‘‘అమ్మతనం’’ పూర్వకాలంలో లేదా సాంప్రదాయంలో మాతృత్వం అనే మాటకు సరిపోల్చదగిన మాట. కానీ మనం అమ్మతనం అని అనుకోవడంలోనే సహజత్వం వ్యావహారికం ఉన్నాయని నా భావన.
ఇప్పుడు కథల గురించి తెలుసుకుందాం. ‘‘పిల్లలు’’ అనే కథ తాయమ్మ కరుణ రాసింది. సుమ, ప్రదీప్ డెన్ ను మెయింటెయిన్ చేస్తూ ఉంటారు. వారిద్దరూ సహచరులు సుమకు పిల్లల్ని కనాలని చాలా కోరిక. కానీ ఇప్పుడు ఉద్యమం కోసం డెన్ నడుపుతున్న వాళ్ళు ఒకవేళ పరిస్థితుల వల్ల పూర్తికాలం కార్యకర్తలుగా లోపలికి వెళ్ళాల్సి వస్తే ఎట్లా? అయినా పూర్తికాలం ఉద్యమానికి అంకితమవ్వాలనుకుని వచ్చిన తామిద్దరం ఈ విషయానికి లొంగిపోతే ఎలా అనే ఆలోచనతో ప్రదీప్ ఆపరేషన్ చేయించుకుంటాడు. ఆ విషయం తెలిసిన సుమ బాధ పడుతుంది. ఇక ఎప్పటికీ పిల్లలు కలగకపోవడం అనే విషయాన్ని తట్టుకోలేక పోతుంది. అదే సమయంలో ఉద్యమమంటే గౌరవం, ఉద్యమమంటే ఎంతో ఇష్టం ఇవన్నీ ఉన్న పాత్ర సుమ. కానీ ఒకదాని కోసం ఒకటి వదులుకోవడం కష్టమనిపిస్తుంది. సుమకు, ప్రదీప్ సుమకు నచ్చచెప్పడానికి కవితక్క అనే కామ్రేడ్ పడ్డ తపన, అటు అడవికి, ఉద్యమ జీవితానికి ఇటు అమ్మతనానికి మధ్య పడే సంఘర్షణ సామాన్య పాఠకుడి హృదయంలో ఆవేదన కలిగిస్తుంది. చుట్టూ ప్రపంచంలో తల్లి కావడం అనేది చాలా మామూలైన విషయం ఎంత ఆనందమైన విషయం కానీ ఉద్యమంలోకి పోవాలనుకున్నప్పుడు పూర్తి కాలపు కార్యకర్తగా ఉండాలను కున్నప్పుడు ఎంత కష్టమో వాస్తవ జీవితంలో ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోవలసిన సందర్భాన్ని తాయమ్మ కరుణ అద్భుతంగా చిత్రించింది. బహుశా తాను ఆ ఉద్యమ జీవితాన్ని గడిపింది కనుక ఎంతో మంది స్త్రీలను దగ్గరినుంచి చూసింది కనుక రచయిత్రి ఆ చిత్రణ అంత సహజంగా చేయగలిగిందేమో. సహజమైన మానవ సంబంధాలలో తల్లి, బిడ్డ ప్రేమ పేగుబంధం కనుక అత్యంత సహజమైనది. ఉద్యమం, పోరాటం చాలా కఠినమైనవని దానిలో ఉన్న మనుషులం దరూ హృదయం లేని రాళ్ళవలె ఉంటారని అనుకునే సమాజం పాఠకలోకం ఇట్లాంటి కథలు చదవాలి. ఒక స్త్రీ మానసిక వేదన, భార్యాభర్తల సంఘర్షణ పాఠకులకు ఒక కొత్త చూపును ఇస్తుంది. ఈ కథలోని పాత్రలు ఆ సంఘర్షణను మనకు అద్దం పట్టినట్టు చూపిస్తాయి.
పద్మకుమారి రాసిన కాంత పున్నం వెన్నెల కథలో కాంత ఉద్యమంలో పనిచేసి పుట్టిన బిడ్డకోసం తప్పనిసరి పరిస్థితుల్లో బయట జీవిస్తుంటుంది. కాంత సహచరుడు పున్నం. తాను జాగ్రత్త వహించనందువల్ల కాంత గర్భవతి అవుతుంది. ఆమె శరీరం బలహీనంగా ఉన్నందువల్ల అబార్షన్‌కి సాధ్యపడదు. అప్పుడామె ఏం చేయాలి? ఉద్యమ జీవితాన్ని, త్యాగాన్ని కోరుకొని వచ్చిన కాంత స్త్రీ సహజమైన శారీరక ధర్మం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డను కనాలని నిర్ణయించుకుంటుంది. బిడ్డ పుట్టాక బిడ్డతో సహా అడవిలోకి వెళ్ళొచ్చను కుంటుంది. కానీ తీవ్ర శత్రు నిర్భంధం మధ్య ఏం చేయాలో తెలియక పిల్లను ఉంచుకోలేక, బయటికి పంపించలేక సతమతమయ్యే తల్లి మనసు కాంతది.
‘‘తుపాకుల్ని శుభ్రం చేసినంత సులభం కాదు పిల్లల పని చేయడం’’ అంటుంది ఒకచోట రచయిత్రి. పిల్లలతో ఉద్యమ జీవితం ఎంత కష్టమో ఈ మాటలో అర్థమవుతుంది. పిల్లతో కష్టమని పున్నం తల్లికి ఇచ్చి వద్దామని వెళుతుంది కాంత. కానీ ఆమె తాను ఈ పసిగుడ్డును నేనెట్లా సాకుతాను కూలిపనికి పోకపోతే ఎల్లదాయె అంటుంది. వాళ్లకు రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలు పైగా పోలీసు నిర్భంధం ఈ పిల్ల పేరుమీద మళ్ళీ ఏరకమైన విధ్వంసం సృష్టిస్తారో ననే భయం మరోపక్క. ఆ ఆశకూడా అడుగంటింది. మళ్ళీ కామ్రేడ్ రవి, ప్రకాశ్‌తో కలిసి తమ చెల్లె నీల దగ్గరికి వెళ్తారు. పిల్లను పెంచుకోమని అడగడానికి, నువ్వు కొంతకాలం మాతో ఉంటే చూసుకుంటాం కానీ నువ్వు పోయి పాపను చూసుకోవడమంటే మాటలా అని చెల్లె తేల్చి చెప్పింది. ఇప్పుడేం చేయాలి? మళ్ళీ సమస్య మొదటికొచ్చింది. మళ్ళీ అడవిలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఇక కాంత పిల్లను తీసుకొని బయటకు వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చింది. పాపకోసం ఉద్యమాన్ని సహచరుడైన పున్నంను వదులుకోవడానికి సిద్ధపడిరది. అందుకే తనకెంతో ఇష్టమైన ‘‘విప్లవంలో మాతృత్వ అనుభూతికి ఆటంకం లేని విముక్తి ప్రాంతాలను సృష్టించే రోజు వస్తే? అంటుంది ఒకచోట రచయిత్రి. నిజమేకదా ఏదో ఒకటి తేల్చుకోవాల్సి రావడం ఉద్యమకారిణికి ఎంతో కష్టం.
మరికొంత కాలానికి పున్నం ఎన్‌కౌంటర్‌లో అమరుడవుతాడు. ఇక పున్నం తల్లితండ్రుల దగ్గర గడుపుతూ బిడ్డను పోషించడానికి కూలికి వెళుతుంది కాంత. తన జీవితంలో మిగిలిన వెన్నెల పాప. అందుకని వెన్నెల అనే పేరుతోనే పిలుచుకుంటుంది. మెల్లమెల్లగా పాపతో తన అనుబంధం పెరగసాగింది. బయటి జీవితం అలవాటయింది. జీవితమంతా రాజకీయాలే అనుకుని లోపలికి వెళ్ళిపోయింది. కానీ ఈ పేగుబంధం కోసం సహచరున్ని ఉద్యమాన్ని వదులుకొని రావాల్సి వచ్చింది. కానీ ఈ జీవితం ఇష్టం కావట్లేదు. ఇంకేదో చేయాలనే తపన వేధిస్తోంది. జీవితం అసంతృప్తి అనిపిస్తుంది. అమరుడైన రవి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. పాపను వేరే వాళ్ళకు ఇవ్వలేక, బయట ఉండలేక ఆమె పడుతున్న వేదనను రవి గ్రహించాడు. ఉద్యమంలో అమరులైన కామ్రేడ్ల కుటుంబ సభ్యులు కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంఘంలో పనిచేయమని కాంతకు సలహా ఇచ్చాడు. ఉద్యమంలో ఉండడం వల్ల చైతన్యాన్ని నిలబెట్టుకుంటావు అని రవి చెప్పిన మాటలు చెవిలో గింగురుమంటున్నాయి. ఆ రవి అమరుడయ్యాడు. ఆ రవి సంస్మరణ సభకు వెళ్ళడానికి తయారయింది. వెన్నెలను కూడా తీసుకుని బయల్దేరింది. ఎదురుగా చిరునవ్వు చిందిస్తున్న రవి నిలువెత్తు బ్యానర్. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా వెన్నెలకు రవి ని పరిచయం చేసింది. మీ నాన్నకు నాకు దోస్తు కామ్రేడ్ రవి అంటూ ఉద్విగ్నంగా పరిచయం చేసింది. యుద్దంలో పుట్టి పెరిగిన వెన్నెల కూడా ఆ మీటింగ్‌ను, పాటలను ఉత్సాహంతో వింటుంది. ఆ వెన్నెల మనసులో ప్రశ్నలెన్నో, పోరెత్తే పాటలెన్నో.
మొత్తం కథ ఎన్నెన్ని అనుభూతులను, హృదయ స్పందనలను, ఉద్విగ్నతలను, సంతోషాలను, కష్టాలను మోసుకొస్తుందో చదివి తీరాల్సిందే. మానవ సహజ అనుభూతుల స్పందనల కోసం ముఖ్యంగా ఉద్యమం పట్ల ఇష్టం, అభిమానం ఉన్న ఒక స్త్రీ తల్లిగా, ఉద్యమకారిణిగా, సహచరిణిగా, స్నేహితురాలిగా, ఎంత గొప్ప వ్యక్తిత్వంతో ఉంటుందో ఆమె పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు రచయిత్రి.
పద్మకుమారి రాసిన మరో కథ అపురూప. ఈ కథలో నారాయణ దుర్గమ్మ ఇంటి గృహప్రవేశం చేసుకున్నారు. బంధువులంతా వెళ్ళిపోయారు. ఇల్లు, ఇంటి ప్రహారీ అటూ ఇటూ నాటిన కొబ్బరి చెట్లు, మందారం చెట్లు సందడంతా అయిపోగానే ఒక శూన్యం ఆవరించింది. నారాయణకు ఇల్లు కొత్త వాసనతో కొత్తకొత్తగా అనిపిస్తుంది. ఖర్చుకూడా అనుకున్న దానికన్నా ఎక్కువే అయింది. కొడుకు కోడలు బతికి ఉంటే అని లేని కొడుకును తల్చుకొని బాధపడ్తున్నాడు. ఊరందరినీ బంధువులందరినీ పిలిచి ఆడంబరంగా చేసాడు. కొడుకు పెళ్ళి అట్లా చేద్దామనుకున్నాడు. కొడుకు ఆ అవకాశమే ఇవ్వలేదు.
ఒక్కసారిగా కొడుకు కోడలి శవాలు ఇంటికొచ్చిన రోజు గుర్తొచ్చింది. ఎవరో అన్నారు మనవరాలు వచ్చిందని నారాయణకు తన కొడుకు స్నేహితుడు రవీందర్ కొడుకు లేని లోటును తీర్చాడు. ఎంతో సహాయం చేసిండు. కొడుకు చనిపోయినప్పుడైనా ఇప్పుడైనా దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాడు.
అందరూ వెళ్ళిపోయాక చిన్నగా సుధాకర్ (చనిపోయిన కొడుకు) ప్రస్తావన తెచ్చిండు. వాళ్ళ బిడ్డ తెలిసిన వాళ్ళదగ్గర చదువుకుంటుంది అని చెప్పిండు రవీందర్. ముసలోళ్ళిద్దరికీ ప్రాణం ఆగుతలేదు. మనవరాలి గురించి వినగానే కళ్ళల్లో మెరుపు. ఎప్పుడెప్పుడు ఆ పాపను తీసుకొచ్చు కోవాలని మనసు ఆరాటం. ఎవరో మనోళ్ళ దగ్గరే బతుకుతుందని సంతోషం ఒకవైపు అయ్యో మనదగ్గర లేకపాయెనే అని బాధ మరోవైపు. ఇప్పటివరకూ మొహం చూడని మనవరాలి మీద ఇద్దరూ తమతమ ఆప్యాయతలను మాటల్లో వెలిబుచ్చుతూనే ఉన్నారు. సుధాకర్ ఉద్యమంలోకి పోయినాక వాళ్ళను పోలీసులు ఎట్లా కష్టపెట్టారో గుర్తొస్తే ఇద్దరికీ భయం కలుగుతుంది. కానీ ప్రాణాలకు తెగించి ఉద్యమంలోకి పోయిన తన కొడుకు అంశ మనవరాలి రూపంలో ఎక్కడో ఉంది అని తెలిసినప్పట్నించీ మనసు ఒక్క దగ్గర నిలుస్తలేదు.
మనవరాలి నుంచి ఆలోచన కొడుకు కోడలి వైపు మరలింది. ఒకసారి చూసి రావడానికి పోయిండు. కోడలి పరిచయం అప్పుడే కానీ మంచి పిల్లే అనిపించింది దుర్గమ్మకు. అట్లా మళ్ళీ పాత ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది. ఈలోపు ఒక కారు వచ్చి ఆగింది. ఆ కార్లోంచి ఒక అమ్మాయి దిగి తనతో పాటుగా ఒక వృద్ధ దంపతులను కార్లోంచి దించి మీ ఇంటికే వస్తున్నం మీరు దుర్గమ్మ కదా అంటూ ఇంట్లోకి ప్రవేశించింది. ఆ అమ్మాయే కొడుకు కూతురని, ఆ అమ్మాయే అపురూప అని తెలుసుకుని ఆమె దు:ఖం కరిగి ఏడుపుగా మారింది. అప్పుడే నారాయణ బయటి నుంచి వచ్చాడు. ఈ కొత్త మనుషులను చూసి ఆశ్చర్యపోతుండగా నీ సుధాకర్ కూతురంట అంటూ ఆయనకు చెప్పింది. మేము రాలేమని నీవే వచ్చావా తల్లీ అంటుంటే గొంతు పూడుకు పోయింది. కల అనుకుంటున్న నారాయణ దుర్గమ్మలకు ఇది నిజమని చెప్పింది అపురూప. మనవరాలికోసం 25 ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఆ దుర్గమ్మకు నిద్ర పట్టడం లేదు.
తనతో పాటు తీసుకొచ్చిన అమ్మమ్మ తాతయ్యలను కూడా చూసుకోవడానికి ఎవరూ లేరని వారి బిడ్డ ఉద్యమంలో అమరురాలైందని అపురూప చెప్తుంది. అంతేకాదు ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలను చూసుకునే బాధ్యత తీసుకుంది. వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గరే ఉండటానికి నిశ్చయించుకుంది. మనుషుల్ని కలపడమే మన పని ఒకరిని ఒకర్ని ఆసరాగా నిలబెట్టడమే మనం చేయాల్సింది. అంటూ ఉద్యమంలో అమరులైన తన కొడుకు కోడలికి పుట్టిన ఈ అపురూప నిజంగా అపురూపమే అనుకునేట్టుగా కథను తీర్చింది రచయిత్రి. వృద్ధాప్యంలో తోడు లేకుండా ఎంతో మంది సమస్యలు ఎదుర్కొంటారు. చాలామంది విదేశాల్లో స్థిరపడి ఒక్కొక్కరినే ఉంచుతున్నారు. అట్లాంటి సమాజంలో బతుకుతున్నాం మనం. ఈ సమాజంలో వయసులో ఆసరా ఉండవలసిన కొడుకు కోడలు ఉద్యమం లోకి వెళ్తే ఆ తర్వాతి తరం ముసలివారి రక్షణ తీసుకోవడం ఒక బాధ్యత ఒక కర్తవ్యం. ఆ విషయాన్ని ఎంతో బాగా చెప్పారు రచయిత్రి.
బద్రి రాసిన గంగి కథలో ఒక చిన్నారిని అమ్మమ్మ దగ్గర వదిలివేసి మళ్ళీ ఉద్యమంలోకి తిరిగి వచ్చిన తల్లి వేదన తల్లి ఆలోచన, తల్లి స్ఫూర్తి ఈ కథలో కనిపిస్తుంది. ఈ కథలో బిడ్డకు ఉత్తరం రాస్తున్న ఆ తల్లికి అంతే తన బిడ్డ వయసున్న గంగి అనే బుజ్జిపాపాయి తారసపడుతుంది. ఆ గంగి తల్లి ఇర్మె. ఆ తల్లికి దళంతో ఏ ప్రాంతానికి పోయినా చంటిపిల్లలను చూసినప్పుడల్లా తన బిడ్డ గుర్తొస్తుంది. ప్రతి బిడ్డలో తన బిడ్డను చూసుకుంటుంది. రెండేళ్ళ గంగిని ఇర్మె కూడా అట్లానే వదిలేసి దళంలోకి వస్తుంది. రెండేళ్ళ పిల్లకు ఉత్తరం రాస్తున్నానని ఇతర ఉద్యమ సహచరులంతా ఆశ్చర్యపోతుంటారు. బిడ్డ పెద్దయ్యాక నేనున్నా లేకున్నా బిడ్డ ఉత్తరం చదువుకొని వాళ్ళ అమ్మ గురించి తెలుసుకుంటుంది కదా అమ్మ మనసులో ఆలోచన.
‘‘మాతృత్వం అనే బలహీనతను చంపుకోలేని బలహీనత నిన్ను ఈ భూమ్మీదకు తెచ్చింది. నన్ను క్షమించు కన్నమ్మా’’ అంటుంది రచయిత్రి. ఆ పాపకు రాసే ఉత్తరంలో వాక్యాలు మనసును పిండేస్తాయి. విప్లవానికి అంకితమైన వాళ్ళకు పిల్లల్ని కనే హక్కు లేదనుకున్నాం. ఆపరేషన్ ఫేయిలవడం వల్ల కనాల్సి వచ్చింది. అబార్షన్ ఇష్టం లేదు. ఆమెలోని విప్లవకారిణిని తాత్కాలికంగా అమ్మ ఓడిరచింది. కానీ కలలు కన్నంత సేపైనా ఆ పసికందుతో గడపలేదు. ఇర్మె కూడా గంగిని అట్లానే వదిలేస్తుంది. గంగిని చూసినప్పటి నుంచీ, ఆ తల్లికి విప్లవకారిణికి పాప, గంగి పదే పదే గుర్తొస్తున్నారు. అందువల్లే పాపకు ఉత్తరం రాయడం మొదలుపెట్టింది.
అట్లా మధ్యమధ్యలో గుర్తొచ్చినప్పుడల్లా ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో ఆ పాప వయసును లెక్కించుకుంటూ తన మనసును ఆవిష్కరిస్తుంది. ఆ తల్లి ప్రతి సారీ ఉత్తరంలో గంగి గురించిన విషయాలను వివరంగా తెలుపుతుంది. అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్న ఆ పాప ముచ్చట్లు వీళ్ళకు తెలుస్తుంటాయి. ఇంట్లోనే అక్షరాలు నేర్పిస్తున్నామని, చాలా హుషారు పాప అని చెప్తూ ఉంటారు. అమ్మమ్మ తాతయ్య ఆ తర్వాత కొంతకాలానికి గంగి తల్లి ఇర్మె చనిపోతుంది తల్లిలేని పిల్లయిందని ఆ గంగి గురించి బాధపడుతుంది. అట్లా మొత్తంగా ప్రతిసారీ తన చిన్నారికి రాసే ఉత్తరంలో గంగి ఎట్లా పెరుగుతుంది. గంగి తల్లిని ఎట్లా కోల్పోయిందీ చివరకు 11 ఏండ్ల గంగి కూడా ఉద్యమానికి, విప్లవకారులకు సహాయం చేస్తూ ఎట్లా పోలీసుల దౌర్జన్యానికి బలైందో తెల్పుతుంది. ఇట్లా కథ చదువుతున్నంత సేపూ మన కళ్ళముందు ఆ తల్లి చిన్నారి మధ్యనున్న ఆత్మీయ బంధం, పసిపిల్ల గంగి అమాయకత్వం, ధైర్యం, విశ్వాసం, ప్రేమ అన్నింటినీ మనకు కళ్ళముందుంచుతుంది రచయిత్రి. అంతేకాదు ఆ ఉత్తరం ఎప్పటికి చదివినా బిడ్డ పెరుగుతున్న ఈ సమాజం తెలుసుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయాలను అద్భుతంగా వివరిస్తుంది.
ఈ కథ ఇద్దరు మహిళలు, తల్లులు, విప్లవకారిణుల హృదయాలను మనసులను ఎంతో చక్క గా తీర్చిదిద్దుతుంది. ఒక ఆదివాసీ మహిళకు ఉండే ధైర్యం తెగువ ఇర్మెలో, గంగిలో కూడా కనిపిస్తుంది. మొత్తంగా కథలో మహిళలలో ఉండే సున్నితమైన అనుభూతులు స్పందనలతో పాటుగా మహిళలలో ఉన్న విశ్వాసం, తెగువ కూడా కనిపిస్తాయి. పోరాటంలో, ఆకాశంలో సమాజంలో సగభాగమైన మహిళలు ఆవిష్కృతమవుతారు.
పుట్టిన రోజున కొడుకుకు ఇచ్చిన కానుక ఒక ఉత్తరం, ఒక సందేశం, ఒక కర్తవ్యం. పుట్టినరోజు తెలియని లక్షలాది మంది పిల్లల కోసం జాలరన్నల పిల్లలకు వాళ్ళకు వాళ్ళ తండ్రులకు జరుగుతున్న అన్యాయం పట్ల ఒక అవగాహన కలిగించే పని సాగరన్న చేస్తాడు. అందుకోసం రాజు, రత్నం అని ఒక కథ చెప్తాడు. రాజు రత్నాన్ని ఎట్లా దోచుకుంటున్నడు ఎట్లా మోసం చేస్తున్నాడో వివరిస్తాడు. మెల్లమెల్లగా రత్నంకు కథలో చైతన్యాన్ని కలిగిస్తూ, పిల్లలకు చైతన్యం కలిగిస్తాడు. అట్లా వాళ్ళు జాలర్లుగా వాళ్ళను దళారీలు ఎట్లా మోసం చేస్తున్నారో చెపుతాడు.
కథ పూర్తయ్యేసరికి ఆ పిల్లలకు తిరగబడాలి, న్యాయం కోసం పోరాడాలి అనే అవగాహన కలిగిస్తాడు. జాలర్ల పిల్లల జీవన స్థితిగతుల గురించి తన కొడుక్కు ఉత్తరం రాస్తుంది తల్లి. పుట్టిన రోజంటే పండగ చేస్కోవడం కాదు పుట్టినందుకు మన జీవితానికి అర్థం ఉండాలి. ఇప్పుడు నువ్వు చిన్నవాడివే కానీ పెద్దవాడయ్యాక ఇవన్నీ అర్థం చేసుకుంటావనే ఆశతో ఈ కానుక తల్లి రాసిన ఉత్తరమే ఈ చిరుకానుక అంటూ మిడ్కో మనకు అందించిన చిరు కానుక.
‘‘యామిని’’ రాసిన అమ్మప్రేమ అమ్మల కోసం ఒక సభ జరుగుతుంది. ఆ సభలో దండకారణ్య మహిళా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి విశేష కృషి చేసిన అమరులైన మహిళల ఫోటోల ప్రదర్శన అక్కడ ఉంటుంది. ఆ ఫోటోల్లో ‘‘యోగిత’’ ఫోటో ఉంది. ఆ యోగిత వాళ్ళ అమ్మ ఆ మీటింగుకు వచ్చింది. ఆమెనే రామ్‌కో దీదీ. ‘‘ఎప్పటికీ మరిచిపోలేని మధురాను భూతి కలిగించే కరచాలనం చేసింది. అదే చివరిదవు తుందని ఊహించనే లేదు’’ అనుకుంటుంది రామ్‌కో దీదీ. తల్లీ బిడ్డల మధ్య ఉన్న సున్నితమైన భావాలను చిత్రించింది రచయిత్రి.
రామ్‌కో దీదీ బిడ్డ యోగిత రామ్‌కో దీదీ భర్త అడవిలో పోలీసుల దాడులు తట్టుకోలేక ఉద్యమంలోకి వెళ్ళిపోతాడు. కొంత కాలానికి రామ్‌కో దీదీ కూడా వెళ్తుంది. ఆమెకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఆ కూతురే యోగిత. తొమ్మిదేండ్ల యోగితను వదిలేసి వచ్చింది రామ్‌కో దీదీ. కొంతకాలానికి యోగిత కూడా ఉద్యమంలో రిక్రూట్ అయింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తల్లీ బిడ్డలు కలుసు కునేవాళ్ళు. కలిసి ఒక్క దళంలో కూడా పచి చేసారు. అట్లాంటి సమయంలో తల్లి కిట్టు తాను పట్టుకునేది తల్లికి సహాయం చేసేది. తర్వాత కొంత కాలానికి ఖోబ్రామెండ గ్రామ అంచుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో ఒక ఐదుగురు కామ్రేడ్స్ చనిపోయారు. వాళ్ళల్లో ‘‘యోగిత’’ కూడా ఉంది. ఆ వార్త విన్న తల్లి తాను అపురూపంగా దాచుకున్న యోగిత ఉత్తరం తీసి చదువుకుంటుంది. తల్లిదండ్రులను జాగ్రత్తగా ఉండమని, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పిన ఉత్తరం అది. నిజంగా ఆ తల్లికి ఆ వార్త ఎంత అశనిపాతంలా తగులుతుంది. ఎవరైనా ఊహించగలరా, కానీ ఆ తల్లి బిడ్డ ధైర్యాన్ని తలుచుకొని మురిసిపోయింది. ఆ ఎన్‌కౌంటర్లో పవన్ దాదాను కాపాడడానికి ఆమె చేసిన వీరోచిత పోరాటాన్ని తల్చుకొని ఉప్పొంగి పోయింది.
ఆ తల్లికి యోగితలాంటి పుత్రికను చూసి నింగినేల జయించినంత గర్వంగా ఉంది. సోమ్లి కూడా అట్లాంటి ఇంకొక తల్లి. తనతో పాటు ఉంచుకునే పరిస్థితి లేక మంగ్లిని వేరే దగ్గరికి పంపించింది. అప్పుడు ఆ తల్లీ బిడ్డల పరిస్థితిని నిజంగా ఒక తల్లి హృదయం మాత్రమే గుర్తించగలుగుతుంది. అంతేకాదు కనిపించిన ప్రతి పిల్లలో మంగ్లిని చూసుకుంటుంది. తల్లిప్రేమ అంటే ఏమిటో ఉద్యమ జీవితం గడుపుతున్న సోమ్లి లాంటి వారిని బట్టి అర్థమవుతుంది.
జాగేష్ వాళ్ళ అమ్మకు వాడంటే ఎంతో ప్రేమ కానీ వాడు ఊహించని నిర్ణయం తీసుకున్నప్పుడు అందరి అమ్మల్లా కాకుండా వారిని ప్రోత్సహించింది. తన కొడుకులాంటి కూతుళ్ళను కొడుకులను చూసి వారిలో తన కొడుకును చూసుకునేది. వాళ్ళందరికీ వంట చేసి పెట్టి, తన కొడుక్కి పెట్టినంత సంబరపడేది. అట్లాంటి అమ్మలు ముఖ్యంగా ఉద్యమానికి ఎంత అవసరమో తెలిపే కథ. యోగిత, జాగేష్‌ల లాంటి అమరులను కన్నటువంటి అమ్మల ప్రేమలు ఎంత గొప్పవో తెలిపే కథ ఇది.
బాలీ రాసిన అనువాద కథ మున్నీ. ఈ కథను సాధన అనువాదం చేసింది. ఈ మున్నీ ఒక ఐదారేళ్ళ చిన్నారి. ఇది ఒక వాస్తవ ఘటన అడవిలో తిరుగుతున్న దళానికి ఒక చిన్నపిల్ల తారసపడుతుంది. ఆ అమ్మాయి ఎక్కడ తప్పిపోయిందో అని దళం ఆ పాప తల్లిదండ్రులు, ఊరు వివరాలు అడుగుతారు. ఆ పాప మీ దగ్గరికే వస్తానని మీతోనే ఉంటానని చెప్తుంది. తల్లి చనిపోయిందని, తండ్రి వేరే పెళ్ళి చేసుకున్నాడని, సవతి తల్లి సరిగా చూసుకోలేదని, చాలా పని చేయాల్సి వచ్చేదని, ఆ కష్టానికి తట్టుకోలేక మామ ఇంటికి వెళ్ళానని, అత్తకూడా సరిగ్గా చూస్కోలేదని, అందుకే మీ దగ్గరికి వచ్చానని చెప్తుంది. వాళ్ళకు అర్థం కాదు. ఇంత చిన్న పిల్లను ఎట్లా తిప్పుతాం మనతో అనుకుంటారు. కానీ మున్నీ ఒప్పుకోదు. వాళ్ళతో పాటు ఒక చిన్న కిట్టు వేసుకొని తిరుగుతుంటుంది.
ఝార్ఖండ్ లో గెరిల్లా జోన్‌లో జరిగిన వాస్తవ ఘటనకు ప్రతిరూపమే ఈ కథ. దళంతో పాటు ఊర్లు తిరుగుతూ వాళ్ళకు కూడా చిన్న చిన్న సహాయాలు చేస్తుంటుంది. అంతే కాదు ఎప్పుడన్నా శత్రువు దాడి చేస్తే తిండి దొరకకపోయినా ఆకలిని కూడా ఓర్చుకుంటుంది. ఆ పాపను చూసి దళ సభ్యులు అందరూ ఆశ్చర్యపోతారు. కానీ ఆ పాపకు మున్నీకి మాత్రం ఇవేవీ ఇబ్బంది కలిగించవు. పైగా చాలా ఇష్టంగా నవ్వుతూ దళంతో పాటు గడుపుతుంది. ముఖ్యంగా ఇంతకు ముందు కన్నా ముఖ్యంగా తనకొక గుర్తింపు, ప్రేమ ఆప్యాయత ఒక మనిషిగా గుర్తింపు ఇవన్నీ మున్నీకి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఆమెకు తన కుటుంబ సభ్యులు గుర్తురావడం లేదు. ఒక వ్యక్తిత్వమున్న కొత్త మనిషిగా ఎదుగుతుంది. మున్నీలాంటి ఆడపిల్లల వ్యక్తిత్వం దళసభ్యుల మధ్య ఎట్లా ఎదుగుతుందో ఈ కథ చాలా స్పష్టంగా వివరిస్తుంది.
షహీదా రాసిన పుత్రికోత్సాహం కథలో సాగర్, భవాని ఉద్యమంలో ఉన్నారు. చర్చల సమయంలో వచ్చిన వెసులుబాటు వల్ల అందరూ తమ కుటుంబ సభ్యుల్ని కలుసుకుంటున్నారు. అట్లానే సాగర్ వాళ్ళ అమ్మనాన్నను తీసుకొని వాళ్ళ పదహారేండ్ల కూతురు కూడా వచ్చింది. వేరే ప్రాంతానికి మారే ముందు ఒకసారి కలవాలనుకుంటారు. మానస వాళ్ళ అత్త కూతురు లలిత దగ్గర పెరుగుతుంది. అడవిలో దళంలో పనిచేస్తున్న సాగర్, భవానీల కూతురు మానస. చిన్నప్పుడే పాపను సాగర్ వాళ్ళమ్మ వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అప్పుడప్పుడూ విషయాలు తెలుస్తున్నా, పెరుగుతున్న పాపను చూడాలని అప్పుడప్పుడూ అనిపిస్తుంది. చర్చల తర్వాత వచ్చిన వెసులు బాటు వల్ల వాళ్ళిద్దరూ ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారిపోతుండడం వల్ల ఒక్కసారి తల్లిదండ్రులను పాపను చూడాలని అపాయింట్‌మెంట్ పెడతారు.
ఇంటర్మీడియట్ చదువుతున్న తమ బిడ్డను తీసుకొని తల్లిదండ్రులొస్తారు. ఇద్దరి ముఖాల్లో కూతుర్ని చూస్తున్న సంతోషం కళ్ళల్లో మెరుస్తుంది. అయితే ఉద్యమానికి అంకితమైన వాళ్ళుగా బిడ్డ ఎట్లా ఎదుగుతుందో, ఏ ప్రభావాలు పడుతున్నాయో తెలుసుకోవాలనిపిస్తుంది. బిడ్డ తాను డాక్టరవ్వాలనే కోరికను వ్యక్తపరిచినప్పుడు ఇద్దరికీ మనసులో ఆనందం కానీ ఒకపక్క ఇప్పటి కార్పోరేట్ డాక్టర్ల లాగా డబ్బుల కోసమా అనారోగ్యంతో ఉన్న ప్రజలకు సేవ చేయడం కోసమా తను బిడ్డ చదవాలనుకుంటుందని తెలుసుకుంటారు. తమ బిడ్డ మానస అభిప్రాయాలు కొంత స్పష్టంగా ఉండడం చూసి ఆనందపడుతారు తాము అనుకున్నట్టుగా తమ లాగా పూర్తి కార్యకర్త కావాలని కాకున్నా కొంతైనా ప్రజలకోసం పని చేయాలనే ఆకాంక్షను మానస ముందు వెలిబుచ్చుతారు.
ఆ తర్వాత వీళ్ళు వేరే ప్రాంతానికి మారిపోతారు. ఆ ప్రాంతం అంతకుముందు సాగర్ పనిచేసి వెళ్ళిపోయిన ప్రాంతమే అక్కడి సంగతులన్నీ తెలిసిన కామ్రేడ్ పద్మతో మాట్లాడుతుంటాడు. అప్పుడు ఒక కామ్రేడ్ శీనన్న ఉండే వాడని, అతడు అమరుడయ్యాడని, వాళ్ళ పాప గంగ అని ముద్దుగా ఉండేది, నేను ఎత్తుకునే వాన్ని అంటూ ఆ మంచి జ్ఞాపకాలను తలుచుకుంటుంటాడు. అది విన్న పద్మ ‘‘గంగ’’ గుర్తుందా ఇప్పుడు చూస్తావా అంటుంది. ఆ ఎందుకు చూడను తప్పకుండా చూస్తాను అంటాడు. అప్పుడు వెంటనే రేపు నువ్వు వెళ్తే దళం దగ్గర కలుస్తుంది అంటుంది. అప్పుడు సాగర్ ఆశ్చర్యపోతూ అవునా ఆ గంగ ఇప్పుడు దళ కమాండరా అని ఆశ్చర్యపోతాడు.
అమరుడైన శీనన్నను, తాను ఎత్తుకొని పెంచిన గంగను, ఆనాటి సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటాడు. తాను ఎత్తుకొని పెరిగిన గంగ దళకమాండర్ అయిందనే సంతోషాన్ని ఆపుకోలేక భవానికి చెప్తూనే ఉంటాడు. అతని పుత్రికోత్సాహాన్ని చూసి భవాని, పద్మ ఆశ్చర్యపోతుంటారు. విప్లవోద్యమంలో పనిచేసేవారికి ఉండే ప్రేమలు, మమకారాలు, తమకు ఇష్టమైనవారు ఉద్యమంలోకి వస్తే ఇంకా పెరుగుతాయని తెల్పుతుందీ కథ. తామెత్తుకుని పెంచిన పిల్లలు తమ మార్గంలో పయనిస్తుంటే ఆ గర్వమే వేరు ఆ సంతోషమే వేరు. అట్లాంటి పుత్రికోత్సహాన్ని గురించి తెల్పుతుందీ కథ. కథ మొత్తంగా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండవలసిన సున్నితమైన ప్రేమ, సాన్నిహిత్యం, సమాజం పట్ల ఉండవలసిన అవగాహన కలిగించడం వంటి విలువలెన్నింటినో ఈ కథ వివరిస్తుంది.
మొత్తంగా ఈ 8 కథలు ఉద్యమంలోని తల్లులు, తండ్రులు పిల్లలు కేంద్రంగా సాగుతాయి. పిల్లల్ని కనకుండా ఉండడం కంటే పడే కష్టాలు, కన్న తర్వాత పెంచే వాళ్ళ ప్రేమలు, వాళ్ళు పెద్దగవుతున్న క్రమంలో మంచి మనుషులుగా ఎదుగుతున్నారా లేదా ఆనే ఆలోచనలు వాళ్ళు కూడా దళంలోకి ఉద్యమంలోకి వస్తున్నారనే సంతోషాలు, తాము వదిలేసి వచ్చిన తల్లిదండ్రుల బాధ్యతలను ముసలితనంలో నిర్వర్తించే మనవరాళ్ళు ఇన్నిన్ని కథాంశాలతో ఈ అమ్మతనం కథలు సాగాయి. నిజంగా ఈ ఎనిమిది కథలను ప్రతి ఒక్కరూ చదివి ఉద్యమం, ఉద్యమ జీవితం అంటే ఎన్నెన్ని త్యాగాలతో పాటుగా తమ రక్తం పంచుకుని పుట్టిన పిల్లల్ని త్యాగం చేయడం ఎంత కష్టమైన విషయమో గ్రహిస్తారు. ఉద్యమ జీవితంలో ఉన్న ఆటుపోట్లు ముఖ్యంగా స్త్రీలు పడే మనోవేదన స్పష్టంగా అర్థమవుతాయి.
(ఇది అజ్ఞాత రచయిత్రుల కథా సంకలనం ఆరు సంపుటాలుగా వచ్చిన విరసం ప్రచురించిన వియ్యుక్క కథలలోని ఎనిమిది కథల గురించిన సమీక్ష).