ప్రొఫెసర్‌ సాయిబాబా రాజ్య వ్యవస్థీకృత హింస, నిర్బంధం కారణంగా అమరుడైన సందర్భంగా గత అక్టోబర్‌ నుంచి విజయవాడ బుక్‌ ఫెయిర్‌ (జనవరి మొదటి వారం) దాకా కవులు, రచయితలు బుద్ధిజీవుల్లో ఊహించిన దానికన్నా ఎక్కువగా స్పందన వచ్చింది. ఒక నెల కూడా గడవకుండా ఫిబ్రవరి 8, 9 తేదీల్లో సాయిబాబా అమరత్వం సందర్భంలో సంక్షోభ కాలంలో సాహిత్యం భూమిక’ గురించి విరసం ఏర్పాటు చేసిన రెండు రోజుల సాహిత్య పాఠశాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 600 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు. అందులో యువత ఎక్కువగా పాల్గొన్నారు. ఈ సాహిత్య పాఠశాలను ప్రారంభిస్తూ సాయి సహచరి వసంత ‘మాకు ఏర్పడిన అనుబంధమే సాహిత్య, సమాజాల పట్ల మాకున్న ఆసక్తి’ అని, అది ఎట్లా గాఢమై పోతుంటే మా ప్రేమ అట్లా వికసిస్తూ పోయిందని చలం, శ్రీశ్రీ, రావిశాస్త్రి వంటి రచయితల ఉదాహరణలు చెప్పింది. ఈ ముగ్గురు రచయితలు స్త్రీలు, కార్మిక వర్గం, అధోలోకం పీడితుల గురించి రాసిన వాళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు, సాయిబాబా తన బాల్యం నుంచి అట్టడుగు వర్గాల ప్రజల గురించి ఆందోళన చెందుతూ తన శరీరంలో వచ్చిన వైకల్యం వంటిదే ఈ సమాజంలో దోపిడీ పీడనల వ్యవస్థ వలన వచ్చిన వైకల్యం అని, దీనిని అధిగమించే పోరాటమే చైతన్య పూర్వకంగా చేపట్టడం బుద్ధిజీవుల కర్తవ్యమని తన జీవితమంతా ప్రజా ఉద్యమాల నిర్మాణానికి అంకితం చేశాడు. ఒకవైపు ఆట మాట పాట బంద్‌ నిశ్శబ్ద నిర్బంధం నుంచి, అజ్ఞాతం నుంచి పాట అయి తిరిగి వచ్చిన శబ్దం, మండల్‌ కమిషన్‌ సిఫారసులు, మరొకవైపు ప్రపంచీకరణ, బాబ్రీ మసీదు విధ్వంసం… రాజ్యానికి ఉన్న సంక్షేమం, లౌకిక ప్రజాస్వామ్య ముసుగును తొలగించాయి.

అప్పటి నుంచీ, పదేళ్లు జైలు నిర్బంధం తర్వాత విడుదలై పట్టుమని ఆరు నెలలు కూడా బయట ప్రాణాలతో ఉండలేకపోయినా ఆయన ప్రజల మీద యుద్ధాన్ని ప్రకటించిన కార్పొరేట్ల దళారీ ప్రభుత్వం ‘‘యుద్ధ ఖైదీగా వ్యవహరించిన తీరుతో ఒక గుణపాఠంగా తీసుకున్నదేమిటంటే ‘పౌరులమని అనుకునే వారెవరు ఆదివాసుల గురించి పట్టించుకోకుండా ఉండలేరు’ అని. భూమి చాలా విస్తారంగా ఉంటుంది కానీ, దానికి ఒక భూమధ్య రేఖ ఉంటుంది. భూగోళానికి ఒక యాక్సిస్‌ ఉంటుంది. సూర్యుని చుట్టూ పరిభ్రమించే క్రమంలో భూమి మీద ప్రసరించే వెలుగునీడలు కాలమార్పుకు కారణం అవుతాయి. మనదేశంలో తూర్పు మధ్య భారతాల్లో భూగోళ పరిభ్రమణం లోని వెలుగునీడల ఘర్షణను, మార్పును, దాని వెనక ఉన్న చలన సూత్రాన్ని పట్టుకున్నది నక్సల్బరీ సంతాలులు, వారికా చైతన్యాన్ని అందించిన చారుమజుందారు ఆచరణ. తెలంగాణ వంటి మైదాన ప్రాంతాల్లో విస్తరించిన నాడు కూడా దాని ఆయువుపట్టు ప్రజా విముక్తి సైన్య వ్యూహంతోనే కాదు, రాజకీయ వ్యూహంతో కూడా అడవుల్లో ఉన్నది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ వ్యూహమంతా ద్రవ్య పెట్టుబడి దేశంలోని అడవులు, నదులు, భూమి, భూగర్భాలను ఛేదించి, శ్రమజీవుల శ్రమనంతా వెచ్చించి కొల్లగొట్టడం మీద కేంద్రీకృతమైంది. ప్రపంచీకరణ విధ్వంసకర అభివృద్ధి నమూనాలు రూపొందించిన ఇద్దరు మేధావులు దానికి ఒకే ఒక్క అంతర్గత పెను శత్రువు మావోయిస్టు ప్రమాదం అని గ్రహించారు. ఎందుకంటే ద్రవ్య పెట్టుబడి ప్రవహించే తూర్పు మధ్య భారత అడవుల్లో ఆదివాసీల మధ్యన మావోయిస్టులు ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య ప్రయోగం ప్రారంభించారు.

గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌ ప్రారంభించిన మన్మోహన్‌ చిదంబరం ప్రభుత్వం – అమెరికా సామ్రాజ్యవాదం అందించిన ‘ఆక్రమించు, తొలగించు, నీ ‘అభివృద్ధి’ ప్రారంభించు అడవుల నాక్రమించు, నీళ్లను తోడెయ్యి, చేపలను పట్టు. ఖాళీ అయిన స్థలంలో నీ కార్పొరేట్‌ దోపిడీ నిరాటంకంగా కొనసాగించు. కర్నూలులో అమరుడు సాయిబాబా ప్రాంగణంతో సాహిత్య పాఠశాల జరుగుతున్న రెండవ రోజు రెండు అంశాలు కొట్టవచ్చినట్లు కనిపించాయి. ఒకటి తొమ్మిదవ తేదీ ఉదయం నుంచే బీజాపూర్‌ జిల్లాలో నేషనల్‌ పార్క్‌ ఏరియాలో ఎన్‌కౌంటర్‌ ప్రారంభమై సభ ముగిసే కాలానికి 31 మంది మావోయిస్టులు మరణించారని ఐజి సుందరరాజ్‌ ప్రకటించాడు. వీళ్ళందరికందరు ఆదివాసులేనని తర్వాత తెలిసింది.

‘సాయిబాబా మరణం పట్ల అంతగా స్పందించిన తెలుగు సాహిత్యలోకం నుంచి కూడా స్కైబాబా, కెంగర మోహన్‌ తప్ప ఏ ఒక్క లబ్ద ప్రతిష్ట కవి, రచయిత కూడా సాహిత్యంలో సంక్షోభాన్ని చర్చించడానికి రాలేదు.’ మన సంతాపం, సంఫీుభావం అంతా సాయిబాబా గురించేనా మన సంఫీుభావం ఆయన విశ్వాసాల పట్ల కాదా! ఆదివాసుల కోసం ఆయన ఇంకా 14, 15 ఏళ్ల వయస్సులోనే బి.డి. శర్మ ప్రసంగాన్ని అనుసరిస్తూ జీవితమంతా అంకితమైపోయాడు. ఆదివాసులు గురించి పట్టించుకోనివాడు నాగరికుడెట్లా అవుతాడని ఆఖరి మాటగా చెప్పి పోయాడు. ఆ విలువల గురించి, ఆ విశ్వాసాల గురించి ఏమందాం. సంక్షోభం మన దాకా రాలేదా! మనం కడుపులో చల్ల కదలకుండా ఉన్నామా!

ఇవాళ కనీసం రెండు దిన పత్రికలు ఒకటి తెలుగు, మరొకటి ఇంగ్లీష్‌ దిన పత్రికలు చదివి ‘ప్రధాన జనజీవన స్రవంతి’ అవి ఎంతటి స్థితిస్థాపకత్వాన్ని నిలువ నీరయ్యే స్థితిని కోరుకుంటున్నావో అర్థమైంది. అందులోనూ ఇంగ్లిష్‌ దినపత్రిక 1980ల నిర్బంధ కాలంలో వరంగల్‌ లో పియుడిఆర్‌ సి.వి. సుబ్బారావు చెప్పిన మాటలను తలపించింది. ‘అర్ధరాత్రి పూట మూడు హత్యలు చెయ్‌, ఇంగ్లిషు మాట్లాడు. ఎవ్వరూ నిన్ను ముట్టుకోరు. లెఫ్ట్వాంగ్‌ ఎక్స్‌ మిజం – మావోయిస్టు మెసేస్‌ వామపక్ష అతివాదం / ఉగ్రవాదం, మావోయిస్టు పెను ప్రమాదం – కార్పొరేట్ల ఇంగ్లిష్‌ మీడియాకు ఎంత చురుక్కుమనిపిస్తుదంటే ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏకంగా ‘టర్నింగ్‌ ఆన్‌ ది హీట్‌’ సంపాదకీయం రాసింది. ‘శభాష్‌, ఈ వేడి మీదనే ఇంకా … కానీయ్‌, మావోయిస్టుల మీద ఈ ఉక్కు పదఘట్టనను కొనసాగించు. అది తన లక్ష్యాన్ని తగ్గించకూడదు. అంటూనే సివిలియన్స్‌ను మాత్రం ఈ ప్రమాదం నుంచి కాపాడు అంటున్నది.

బహుశా రోమన్‌ సామ్రాజ్యంలో స్పార్టకస్‌ తిరుగుబాటును అణచివేస్తుంటే సెనేటర్లందరూ ఇటువంటి ఆనందాన్ని వ్యక్తం చేసి ఉంటారు. ఇంకా సాక్షి ప్రతినిధి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి రాసిన రిపోర్టు ‘బిట్వీన్‌ ది లైన్స్‌’ మనం చదివితే ‘నీళ్లు తోడె య్యి, చేపలు దొరుకుతాయి’ అనే నీతి ఎంతగా అమలవుతున్నదో అర్థమవుతున్నది. నీళ్లు ఉంటేనే చేపలు బతుకుతాయి. చేపలు నీళ్లను  శుభ్రం చేస్తాయి. ఆదివాసుల కోసం ఆదివాసులతోపాటు పోరాడడానికి మావోయిస్టులు ఉన్నారు. ఆదివాసులు ఈ దేశ అడవుల్లోని ప్రకృతి సంపదను వేల సంవత్సరాలుగా తమ చెమట, నెత్తురుతో కాపాడుతున్నారు. ఇప్పడయితే 2023 డిసెంబర్‌ నుంచి ఇల్లు కూడా పదిలంగాని అడవిలో, తునికాకు ఏరడానికి పోయినా ఎన్‌కౌంటర్‌ అయ్యే స్థితిలో, ఆకాశం కూడా నీడ కాదు డ్రోనుల నుంచి బాంబులు రాలే స్థితిలో, ఒళ్ళో పాపకు తుపాకీ బుల్లెట్‌ ప్రాణాంతకం అయ్యే స్థితిలో, బేస్‌ ఏరియాలోని రాకెట్‌ లాంచర్‌ నుంచి బాంబులు వచ్చి చనిపోయే స్థితిలో అడవి మనుషులు అల్లాడుతున్నారు. అయినా జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. మేము ఈ అడవి సంపదలో భాగం కూడా కాదా అని అడిగిన మూలవాసీ బచావో మంచ్‌ను నిషేధించారు.

నలుగురు తొలి రోజుననే పోలీసు తూటాలకు బలి అయిన అమరుల సాక్షిగా ప్రారంభమైన సిలింగేర్‌ పోరాటం విశాల ప్రజా ఉద్యమంగా ఈ మారణకాండ మధ్యనే కొనసాగుతున్నది. మన ప్రజల సంపదను, శ్రమను, సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం. దీనిని రాజ్యం వ్యూహ రీత్యా అంచనా వేయలేదని కాదు, వేసింది కనుకనే మావోయిస్టు రహిత భారత్‌ అని ఆదివాసి రహిత భారత్‌ కోసం ఈ ఆక్రమణ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నది. ఈ క్రమంలో మావోయిస్టుల వేటలో ఆదివాసులు ఎందరు ఎక్కువమంది చనిపోతే అందరు ఆదివాసుల దేహంలో భాగమైన స్థలం ఖాళీ అవుతుంది. మావోయిస్టులు ఎందరు ఉంటారు. ప్రభుత్వాలు లెక్కలు చెబుతూనే ఉన్నాయి. ‘సాక్షి’ ఏమని రాస్తుందంటే వాళ్ల లక్ష్యమంతా తెలంగాణ నుంచి ఈ ప్రాంతంలో ఉన్న 20 మంది మావోయిస్టులను తుదముట్టించడం ఎందుకంటే ఈ నేషనల్‌ పార్క్‌ ఉన్న దక్షిణ బస్తర్‌ ఏరియాలో ఉన్న తెలంగాణ నుంచి వచ్చిన మావోయిస్టు పార్టీ నాయకత్వం అంతా ఉంది. మృతుల్లో బండి ప్రకాశ్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ రాష్ట్ర కమిటీ నాయకుడున్నాడని అనుమానించి వెతికారు. ఇది ఒక విచిత్రమైన స్థితి. మావోయిస్టు అనుకొని చంపబడుతున్న వాళ్లంతా ఆదివాసులు అవుతున్నారు. ఆదివాసులంతా మావోయిస్టులు కావడం, మావోయిస్టులంతా ఆదివాసులు కావడం అంటే ఇదేనేమో. రాజ్యానికేమో ఇద్దరూ ఒకటే. కార్పొరేట్లకు ఇద్దరూ ఒకటే. ఎందుకంటే ఏడు దళాలుగా బస్తర్లో ప్రవేశించిన విప్లవకారులు ఇప్పుడు చైతన్య పూర్వకంగా ఆదివాసుల్లో కలిసిపోయి జల్‌ జంగల్‌ జమీన్‌ ఇజ్జత్‌లను మాత్రమే కాదు జనతన రాజ్యాన్ని కాపాడుకునే ఆదివాసులుగా లక్షల సంఖ్యలుగా సంలీనం అయిపోయారు.  ఇప్పుడు నిజానికి ఈ 13 నెలలుగా సిఆర్‌పిఎఫ్‌ వంటి కేంద్ర అర్ధ సైనిక బలగాలు ఉన్నా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం గాలింపులకు, లక్ష్యాలు సాధించడానికి పంపిస్తున్నది. సి. 60 కమాండోలు, డిఆర్‌జి ఫోర్స్‌, బస్తర్‌ ఫైటర్స్‌ వంటి స్థానిక, మాజీ మావోయిస్టు సైనిక శిక్షణ, కలిగిన బలగాలనే. ఇదివరకే రాసినట్లుగా అటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఇందులో ఇద్దరు జవాన్లు బలైపోయినా వాళ్లకి ఏమీ కన్నీళ్లు లేవు. మందు పాతరలో వాళ్ళు చనిపోయిన సందర్భంలో రాష్ట్రపతి, అమిత్‌ షా మొదలు సుందరరాజ్‌ కార్చిన కన్నీరు, చేసిన వ్యాఖ్యల గురించి ఇదివరకు రాసి ఉన్నాను. కానీ పోలీసుల నైతిక శక్తిని కాపాడడానికి గాయపడిన వారిని హెలికాప్టర్లలో తెచ్చి జిల్లా కేంద్రంలోనో, రాయపూర్లోనో చికిత్స చేయిస్తారు. ఇప్పుడు ఈ ఇద్దరు జవాన్ల మృతదేహాలను రాష్ట్ర డిజిపి, ఐజి సుందర రాజ్‌ మీడియా వీడియోల కోసం మోసారు. ఇక 31 మంది ఆదివాసుల మృతదేహాలు మాత్రం మూడు రోజులు ఆసుపత్రి శవాగారాల్లో కూడా స్థలం లేకుండా గుర్తింపు కోసం అడవిలో కుళ్ళిపోయాయి. ఆ ఆదివాసి ప్రాంతాల కింద ఉన్న ఉక్కు గా మారే ఇనుము, అల్యూమినియంకు మాత్రం 25 శాతం సుంకం పెంచబోతున్నానని అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరిస్తున్నాయి బేరమాడడానికి అవును మన దేశ ప్రధాని మోడీ వెల్లివచ్చాడు.

ఇంతకూ ఘటన ఎటా జరిగిందో , మృతులెవరో కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మావోయిస్ట్‌) సౌత్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో ఫిబ్రవరి 13, 2025 ఇచ్చిన ప్రకటన వల్లగాని మనకు తెలియలేదు. దాని ప్రకారం..

..ఫిబ్రవరి 9వ తేదీన బీజాపూర్‌ జిల్లాలోని నేషనల్‌ పార్క్‌ ప్రాంతంలోని తకమెట్ట గ్రామ సమీపంలోని అడవిలో మా పార్టీ కార్యకర్తలు ప్రజల సమస్యల పరిష్కారానికి గుమిగూడారు. ఈ విషయంపై ఇన్‌ఫార్మర్‌ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వేలాది మంది పోలీసులను పంపి సీజ్‌ చేశారు. అకస్మాత్తుగా పోలీసులు మా సహచరులపై కాల్పులు ప్రారంభించారు. ఆత్మరక్షణ కోసం మా సహచరులు ప్రతిఘటించారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, మరికొందరు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ప్రతిఘటనలో మా సహచరులు 12 మంది అమరులయ్యారు. ఇందులో చాలా మంది సహచరుల వద్ద ఆయుధాలు కూడా లేవు, కొంతమంది గాయపడ్డారు. వారందరినీ పట్టుకుని దారుణంగా హత్య చేశారు. ఇందులో ముగ్గురు గ్రామస్తులు కూడా హత్యకు గురయ్యారు. 21 మంది సహచరుల వివరాలు ఇలా ఉన్నాయి – కామ్రేడ్స్‌ 1. కల్ము ఉంగల్‌ (డివిసి సెక్రటరీ), 2. ఓయం సుభాష్‌ (ఎసిఎం), 3. హేమ్లా మంగు (పిపిసిఎం), 4. మద్వి బజ్ని (ఎసిఎం), 5. ఆప్కా సోను (ఎసిఎం), 6. ఎమ్‌పి కమ్‌బారు (యుఐకా సోంబరు) (పిఎం) 9. పోయం మైని (పిఎం) 10. హేమల జ్యోతి (పిఎం) 11. పోతం కేశ (పిఎం) 12. మారిa రాజు (పిఎం) 13. మద్వి సోను (పిఎం) 14. దేశు (పిఎం) 15. పూనెం రఘు (పిఎం) 16. పిఎం, 17. పిఎం, 18. మద్వి సంజాతి (పిఎం) 19. పూనెం మైని (పిఎం) 20. పోడియం శాంతి (పిఎల్‌జిఎ సభ్యుడు) 21. కుమ్మ సంజయ్‌ (పిఎల్‌జిఎ సభ్యుడు), ఈ సంఘటనలో ఎక్కువ మంది వ్యక్తులు పట్టుబడ్డారు, హింసించబడ్డారు మరియు చంపబడ్డారు. ఈ కారణంగా, గుర్తింపు కూడా కష్టంగా మారింది. దీన్నిబట్టి ప్రభుత్వ ఫాసిస్టు మనస్తత్వం బట్టబయలు అవుతోంది. ఈ దారుణమైన హత్యాకాండ పౌర సమాజంలో జరగకూడదు. అమరులైన సహచరులందరికీ నివాళులర్పిస్తామన్నారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం..అని విప్లవకారులు ప్రకటించారు.

ఫిబ్రవరి 1న బీజాపూర్‌ జిల్లా తోడ్కా కోర్చిల్‌ గ్రామాల ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 24 మంది గ్రామస్తులు గాయపడగా, 8 మంది గ్రామస్థులు మరణించారు. 67 మంది గ్రామస్తులను పట్టుకుని, చిత్రహింసలకు గురిచేసి, కొంత మందిని జైల్లో పెట్టి, లొంగిపోయేలా చూపించారు.

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం టైగర్‌ ప్రాజెక్ట్‌ పేరుతో నేషనల్‌ పార్క్‌ ప్రాంతంలోని 72 గ్రామాలను ఖాళీ చేయాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా ఈ హత్యాకాండ జరిగింది.

జనవరి 16న ఊసూరు బ్లాక్‌లోని సింగనపల్లి గ్రామస్తులు నలుగురు హత్యకు గురయ్యారు. మహిళను చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు.

ఇప్పుడు మన మధ్యతరగతి బుద్ధిజీవుల బతుకంతా మోదీ, ట్రంప్‌ ఒప్పందాల మీద ఆధారపడి ఉన్నదని మనం విశ్లేషించుకుంటున్నాం. వైట్‌ హౌస్‌ నుంచి, సంసద్‌ సదన్‌ నుంచి, విమానాల లోంచి, ఎయిట్‌ లైనర్‌ రోడ్డుపై వేగంగా పరుగెత్తే కార్ల నుంచి, వందే భారత్‌ రైళ్ల నుంచి చూస్తే సంక్షోభం ఎట్లా అర్థం అవుతుంది. ఐతే వైట్‌ హౌజ్‌కు, డిఫెన్స్‌ బడ్జెట్‌ 13 శాతం పెంచిన భారత పాలకులకు సంక్షోభం తెలుసు. ఎందుకంటే వాళ్లు సామ్రాజ్యవాద కార్పొరేట్ల దళారులు కనుక వాళ్లు నిషేధించిన మావోయిస్టు పార్టీకి, మూలవాసీ బచావో మంచ్‌కు జార్ఖండ్‌లో ఎం.కె.ఎం.ఎస్‌ కు, పోరాడుతున్న, అమరులైన ఆదివాసులకు సంక్షోభం గురించి తెలుసు. అందుకే అంత భీకర ఆక్రమణ ఆఖరి యుద్ధం.

గాజా ఇజ్రాయిల్లో కాల్పుల విరమణ జరిగాక కూడ, హమాస్‌ బందీలను ఒప్పందం ప్రకారం వదిలేస్తున్నా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దగ్గరికి ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు వెళ్లినపుడు.. అమెరికా గాజాను మధ్యప్రాచ్యంలో గాజాను ఒక  నదీతట పర్యాటక ప్రాంతంగా మారుస్తుంది. అందులో అందరూ ఉండవచ్చు, కానీ పాలస్తీనియన్లు మాత్రం కాదన్నాడు. అది నెతన్యాహుకు, ఇజ్రాయిల్‌ పాలకులకు సమ్మతమే.

అదే మాట భారత కాందిశీకుల కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసి సైనిక విమానంలో పంపిన మోడీ హౌడీ ట్రంప్‌ ద్విగుణీకృత అధికారంతో కార్పొరేట్ల అధిపతిగా దళారీ మోడీతో, బస్తర్‌ గురించి అనలేదనే గ్యారంటీ లేదు. ఇప్పుడైనా మనం యుద్ధంలోకి దిగుతామా? ప్రజల ప్రజాస్వామ్యాన్ని, ఆదివాసీ ప్రజల జనతన రాజ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మన ప్రకృతి సంపదను, శ్రామిక శక్తిని కాపాడుకుంటామా? ఆదివాసులకోసం కాదు – మన కోసం కూడ. నాకు కావాల్సింది సానుభూతికాదు సంఫీుభావం అన్నాడు సాయిబాబా. వసంత కూడ అదే మాట చెప్పింది. బస్తర్లో అమరులైన వాళ్లు, పోరాడుతున్నవాళ్లు, ఆదివాసులైనా, మావోయిస్టులైనా అదే చెప్తున్నారు. సంఫీుభావం కావాలని. నిషేధిత మూలవాసీ బచావో మంచ్‌ మీద నిషేధం తొలగించాలని, కిసాన్‌ ఆందోళనను బలపరచినట్లే సిలింగేర్‌ పోరాటాన్ని బలపరచాలనే ఆశయంతో అమరులైన, పోరాడుతున్న ఆదివాసీలు మన నుంచి ఆశిస్తున్నారు. 

Leave a Reply