గత ఆరు నెలల కాలంలో బస్తర్‌లో భద్రతా దళాలు 150 మందికి పైగా ప్రజలను నిర్భయంగా హత్య చేశాయన్న దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ ప్రజలందరి దృష్టికి తీసుకురావాలనుకుంటోంది. బస్తర్‌లో మానవహక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న, పియుసిఎల్‌కు చెందిన యువ ఆదివాసీ కార్యకర్త, 26 ఏళ్ల సునీతా పొట్టామి మూల్‌వాసీ బచావో మంచ్ సీనియర్ కార్యకర్త సుర్జు టెకామ్, ఇంకా మరికొంతమందిని వివక్షారహితంగా అరెస్టు చేయడంపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
2017లో బస్తర్‌లో జరిగిన చట్టాతీత హత్యలపై సునీతా పొట్టాం మైనర్‌గా వున్నప్పుడు మరో కార్యకర్తతో కలిసి సుప్రీంకోర్టులో పిఐఎల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, 2022లో కూడా తనపై పెట్టిన తప్పుడు కేసులతో పాటు అదే తరహా ఫిర్యాదులతో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వెళ్లింది. 2016లో బీజాపూర్‌లో జరిగిన లైంగిక హింసను కూడా నిజనిర్ధారణల ద్వారా వెల్లడించింది.
ఈ ఘటనల్లో మృతిచెందిన వారందరూ సాయుధ మావోయిస్టులని రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు చెబుతున్నప్పటికీ, పియుసిఎల్ రాష్ట్ర విభాగాలు, జర్నలిస్టులు, ఇతర వ్యక్తులు స్వతంత్రంగా జరిపిన దర్యాప్తులో, చనిపోయిన వారిలో చాలామంది సాధారణ గ్రామస్తులని వారు అడవుల్లో టెండూ ఆకులు లేదా మహువా పువ్వులు సేకరించడం వంటి సాధారణ గ్రామీణ కార్యకలాపాల్లో వున్నారని తేలింది.
వారిలో కొందరు యువకులు, మైనర్లు అని కూడా ఖచ్చితంగా గుర్తించారు. అనేక చర్యలలో ‘యూనిఫార్మ్ ధరించిన మావోయిస్టులు’ కూడా బందీలుగా ఉండవచ్చని, భద్రతాదళాలకు వారు ఎటువంటి ముప్పు కలిగించలేదని తేలింది. భద్రతా దళాలపై ఘోరమైన నేరాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, రాజ్యం ఏ స్వతంత్ర దర్యాప్తును ఆదేశించలేదు, గ్రామస్తుల ఫిర్యాదులపై ఎటువంటి దర్యాప్తు చేయలేదు.
నిజానికి, తమ స్వంత పౌరుల ప్రాణాలను పణంగా పెట్టినప్పటికీ, ఇటీవలి ఎన్నికల సందర్భంగా చేసిన ఛత్తీస్‌గఢ్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రతా దళాలకు మాత్రమే పూర్తి ప్రశంసలు, వారి “విజయం” పై అపరిమిత ఉత్సాహం ప్రకటించారు.
మరణం సంభవించిన ప్రతి ఎన్‌కౌంటరు గురించి, భద్రతా దళాలు అధిక బలప్రయోగాన్ని చేయడం గురించి స్వతంత్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఈ క్రింద పేర్కొన్న కొన్ని ఘటనలు స్పష్టంగా కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలను లేవనెత్తాయి. –
చట్టాతీత హత్యలు:
● ఈ ఏడాది జనవరి 1వ తేదీన బీజాపూర్ జిల్లాలోని ముద్వెండిలో జరిగిన ఎన్‌కౌంటరులో ఆరునెలల శిశువు మృతి చెందింది. కానీ, ప్రత్యక్ష సాక్షులైన గ్రామస్థులు ఎటువంటి ఎన్కౌంటర్ జరగలేదని, తుపాకి పేల్చడానికి తహతహలాడే సాయుధ పారామిలిటరీ కమాండో పగటిపూట ఆ శిశువు తల్లిపై కాల్పులు జరిపాడని చెప్పారు.
● ఈ శిశువు మృతికి నిరసనగా సమావేశమైన గ్రామస్తులను బెల్లాం-నెంద్రలో కాల్చిచంపడంతో ఈ విషాదం మరింత తీవ్రమైంది. జనవరి 20న జరిగిన కాల్పుల్లో ఇద్దరు మైనర్లతో సహా ముగ్గురు మరణించారు.
ఫిబ్రవరి,25న కోయెలిబేడ(కాంకేర్ జిల్లా)లోని భోమ్ర-హుర్తారై గ్రామాలమధ్య హత్యకు గురైన ముగ్గురు వ్యక్తులను మావోయిస్టులుగా గుర్తించడాన్ని కోయెలిబేడలోని మార్డా గ్రామం, అంటాగఢ్‌లోని పెరావి గ్రామానికి చెందిన వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. వారు తమ ఆధార్‌కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్‌లు, రేషన్‌కార్డులను చూపించారు. వారు తునికాకులను కట్టలు కట్టడం కోసం తాళ్ళు సేకరించడానికి 2 రోజుల పాటు అటవీ ప్రాంతానికి వెళ్లిన సాధారణ గ్రామస్తులు అని పేర్కొన్నారు.
● ఏప్రిల్ 2న బీజాపూర్ జిల్లాలోని కోర్చోలీలో జరిగిన ఎన్కౌంటర్లో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తరువాత మరణించారు. ఈ ఘటనలో చనిపోయినవారిలో కమలి కుంజం అనే యువతి మూగ-చెవిటి వైకల్యం గల అమ్మాయని, ఆమెను తుపాకీతో బెదిరించి బలవంతంగా ఈడ్చుకెళ్లారని, ఆరుగురు పిల్లల తండ్రి అయిన చైతు పోట్టమ్ కూడా చనిపోయాడని గ్రామస్తులు విలేకరులకు తెలిపారు.
● పిడియాలో మే10 న పన్నెండు మంది మృతి: బీజాపుర్‌లోని పిడియా గ్రామంలో 2024 మే 10న జరిగిన ఘటనలో 12 మందిని భద్రతాదళాలు హత్య చేశాయి. ఈ ఘటనకు సంబంధించి ఇతర విలేఖరులు, పాత్రికేయులు కనుగొన్న వాస్తవాలను పరిశీలించిన పియుసిఎల్ రాష్ట్ర విభాగం మరణించినవారందరూ అడవుల్లో తునికాకులు సేకరించడానికి వెళ్ళిన గ్రామస్తులు అని నిర్ధారించింది.
మరణించిన వారిలో పదిమంది సమీపంలోని పిడియా, ఇటవార్ గ్రామ నివాసులని, మిగిలిన ఇద్దరు ఆ వూరికి అతిథులుగా వచ్చారని, వారికి నిషేధిత సంస్థతో సంబంధం వుండవచ్చని తెలిపారు. అడవులకు చేరుకున్న భద్రతా దళాలు తమను చూసి భయంతో పరుగెత్తిపోయే గ్రామస్తులను చాలా దూరం వరకు వెంటాడి చంపుతాయి. ఇలా జరిగిన కాల్పుల్లో ఆరుగురు గ్రామస్తులు గాయపడ్డారు. 50 నుంచి 100 మందిని పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. చాలా మందిని విడుదల చేసినప్పటికీ, ఆ తరువాత కొంతమందిని సంబంధం లేని కేసుల్లో అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
వైమానిక బాంబు దాడుల ఘటనలు
● మే 12 బొగ్డా గ్రామంలో (మాడ్ ప్రాంతం) 11, 12 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు బురదలో మునిగి పేలకుండా వుండిపోయిన ఆర్‌పిజి(రాకెట్‌ప్రొపెల్డ్‌గన్)తో ఆడుకుంటున్నప్పుడు మరణించారు. నక్సలైట్లు పాతిన ఐఈడీ పేలుడులో చిన్నారులు మృతి చెందినట్లుగా ఆ ఘటనను పోలీసులు ప్రకటించారు. గతంలో కూడా ఛత్తీస్‌గఢ్ పియుసిఎల్, విలేఖరులు, గ్రామస్తులు, సామాజిక కార్యకర్తలు బస్తర్‌లో వైమానిక ఆయుధాల వినియోగం, బాంబు దాడుల అంశాన్ని లేవనెత్తారు.
It has been denied but there is clear evidence that this is happening in this region. This is a clear violation of the law. In 2022 PUCL Chhattisgarh had lodged a complaint with the NHRC in this regard. But the security forces were given a clean chit by the NHRC saying that such an incident had not taken place, by relying on the police version.
అలా జరిగిందనడాన్ని పోలీసు వర్గాలు తిరస్కరించాయి కానీ ఈ ప్రాంతంలో అలా జరుగుతున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇది స్పష్టంగా చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. 2022లో పియుసిఎల్, ఛత్తీస్‌గఢ్ విభాగం ఈ విషయంలో ఎన్‌హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసుల కథనం మీద ఆధారపడిన ఎన్‌హెచ్‌ఆర్‌సి అలాంటి ఘటన జరగలేదని భద్రతా దళాలను నిర్దోషులుగా ప్రకటించింది.
● మే 24వ తేదీన మాడ్ ప్రాంతంలోని మారుమూల గ్రామాలలో పలు ఘటనలు చోటు చేసుకొన్నాయి. బోడెగా, రేకావయ్య గ్రామాల్లో యువతులను అదుపులోకి తీసుకున్నారు. 40 మందిని అరెస్టు చేసి, వారు లొంగిపోయారని చూపించారు. ఒక యువతికి యూనిఫామ్ వేసి, లొంగిపోయిన మావోయిస్టుగా చూపించారు. ప్రస్తుతం ఆమె జగదల్‌పుర్ జైలులో ఉన్నారు.
● రేకవియాలో 10 మంది మృతి చెందగా, పోలీసులు వారందరినీ నక్సల్స్ అని పేర్కొన్నారు, కాని గ్రామస్తులు వారిలో నలుగురు సాధారణ గ్రామస్తులు అని చెప్పారు.
● అంతేకాక, పోలీసులు ఎన్కౌంటర్లుగా పేర్కొన్న ఘటనలు నిజానికి వారు అరెస్టు చేయగలిగినప్పటికీ చంపిన, నిరాయుధ వ్యక్తుల దారుణ హత్యలు.
ప్రజాస్వామ్య నిరసనలపై దాడులు, కార్యకర్తల అరెస్టులు.
బస్తర్‌లోని సిలంగేర్‌లో తమ గ్రామంలో పోలీసుల శిబిరం ఏర్పాటుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులపై కాల్పులు జరిగి, ముగ్గురు గ్రామస్తులు మరణించిన తర్వాత, మూల్‌వాసీ బచావో మంచ్ అనే యువజన సంస్థ 2022లో ఏర్పడింది. ఆ సంస్థ శాంతియుత ప్రజాస్వామ్య నిరసనలను నిర్వహిస్తోంది.
సీనియర్ ఆదివాసీ కార్యకర్త సుర్జు టెకమ్ సర్వాదివాసీ, మూల్ నివాసీ బచావో మంచ్ – సునీతా పొట్టామ్, రామ్ సింగ్ కడితి, మున్నా లాల్ ఓయం, మంగేష్ ఓయం, గజేంద్ర మాడీ, జోగా కడితి, శంకర్ కొర్రమ్, కమలేష్ కుర్సమ్, లక్మా కొర్రమ్‌ల వంటి 10 మందికి పైగా కార్యకర్తలను అరెస్టు చేసి, అదుపులోకి తీసుకుని, వేధిస్తున్నారు. (ఎన్‌హెచ్‌ఆర్‌సి కి సునీతా పొట్టామ్ లేఖ, పియుసిఎల్ ఛత్తీస్ గఢ్ పత్రికా ప్రకటన). ఆమ్దానీ ప్రాంతం (నెకో జైస్వాల్ ఇనుప ఖనిజ గనులు). జియో సెల్‌టవర్‌ను కాల్చిన ఘటనలో పాల్గొన్నందుకు, ఐపిసి సెక్షన్ 147, 148, 149, 435, యుఎపిఎ సెక్షన్ 10, 13, 38 (2), 39 (2) లకింద అభియోగాలు మోపారు. జగ్ను కౌదే చాలా ప్రముఖుడు, బిఏఎంసిఇఎఫ్ సభ్యుడు, ఆదివాసీ సమాజ్‌లో కార్యనిర్వాహక సభ్యుడు కూడా.
ఎఫ్ఐఆర్ లో మొత్తం 22 మంది పేర్లు ఉన్నాయి. కొండగావ్, నారాయణపుర్ జిల్లాలన్నింటిలో యువకులను అరెస్టు చేసినట్లు నిన్నటి నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఎఫ్ఐఆర్‌లో పేరున్న వారిలో మరొక ప్రముఖ యువ కార్యకర్త, బీకేయూ జిల్లా అధ్యక్షుడు అయిన రుబ్జీ సలాం కూడా ఉన్నారు. గత ఏడాది నారాయణపురంలో జరిగిన మధోనార్ ఆందోళన్ (మైనింగ్, రోడ్లకు వ్యతిరేకంగా)కు వచ్చిన రాకేష్ తికాయత్ పర్యటన ఏర్పాట్లకు భాధ్యత వహించాడు. కాంకేర్ లో ఎల్‌ఎల్‌బి చదువుతున్న ఆయన తునికాకుకు మంచి ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఓ ప్రతినిధి బృందం ఎమ్మెల్యేను కలవడానికి ఏర్పాటు చేశాడు.
బస్తర్‌లోని ఏడు జిల్లాలలో ఒకటి నారాయణపూర్. ఇక్కడే ప్రసిద్ధ మాడ్ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం అత్యధికంగా సైనికీకరణ జరిగిన ప్రాంతం. ప్రస్తుతం అక్కడ అనేక “ఉగ్రవాద నిరోధక” కార్యకలాపాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం శాంతియుత, సైనికీకరణ వ్యతిరేక, మైనింగ్ వ్యతిరేక సామూహిక నిరసనలను నిర్వహించిన చాలా మంది యువకులు అరెస్టు అయ్యారు. వీరిలో మాడ్ బచావో ఆందోళన్‌కు చెందిన లఖ్ము కొర్రమ్, ఇరక్‌భట్టి ఆందోళన్‌కు చెందిన గుడ్డు సలాం, మహదేవ్ ఆందోళన్‌కు చెందిన మహాదేవ్ నేతామ్‌లు ఉన్నారు.
మావోయిస్టులపై పోరాటంలో ఎలాగైనా “విజయాలను” సాధించాలన్న తెగింపుతో భద్రతా దళాలకు వేతనం చెల్లించి చంపించినవారిలో సాధారణ, నిరాయుధ గ్రామస్తులే ఎక్కువ మంది ఉన్నారన్న విషయం స్పష్టమైంది. మృతులు మావోయిస్టులుగా ఉన్నప్పటికీ, వారు నిజంగా భద్రతా దళాలకు ప్రత్యక్ష ముప్పుగా ఉన్నారా లేదా వారు లొంగిపోయి, నిరాయుధులిగా చేసిన తరువాత చంపేశారా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ప్రశ్నలకు ఒక స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్ మాత్రమే సమాధానం ఇవ్వగలదు. అప్పుడే గ్రామస్తులు కూడా చనిపోయినవారి గుర్తింపు, వారి హత్యలకు సంబంధించిన పరిస్థితుల గురించి సాక్ష్యాలను చెప్పగలిగే స్వేచ్ఛను కలిగి ఉంటారు.
ఈ ఘటనలపై స్వతంత్ర విచారణ జరిపేందుకు ప్రయత్నించే బదులు బీజాపూర్‌కు చెందిన సునీతా పొట్టామ్ అనే ప్రముఖ కార్యకర్తను జూన్ 3న అరెస్టు చేయడం ద్వారా ఛత్తీస్‌ఘఢ్ ప్రభుత్వం స్పందించడం ఆందోళన కలిగిస్తోంది. 2016లో బీజాపూర్‌లోని కదేనార్, పల్నార్, కోర్చోలి, ఆంద్రి, పెద్ద కర్మా గ్రామాల్లో గ్రామస్తులను హత్య చేసినందుకు సునీతా నిరసన వ్యక్తం చేశారు. చనిపోయినవారు సాధారణ గ్రామస్తులేనని రుజువులను సేకరించి, వీటిని స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించాలని కోరుతూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ముందు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. చివరకు, ఈ కేసు మరొక కేసు, నందిని సుందర్ & అదర్స్ vs ఛత్తీస్‌గఢ్ (సల్వాజుడమ్ కేసు) తో కలిపి సుప్రీంకోర్టుకు బదిలీ అయింది. ఇప్పటికీ పెండింగ్‌లో వుంది.
న్యాయం అమలవుతేనే బస్తర్‌లో శాంతి నెలకొంటుందని పియుసిఎల్ గట్టిగా నమ్ముతుంది. అంతులేని సైనిక చర్యలు, అడ్డూ ఆపూ లేని గ్రామస్తుల హత్యలు కేవలం స్మశాన నిశ్శబ్దాన్ని, శాంతిని నెలకొల్పడంలోనే విజయం సాధిస్తాయి. న్యాయమైన, శాశ్వత శాంతి కోసం, ప్రభుత్వం సైనిక చర్యలకు అవతల చూడాలి. “ఎన్‌కౌంటర్లు” అని పిలవబడేవాటిలో ఏమి జరిగిందో నిజం తెలుసుకోవడానికి విచారణ కమిషన్‌లను ఏర్పాటు చేసి ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూరగొనాలి.
మావోయిస్టులు ఏకపక్ష కాల్పుల విరమణ జరపాలని పట్టుబట్టకుండా, చర్చలకు అనుకూలమైన విశ్వసనీయ వాతావరణాన్ని ప్రభుత్వం చురుకుగా ఏర్పాటు చేయాలి. ఏ చర్చలోనైనా గ్రామస్తులు, ఆదివాసీసమాజం, మావోయిస్టుల ప్రతినిధులు మొదలైనవారందరూ పాల్గొనాలి. సైనిక శిబిరాల దట్టమైన యంత్రాంగాన్ని నిర్మించడం ద్వారానూ, సాయుధ సిబ్బంది బెటాలియన్లతో నింపడం ద్వారానూ అసంతృప్తిని, సంఘర్షణను అరికట్టడానికి ప్రయత్నించడం శత్రుపూరిత ఆక్రమణకు మాత్రమే పరిస్థితులను సృష్టిస్తుంది. ఇది శాశ్వత శాంతి, భద్రతలకు ఎల్లప్పుడూ హాని కలిగిస్తుంది.
మా డిమాండ్లు:
● రాజ్యం ఉల్లంఘిస్తోన్న జీవించే హక్కు, స్వేచ్ఛల విచ్చలవిడి ఉల్లంఘనను వెంటనే ఆపివేస్తామని భరోసా ఇవ్వాలి!
● సునీతా పొట్టమ్, సుర్జు టెకమ్, ఇతర మూల్‌వాసీ బచావో మంచ్ కార్యకర్తలతో సహా గత కొన్నేళ్లుగా అరెస్టు చేసిన ఆదివాసీ కార్యకర్తలు, అమాయక గ్రామస్తులందరినీ వెంటనే విడుదల చేయాలి. కార్యకర్తలతో సహా ఆదివాసీలపై మోపిన అన్ని తప్పుడు కేసులకు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి, పోలీసు విచారణ చేపట్టాలి.
● పైన పేర్కొన్న అన్ని ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలి. చట్ట పాలన అమలవడానికి ఇది అత్యవసరంగా జరగాలి.
● పైన పేర్కొన్న కేసులన్నింటినీ పరిశీలించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
● అన్ని శత్రుత్వాలను నిలిపివేసి, స్థానిక జనాభా, ఆదివాసీ సమాజం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) తో శాంతి, భద్రతలకు, చర్చలకు పరిస్థితులను కల్పించాలి.
● ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆపేయాలి, మైనింగ్ వ్యతిరేక ఉద్యమంతో సహా ప్రజాస్వామిక ఉద్యమాలపై అన్ని ఆంక్షలను ఎత్తివేయాలి, ప్రభుత్వ విధానాలకు, నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజలు తమ అసమ్మతిని బహిరంగంగా వ్యక్తం చేయడానికి అనుమతించాలి.
తెలుగు: పద్మ కొండిపర్తి