పుస్తకం చదువుతుంటే పాలకులు ఇంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తించగలరు అనే భావన కలుగుతుంది. ఎందుకంటే ఈ సమాజ ఆరోగ్యానికి అవసరమైన గాలీ, నీరు, ఖనిజాలు, కలపను కాపాడుతూ అవి ఈ దేశ ప్రజలకు దక్కాలన్నందుకే ఆదివాసులు, మావోయిస్టులు ప్రభుత్వాలకు కంటగింపయ్యారు. ఆ వనరులను కాపాడటానికి పోరాడటం పాలకుల ఆగ్రహానికి కారణమైంది.  ఆదివాసుల కాళ్లకింద ఉన్న ఖనిజ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టడానికి చేసే ప్రయత్నంలో ఆదివాసులు, మావోయిస్టులు ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారిపోయారు. కాబట్టి వారిని అడవి నుంచి లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో జనవరి 1 నుండి  ‘ఆపరేషన్‌ కగార్‌’ (అంతిమ యుద్ధం) ప్రారంభించారు.

ఈ పుస్తకంలోని వ్యాసాలు కేవలం ఈ అంతిమ యుద్ధం గురించే కాకుండా, ప్రజలకు`ప్రభుత్వానికి మధ్య ఈ యుద్ధం ఎక్కడ మొదలైందో, ఎందుకు మొదలైందో, ఎట్లా సాగుతూ వచ్చిందో వివరించాయి. ఆదివాసుల మీద ప్రభుత్వానికి ఇక ‘అంతిమ’ యుద్ధమని తెగబడక తప్పని స్థితి ఎందుకు వచ్చిందో విశ్లేషించాయి. దీని కోసం   కొంచెం ముందుకు వెళ్లి చెప్పుకోవాలి. ఆదివాసీ  ప్రాంతాల్లో విప్లవోద్యమం ఒక నూతన, ప్రత్యామ్నాయ, మానవీయ సమాజాన్ని రూపొందించడంలో భాగంగా బీజ రూపంలో చేస్తున్న ప్రయత్నాలను  సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యాన్ని  ప్రభుత్వం పెట్టుకుంది. దీని కోసమే ఆపరేషన్‌ కగార్‌ తీసుకొచ్చింది.

ఈ అంతిమ యుద్ధాన్ని 2024, జనవరి 1న కొత్త సంవత్సరం రోజున ప్రభుత్వ బలగాలు బీజాపూర్‌ జిల్లాలోని మద్దు అనే గ్రామంపై దాడిచేసి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో  ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో తన ఇంటిముందు నిలుచున్న తల్లి చేతుల్లో ఉన్న మంగ్లీ అనే ఆరు నెలల పసిపాప కడుపులో నుంచి తూటా దూసుకుపోయి అక్కడికక్కడే మృతి చెందింది.  మావోయిస్టులు జరిపిన కాల్పుల కారణంగానే పాప మరణించిందని భద్రతా  బలగాలు అబద్ధపు ప్రచారం చేశాయి.

 ఆదివాసీ  ప్రజలపై పోలీసు బలగాలు కాల్పులు జరిపి  దీనికి ఎన్‌కౌంటర్‌ కథ అల్లారు. మావోయిస్టుల వల్ల పాప చనిపోయిందని అన్నారు. కానీ అక్కడ ఆదివాసులకు వాస్తవాల పట్ల పూర్తి స్పష్టత ఉంది. అక్కడ ఎంత భయానకమైన పరిస్థితి ఉందో ఆ తల్లి మాటల్లోనే ‘ఈ రోజు గడుస్తే అదే మాకు మంచిరోజు’ అంటుంది.  ‘ప్రభుత్వాలకు మా బతుకుల కంటే అడివిలోని ఖనిజ సంపదే ముఖ్యం. కాబట్టి మా పై పోలీసు క్యాంపులను  తెచ్చి మా బతుకులను చిద్రం చేస్తున్నార’ని ఆదివాసులు అంటున్నారు.

ఆపరేషన్‌ కగార్‌ మొదటిది కాదు, ఇది చివరిది కాదు అనే విషయం ఈ వ్యాసాల నిండా పరుచుకొని ఉన్నది. ఆపరేషన్‌ కగార్‌ కు ముందు చాలా ఆపరేషన్‌లు జరిగాయి. కాని దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది డబుల్‌ ఇంజన్‌ బిజెపి సర్కారు ఆధ్వర్యంలో జరగుతున్నది. ఇది ప్రారంభమైన ఆరు నెలల్లోనే 130 మందిని ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపారు. అందులో సగం మంది నిరాయుధులైన ఆదివాసులు. ఈ ప్రాంతంలో  ఇలాంటి సంఘటనల వల్ల  రక్తపు తడి ఆరడం లేదు. వరుసగా హత్యలు జరుగుతున్నాయి.

 2005లో బిజెపి ప్రభుత్వ అండతో కాంగ్రెస్‌ నాయకుడు మహేంద్రకర్మ నాయకత్వంలో ఆదివాసీల్లోని కొద్దిమంది యువకుల్ని లోబరుచుకొని సల్వాజుడుంను ఏర్పాటు చేశారు. సల్వాజుడుం ఆదివాసీ గూడేలపై పడి చేయని అకృత్యమంటూ లేదు. 2009లో ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ను అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించి ఉద్యమంపై దాడులకు పాల్పడిరది. 2017లో  ఆపరేషన్‌  ఆపరేషన్‌ సమాధాన్‌`ప్రహార్‌ అనే కొత్త అణచివేత రూపాలను ముందుకు తెచ్చారు. 2022లో ‘బస్తర్‌ ఫైటర్స్‌’ పేరుతో ఆదివాసీ యువకుల్ని బలగాల్లో చేర్చుకొని వాళ్ల వేళ్లతోనే వారి కంటిలోనే పొడిపిచ్చే ప్రయత్నం మొదలు పెట్టారు.

 ఇవ్వన్నీ పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయాయనే ఉద్దేశంతో 2024 జనవరి 1న నుండి ఆపరేషన్‌ కగార్‌ అనే అంతిమ యుద్ధాన్ని ఈ దేశ ప్రజలపై బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇది ఏకకాలంలో ఆకాశ మార్గంలో  డ్రోన్‌ల ద్వారా ఆదివాసీ గూడాలపై బాంబు దాడలు చేస్తున్నారు. పొలాల్లో పని చేసుకుంటున్న ఆదివాసులను పట్టుకెళ్లి కాల్చేస్తున్నారు.  ఉద్యమ కదలికలను కనిపెట్టి  ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. అంతే కాకుండా డ్రోన్‌ కెమెరాలతో ఆదివాసీ మహిళలు స్నానం చేస్తున్నప్పుడు ఫొటోలు తీసి వారికి చూపెట్టి మానసికవేదనకు గురిచేస్తున్నారు. ఈ అణచివేత సైనిక సంబంధమైంది మాత్రమే కాదు. దీని వెనుక ప్రధానంగా ఆర్థిక, రాజకీయ కోణాలున్నాయి. ఇందులో డబుల్‌ ఇంజన్‌ సర్కారు ప్రయోజనం, కార్పొరేట్ల ప్రయోజనం జమిలిగా ఉన్నాయని తెలుస్తుంది.

ఈ అణచివేతను ఇంత తీవ్రంగా అమలుచేయడానికి కారణం 2022 అక్టోబర్‌ 27, 28 తేదీల్లో సూరజ్‌కుండ్‌ చింతనా శిబిరంలో రూపొందించుకున్న ప్రణాళికే. ఈ పుస్తకంలో ఈ విషయాన్ని చాలా లోతుగా విశ్లేషించింది. ఈ సమావేశంలో  దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించి మావోయిస్టు రహిత భారత దేశంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  అందులో భాగంగానే ఆదివాసీ ప్రాంతాలో కొత్తగా పోలీసు  క్యాంపులు నిర్మిస్తున్నారు, ప్రతి ఐదు కిలోమీటర్ల దూరంలో వేలాది బలగాలతో క్యాంపులు పెట్టి అడవినంతా జల్లెడపడుతూ ఆదివాసులకు నిలువనీడలేకుండా చేస్తున్నారు. ఆదివాసీల ప్రాంతాల రక్షణ కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన 5వ, 6వ షెడ్యూల్‌ ప్రాంతంలోని గ్రామాల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రి పోలీసు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఆదివాసులకు రాజ్యాంగ రక్షణలనేవి అచ్చులో మాత్రమే ఉన్నాయి తప్ప ఎక్కడా అమలు కావడం లేదని పూర్తిగా ఈ కగార్‌ యుద్ధంతో తేటతెల్లమవుతున్నది. ఆదివాసీలపై వివిధ రూపాల్లో జరుగుతున్న దమనకాండను వ్యతిరేకిస్తూ  సైనిక క్యాంపులను ఎత్తివేయాలని నిరాయుధంగా గత నాలుగేళ్లుగా సిలింగేర్‌లో ఆదివాసులు   పోరాడుతున్నారు. తమ ఆరాట పోరాటాలను వ్యక్తీకరించడానికి ‘మూలవాసీ సాంస్కృతిక కళా మంచ్‌’ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్థ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ మీద జరుపుతున్న దోపిడీ రూపాలను  వ్యక్తం చేస్తూ తమ హక్కులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ పుస్తకం కగార్‌ వెనుక ఉన్న కార్పొరేటీకరణను చాలా వివరంగా చర్చించింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో 26 రకాలైన ఖనిజ సంపద ఉంది.   దీన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడానికి కాంగ్రెస్‌, బిజెపి ప్రభుత్వాలు 104 ఎంఓయులను చేసుకున్నాయి. దీన్ని అమలు చేయడానికే లక్షలాది సైనిక బలగాలతో ఆదివాసీ ప్రాంతాల్లో మానవ హననానికి పాల్పడుతున్నారు. ఈ మారణకాండ వెనుక ఉన్న కీలకమైన రాజకీయార్థిక విషయం ఇది. ఈ విషయం ఎంత అర్థం చేసుకుంటే అంతగా ఈ యుద్ధం ఎందుకు జరుగుతున్నదో స్పష్టమవుతంది.

అందుకే ‘దేశం కార్పొరేట్లకు’ అనే ఈ పుస్తకం ప్రధానంగా దీని మీద కేంద్రీకరించింది. ఆదివాసీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదంతా ఈ దేశ ప్రజలందరిది కాబట్టి ఆ వనరుల రక్షణ కోసం దేశ ప్రజలందరు ఉద్యమించాల్సి ఉంది. ఇది ఒక్క ఆదివాసీ ప్రజల బాధ్యత మాత్రమే కాదు. కాబట్టి ఈ దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దక్కకుండా ఎదురొడ్డి నిలుస్తూ తమ ప్రాణాల్ని బలిపెడుతున్న వారి పక్షాన ప్రజలంతా నిలవాల్సి అవసరం ఆసన్నమైంది. ఆ పోరాటాన్ని మన పోరాటంగా స్వీకరించి ముందుకుపోవాల్సిన సమయం ఇది.

Leave a Reply