దేహాన్ని కవిత్వదీపంగా వెలిగించుకున్నవాడు. దేహం నిండానేకాదు.. అణువణువు మస్తిష్కపు నాఢులనిండా కవిత్వపు ప్రేమను నింపుకున్నవాడు. అతడి వాక్యం ప్రేమ, అతడి అక్షరం ప్రేమ, అతడొక ఎల్లలులేని కవిత్వపు ద్వీపంలో వొక ప్రపంచాన్ని నిర్మించుకున్నవాడు. ఈప్రపంచంలో ఎగరేసిన కవిత్వపు అరుణపతాకం. మాటల్ని మండిస్తాడు. మనుషుల్ని ప్రేమిస్తాడు. ఏతరమైనా అతడికవిత్వానికి, అతడి ఆత్మీయతకు బానిసవ్వాల్సిందే. కవిత్వపు సీసానిండా ప్రేమల్ని, ఆవేధనల్ని, ప్రాపంచిక పరిణామాల్ని నింపి వర్తమాన ప్రపంచపు వీధుల్లోకి విసిరేస్తున్నవాడు. కళ్ళనిండా కవిత్వపు కాంతుల్ని, గుండెనిండా ఈ కాలపుకవుల ప్రేమను నింపుకున్న  అసాదారణ కవితా యాత్రికుడు. వొకతరానికి శివుడు, మరొక తరానికి ప్రేమైక మానవుడు. అంతటి మహోన్నత కవిత్వపు  శిఖరం గూర్చి అతడి కవిత్వం గూర్చి మాట్లాడటమంటే ఒక పాసవ్వని పరీక్ష. అతడు మనందరికీ అందించిన  ఓడ్‌ టు లవ్‌ అను ప్రేమగీతాన్ని మనమూ ఆలపిద్దాం పదండి..

ప్రేమ:

మనం బతికున్నప్పుడు ప్రేమకావాలి/మనం పోయింతర్వాత కూడా యింత ప్రేమ/పిల్లలకి వాళ్ళ పిల్లలకి మిగలాలి/దీర్ఘంగా నాకళ్ళలోకి చూడు -ఏం కనబడుతుంది/సుడులు తిరుగుతున్న ప్రేమ`అలా చెంపమీదకి జారే ప్రేమ/మనుషులందరిని ప్రేమలో ముంచి బయటికితీయడానికి/యుద్దం చేయి`అవసరమైతే దేన్నయినా అడ్డంగా నరుగు/తుమ్మచెట్టు నుంచి తుంబంక ఉబికినట్టు/మనిషనే ఈ మాను  నుండి ప్రేమ ఉబకాలి.

ఇంతకంటే గొప్ప ప్రేమ ఎవరుకోరుకుంటారు. ఇంతకంటే మనుషుల్ని ప్రేమలో ఎవరు ముంచగలరు. మరింతకంటే ప్రేమను ఎవరు రాయగలరు. అసలీ ప్రపంచంలో మనుషుల మధ్య ప్రేమే ఉంటే ప్రేమనిలా చెప్పేవారా. మనుషుల మధ్య ప్రేమ అంతరిస్తుంది. మనిషుల మధ్య ఆగాధాలున్నాయి. ప్రేమ ప్రవహించని దేహాలున్నాయి. అసలీ మనుషులకు ప్రేమతో బతకడమే తెలీదనిపిస్తుంది. ఎంత తాత్వికంగా చెప్తాడు. సున్నితంగా సూదిలో దారాన్ని ఎక్కించినట్టు మనుషుల్లో ప్రేమను ఎక్కించే ప్రయత్నమెలా చేస్తున్నాడో చూశారా పై కవితలో..అది శివారెడ్డి అంటే…అయితే మనుషుల మీద నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. నమ్మకాన్ని, విశ్వాశాన్ని మనుషుల్లో కలగంటాడు. ఎలాగంటే..

ఎప్పుడూ దేనికీ చెక్కుచెదరని/మానవుడున్నాడు/మార్గాంతరం వెతికే మానవుడున్నాడు/మానవనిర్మితమైన జీవితముంది/ ప్రకృతికి ప్రతీక అయిన మనిషున్నాడు..

ఇలాంటి మనషులున్నారంటాడు. మనిషి ఉన్నా ఆ మనిషికి కావాల్సింది గుప్పెడంత ప్రేమ. జీవితాంతం మనిషిని మోసుకెళ్ళే ప్రేమ. ఆ ప్రేమే ఉంటే మనిషిలా ఉండడు కదా..ప్రకృతికి ప్రతీకగా మానవుణ్ణి పేర్కొనడం అనిర్వచనీయం కదా..అందుకేనా ఈ పుస్తకంలో మరొక చోట..

సమస్త ప్రకృతిని నింపుకున్న ఈ దేహం/రోదసి అంతా పరిభ్రమిస్తుంది..అంటారు..ప్రేమ ప్రకృతి రెండు మనిషికళ్ళు..ఇలాంటి మనిషిని అతడు కోరుకుంటాడు..

కవిత్వం

ఈ ప్రపంచంలో కవిత్వానికర్థం, నిర్వచనం ఒక్కరేమిటి ప్రతీ కవి చెప్తాడు. ఎవరిదోవలో వాళ్ళు..ఎవరి దృష్టిలో వాళ్ళు, ఎవరి దృకథంలో వాళ్ళు, ఎవరి అంతరంగంలో వాళ్ళు కవిత్వాన్ని చెప్తారు. ఇదంతా మామూలే..కాని శివారెడ్డి వృత్తం కవితలో..

ఒక వృత్తం గీశాను/దాని చుట్టూ తిరిగాను/ అది భూమండలమయింది/ ఒక చిన్న ఆకుని తెచ్చి గుండె మీద పెట్టి/ స్మరించాను/అది సముద్రమయింది/ఒక గింజను తెచ్చి/అరచేత్లిళి నాటి/ధ్యానించా/అది కవితయ్యింది.

ఎవరైనా ఇలా చెప్పారా..చెప్తారా. కవిత్వపు సారాన్ని ఈ నాలుముక్కల్లో చెప్పగలరా..ఎవరైనా కవిత్వాన్నిలా పునీతం చేయగలరా..అది శివారెడ్డికే సాధ్యం..మరి అలాంటి కవిత్వం రాసే కవికి నిర్వచనం ఇయ్యాలి కదా..అదీ చూద్దాం..

నా పక్క/పసిపిల్లాడి వాసనేస్తుందేమిటి?/ నాగది మొత్తం/ పచ్చిబాలింతలా మారిందేమిటి?/ ఈ గదిలో ఏమున్నాయి/అన్నీ పుస్తకాలే/ అన్ని దేశాల పుస్తకాలే/ నా మంచం మీద మూడొంతులు పుస్తకాలే/పురిటి వాసనేస్తున్న  నా మంచం/ నిజానికి యిదొక స్త్రీ గర్భం/ సాహిత్యం గర్భగుడి/ అయితే పుస్తకాల వాసన రావాలి/ ముక్కు వాసన రావాలి/ కానీ/ విచిత్రంగా పురిటి వాసనేస్తుంది/కవి ఎప్పుడూ పచ్చిబాలింతే!

కవిని ఇలా ఎవరైనా ఆలోచిస్తారా.కవిని ఇలా ఎవరైనా ఊహిస్తారా, కవి గూర్చి ఇంతగా ఎవరైనా అర్థం చెప్తారా..ఈయనకెలా సాధ్యం..బహుశా అతని నిండా ప్రేమ నిండి ఉండటమేనా..?మీరూ ఆలోచించండి.. మరి ఎలాంటి కవిత్వాన్ని ఈ కవి కంటున్నాడో చూద్దాం..

తల్లి నాకుతున్న దూడలాంటి పద్యాన్ని నే కన్నానా లేదు/ దానంతటకి అదే బయటపుడిరది/లోకం వింతగా చూస్తుంది/ గాలి విస్తుపోతుంది/ చావిడి మొత్తం పురిటి ఊయలై ఊగిపోతుంది.

తన కనలేదు..కానీ దానంతటదే ప్రసవించిందంటాడు. ఎంతగొప్ప పోలిక కదా..జీవితానికి ఎలా అన్వయించాడో కదా..జీవితంలో కవిత్వాన్నెలా భాగం చేశాడో కదా…ఇంత చెప్పినా..ఇన్నిన్ని అర్థాలు,  ఉటంకించినా ఊరుకుంటాడా..ఊరుకుంటే శివుడెలా అవుతాడు..కవీశ్వరుడెలా అవుతాడు..చూడండి..మరొక చోట..

నేను కవిత్వాన్ని పొదుగు చేశా/ఎవరైనా పిండుకోవచ్చు/ఎవరు పిండుకోకపోయినా/ఒత్తిడెక్కువై ధారలు ధారలుగా కారిపోతూ వుంటాయి/ నడిచినంతమేర పాల ధారల దారులు/త్రిమూర్తులు చిన్నపిల్లలై/వస్తారేమో నా పాలు తాగడానికి/లోకానికి పాలు కుడిపేందుకు /భూమ్మీదకు వచ్చిన కామధేనువు/ ఎండిపోయే ప్రసక్తే లేదు/పాలిచ్చేకొలది పాలధికమౌతాయి/అడక్కుండా ఇస్తాను పాలు/ లేవన్న ప్రసక్తి లేదు/ ఈ భూఖండమంతా తిరిగి/మేసొస్తుంటాను/ నాకాహారానికేమి తక్కువ/ప్రపచంమంతా నాదే/రాత్రినొక బందం చేస్తాను/పగటినొక బందం చేస్తాను/ ప్రకృతిలోని సమస్త మూలికల సారం/నాపాలలోనే/ సర్వారోగ్య సూత్రాలు మూలాలు నాపాలలోనే/ప్రపంచం మొత్తం/ఒక పసిపిల్లై/ నా పాలు తాగవచ్చు..

శివారెడ్డి కవితాక్షరాల పాలధార ఎంతతాగినా తనివితీరదు. ఎంతబాగా చెప్తాడు. ఎంత లౌల్యంగా చెప్తాడు.అన్వయాలు..అవ్యయాలు..దృష్టాంతాలు..ఇంకేవి లేని..ఇంకేవి అవసరం కాని కవిత్వ జీవనపాదాలతడివి.అందుకే శివారెడ్డి ఆధునిక కవిత్వానికి ఐకాన్‌. మరి కవిత్వమెలా ఉండాలి..కవిత్వాన్నెలా ఆస్వాదించాలి..కవిత్వపు లోతుల్నెలా వీక్షించాలి. అదీ చూద్దాం రండి…కవిత్వాన్నెలా వేడుక చేయాలో చూద్దాం రండీ..

కవిత్వం/నవలలా ఒక్క వూపులో/ఈ పక్క నుంచి ఆ పక్కకి చదివేదిగాదు-/కొంచెం కొంచెంగా ‘ఆరం ఆరంగా’/పిల్లలు బెల్లం తింటూ వూరిస్తున్నట్టు/అయిపోతుందేమోనన్నట్టుగా చప్పరించాలి/ఒక ఇమేజ్నో రూపకాన్నో -/బుగ్గన పెట్టుకుని ఆనందించాలి/నువ్వెంత లోతులకెళ్తే అంత ఆనందం/నాకొక పద్యం చాలు/రోజంతా చదువుకుంటానికి/బయట కూడా అవే మాటలు- కానీ/పద్యంలోకొచ్చాక కాంతిచక్రాలవుతాయి/పరిభ్రమించి పరిభ్రమించి ప్రాణం పోస్తాయి/ఎంత పాతబడితే అంత కొత్తదనం పొడుగాటి ఒక పద్యవాక్యాన్ని/పైపంచలా బుజానేసుకుని/పొలానికి బయల్దేరు/కవిత్వం దున్నే నాగలిలాంటిది/దున్నుతుంటే సీతమ్మ బయటపడుతుంది./అదొక వేడుక..

ఇంతకంటే కవిత్వం గూర్చి ఇంకేమి చెప్తాం..ఈ కవిత్వం నిండా ప్రేమ, కవిత్వం, తాత్వికత ఇలా ఎన్నో ఉన్నాయి..మరెన్నో వస్తువులు మన హృదయాల్ని పలకరించి పలవరించవచ్చు..ఎన్నో శిల్పసొగసులు అక్షరాలకు రంగులద్ది ఉండవచ్చు..కానీ..ఇవన్నీ ఉండాలంటే..మనిషి అసహనం లేకుండా ఉండాలంటే రాజ్యం బాగుండాలి..రాజ్యం ఎంత దుర్మార్గంగా వుందో కూడా చెప్తాడు..

మోదీ:

మోదీ ఎవరో మనందరికీ తెలుసు..మోదీ ఎలాంటి వాడో కూడా తెలుసు. మోదీ నిరంకుశరాజ్యంలో ప్రజలెలా ఉన్నారో కూడా తెలుసు..శివారెడ్డి మోదీ గూర్చి ఏమన్నాడో తెలుసా..

చిన్న మాట

మోదీజీ!/మిమ్మల్ని ఏం అడగటం లేదు ఒక ముద్ద, గుక్కెడు నీళ్లు ఒక పంచ, ఒక అరుగు ఒక గోసె, చేతికర్ర/మోదీజీ!చాలా చిన్న విషయాలు వీటిని హింస లేకుండా రక్తం చిందకుండా యివ్వగలరా?/మోదీజీ!

/మీ రాజ్యంలో రక్తమంటని యింత మట్టి యివ్వగలరా? కూచుని ధ్యానం చేసుకుంటానికి మూడడుగుల నేల యివ్వగలరా?/మోదీజీ! చాలా చిన్న విషయం..

ఈ ఒక్క కవిత చాలు కదా దుర్మార్గాన్ని చెబటానికి..ఈ ఒక్క కవిత చాలుకదా..రాజ్యం చేస్తున్న దురాగతల్ని ప్రశ్నించడానికి..కాని ప్రశ్నిస్తే ఊరుకుంటారా..ఉండరు..ఉండరుగాక ఉండరు..ప్రజల్ని నోరులేని మూగజీవాలుగా చేయడమే ఈ రాజ్యం లక్ష్యం..ఇంకా చూడండి..ఈ రాజ్యానికి వ్యతిరేకంగా రాసిన మరొక కవిత..తలలో అనే శీర్షికతో

తలలో/ధ్వనులుండటం మంచిది కాదని డాక్టరంటాడు-/ఆ ధ్వనులు వేరే ప్రపంచానికి/సంబంధించినవని ఆయనుద్దేశం/ తల నిశ్శబ్దంగా వుండటం మంచిదని /డాక్టర్లు, యోగులు చెబుతారు నిశ్శబ్దమైపోవటం మంచిదిగాదని /కవులూ కళాకారులూ కార్యకర్తలు చెబుతారు /ధ్వని తరంగాలు తరంగాలుగా లోన తలలో/ వ్యాపిస్తుంటే తల ఒక సంతూర్‌ వాదమవుతుంది /పిచ్చివాడి తల నిశ్శబ్దంగా వుంటుందా /ఎప్పుడూ ఎవడితోనో ఏదో యుద్ధం చేస్తూ వుంటుంది/ మూడు కాలాల్ని ముడివేసే పిచ్చివాడి తల/ఎప్పుడూ మజ్జిగ చేస్తున్న పాలకుండలా వుంటుంది/రాజ్యం నిశ్శబ్దాన్ని కోరుకుంటుంది./నిశ్శబ్దంగా వుండటం కంటే/పిచ్చివాడిగా వుండటం మంచిదేమో..

నిజమే మనల్ని రాజ్యం పిచ్చివాళ్ళను చేస్తుంది..నోరెత్తని మూగజీవాల్ని చేస్తుందనేమాటను విరమించుకుంటున్నాను. శివారెడ్డి చెప్పినట్లు..పిచ్చివాళ్ళనే చేస్తుంది..

ఈ కవిత్వం నిండా ప్రతిఅక్షరమూ కవిత్వమయ్యింది. చివరగా ఆయన చెప్పిన కవితావాక్యం చెప్పి ముగిస్తాను..దేహం కూడా పొయ్యి లాంటిదే..మండినంతసేపూ మండుతుంది..అంటారు..

కానీ శివారెడ్డి కవిత్వం నిరంతరం మండుతుంది..మండాలి..తాత్వికభూమిక ఏమున్నా..ఆరిపోని అగ్నిశిఖ శివారెడ్డి కవిత్వం..అంతే..ఇంతకంటే ఇంకేం చెప్పగలం

Leave a Reply