పెట్టుబడి తోపాటు ఆవిర్భవించిన ఆధునిక యుగంలోని రాజకీయాలకు రెండు తీవ్ర అంచులు ఉంటాయి. ఒకటి బూర్జువా ప్రజా స్వామ్యం, రెండు అత్యంత ప్రగతి నిరోధక ఫాసిజం.
పెట్టుబడిదారీ రాజకీయాలు ఈ రెండు అంచుల ద్వంద్వం మధ్యనే లోలకంలా కొనసాగుతాయి. పెట్టుబడి కి ఉన్న స్వభావం వల్ల నే వలస రూపంలో ప్రపంచమంతటా విస్తరించింది. ఈ క్రమంలోనే దేశ దేశాలలో ప్రజలు సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాడారు. ప్రత్యక్ష వలస పెట్టుబడిదారీ విధానం అంతమై పరోక్ష వలస పెట్టుబడిదారీ విధానం మొదలైంది. పెట్టుబడి ద్రవ్య పెట్టుబడి గా బలపడినాక దాని పని విధానం మారించి. దాని చలనం మరింత వేగవంతమైంది. ఆ పెట్టుబడి ప్రవహించిన చోటల్లా జరిగే ప్రజల శ్రమ దోపిడీ ఫలితంగా భారీ స్థాయిలో అదనపు విలువలు సమకూరాయి. అంటే, పెద్ద ఎత్తున లాభం గుట్టలు గుట్టలుగా పోగుపడిందని అర్థం.
అయితే ఒకవైపు పెట్టుబడి అంతులేని లాభాన్ని కోరి దోపిడీ చేస్తే , మరోవైపు ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్య్రం కోసం , దోపిడీ రాహిత్యం కోసం పోరాడతారు. ఇది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఉండే నిత్య వైరుధ్యం. ఈ వైరుధ్యం వల్లనే నిరంతరం సంక్షోభాలు, వర్గ పోరాటాలు తలెత్తుతాయి. ఈ నిరంతర పెట్టుబడిదారీ సంక్షోభమే కీలకమైన వైరుధ్యంగా ఉండి వివిధ దేశాలలో ఫాసిజానికి దారి తీస్తుంది. ఆయా దేశాల నిర్దిష్ట చరిత్ర గమనం, రాజకీయాలను బట్టి ఫాసిజం భిన్న రకాలుగా రూపొందుతుంది. కొన్ని దేశాలలో రేసిజంగా, మరికొన్ని దేశాలలో స్థానికేతరుల పట్ల, విదేశీయుల పట్ల ద్వేషంగా( జెనోఫోబియా), మనలాంటి దేశంలోనైతే మెజారిటీ హిందూ మతోన్మాదంగా, బ్రాహ్మణవాద హిందుత్వ ఫాసిజంగా రూపు తీసుకుంటుంది.
మరి భారతదేశంలో కొనసాగుతూ ఉన్న ఈ ఫాసిజం ఎక్కడినుండో రాలేదు. సాక్షాత్తు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారానే వచ్చింది. రాజ్యాంగం తొలి కాలం నాటి ప్రగతిశీల ఆదర్శలన్నిటిని తుంగలో తొక్కి నేటి భారత ప్రజాస్వామ్యం కార్పొరేట్ హిందుత్వ ఫాసిజంగా పరిణమించింది. అయితే ఈ ఫాసిజాన్ని ప్రజలుగా అనుభవించడం వేరు, దీన్ని సరిగా అర్థం చేసుకోవడం పూర్తిగా వేరు. ఎందుకంటే- ఫాసిజాన్ని అనుభవించడానికి మనం ఏమీ చేయనక్కరలేదు. కానీ దీన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి మాత్రం సిద్ధాంతపరమైన విశ్లేషణా జ్ఞానం అవసరమవుతుంది. అటువంటి జ్ఞానాన్ని అందించేవే *దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం * ప్రచురించిన “కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం” అనే ఈ పుస్తకంలోని వ్యాసాలు. వీటిలోని ప్రత్యేకత ఏమిటంటే -ఇవి ఫాసిజాన్ని ఏకోన్ముఖంగా మాత్రమే విశ్లేషించలేదు. పైన రాజకీయార్థిక వ్యవస్థ స్థాయిలో, కింద సామాజిక సాంస్కృతిక స్థాయిలోనూ కొనసాగిన ఫాసిస్టుక్రమాలను అర్థం చేసుకోవడానికి ఒక శాస్త్రీయ విశ్లేషణా చట్రాన్ని ఈ వ్యాసాలు స్థూలస్థాయిలో అందిస్తాయని నిస్సంకోచంగా చెప్పవచ్చు.
‘ద్రవ్య పెట్టుబడి- ఆర్థిక మాంద్యం ప్రభావం'(ఇఫ్టు ప్రసాద్ ), ‘మోడీ ప్రభుత్వ దన్నుతో ఆదానీ అక్రమాలు'( ఏ.నరసింహారెడ్డి ), ‘కార్పొరేటీకరణ- సైనికీకరణ'(చిలుకా చంద్రశేఖర్) అనే వ్యాసాలు రాజకీయార్థిక వ్యవస్థ స్థాయిలో జరిగిన పరిణామాలను చిత్రించగా, ‘దేశభక్తి -హిందూ జాతీయ వాదం'( పి. వరలక్ష్మి), భారతీయ సంస్కృతులు పరిణామం- బ్రాహ్మణిజం-బుద్ధిజం-హిందూయిజం'( రమేష్ పట్నాయక్) అనే వ్యాసాలు సామాజిక సాంస్కృతిక స్థాయిలో జరిగిన అనేక ఫాసిస్టు క్రమాలను వివరించాయి. కాగా ‘ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన- కొన్ని ఆలోచనలు’ (ఎన్. వేణుగోపాల్ ) అనే చివరి వ్యాసం ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడడానికి కావలసిన ఐక్య సంఘటన అవసరాన్ని, అంతర్జాతీయంగా, దేశీయంగా, ప్రాంతీయంగా కట్టిన వివిధ ఐక్య సంఘటనల చరిత్రల తీరుతెన్నులను, వాటిలోంచి ఇవాల్టి సందర్భానికి తగిన పాఠాలు తీసుకుంటూ కొన్ని కొత్త ఆలోచనలతో కూడిన ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన నిర్మాణ అవసరాన్ని ఉదాహరణ పూర్వకంగా చర్చించింది. అంతేగాక మొత్తంగా ఫాసిజాన్ని రద్దు చేసే నిజమైన ఐక్య సంఘటనను నిర్మించడం ఈనాటి ప్రగతిశీల శక్తుల ముందున్న చారిత్రక కర్తవ్యమని నొక్కి చెప్పింది.
స్థూలంగా చూస్తే ఇండియన్ పాసిజానికి సాధారణ, సార్వత్రిక లక్షణాలు ఉన్నాయి. సూక్ష్మ స్థాయిలో చూస్తే, ఇండియన్ ఫాసిజానికి అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అవి ఈ దేశ నాగరికత నుంచి, సామాజిక సాంస్కృతిక క్రమాల చరిత్ర నుంచి, ఇక్కడి పెట్టుబడికి గల ప్రత్యేక స్వభావం కారణంగా జరిగిన బూర్జువా శక్తుల పరిణామ క్రమం నుంచి, ముఖ్యంగా ఉత్పాదక శ్రమతో , శ్రమదోపిడితో పాటు భావజాల సామాజిక ఆధిపత్య సమూహాల నుంచి, వాటి భావజాలం నుంచి కూడా క్రమంగా ఇండియన్ ఫాసిజం రూపొందింది.
ఇలాంటి ఇండియన్ పాసిజాన్ని నిర్మూలించాలంటే ఏకైక పోరాటం, ఏకోన్ముఖ పోరాటం సరిపోదు. ఎట్లా అయితే బహు విధాలుగా భారత సమాజాన్ని ఫాసిజీకరించిన ఫాసిస్ట్ వ్యూహానికి సరిదీటుగా ఫాసిస్టు నిర్మూలనా ప్రతి వ్యూహాన్ని మనం రూపొందించుకోవాలి. ఆ ప్రతి వ్యూహంలో బహుముఖ పోరాటాలు ఎన్నో ఉంటాయి. నిర్దిష్ట సమస్యల ప్రాతిపదికగా నిర్దిష్ట ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలను మనం రూపొందించుకోవాలి.అందుకు వేర్వేరు నినాదాలు కూడా అవసరమవుతాయి. అలాగే ఏకైక ఐక్య సంఘటన కూడా సరిపోదు. మనం బహుళ ఐక్య సంఘటనలను నిర్మించుకోవాలి. వివిధ రాజకీయ ఐక్య సంఘటనలను, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య ఐక్య సంఘటనలను వేర్వేరుగా రూపొందించుకోవాలి. వివిధ స్థాయిలలో, వివిధ రూపాలలో కొనసాగుతున్న ఫాసిస్టు క్రమాలకు వ్యతిరేకంగా ప్రగతిశీల ప్రజాస్వామిక క్రమాలను ముందుకు తెచ్చి వేర్వేరు ఐక్య సంఘటనల ద్వారా పోరాటాలు నిర్వహించాలి. ఆయా ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలన్నింటినీ చారిత్రకమైన ముందుచూపుతో, శాస్త్రీయమైన సమన్వయ స్ఫూర్తితో నిర్వహించాలి. అప్పుడు మాత్రమే ఫాసిజాన్ని మనం సమూలంగా రద్దు చేయగలుగుతాం.
ఇలాంటి ఇంకా ఎన్నో సూక్ష్మస్థాయి విశ్లేషణలకే కాకుండా, సృజనాత్మక ఫాసిస్టు వ్యతిరేక పోరాటాల నిర్వహణకు కూడా ఎంతో ప్రేరణ నిచ్చే వ్యాసాలు ఈ “కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం” పుస్తకంలో ఉన్నాయి. దీన్ని అందరూ తప్పక చదవండి.