ముక్తవరం పార్థసారథి గారికి శరీరం లేదు. ఒక హోదా లేదు. అవార్డులు, రివార్డులు లేవు. పబ్లిసిటీ లేదు. ప్రచారం లేదు. ముఠాలు లేవు. సాహిత్యమే పార్థసారథి గారు. ఆయనతో మాట్లాడితే సాహిత్యం మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఆయన్ని ఎరిగినవాళ్లు సాహితీ సంపదని ఎంతోకొంత సంగ్రహించకుండా ఉండరు. అందుచేతే ఎరిగినవాళ్లు, ఆయన్ని ఎరగని వాళ్లలా నడుచుకుంటారు. అయినా కించిత్తు కూడా విచారించరు. బావిలో నీళ్లు చేదకపోతే వూట తగ్గిపోతుందేమోనన్నట్టుగా, నిరంతరం ఒక ప్రవాహంలా సాహిత్యాన్ని వెలువరిస్తారు.

ఆర్బిఐ లో అధికారిగా పనిచేయడం వల్లనో జీవితం నేర్పిన సత్యాల కారణంగానో సమాజంలోని అన్ని రుగ్మతలకి కారణం డబ్బు అని నమ్ముతారు. ఈ కారణం చేతే ఆయన ‘బాల్జాక్’ కి అతి చేరువయ్యాడు. బాల్జాక్ బయోగ్రఫీ చెప్పడానికి పూనుకొన్నారు.

మానవ సమాజం ఎంతగా పతనం చెందాలో అంతకంటే ఎక్కువగా పతనమై మనిషిలోని ప్రక•తిని ప్రేమించడం మానేసి మార్కెట్ని, ఆస్తుల్ని, డబ్బుల్ని ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత తనకు తెలువకుండానే డబ్బుకి బానిసగా మారిపోయింది. ఇక్కడ ఏ విలువలూ లేవు. ఏ నీతీ లేదు. ఏ ధర్మమూ లేదు. ఉన్నదల్లా దేవుడు, చట్టం, న్యాయస్థానాలు, జైళ్లు. అసహ్యమైన ఈ వ్యవస్థని ప్రతిఘటిస్తే పాపం పుణ్యం పేరిట దేవుడు చట్టాన్ని ధిక్కరించాలన్న కారణంగా కోర్టులు, జైళ్లు నోళ్లు తెరుచుకుంటాయి. తప్పించుకోవడానికి ఈ భూమి మీద నీకు ఒక్క అడుగు నేల కూడా లేదు. మ•త్యువంటే మనది ఒక బతుకేనా! కుక్కల వలె, నక్కల వలె, సందుల్లో పందుల వలెనని శీశ్రీ అన్నట్లుగా అలాంటి బతుకు బతకడం చావు కంటే దుర్భరమని బాల్జాక్ చెప్పిన జీవిత సత్యాల్ని ఆవిష్కరించారు. మనలో ఎక్కడైనా చీమూ, నెత్తురు మిగిలుంటే నిజంగా నిజంగా మనం బ్రతికుంటే ఈ పరిస్థితి మార్చుకోవాలి అని పరోక్షంగా చెప్పారు.

బాల్జాక్ జీవితం వడ్డించిన విస్తరి కాదు. సాఫీగా సాగలేదు. అతని తల్లిదండ్రులు కూడా డబ్బుని ప్రేమించినంతగా పిల్లల్ని ప్రేమించలేదు. తనకంటే వయసులో పెద్దవాడని తల్లి భర్త మీద అసహనాన్ని పెంచుకుంటుంది. ఆ అసహనం నుంచి తప్పించుకోవడానికో ఏమో బాల్జాక్ తండ్రి డబ్బు సంపాదననే ధ్యేయంగా పెట్టుకొంటాడు. తల్లి నిరాదరణకు గురైన బాల్జాక్ తల్లి ప్రేమ కోసం నిరంతరం తపిస్తాడు. చిన్నప్పుడే అరేబియన్ నైట్స్ చదివి ఒక ఊహా ప్రపంచాన్ని నిర్మించుకుంటాడు. ఇది అతనికి ఒక లేపనం లాంటిది. రచయితగా ఎదగడానికి తోడ్పడింది. అయినా అతను జీవితాంతం మాత• ప్రేమ కోసం తపించాడు. తనకంటే, తన తల్లి కంటే వయసులో ఓ పెద్దవిడ్ని ప్రేమిస్తాడు. ఆవిడ్ని మెప్పించడం కోసం అనేక పనులు చేస్తాడు. సాహిత్యంలో కూడా ఆమె జడ్జిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తాడు.

ఒక స్త్రీలో తల్లిని ప్రేయసిని చూడగలగడం అతని స్వభావం లోని ప్రత్యేకత. అతని జీవితంలో అనేకమంది స్త్రీలు ప్రవేశించినా జీవితాంతం అతని మానసిక ప్రపంచంలో సహచరిగా మిగిలిందామె.

తన ఊహాజనిత ప్రపంచంలో నుంచే అనేకసార్లు బతుకుతెరువుని ఎంచుకుంటాడు బాల్జాక్. అంచేత అతని ఇమాజినరీ వరల్డ్ అతనికి ఎలాంటి జీవనాధారం కలిగించలేకపోయింది. దాంతో అప్పులు చేయడం, అప్పులు తీర్చడంతో అతని జీవితం గడిచిపోయింది. వాస్తవ ప్రపంచం అర్థమైంది. చారిత్రక ద•క్పథం కూడా ఉండటంతో జీవిత వాస్తవికతని ప్రతిబింబిస్తూ రచనలు చేశాడు. జీవితమే బాల్జాక్ సాహిత్యానికి రూట్స్. మనిషి సమాజంలో బతుకుతాడు కనుక మనిషి జీవితం సమాజంతో సంబంధం లేకుండా ఉండదు. అంచేతే బాల్జాక్ సాహిత్యమంతా సామాజిక వాస్తవికతని ప్రతిబింబించింది.

‘బ్లాక్ షీప్’ నవల చదివినప్పుడు తల్లిదండ్రులు గారాబం చేసిన పిల్లలు మూర్ఖులుగా, స్వార్థపరులుగా తయారవుతారని అర్థమవుతుంది. ఎర్రగా, బుర్రగా అందంగా ఉన్నాడని బాల్జాక్ సోదరుడిని తల్లిదండ్రులు బాగా గారం చేస్తారు. అతన్ని తన ముద్దుల బిడ్డగా చూసుకుంటారు. చివరి కథను మూర్ఖుడుగా, స్వార్థపరుడుగా ఎందుకు కొరగాని వారుగా మారతాడు. నిజాయితీ ఉన్న రచయిత నేల విడిచి సాము చేయరు. తన జీవితంలో గ్రహించిన వాస్తవాల్నించే ప్రపంచాన్ని చూస్తాడు.

టాల్ స్టాయ్, అన్నాకెరీనా, ప్లూబియర్ మేడమ్ బౌరే బాల్జాక్ హ్యూమెన్ కామెడీ చదివినప్పుడు కలిగే అనుభూతి గ్రహించే వాస్తవాలు నిజజీవితంలో నిత్యం ఎదురవుతాయి. అంచేతే ఈ రచనలు సాహిత్యం కాదు. జీవితం అనిపిస్తుంది. సాహిత్యం ఎలా ఉండాలి, రచయితలు రచనా నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి, అని ఎక్కడా చెప్పకుండా బాల్జాక్ జీవితాన్నించే గ్రహించేలా చేశారు పార్థసారథి.

రచన చేస్తున్నంతసేపు ముక్తవరం పార్థసారథి ఎమ్మ్యూజ్ అయ్యారని పాఠకులు గ్రహిస్తారు. బాల్జాక్ జీవిత కథ చదువుతున్నంత సేపు అదే అనుభూతికి మనం కూడా లోనవుతాం. బాల్జాక్ ప్రపంచంలో ఉండిపోతాం.

మన చుట్టూ ఉన్న వాళ్లంతా స్వార్థపరులుగా మారిపోయి ధన సంపాదన ధ్యేయంగా బతుకుతున్నప్పుడు అందరి మధ్యన మనం ఒంటరై పోయామనిపిస్తుంది. పార్థసారథి గారన్నట్లుగా యుద్ధంలో తన సైనికులని వాడుకున్నట్లుగా తన పరిచయస్తుల్ని మిత్రుల్ని తనకు తారసపడ్డ వాళ్లని వాడుకుని ఏ మాత్రం కనికరం లేకుండా నీతి, అవినీతి అన్న మీమాంస లేకుండా అందరినీ వాడుకొని తను పైకి పోవడమే ధ్యేయంగా పెట్టుకున్న వాళ్ల కింద నలిగిపోయే విలువలున్న మనుషుల సనుగుడు ఎవరికీ వినిపించదు. పై పెచ్చు ఏదో ఒక రూపేణా వాళ్లని సమర్థిస్తూ మనలో తిరిగే హైనాలు వాళ్లని ప్రశ్నించకుండా మనల్ని హంట్ చేస్తుంటారు. హైనా కూడా ఒక జీవే అన్న సానుభూతితో హైనాల్ని భరించే మధ్యతరగతిని

ఉపయోగించుకొని పైకొచ్చేవాళ్లు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతారు. ఈ అందరి లక్షణం ఒకటే. డబ్బు సంపాదించి పెత్తనం చేయాలి. అధికారాన్ని సంపాదించాలి. బాల్జాక్ జీవితం నుంచి, సాహిత్యం నుంచి ఈ క్రూరమైన వ్యవస్థ వలువలు విప్పి చూపించారు పార్థసారథి. ఇక నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీ జీవితాల్ని డబ్బు శాసించడానికి వీల్లేదు. మీ జీవితాల్ని మీరే శాసించండి, అని ఆదేశించకుండానే గ్రహించేలా చేశారు.

జీవితం ఒక పండగ. మనం పండగ చేసుకోవాలంటే అసహ్యంగా ఉన్న జీవితాన్ని అందంగా మార్చుకోవాలి. జీవితాన్ని అందంగా మార్చడమే సాహిత్య లక్ష్యం. అంచేత పార్థసారథి గారికి సాహిత్యం ఒక పండగ. సాహిత్య సృష్టి తోనే ఆయన పండగ చేసుకుంటారు.

Leave a Reply