తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యా బోధనను కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతున్నాయి. దీనితో రాష్ట్రంలోని ప్రజలు వారి పిల్లలను ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ ఆ సంఖ్య నేడు 60% కి పైగా పెరిగింది. విద్యాభోధన అనగానే ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల్లో మాత్రమే నాణ్యమైన విద్య అందే అవకాశం ఉందనే భావన తల్లిదండ్రుల్లో నెలకొనే విధంగా ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాలు ప్రచారం చేస్తున్నాయి. దేశంలో మొదట విద్యాబోధన ప్రభుత్వరంగంలోనే కొనసాగినప్పటికీ 1986 లో మన పాలకులు విద్యారంగంలో ప్రైవేటీకరణకు అనుమతించడంతో పాటు గాట్స్ ఒప్పందంలో విద్యను చేర్చడంతో ప్రైవేటు విద్యా సంస్థలకు బీజం పడింది. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హాయంలో జాతీయ విద్యావిధానం -1986 తో మొదలై నేటి ఎన్డీఏ పాలకులు తీసుకొచ్చిన నూతన విద్యా విధానం-2020 వరకు ప్రైవేటు దాతృత్వ సంస్థల పేరుతో స్వదేశీ, విదేశీ ప్రైవేటు విద్యాసంస్థలు ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ, అందులో ఫీజులు కూడా ఆ విద్యా సంస్థలే నిర్ణయించుకునే విధంగా పాలసీలు రూపొందించారు. పాలకులలో కొంత మంది ప్రైవేటు విద్యా వ్యాపారంలో పెట్టుబడులు పెడుతూ విద్యా వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.
ఈ ఏడాది అకడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందే తెలంగాణ సర్కారు ఫీజుల నియంత్రణ చట్టం రూపొందిస్తామని చెబుతూ దాట వేసింది. దీంతో ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీ నిరాటంకంగా సాగుతోంది. పాలకుల వైఫల్యం, అధికారుల పర్యవేక్షణా లోపంతో అధిక ఫీజుల భారం తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ అంశంపై తెలంగాణా విద్యా కమీషన్ అధ్యయనం చేసింది. పదేళ్ల కిందట తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల్లో సరాసరి వార్షిక ఫీజు రూ.50 వేలు. ఇప్పుడు అది రూ.1.90 లక్షలకు చేరింది. రాష్ట్రంలో ఏటా ప్రైవేటు విద్యా సంస్థలు 10-30 శాతం ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయి’’ అని కమీషన్ వివరించింది. దీంతో పాటు ఫీజులపై కమిషన్ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి విధానాన్ని అధ్యయనం చేసి, ఆ వివరాలను ముఖ్యమంత్రి రేవంత్‌కు సమర్పించింది. 2015-16లో తెలంగాణలో సరాసరి ఫీజు రూ.50 వేలు ఉంటే, ఉత్తరప్రదేశ్‌లో రూ.35 వేలు, తమిళనాడులో రూ.40 వేలు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.38 వేలు, ఢిల్లీలో అత్యధికంగా రూ.60 వేలు ఉండేదని వివరించారు. పదేళ్ల కిందట ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉండగా.. ఇప్పుడు తెలంగాణ ఉందని తెలిపారు. 2025-26లో ఉత్తరప్రదేశ్‌లో ఫీజు రూ.95 వేలు ఉంటే.. తమిళనాడులో లక్ష, ఆంధ్రప్రదేశ్‌లో రూ.1.05 లక్షలు, ఢిల్లీలో రూ.1.60 లక్షలు ఉందని, తెలంగాణలో మాత్రం రూ.1.90 లక్షలుగా ఉందని కమిషన్ తెలిపింది. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజు దోపిడీకి ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని, ఇందుకు ఇంజినీరింగ్ తరహాలో ప్రత్యేకంగా ఫీజు నియంత్రణా కమిటీ ఉండాలని సూచించింది. రవాణా, బోర్డింగ్, భోజనం, విహార యాత్రలు, క్యాపిటేషన్ ఫీజు, పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, స్టేషనరీ పేరుతో ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతున్నాయని కమిషన్ స్పష్టం చేసింది. ప్రైవేట్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల ఫీజులను నియంత్రించాలని చెబుతూ ఫీజుల నియంత్రణకు సంబంధించి ఆయా సంస్థలలో ప్రమాణాల ఆధారంగా ప్రైవేట్ పాఠశాలలను 5 లేదా 6 రకాలుగా వర్గీకరించింది. లొకేషన్, భూవిస్తీర్ణం , మౌలిక వసతులు, ఎక్స్ట్రా కరిక్యూలం ఆక్టివిటీస్, ఉపాధ్యాయుల అర్హతలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. చట్టబద్ధ ఫీజు నియంత్రణా కమిషన్ ఏర్పాటుకు సంబంధించి సిఫార్సు చేయడంతో పాటు “తెలంగాణ ప్రైవేట్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల ఫీజు నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ బిల్లు-2026 (ముసాయిదా)”తయారు చేసి అందించింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అమలు కాని ఫీజుల నియంత్రణ చట్టాలు, జీవోలు : ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం- 2009 యొక్క నిబంధనల ప్రకారం “ఏ ప్రైవేటు పాఠశాల అయినా ఒక పిల్లవాడిని చేర్చుకునేటప్పుడు, ఎలాంటి క్యాపిటేషన్ ఫీజును వసూలు చేయరాదు”. ఏదైనా పాఠశాల ఒకవేళ నిబంధనను ఉల్లంఘించి, క్యాపిటేషన్ ఫీజును వసూలు చేసినట్లయితే, వసూలు చేసిన క్యాపిటేషన్ ఫీజుకు పది రెట్ల వరకు జరిమానాతో శిక్షించబడతారు.”అదే విధంగా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు వివరాలను నిర్దేశిత సమయంలోగా పాఠశాల నోటీసు బోర్డుపై మరియు పాఠశాల వెబ్సైట్లో ప్రదర్శించాలి. అన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజు వివరాలను నిర్దేశిత ప్రోఫార్మాలో డిపార్ట్మెంటల్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సి వుండగా రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు కనీసం నిబంధనలు పాటించడం లేదు.
తేది 24.08.2016 నాడు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల స్ట్రక్చర్ ఎలా ఉండాలనే అంశంపై మరియు పలు పాఠశాలలు ఆకర్షణీయమైన పేర్లతో మోసగించడాన్ని ఆపాలనే ఉద్దేశ్యంతో పాఠశాల పేరు చివరలో ఐఐటీ ఒలంపీయాడ్/కాన్సెప్ట్/ఈ -టెక్నో/ఈ-శాస్త్ర వంటివి పెట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. అందుకు గాను జివో ఎం.ఎస్ నెం.91 (06.08.2009) ను జారీ చేసింది. గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల (ప్రవేశాల నియంత్రణ మరియు క్యాపిటేషన్ ఫీజు నిషేధం) చట్టం-1983 ను అమలు చేయాలని గతంలో జారీ చేసిన G.0 MS NO. 1 మరియు జివో ఎం.ఎస్ నెం. 91 లను కూడా కోడ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల (ప్రవేశాల నియంత్రణ మరియు క్యాపిటేషన్ ఫీజు నిషేధం) చట్టం, 1983లోని నిబంధనల ప్రకారం జిల్లా స్థాయిలో ఫీజు నియంత్రణ కమిటీ (డి.ఎఫ్.ఆర్.సి) ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ సంబంధిత జిల్లాలోని అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల ఫీజుల నిర్ణయాలను నియంత్రించడం, ఆమోదించడం కోసం పని చేస్తుంది.ఈ కమిటీలో (ఎ) జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ హోదాకు తక్కువ కాని అతని నామినీ, (బి) సంబంధిత జిల్లా విద్యాధికారి మరియు (సి) జిల్లా ఆడిట్ అధికారి / పే & అకౌంట్స్ అధికారి యొక్క ఆడిటర్‌తో కూడిన జిల్లా ఫీజు నియంత్రణా కమిటీ (డిఎఫ్ఆర్సి)ని ఏర్పాటు చేయాలి.అదే విధంగా జి.ఓ.ఎం.ఎస్.నెం.1, విద్యా శాఖ, తేది 1.1.1994 ప్రకారం ఆయా పాఠశాలల్లో పాలక మండళ్లు ఏర్పాటు చేయాలి. ఆ పాలక మండలి ఆడిట్ చేయబడిన నివేదికల ఆధారంగా ఆయా పాఠశాలల్లో ఫీజుల స్ట్రక్చర్ ను ప్రతిపాదిస్తూ ముసాయిదాను ప్రతి ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోగా జిల్లా ఫీజు నియంత్రణా కమిటీకి సమర్పించాలి. జిల్లా ఫీజు నియంత్రణ కమిటీ, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యానికి మరియు తల్లిదండ్రుల విన్నపాలకు విచారణకు అవకాశం ఇచ్చిన తర్వాత, వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు నిర్మాణంపై డిసెంబర్ 31వ తేదీలోగా ఆమోదం తెలపాలి.
ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల (ప్రవేశాల నియంత్రణ మరియు క్యాపిటేషన్ ఫీజు నిషేధం) చట్టం, 1983 (ఏ.పి. చట్టం నెం. 5 ఆఫ్ 1983) లోని సెక్షన్ 7 ద్వారా ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో దరఖాస్తు ఫీజు రూ.100/- మించకూడదు.రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500/- మించకూడదు.వాపసు పొందగల, వడ్డీ లేని కాషన్ డిపాజిట్ రూ.5,000/- మించకూడదు. దీనిని కూడా ఆయా పాఠశాలల పాలకమండలి ఆమోదం కోసం సరైన కారణాలతో DFRCకి సమర్పించాలి.మరే ఇతర ఫీజును, ఏ పేరుతోనైనా ఒకేసారి చెల్లించే రుసుముగా వసూలు చేయరాదు.
జివో ఎం ఎస్ స్ నెం.1 ప్రకారం ఆయా పాఠశాలల్లో ఏర్పడిన పాలకమండలి ఉపాధ్యాయులు మరియు సిబ్బందికి చెల్లించే జీతాలు, పదవీ విరమణ ప్రయోజనాలు, నిర్వహణ ఖర్చులు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలతో పాటు, ఏదైనా నిర్దిష్ట ప్రయోజనం కోసం విధించే ప్రత్యేక రుసుము మరియు అభివృద్ధి రుసుము ఆధారంగా ట్యూషన్ ఫీజును నిర్ణయించాలి. ట్యూషన్ ఫీజును కనీసం 3 వాయిదాలలో వసూలు చేయాలి. విద్యతో ప్రత్యక్షంగా సంబంధం లేని ఎక్స్ట్రా కరిక్యూలం ఆక్టివిటీస్ కి ఎలాంటి ఫీజు చెల్లింపు జరుగదు. ఇది ట్యూషన్ ఫీజులో భాగంగా పరిగణించబడ కూడదు.
పాఠశాల వినియోగ వస్తువుల రుసుములు :
(i). పట్టణంలో పుస్తకాలు/నోట్బుక్లు/స్టేషనరీ లభించే కనీసం 3 దుకాణాలను పాఠశాల తప్పనిసరిగా తెలియ జేయాలి. పాఠశాల కౌంటర్లో పుస్తకాలు/నోట్బుక్లు/స్టేషనరీ అమ్మకానికి అనుమతి లేదు. కౌంటర్ లో అమ్మదలుచుకుంటే అది రాయితీపై జరగాలి.
(ii). యూనిఫాంలను పాఠశాల నిర్దేశించిన దుకాణాల నుండి లేదా సేల్స్ కౌంటర్ నుండి కొనుగోలు చేయడం తప్పనిసరి కాదు. పాఠశాల నిర్దేశించిన నిర్దేశాల ప్రకారం, విద్యార్థులు తమకు నచ్చిన బయటి అవుట్లెట్ల నుండి యూనిఫాంను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
(iii). రవాణా రుసుమును 5 కిలో మీటర్ల స్లాబ్‌తో నిర్ణయించాలి
(iv). ప్రైవేట్ పాఠశాలలు నిర్దేశించిన సమయానికి మించి పాఠశాలను నడపవద్దని సూచించడ మైనది. ఒకవేళ అదనపు తరగతులు నిర్వహిస్తే, పిల్లలు ఆ తరగతులకు హాజరు కావడం ఐచ్ఛికంగా ఉండాలి మరియు దీనికి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయరాదు.
(v). ప్రైవేట్ పాఠశాలలు తమ ఫలితాల గురించి వార్తాపత్రికలలో ప్రకటనలు ఇవ్వవద్దని సూచించడ మైనది. ఒకవేళ అలా చేస్తే, ఆ ప్రకటనల ఖర్చును రుసుము నిర్మాణంలో చేర్చరాదు.
ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు DFRC ద్వారా నిర్ణయించబడిన ఫీజు కంటే ఎక్కువ ఫీజు వసూలు చేయరాదు:
పాఠశాలలు DFRC ఆమోదించిన ఫీజు కంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తే, దానిని క్యాపిటేషన్ ఫీజుగా పరిగణిస్తారు మరియు ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల (ప్రవేశాల నియంత్రణ మరియు క్యాపిటేషన్ ఫీజు నిషేధం) చట్టం, 1983లోని నిబంధనల ప్రకారం యాజమాన్యంపై చర్య తీసుకోబడుతుంది.తగిన నోటీసు ఇచ్చిన తర్వాత పాఠశాలకు మంజూరు చేసిన గుర్తింపు రద్దు చేయడం జరుగుతుంది.
తేది 31.08.2023 నాడు తెలంగాణా పాఠశాల విద్యా శాఖ – రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజు వసూలుకు సంబంధించి మరిన్ని సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ (సహాయం పొందని) పాఠశాలలలో ఫీజు వసూలుకు సంబంధించి జివో ఎం.ఎస్ నెం 1 ప్రకారం ఈ క్రింది సూచనలను జారీ చేసింది. ఈ పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు పొంది, ఏదైనా యాజమాన్యం ద్వారా నిర్వహించబడుతూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE), ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ICSE), ఇంటర్నేషనల్ బాకలారియేట్ (IB) మరియు ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (IGCSE) మొదలైన భారతీయ లేదా విదేశీ కోర్సు లేదా బోర్డులకు అనుబంధంగా ఉండాలి. ప్రతి పాఠశాల, అది ప్రభుత్వ సహాయం పొందుతున్నా లేదా పొందకపోయినా, ఒక పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పాలకవర్గంలో విద్యా సంస్థ అధ్యక్షుడు, విద్యా సంస్థ కార్యదర్శి/కరస్పాండెంట్/మేనేజర్,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు/ప్రిన్సిపాల్,బోధనా సిబ్బందిలో నుండి ఒకరు, ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులతో పాలకవర్గం ఏర్పాటు చేయాలి. ఆ పాలక వర్గమే ఏడాదిలో మూడు సార్లు సమావేశమై ఫీజుల నిర్మాణాన్ని నిర్ణయించాలి. పాలక మండలి ఫీజులు నిర్ణయించేటపుడు సిబ్బందికి జీతాలు, భవనానికి అద్దె, విద్యుత్ మరియు నీటి ఛార్జీల,స్టేషనరీ, స్టాంపుల ఖర్చు, చాక్ పీస్, డస్టర్, పుస్తకాలు మరియు ప్రయోగశాలకు రసాయనాలు,నమూనాల కొనుగోలుకు సంబంధించిన ఖర్చు విద్యా సెస్సు ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి.
విద్యార్థుల నుండి నెలవారీగా గానీ, త్రైమాసికంగా గానీ, లేదా అర్ధవార్షికంగా గానీ ఫీజులను వసూలు చేయాలనే నిర్ణయాన్ని పాలకవర్గం తీసుకోవచ్చు. అయితే, ప్రత్యేక ఫీజును విద్యా సంవత్సరం ప్రారంభంలో ఒక్కసారి మాత్రమే వసూలు చేయాలని ఈ నిబంధనలు చెబుతున్నాయి. వసూలు చేసిన ఫీజు వివరాలు మరియు వాస్తవ వ్యయాన్ని పాఠశాల వెబ్సైట్లో ఉంచాలి. పాఠశాల విద్యా శాఖ రూపొందించిన మాడ్యూల్లో ప్రదర్శించాలి.
జివో నెం.1 ప్రకారం ఆయా పాఠశాలల యాజమాన్యాలు వసూలు చేసిన రుసుములలో 5% యాజమాన్యానికి వ్యక్తిగత ఆదాయంగా కేటాయించాలి. 15% సంస్థల నిర్వహణ కోసం వినియోగించాలి.15% సంస్థ యొక్క అభివృద్ధి కార్యకలాపాల కోసం కేటాయించాలి.50% సిబ్బంది జీతాల చెల్లింపునకు కేటాయించాలి. 15% గ్రాట్యుటీ, ఉపాధ్యాయుల ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం మొదలైన సిబ్బంది ప్రయోజనాల కోసం కేటాయించాల్సి ఉండగా ఈ మొత్తాన్ని ఆయా యాజమాన్యాలు కొల్లగొడుతున్నాయి. పై చట్టాలు,జీవోలూ ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజుల వసూలు పారదర్శకంగా ఉండాలని చెబుతున్నాయి. కానీ రాష్ట్రంలోని మెజారిటీ పాఠశాలు కనీసం నిబంధనలు పాటించడం లేదు.పాఠశాలల్లో పాలక మండళ్ళు ఏర్పాటు చేయడం లేదు.ఫీజులు నిర్ణయించడంలో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయడం లేదు.అప్రజాస్వామికంగా, అన్యాయంగా వ్యవహరిస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు.రికార్డులలో నమోదు చేయకుండా మోసం చేస్తున్నారు.
విద్యాసంవత్సరం జూన్ 15 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రైమరీ, ఉన్నత పాఠశాలల పిల్లల చదువుకు వెచ్చించే ఖర్చులు విపరీతంగా పెరిగాయి .ఈ ఏడాది ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తల్లి తండ్రులు బెంబేలెత్తించే విధం గా అడ్మిషన్, డొనేషన్ ఫీజులను పెంచారు. కాపిటేషన్ ఫీజులతో పాటు పుస్తకాలు,యూనిఫాం,బెల్ట్, టై, షూ, వాటర్ బాటిల్స్, లంచ్ బ్యాగు, పుస్తకాల బ్యాగు తదితర వస్తువులు పాఠశాల కౌంటర్ లోనె కొనుగోలు చేయాలని అంటుడంటంతో తల్లిదండ్రులపై అదనపు భారం పడుతుంది.నేడు ప్రైవేటు పాఠశాలల్లో రూ.10 వేల నుంచి రూ.లక్షకు పైగా ఫీజులున్నాయి. ఐఐటీ, ట్యూషన్, సాంస్కృతిక కార్యక్రమాలు, కరాటే తదితర అంశాల పేరుతో అదనంగా రూ.10 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. తెలంగాణ జిల్లాలలోని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో అడ్మీషన్ నమోదు ఫీజుల వివరాలు గమనిస్తే రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.500 నుంచి రూ.1,000 వరకు, ఎంట్రెన్స్ ఫీజు: రూ.400 నుంచి రూ. 1,000 వరకు , అడ్మిషన్ ఫీజు రూ.3,000 నుంచి రూ.15,000 వరకు ,స్పెషల్ ఫీజు రూ.3,000 నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక అసలు కోర్సు ఫీజులు పూర్వ ప్రాథమిక విద్యలో పది వేల నుండి యాబై వేల వరకు, ప్రాథమిక విద్యలో పదిహేను వేల నుండి 75 వేల వరకు, ప్రాథమికోన్నత విద్యలో 25 వేల నుండి లక్ష పదివేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.
పాలకుల వైఫల్యంతోనే ఫీజుల దోపిడీ: నిబంధనలు పాటించని పాఠశాలల అనుమతులు రద్దు చేయాలని చట్టాలు చెబుతున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదు. జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు పర్యవేక్షించాల్సి వుండగా ఆ పని చేయడం లేదు. మండల, జిల్లా స్థాయి అధికారులు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చే లంచాలకు మరిగి తనిఖీలు నిర్వహించడం లేదు. దేశంలో రోజు రోజుకు తీవ్రమవుతున్న ద్రవ్యోల్బణంతో ప్రజల వినియోగ స్థాయి దిగజారి అనేక కష్టాల పాలవు తున్నారు.పాలకులు ఉచితంగా విద్యనందించే బాధ్యత నుండి రోజు రోజుకు వైదొలుగుతూ విద్యా రంగాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పేద మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ రంగ విద్యను కాపాడుకుంటూనే, ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణకై, ప్రైవేటు బడులను ప్రభుత్వ రంగంలో విలీనం చేయాలని, విద్యాహక్కుల పరిరక్షణ తదితర డిమాండ్లతో ఉద్యమించాలి. ఆ ఉద్యమం అంతిమంగా ప్రైవేటు కార్పొరేట్ విద్యావిధానం రద్దు వైపుగా సాగాలి.
-కోట ఆనంద్
ప్రొగ్రెస్సివ్ స్టూడెంట్స్ యూనియన్.




