నాయిన భుజాలనెక్కి
మెడ చుట్టూ కాళ్లు వేసుకుని
దారిన ఎవరైనా పోతుంటే అచ్చెరువేకదూ
కొండలు, మిద్దెలు, పచ్చలు తొడిగిన చేలు
నే చూడలేనివన్నీ ఎంత బాగా అగుపిస్తాయో వాళ్లకు!
నాకులేని అదృష్టానికి దిగులయ్యేది…
నా తండ్రిని నేను చూడలేదు
ఒంటరి చింత చెట్టుకింద
జీరంగుల ఆకలితీరుస్తూనో
మసీదు గోడన చాకలి పూలు ఏరుతూనో
దిగులు దిగదీసుకునేవాణ్ణి
అనుకోకుండా కొన్ని చేతులు నన్నెత్తుకున్నాయి
పలకలు తెచ్చాయి పలుకులు దిద్దాయి
మాటలకు మురిసి ముద్దయ్యాయి
కొన్ని భుజాలు నన్నెక్కించుకున్నాయి
రంగురంగుల లోకం పట్టకంలో
పారదర్శకం అయ్యింది.
ఎత్తుకున్న ఈ తండ్రి…
పైకి చూస్తే ధిక్కారమూ
కిందికి చూస్తే కారణ్యమూ వుండాలన్నాడు
మట్టిని మరవొద్దన్నాడు
నెర్రెలిచ్చిన నేలా, పర్రెలిచ్చుకున్న బురద కాళ్లు చూపాడు
భూమే కాదు లోపటి బంగారమూ మనదేనన్నాడు
వాటిని కాపాడేకే అడవుంది
దానికి అండగా మన ముందామన్నాడు
తన పక్కటెముకను విల్లుచేసియిచ్చాడు.
అన్ని కాలాలు మనవి కాని
ఒకానొక క్షణాన భయపడి
అతని తలచుట్టూ చేతులు చుట్టినప్పుడు
వెచ్చదనపు ధైర్యం గుండెల్లోకి ప్రవహించింది.
కనక పోయినా ననుగన్న తండ్రి వొకడు
చెలిమినున్నాడన్న నిబ్బరమే నిలబెట్టింది
* * *
చీకటి జైలును బడిగా మార్చిన నా వుపాధ్యాయడా
మళ్లీ ఎన్నేళ్లకు చూశాను నిన్ను
మనుషులు కరిగి దుఃఖంపు నదులవుతున్నప్పుడు
మళ్లీ మళ్లీ నిన్ను చూసాను విన్నాను
నీ కాళ్ళను హృదయంలో నింపుకుని
మా పథానికి అడుగులై నడిచావు
ఇంతమందిని భుజాలపై మోశావు
మరణాన్ని ధిక్కరించిన నీ వెన్నెముక
శత సహస్ర పాదాలై మా దారిని వెలిగిస్తుంది.
ఇప్పుడిక్కడ తండ్రులను మోసిన శ్రవణులు కాదు
శ్రవణులను మోసిన తండ్రుల పాదాలు
దశరథ రాజ్యాన్ని ధిక్కరిస్తున్నాయి.
Related