ఢల్లీ కంటే గన్నవరమే అపురూపమట. చాల మందికి అట్లా అనిపించింది. అంతే మరి. రాజుకంటే రాజును నిలబెట్టినవాడే ఘనుడు.  భూస్వామ్యంలో ఇది చెల్లుబాటవుతుందా? ప్రజాస్వామ్యంలోనే సాధ్యం. తరచూ ప్రజాస్వామ్యం సాధించే విజయం ఇదే.

జూన్‌ 12వ తేదీ ప్రమాణ స్వీకార వేదిక మీద కనిపించినంత ఆహ్లాదంగా చంద్రబాబు అంతకముందెన్నడూ కనిపించలేదని ఎవరో అన్నారు. నరేంద్రమోదీ కూడానట. వేదిక మీద ఆ ఇద్దరూ  ఎన్ని ముచ్చట్లు కలబోసుకున్నారో. ఎంతగా  చిరునవ్వులు చిందించారో. అధికార ప్రదర్శన తప్ప మరేమీ తెలియని ప్రధాని మమతానురాగాలను ఎంతగా ప్రకటించాడో. తాను ఒక్కడే తప్ప మరెవరినీ పక్కన భరించలేని వ్యక్తి అంత మంది మధ్య ఎంత సరదాగా గడిపాడో. తన సర్వంసహాధికారాన్ని మాత్రమే గుర్తించగల మోదీ ఇతరుల అధికారానికీ ఎంతగా కైవారం చేశాడో.

ఎంత విచిత్రం. నాయకులదేముంది? ఎప్పుడు ఎక్కడైనా ఉంటారు. ఎట్లా అయినా ఉంటారు. ఏ వేషమైనా కడతారు. అందరినీ ఇంత విచిత్ర విన్యాసంలో భాగం చేసిన మన ప్రజాస్వామ్యానికి కదా జేజేలు పలకాల్సింది! ఆలింగనాలు, కైమోడ్పులు, ప్రశంసలు, పాదాభివందనాలు, కన్నీటి కృతజ్ఞతలు, ఒకరిపట్ల మరొకరికి అంతులేని మన్ననలు.. చూసి తరించవలసిన దృశ్య పరంపర.

అమరావతి నిర్మాణానికి పిడికెడు మట్టి, కాసిని నీళ్లు మాత్రమే ఇచ్చాడని మోదీ మీద చంద్రబాబు అప్పట్లో ఫీుంకరించాడు. అయినా మోదీ  ఖాతరు చేయలేదు. చంద్రబాబును అధికారంలోంచి లాగి పారేద్దామా? లేదా? అని పవన్‌ ఉర్రూతలూగేలా నడివీధుల్లో ప్రసంగించాడు. అదే జనసేన తక్షణ కర్తవ్యం అని పిలుపు ఇచ్చాడు. ఆ మాటలకు చంద్రబాబు కనీసం నవ్వుకోనైనా లేదు. అంతగా పవన్‌ను చిన్నబుచ్చాడు.  ఇక పురందరేశ్వరికీ, చంద్రబాబుకూ మధ్య కుటుంబ కలహాలు అందరికీ తెలిసిందే. సినిమా ప్రపంచంలో నందమూరి ఫ్యామిలీకి, చిరంజీవి కుటుంబానికీ మధ్య ఎన్ని స్టంట్లు నడిచాయో అటూ ఇటూ అభిమాన బృందాలకే అందరికంటే బాగా తెలుసు. సినిమాకంటే ఈ వినోదాలే తెలుగు ప్రజలను రసవత్తరంగా అలరించాయి.

అన్నీ పక్కకుపోయాయి. అందరూ కొత్త పాత్రలు ధరించారు. ఒకే వేదిక మీదికి వచ్చారు. ఒకే స్క్రిప్ట్‌తో రంగస్థలాన్ని అలరించారు. ఎవరి పోర్షన్‌కు వాళ్లు న్యాయం చేశారు. లెక్కలేనన్ని భావోద్వేగాలు ఒలికించారు. అంతులేని ఆనందాలు చిలికించారు. అంతా ప్రజల కోసమే. ఇదీ ముక్తాయింపు. కాకపోతే మళ్లీ పాత మాటలు ముందుకు వచ్చాయి. స్వర్ణాంధ్రప్రదేశ్‌. నవ్యాంధ్ర నిర్మాణం. ఇరవై ఏళ్ల వెనకబడిన రాష్ట్రాన్ని పాతాళం నుంచి బైటికి తీసే ప్రయత్నం. దీనికంతా కేంద్రం అమరావతి.

ఆరోజు  కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని ముఖ్యమంత్రిగా చంద్రబాబు వందల వేల ప్రకటనలు చేశాడు. ఇప్పుడు లోకేష్‌ ప్రత్యేక హోదా అవసరం లేదని తేల్చేశాడు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం డబ్బులు ఇస్తుందని మోదీ తరపున చెప్పేశాడు. టీడీపీ ఏది చేసినా రాష్ట్రం కోసమే.. ప్రజల కోసమే.. చంద్రబాబు ఈ మాట ఎన్నిసార్లు  చెప్పి ఉంటాడు? కానీ కేంద్రం నుంచి ఒక్క హామీ లేకుండా  ఎన్‌డీఏలో భాగమయ్యాడు. మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాడు. పదవుల పందేరంతో సరిపెట్టుకున్నాడు. పైగా ప్రజల మనిషిని అని మళ్లీ చెప్పుకున్నాడు.

గత కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక రాజకీయ వ్యాఖ్య ప్రచారంలో ఉండిరది.  తెలుగుదేశం, వైసీపీ తమ గెలుపు కోసం ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయా? లేక కేంద్రంలో బీజేపీ గెలుపు కోసం తలపడుతున్నాయా? అని. అన్నట్లే అయింది. కాకపోతే ఫలితాల్లో చిన్న తేడా కొట్టింది. చెరికొన్ని సీట్లు బీజేపీకి ఇచ్చి విధేయతను చాటుకొనే అవకాశం రాలేదు. పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు ఆ చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించారు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌ ‘బలమైన’ రాష్ట్రం అనే పరిశీలన కూడా ఉండిరది. అక్షరాలా అది నిజమైంది.

ఇదీ గన్నవరం దృశ్యపరంపరలోని అంతర్లీన అర్థం. అందుకే దానికి ఢల్లీిలో మోదీ ప్రమాణ స్వీకారానికంటే ఎక్కువ ఆకర్షణ. రజనీకాంత్‌, చిరంజీవి ప్రధానితో ‘చేతులు’ కలపడం ఆదనం.

ఆకర్షణ సరే. వాళ్లందరి స్పష్టత చూడండి. ఇతరులకు ఇది ఉందా? సందేహం. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తే బాగుంటుందో కలలు కన్నారు కదా. దాని చుట్టూ ఎన్నెన్ని ఆశలు అల్లుకున్నారో కదా?  వీటి కోసం మొదట టీడీపీని నాన్‌ కమ్యూనల్‌ పార్టీ అన్నారు. అందువల్ల అది  ఎన్‌డీఏ నుంచి బైటికి రావాలనుకున్నారు. ఇండియా కూటమిలో చేరాలని ఆకాంక్షించారు. తద్వారా నరేంద్రమోదీ అధికారంలోకి రాకుండా చూడాలని కోరుకున్నారు. వాళ్లలో వామపక్ష ప్రగతిశీలవాదులూ ఉన్నారు.

కానీ ఏం జరగాలో అదే జరిగింది. బీజేపీకి ఉన్నట్లు మతతత్వ పునాది టీడీపీకి లేకపోవచ్చు. ఆ మాటకొస్తే మన దేశంలో చాలా ఎన్నికల పార్టీలకు బీజేపీలాగా హిందుత్వ ఫాసిస్టు స్వభావం లేకపోవచ్చు. స్వతహాగా మతతత్వాన్ని రెచ్చగొట్టకపోవచ్చు. కానీ మతతత్వానికి, లౌకికవాదానికి మధ్య పోటీ వస్తే ఏ పార్టీ ఎక్కడ నిలబడేదీ గ్యారెంటీ లేదు. మెజారిటీ మతతత్వం మైనారిటీ సమూహాల మీద దాడులు చేస్తే బాధితుల పక్షాన దృఢంగా నిలబడతాయనే భరోసా ఏమీ లేదు. మత రాజకీయాలు చేయడమంటే ఏమిటో, సెక్యులర్‌ రాజకీయాలకు కట్టుబడి ఉండటమంటే ఏమిటో చర్చించగల పరిణతి ఎన్నికల పార్టీలకు ఉన్నదని నమ్మగలమా? తెలుగు ప్రజల కళ్ల ముందు పుట్టి పెరిగిన టీడీపీ, జనసేనలు బీజేపీతో కలవడాన్ని ఎట్లా అర్థం చేసుకోగలం? కేవలం మోదీ అంటే భయమేనా? సీట్ల సంఖ్య పెంచుకోడానికేనా? అంత వరకే పరిమితం కాగలమా? మతతత్వానికి, సెక్యులరిజానికి తేడా తెలియకపోవడం అసలు కారణం కాదా? తెలిసినా అది పట్టించుకోవలసినంత ముఖ్యమైన విషయం కాకపోవడం కాదా?  ఇదంతా  బీజేపీ కూటమిలో చేరడమనే సాంకేతిక అంశమేనా?   దాని భావజాలంతో జనసేనకు, టీడీపీకి ఏకీభావం లేదా?  

కమ్యునల్‌, నాన్‌ కమ్యునల్‌ అని ఈ పార్టీలను సర్వత్రా వేరు చేయలేం. ఇది రాజకీయాల ప్రత్యేకత. బహుశా  సమాజమే ఈ దశను దాటలేదు. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య లక్షణమే ఇది. ఇదేదో దారి తప్పిన వ్యవహారం కాదు. అనుకోకుండా వచ్చిన విపత్తు కాదు. మన ప్రజాస్వామ్యమే అంత. ఇక తెలుగుదేశం పార్టీలో సెక్యులరిజాన్ని వెతకగలమా? 

గత పదేళ్లుగా దేశమంతా బీజేపీ మీద ప్రదర్శిస్తున్న ఆగ్రహం చంద్రబాబుకు తెలియదా? ఆ పార్టీ చేస్తున్న విధ్వంసం తెలియదా? జగన్‌ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడని తెలుసు కదా. ఆ పని అంతకంటే పెద్ద ఎత్తున మోదీ చేస్తున్నాడనే విమర్శ చంద్రబాబు దాకా పోలేదా?  ఆ పార్టీ మతతత్వ రాజకీయాల గురించి ఆయనకేమీ తెలియదని అనుకోవాలా? చాలా స్పష్టంగా తెలుసు. టీడీపీకి హిందుత్వ ఫాసిస్టు భావజాల పునాది లేకపోవచ్చు. అది ఉన్న బీజేపీతో చెలిమి చేయడానికి మాత్రం చంద్రబాబుకు ఏ అభ్యంతరమూ లేదు. మరి ఇప్పుడు ఏది కమ్యునల్‌? ఏది నాన్‌ కమ్యునల్‌? ఏది ఎంతో ఎట్లా తూకం వేయడం? ఈ శుష్క ప్రయత్నంతో సాధించేది ఏముంది?

ఎన్నికల పార్టీలకు మతతత్వం సమస్య కాదు. సెక్యులరిజం ఆదర్శం కాదు. దేన్ని పట్టుకొనైనా అధికారంలోకి రావడమే ముఖ్యం. రాజకీయాలేవైనా సరే.  అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యం. లేకుంటే అవి రాజకీయాలు కానేకావు. దాని కోసం ఏం చేస్తాయనేదే ముఖ్యం. చావో రేవో అన్నట్లు ఎన్నికల్లోకి దిగిన చంద్రబాబుకు ఈ స్పష్టత ఉంది. ఏం సాధించాలో ఆయనకు తెలుసు. ఎట్లా సాధించాలో తెలుసు. బీజేపీతో ఆయన చెలిమిని కేవలం ఎన్నికల వరకే చూడ్డానికి లేదు. మిగతావి ఎన్ని ఉన్నా నరేంద్రమోదీ స్థాపించాలనుకుంటున్న కార్పొరేట్‌ ఇండియాతో  చంద్రబాబుకు అంతులేని మమేకత ఉంది. ఆయన పైకి మాత్రమే స్వర్ణాంధ్ర అంటున్నాడు. నవ్యాంధ్ర అంటున్నాడు. ఆయన అసలు లక్ష్యం కార్పొరేట్‌ ఆంధ్రా. నిజానికి మోదీకన్నా ముందే చంద్రబాబు ఈ పట్టాల మీద ఉన్నాడు. దేశంలోనే ఈ ఘనత అందరికంటే ఎక్కువ ఇవ్వాల్సింది చంద్రబాబుకే.

హిందుత్వ ఇప్పుడు కేవలం సనాతన హిందుత్వ మాత్రమే కాదు.  బీజేపీ దానికి పూర్తి అర్థాన్ని ఇచ్చేసింది. అది  కార్పొరేట్‌ హిందుత్వ. మతతత్వంగా బైటికి కనిపించవచ్చు. కానీ దాని పనితీరు కార్పొరేట్‌ హిందుత్వ. చంద్రబాబుకు మతతత్వంతో పేచీ లేదు. పైగా ‘కార్పొరేట్‌ ఇండియా’ పట్ల వల్లమాలిన మోజు ఉన్నది.

ఇంతకూ ఈ ఎన్నికల్లో మోదీ అంచనాలన్నీ తారుమరయ్యాయి. అంతగా ఆయనకు ప్రజలు కళ్లాలు వేశారు. సంకీర్ణం తప్పలేదు. సంఖ్యాబలం ఉన్న ప్రతిపక్షం ఆ పక్కన ఉన్నది. ఇదంతా ఒక విజయమే. కానీ తరచి చూస్తే ఇంకో దృశ్యం కనడటం లేదా? ఒక పార్టీ, ఒకే ఒక్కడు పదేళ్లుగా సాగించిన ఫాసిజం ఇప్పుడు కూటమి ఫాసిజంగా మారలేదా? కామన్‌ సివిల్‌ కోడ్‌లాంటి వాటిని చంద్రబాబు సహా మిగతా కూటమిలోని పార్టీలు వ్యతిరేకిస్తాయా? సంఫ్‌ుపరివార్‌ రోజువారీ దారుణాలపట్ల ఈ పార్టీలకు అభ్యంతరాలు ఉంటాయా? ఇందుకు కదా.. మోదీని చంద్రబాబు అంతగా ప్రశంసల్లో ముచ్చెత్తింది. దేశానికి కావాల్సిన నాయకుడని కీర్తించింది. భుజాల మీద మోస్తున్నది. 

చంద్రబాబు పట్టాభిషేక సన్నివేశంలోని అర్థాలు..కార్పొరేటీకరణ. మతతత్వం. సినిమా ఆడంబరం. ఈ మూడిరటి ముచ్చటను అందరూ కలిసి ప్రజలకు వండి వార్చారు. గన్నవరం సభావేదిక అసలు ప్రాభవం ఇదే.

3 thoughts on “దృశ్యంలోని అర్థాలు

 1. Kotami..potthulu. All are monaalla muchhata.
  Wait and see sir
  Pawan deputy c.m —people call him. Devudu ???
  Babu worst politician in India
  Chiranjeevi — is governor —??? Jesus save my country
  ===========
  Buchireddy gangula

 2. Potthulu—alayi balayi—-just for few months
  Wait and see sir
  Babu worst politician in India
  Pawan — dy.c.m – changed uniform -people calling him devudu
  Governor post for chiranjeevi ???
  Jesus save my country
  ===================
  BUCHI reddy gangula

Leave a Reply