నేటి బాలలే రేపటి పౌరులు. బాలల ఆహారం, ఆరోగ్యం, విద్య, మానసిక వికాసానికి తగిన చర్యలు తీసుకోకపోతే ఆ దేశం అభివృద్ధిలో అట్టడుగు స్థాయికి దిగజారుతుంది. ప్రస్తుతం మన దేశంలోని బాలలు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నారు. దేశం 2021లో ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న 7 లక్షల మంది బాలలు చనిపోయారు. వీరిలో 5 లక్షల మంది (70 శాతంకు పైగా) పోషకాహార లోపంతో చనిపోయారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. తల్లి ఎదుర్కొంటున్న పోషకాహార లోపం పిల్లల మరణాలకు కూడా కారణమౌతున్నది. ఇదేకాలంలో ప్రపంచ వ్యాపితంగా 47 లక్షల మంది పిల్లలు మరణించారు. వీరిలో 24 లక్షల (50 శాతంకు పైగా) మంది మరణాలకు తల్లి, పిల్లలకు పోషకాహారం అందకపోవటమే కారణం. పోషకాహార లోపం వలన ప్రపంచంలోని ఇతర దేశాలలో మరణిస్తున్న బాలల కన్నా భారతదేశంలోని బాలలు 25 శాతం అదనంగా చనిపోతున్నారు.ఎథనాల్ ఉత్పత్తి కోసం 23 లక్షల టన్నుల ఆహారధాన్యాలను కేటాయిస్తూ ఈ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. దీనితో ఎథనాల్ ఉత్పత్తికి ఆహారధాన్యాలను వినియోగించటంపై 2023 జూలైలో విధించిన నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది.
పౌష్టికాహార లోపం ప్రబలమైన భారంతో మనదేశం గణనీయమైన సవాలును ఎదుర్కొంటోంది. ఈ సమస్య దేశంలోని సామాజిక, ఆర్థిక సాంస్కృతిక వ్యత్యాసాల సంక్లిష్ట మిశ్రమంతో ముడిపడి ఉంది. ఒక వ్యక్తి వయసుకు తగ్గ పోషకాలను తీసుకోకపోవడం దేశంలోని దారిద్య్రాన్ని సూచిస్తోంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం పోషకాహారం అందించే విషయంలో 2023 మనదేశం 111వ స్థానంలో నిలిచింది. ‘‘ఒక వ్యక్తి ఏడాది వ్యవధిలో రోజువారీ కనీస ఆహారశక్తి అవసరాలను తీర్చడానికి తగినంత ఆహారాన్ని పొందలేకపోవడాన్ని పౌష్టికాహార లోపం’’ అని అంతర్జాతీయ సంస్థలు నిర్వచించాయి. శిశువులకు తల్లి పాలు ఇవ్వడం కూడ పౌష్టికాహార లోపంగానే పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలపడం గమనార్హం. పోషకాహరలోపమనేది ఐదేండ్లకంటే తక్కువైన పిల్లలోను, గర్భిణీల్లోనూ, యుక్తవయస్సు వారిలో ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిలో 19.46 కోట్ల మంది మన దేశంలోనే ఉన్నారు. ఇది మొత్తతం దేశ జనాభాలో 13 శాతానికి సమానమని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆహార భద్రత పౌష్టికాహార స్థితి (తఎస్‌ఒఎఫ్‌ఐ) తాజా నివేదిక 2024 తెలిపింది. దేశ జనాభాలో సరైన ఆహారం లభ్యంకాక 16.6 శాతం పోషకాహార లోపంతో ఉన్నారని, కనీసం 38 శాతం అనారోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నారని ఈ ఏడాది మే 29న విడుదల చేసిన గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్ 2024 తెలిపింది.
పేదరికమే ప్రధాన కారణం :
పోషకాహార లోపం ఉన్న పిల్లలు తరుచుగా వ్యాధులకు గురవ్వడమేకాక మరణించే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా పిల్లల్లో శారీరక, మానసిక అభివృద్ధి జరగక అభ్యాస సామర్థ్యాలు, విద్యా పనితీరు సరిగా జరగదు. సూక్ష్మపోషకాలు, ఐరన్, విటమిన్-ఎ, జింక్ లేని ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతిని వేగంగా అంటువ్యాధులు ప్రబలుతాయి. కుటుంబ ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతాయి. యుక్తవయస్సులో పోషకాహార లోపం వల్ల ఉత్పాదకత తగ్గి దేశ జిడిపి తగ్గుతుంది. రక్తహీనత గల తల్లులు అనారోగ్య శిశువులకు జన్మనిచ్చి పోషకాహార లోప చక్రాన్ని శాశ్వతం చేస్తారు. పోషకాహార లోపం తరచుగా ఆర్థికంగా అట్టడుగు, వెనుకబడిన వర్గాలను ప్రభావితం చేస్తున్నది. ఇది సామాజిక అసమానతలను పెంచుతున్నది. దీనికి గల కారణాలలో అత్యంత ప్రధానమైనది పేదరికం. వీరిలో కొనుగోలు శక్తి తక్కువగా ఉండడం వలన సంతులిత ఆహారాన్ని తీసుకోకపోవడంతో ఈ సమస్య రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నది. కుటుంబంలో ఒకరి సంపాదనపైనే ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తారు. మలేరియా, అతిసారం వంటి అంటువ్యాధులు పోషకాహార లోపానికి కారణమవుతున్నాయి. గర్భంతో ఉన్నవారికి ఎక్కువ మోతాదులో పోషకాలు అవసరం. కాని వారికి సరైన అవగాహన లేక పోషకాహార లోపానికి గురవుతున్నారు.
అనాథ పిల్లలు, వృద్ధులు ఎక్కువ శాతంలో పోషకాహార లోపానికి గురవుతారు. గిరిజనులు, సామాజికంగా వెనుకబడినవారు, మురికివాడ నివాసితులు, సంచార జాతులు తదితర వారికి తగినంత ఆర్థిక పరిపుష్టి లేక సమతుల్య ఆహారాన్ని పొందలేకపోతున్నారు. పేలవమైన పారిశుద్ధ్యం, పరిశుభ్రత పద్ధతులు వ్యాధులకు కారణమయ్యే పరాన్న జీవులకు గురికావడాన్ని పెంచుతుంది. ఇవి శరీరంలోని పోషకాల శోషణ వినియోగాన్ని ప్రభావితం చేసి పోషకాహార లోపాన్ని పెంచుతున్నాయి. ఎగువ మధ్యతరగతి, ఎగువ తరగతి ప్రజలలో కూడా పోషకాహార లోపం ఉంటుంది. తగినంత సంపాదన ఉన్నా కూడా పాలిష్ చేసిన బియ్యం వాడటం, పిజ్జాలు బర్గర్లు తినడం లాంటి అలవాట్లు, పని ఒత్తిడిలో వేళకు భోజనం చేయకపోవడం వలన వీరు పోషకాహార లోపానికి గురవుతున్నారు. మనదేశంలో ఆహార వైవిధ్యం లేకపోవడం, తక్కువ నాణ్యత గల ఆహారాన్ని తీసుకోవడం కూడా ఒక కారణం. మనం తీసుకునే ఆహారంలో ఐరన్, విటమిన్లు, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు తక్కువగా ఉంటున్నాయి.
పథకాలున్నా ఫలితం శూన్యం! :
అంగన్‌వాడీ వ్యవస్థ, పోషన్ అభియాన్, ఆయుష్మాన్ భారత్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్, ప్రధానమంత్రి మాతృవందన యోజన, పాఠశాలలో మధ్యాహ్న భోజనం, కౌమార బాలికల పథకం, గర్భిణీలకు ప్రత్యేక ఆహారం అందించుట లాంటి కార్యక్రమాలను ప్రభుత్వాలు ప్రవేశపెట్టినప్పటికీ వాటి అమలులో చిత్తశుద్ధి లోపించింది. అంగన్‌వాడీ లాంటి వ్యవస్థను పనికిమాలినదిగా చేసే పద్ధతికి కేంద్రం పూనుకుంది. తగిన నిధుల్ని కేటాయించి ఆరోగ్య వ్యవస్థల్ని పటిష్టం చేయాల్సిన పాలకులు వాటికి బడ్జెట్‌లో కేటాయింపులు అంతంత మాత్రంగానే కేటాయించడం శోచనీయం. జాతీయ ఆరోగ్య విధానం 2025 నాటికి ప్రభుత్వ ఆరోగ్య వ్యయాన్ని జిడిపిలో ప్రస్తుతమున్న 1.2 శాతం నుండి 2.5 శాతానికి పెంచాలని చేసిన సిఫార్సును అమలు చేయడం లేదు. పౌష్టికాహారం, ఆహార భద్రత, పేదరికం ఒకదానితో మరొకటి విడదీయరాని సంబంధం కలిగి ఉంటాయి.
భారతీయుల్లో సూక్ష్మపోషకాల లోపంపై లాన్సెట్ అధ్యయనం హెచ్చరిస్తున్నది. భారత్‌లోని స్త్రీ, పురుషుల్లో అన్ని వయసులవారు ఆరోగ్యానికి ముఖ్యమైన ఐరన్, కాల్షియం, ఫోలేట్ వంటి సూక్ష్మపోషకాలను సరిపడా తీసుకోవటంలేదని అంచనా వేసింది. ‘ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. ఈ అధ్యయనం ప్రకారం… ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70శాతం (500 కోట్ల మందికి పైగా) మంది ప్రజలు సరిపడా అయోడిన్, విటమిన్ బి12, ఐరన్‌ను స్త్రీలు మగవారితో పోలిస్తే తగినంతగా తీసుకోవటంలేదని పరిశోధకులు గుర్తించారు. ఇక పురుషులు.. మహిళలతో పోలిస్తే మెగ్నీషియం, విటమిన్ బి6, జింక్, విటమిన్ సి లను తగిన మొత్తంలో తీసుకోవటం లేదు. భారత్‌లోనూ చాలా మంది మహిళలు పురుషులతో పోలిస్తే తగినంత మొతాదులో అయోడిన్‌ను పొందటం లేదు. ఇక మహిళలతో పోలిస్తే పురుషులు సరిపోని మొత్తంలో జింక్, మెగ్నీషియంలను తీసుకుంటున్నారు. 10 నుంచి 30 ఏండ్ల వయసు మధ్య ఉన్న పురుషులు, మహిళల్లో చాలామంది తక్కువ స్థాయిలో కాల్షియం తీసుకుంటున్న అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆరోగ్యవంతులు కలిగిన దేశంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఆరోగ్యంలో పోషకాహారం కీలకపాత్ర వహిస్తుంది. పౌష్టికాహార లోపం భారంతో మనదేశం గణనీయమైన సవాలును ఎదుర్కొంటోంది. పోషకాహార లోపాన్ని వేస్టింగ్ (ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం), స్టంటింగ్ (వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం) తక్కువ బరువు కలిగి ఉండడం, విటమిన్లు, మినరల్స్ లోపాలు అనే నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార భద్రత పోషకాహార స్థితి తాజా నివేదిక 2024 ప్రకారం దేశజనాభాలో 55.6 శాతం ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేదు. ఐదేళ్ల వయస్సు కంటే తక్కువ ఉన్న పిల్లల్లో వేస్టింగ్ 18.7 శాతం, స్టంటింగ్ 31.7 శాతం, తక్కువ బరువు 27.4 శాతం పిల్లలు ఉన్నారని తెలిపింది. 15 నుండి 49 మధ్య వయస్సు మహిళలో పోషకాహారలోపం 18.7 శాతం ఉంది.
ప్రజానీకంపై పంజా విసురుతున్న వ్యాధుల్లో 54 శాతానికి పైగా పోషకాహార లోపం వల్లే తలెత్తున్నాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నిపుణులు పేర్కొంటున్నారు. ఎఫ్‌ఎవో ‘ఆహార భద్రత, పోషణ-2023’ నివేదిక ఆ మేరకు కఠోర వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. ఆహార ద్రవ్యోల్బణం, అరకొర ఆదాయాల అడకత్తెరలో చిక్కుకున్న కుటుంబాల ధైన్యం-బాలభారతాన్ని శక్తిహీనం చేస్తోందనే మరో చేదునిజం తాజా అధ్యయనంలో బయటపడిరది. దేశవ్యాప్తంగా ఆరు నుంచి 23 నెలల వయసులోని చిన్నారుల్లో 77 శాతతం వైవిధ్యభరితమైన పోషకాహారానికి నోచుకోవట్లేదంటున్న ఆ పరిశోధన తీవ్రంగా కలవరపరుస్తోంది! మనదేశంలో ఆకలి కేకలు పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సామాజిక, ఆర్థిక అసమానతలను ప్రధానంగా పేర్కొవాలి. వెళ్లూనుకుంటున్న పేదరికం నుంచి ప్రజలను తప్పించడానికి ప్రభుత్వ పరంగా జరుగుతున్న కృషి దాదాపు శూన్యం. దేశంలో పోషకాహార, ఆరోగ్య సంరక్షణ సేవలు సక్రమంగా అమలు కావడం లేదు. దేశంలో, ‘హిడెద్ హంగర్’(కనిపించని ఆకలి)గా పేర్కొనే సూక్ష్మ పోషక లోపం విపరీతంగా ఉందని యుఎన్ నివేదికలు తేల్చి చెప్తున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి వ్యూహాత్మక విధానాలను కేంద్రం అమలు చేయడం లేదన్న విమర్శలున్నాయి. అసమర్థమైన వ్యవసాయ విధానాలు, అస్తవ్యస్తమైన ఆహార పంపిణీ భారత్‌లో ఆకలి సమస్యను పెంచుతున్నాయి. వాతావరణ మార్పులు కూడా సమస్య తీవ్రతను పెంచుతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే భారత్ మరో సొమాలియాగా మారుతుంది.
దేశంలోని ప్రజలందరికీ తిండి పెట్టటానికి, బాలల్లో పోషకాహార లోపాన్ని నివారించటానికి, తద్వారా లక్షలాది బాలల మరణాలను నివారించటానికి అవసరమైన ఆహారధాన్యాలు దేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. కాని బాలలు, ప్రజల ఆకలిని తీర్చటం, రక్తహీనతను, మరణాలను నివారించటం ప్రభుత్వ ప్రాధాన్యతలలో లేదు. అందువలననే దారిద్య్రంలో ఉండి అవసరమైన ఆహారం కొనలేని వారిని బహిరంగ మార్కెట్‌కు వదిలేసింది. మరోవైపు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నది. లక్షల కోట్ల రూపాయలను అప్పనంగా కార్పొరేట్లకు కట్టబెడుతున్న ప్రభుత్వానికి ఇది పెద్ద ఆర్థికభారం కూడా కాదు. సరైన చర్యలు తీసుకుంటే బాలల మరణాలను నివారించవచ్చు. మహిళలు, పురుషులు, యుక్త వయస్కులలో రక్తహీనతను, ఎత్తుకు తగిన బరువు, వయసుకు తగిన ఎత్తు లేకపోవటాన్ని నివారించవచ్చు. కాని ప్రజల మరణాలను, అనారోగ్యాన్ని నివారించటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే పెట్టుబడిదారులకు లాభాలు రావు. ఆహార ధాన్యాలను ఎగుమతి చేయటం, ఎథనాల్ ఉత్పత్తికి వినియోగించడం వల్ల పెట్టుబడిదారులకు లాభాలు వస్తాయి. ప్రభుత్వానికి విదేశీ మారక ద్రవ్యం వస్తుంది.
2024 ప్రపంచ ఆకలి సూచీలో 127 దేశాల సరసన 105వ స్థానంలో నిలిచి పరువుమాసింది. పోషకాహార లేమి, పిల్లల్లో ఎదుగుదల లోపాలు, శిశుమరణాల ఆధారంగా రూపొందించే ఈ సూచీలో ఇండియా ఎందుకు ఏటా చతికిలపడుతోంది? వ్యవసాయ సంక్షోభంతో పల్లెలు కళ తప్పుతున్నాయి. పొట్టచేత పట్టుకుని పట్టణాలకు వలస వస్తున్నవారు చాలీచాలని సంపాదనతో బతుకుబండిని భారంగా నెట్టుకొస్తున్నారు. ఇంటి అద్దె, వైద్య వ్యయం, ఇతరేతర ఖర్చుల నడుమ సామాన్యులకు పోషకాహారం గగన కుసుమమవుతోంది. తలసరి ఆదాయాల పెంపు, ఆహార ద్రవ్యోల్బణం కట్టడి, ఐసిడిఎస్‌లో లోపాల పరిహరణ తదితరాలపై ప్రభుత్వాలు దృష్టి సారించనంత కాలం జనభారతతం భవిత గిడసబారిపోతూనే ఉంటుంది. ప్రపంచీకరణ ఆర్థిక విధానాలైన ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలతో పెట్టుబడిదారులకు లాభాలను కట్టబెట్టటమే లక్ష్యంగా పనిచేస్తున్న మోడీ ప్రభుత్వం బాలల మరణాలకు బాధ్యత వహించాలి.
You are right reddy garu
No leader
No political party —not paying attention on kids health
Devudu — matham —pushpa 2 movie —movies rates are main topics
Telugu states — family politics —agrakulala petthanaalu —??????