ఏ పోరాటమైనా ఒకానొక నిర్దిష్ట స్థలంలో, కాలంలో జరుగుతుంది. కాబట్టి అది తత్కాలీనమే. కానీ అన్ని పోరాటాలు తత్కాలీనమైనవి మాత్రమే కావు. ఉదాహరణకు నాటి నక్సల్బరీ, నేటి దండకారణ్య ఆదివాసీ పోరాటాలు ఆ కోవలోకే వస్తాయి. ఎందుకంటే-అవి స్వీయ అస్తిత్వ పోరాటాలు మాత్రమే కావు. యావత్ సామాజిక ఉమ్మడి అస్తిత్వం కోసం, సమూలమైన సామాజిక పరివర్తన కోసం జరిగే పోరాటాలవి. కనుక అవి తత్కాలీనత్వాన్ని అధిగమించి ఆగామీ పోరాటాలుగా, భవిష్యత్కాల పోరాటాలుగా, భవిష్యత్ ప్రపంచాన్ని నిర్మించేవిగా నిరంతర పురోగమనం లో ఉంటాయి .

విపులీవోద్యమాన్ని లాంటి నేపథ్యంలో చూడాలి . అందుకే మధ్య భారతంలో ఆదివాసులపై ప్రభుత్వం  చేస్తున్న యుద్ధం ఆకాశ మార్గం పట్టినా, ప్రజలకు అది ‘నేల విడిచి చేసే సాము’ కాదు. ఆ మాటకొస్తే రాజ్యం  చేసే ఆకాశ యుద్ధం కూడా ఆదివాసుల కాళ్ళకింది నేల కోసమే. ఆ నేల గర్భంలో దాగిన అపారమైన ఖనిజ వనరుల(దోపిడీ) కోసమే తప్ప మరింకేమీ కాదు.

కానీ దండకారణ్య ఆదివాసులు ఈ ప్రతి(ఘటనా) యుద్ధం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు చేస్తున్న ఈ యుద్ధానికి గల ప్రత్యేకతలు ఏమిటి? అలాగే సాధారణీకరించే పురోగామి లక్షణాలు ఏమిటి? అని పాఠకులు లోతుగా పరిశీలించడానికి విరసం ప్రచురించిన ‘ఇక ఆకాశయుద్ధం’ అనే పుస్తకం చాలా దోహదపడుతుంది.

మొదటగా మనం ప్రత్యేకతల్ని చూస్తే–దండ కారణ్య ఆదివాసులు సాంప్రదాయిక అర్థంలో కేవలం అటవీ జీవులు కాదు. వాళ్ళ జీవనశైలి లోను, ప్రాపంచిక దృక్పథంలోనూ గుర్తించాల్సిన ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతితో వాళ్ళ జీవిత సంబంధం చాలా గతితార్కికంగా ఉంటుంది. ప్రకృతితో వాళ్ల సంబంధం సహజీవనం (ఐక్యత) దెబ్బతినేలా  ఘర్షణపూరితంగా ఉండదు. లేదా, ఘర్షణే విషమించి ఐక్యతను సాంతం ధ్వంసం చేసేదిగా ఉండదు.  ఇది వాళ్లకు మొదటి నుంచి unnadi. దానికి   మావోయిస్టు రాజకీయాలు తోడయ్యాయి .   అందువల్ల అక్కడి ప్రకృతి వనరులను వాళ్ల నైసర్గిక, సాంస్కృతిక జీవితంలో అవిభాజ్యమైనవిగా చూస్తారు. అంతమాత్రాన ఆ సహజ వనరులన్నిటినీ వాళ్లకు మాత్రమే చెందిన ‘ఆస్తి’గా వాళ్ళు చూడరు.

అసలు వనరులను ఆస్తిగానే చూడరు కనుక, అవి వారి దృష్టిలో ఉపయోగ వస్తువులే కానీ వినియోగ వస్తువులు కానే కాదు. సామ్రాజ్యవాద యుగంలో ప్రకృతిని, మానవ జీవితాన్ని  అసలైన ఆధునిక అర్థంలో సొంతం చేసుకున్న  వాళ్ళు  ఎవరైనా ఉన్నారా.. అంటే దండకారణ్య ఆదివాసులేనని చెప్పాలి. అందుకే ఒకప్పుడు ‘మా గూడెం మీద మాకే అధికారం’ అన్న దండకారణ్య ఆదివాసీలు ఇవ్వాళ ప్రకృతి వనరులపై తమకు మాత్రమే సహజమైన అధికారం ఉందని అనుకోవడం లేదు. దేశ ప్రజలందరివి అనుకోని వాటిని కార్పొరేట్ల నుంచి కాపాడటానికి తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు . అందువల్లనే వాళ్ల పోరాటం అసలు సిసలైన ఆధునిక ప్రజాస్వామిక విలువలను  సంతరించుకున్న పోరాటంగా ప్రపంచ చరిత్రలో నమోదవుతుంది.

పైగా వాళ్ల పోరాటానికి చారిత్రక కొనసాగింపు కూడా ఉన్నది. అయితే ఈ లక్షణాలు వాళ్లు తమ ఇష్టాయిష్టాలతో ఏర్పరుచుకున్నవి కావు. కాలం తమ మీద విధించిన చారిత్రక బాధ్యతలో భాగంగానే వీటిని వాళ్లు సంతరించుకున్నారు. అందుకే వాళ్లు నిత్యం సంకుల సమరం చేస్తూనే అత్యంత కఠినమైన ప్రయోగాత్మకమైన జీవితాన్ని సాగిస్తున్నారు. ఆధునిక భారతంలో గడ్డు చారిత్రక వాస్తవంతో దీర్ఘకాలిక పోరాట ప్రయోగాలు చేస్తున్న ధీరులెవరంటే నేటి దండకారణ్య ఆదివాసీలేనని నిస్సందేహంగా చెప్పవచ్చు.

నిత్యం నిరంతర పోరాట క్రమంలోనే దండకారణ్య ఆదివాసులు తమ ప్రాచీన (సాంఘిక, సాంస్కృతిక) మూలాలను మార్చుకుంటూ ఆధునిక హేతుబద్ధ జీవన విధానంలోకి పరివర్తన చెందుతున్నారు. అసలు ప్రగతిదాయక సామాజిక పరివర్తన క్రమం ఎలా ఉంటుందో వాళ్ల త్యాగశీల పోరాటాలతో, రక్త మాంసాలతో ఆధునిక భారత చరిత్రలో నమోదు చేస్తున్నారు. వాళ్లు అక్కడి పంచ భౌతికాలపై పట్టు కోసం పంచప్రాణాలతో నిరంతరం పోరాడుతుండడం వల్లనే శత్రువు పంచభూతాల్లో ఒకటైన ఆకాశాన్ని సైతం ఆశ్రయించి యుద్ధాన్ని ప్రారంభించాడు. అంటే, ఆధునిక ప్రతిఘటనా యుద్ధ తంత్రం మీద ఆ ఆదివాసుల పట్టు ఎంతటి దృఢమైనదో, ఎంతటి రాజీలేని పోరాట శీలంతో కూడుకొని ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు.

ఒకే దేశంలో భాగంగా ఉన్న దండకారణ్య ప్రాంతంలో తన ఆదివాసీ ప్రజలపై ఈ దేశ ప్రభుత్వమే యుద్ధం చేస్తున్నదంటే, ఇది భారత ప్రజాప్రాతినిధ్య ప్రజాస్వామ్య దేశం అవుతుందా? ఇక్కడి నేలపై పాలకులు తమ దోపిడీ వంచనా శిల్పంతో ఎలాంటి ప్రజాస్వామ్యాన్ని పెంచి పోషించారో ఎవరికైనా సులువుగానే అర్థమవుతుంది.

మధ్య భారత దేశంలోని ఇలాంటి సాయుధ సంఘర్షణకు మూడు దశాబ్దాలుగా సాగుతున్న కార్పొరేటీకరణే మూలం. ఈ కార్పొరేటీకరణను అమలుపరచడానికి భారత పాలకులు ప్రత్యేకంగా సైనికీకరణను ప్రయోగిస్తున్నారు. ఆధునిక భారతదేశపు పాలనా చరిత్ర గర్భంలోంచే కార్పొరేటీకరణ, సైనికీకరణ అనే రెండు కవలలు పుట్టాయి. ప్రపంచ సామ్రాజ్యవాద సంక్షోభం నిర్దిష్టంగా భారతదేశంలో ప్రతిఫలించిన క్రమంలో భాగమే ఈ కార్పొరేటీకరణ, సైనికీకరణ. దీనివల్ల భారత రాజ్యాంగం హామీ పడిన సమానత్వ సాధన పూర్తిగా లుప్తమై, కేవలం ఒకే విలువ గల సార్వత్రిక వోటు హక్కు ఇవ్వడం అనే లాంఛనప్రాయమైన సమానత్వం మాత్రమే మిగిలింది. దీనినే రాజకీయ సమానత్వానికి ప్రతీకగా భారత పాలకులు ఊదరగొడుతున్నారు. ఐదేళ్లకోసారి లేదా ఎలక్షన్లు వచ్చినప్పుడు వోటువేసే స్వేచ్ఛ మాత్రమే తప్ప ప్రజలకు మరే స్వేచ్ఛ, సమానత్వం లేకుండా పోయాయి. ఇందులో వోటు వేసే రాజకీయ అధికారం ఒక్కటి తప్ప మరే రాజకీయ అధికారం ప్రజలకు లేనే లేదు.

ఇదంతా భారత పాలకులు మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో విడదీయలేని భాగంగా చేయడం వల్లనే జరుగుతోంది. 1991 తర్వాత కొనసాగుతూ వస్తున్న సామ్రాజ్యవాద ‘ఉదారవాద’ ఆర్థిక విధానాల వల్ల భారత దేశం మరింత తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. ఇతర వెనుకబడిన దేశాలలో లాగే మన దేశంలో  కూడా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పట్టు పెరిగింది. ఫలితంగా పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం అనే మిశ్రమ ఆర్థిక విధానం పోయి కార్పొరేట్ స్వామ్యం అవతరించింది. దీంతో మన దేశంలో కారు చౌకగా ప్రజల శ్రమను కొల్లగొట్టడంతో పాటు ప్రకృతి వనరులను సైతం కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడానికి ప్రభుత్వాలు వరుసగా సిద్ధపడుతున్నాయి.

ముఖ్యంగా 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వనరుల దోపిడీ ఆర్థిక విధానం మరింత వేగాన్ని అందుకున్నది. తొలి రాజ్యాంగ  కాలం నాటి ఆదర్శాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఆదివాసులకు ఉద్దేశించిన రాజ్యాంగపరమైన రక్షణ చర్యలను ఏమాత్రం ఖాతరు చేయకుండా, కార్పొరేట్ల మార్గదర్శకత్వంలోనే పనిచేయడానికి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. ఈ చరిత్రంతా ఇవాళ దండకారణ్యంలో వైమానిక దాడులు జరగడానికి దారితీసింది.

విరసం ప్రచురించిన *ఆకాశ యుద్ధం * అనే పుస్తకంలోని వ్యాసాలు కేవలం ఆదివాసుల మీద వైమానిక దాడుల వివరాలకె పరిమితం కాదు . అనేక విషయాలు చర్చిస్తూ ..దేశ  వ్యాప్తంగా కార్పొరేటీకరణను వివరిస్తుంది . గత రెండు దశాబ్దాలలో దండకారణ్యంలోకి కార్పొరేట్లు ఎంత దూకుడుగా చొరబడుతున్నారో, అంతకంటే ఎక్కువగా ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు. లక్షలాది సైన్యంతో ఎన్ని కంపెనీలు అడవిలోకి చొరబడ్డాయో, అంతకంటే ఎక్కువే వెనుదిరిగిపోయాయి. అయినా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఉన్న ఆదివాసులను అభివృద్ధి వ్యతిరేకులని ప్రచారం చేసి ప్రభుత్వం ఈ యుద్ధాన్ని తీవ్రతరం చేసింది.

అప్పుడే సరిగ్గా ఆదివాసులు ఈ పెట్టుబడిదారీ యుద్ధానికి వ్యతిరేకంగా శాంతిని గతిశీల ఉద్యమంగా మలిచి, 2021 మే(21న ) లో సిలింగేర్ పోరాటాన్ని ప్రారంభించారు. సాయుధ సైనిక క్యాంపులు ఎత్తివేయాలని లక్షల సంఖ్యలో ఆదివాసులు ఏకమై దీర్ఘకాలిక ఆందోళనలు చేపట్టారు. ఇది విస్తృతంగా బయటి ప్రజాస్వామిక శక్తుల మద్దతు కూడగట్టడానికి దోహదపడింది. అంతేగాకుండా, ఈ శాంతి పోరాటం చుట్టూ ఉన్న అనేక ప్రాంతాలకు విస్తరించి క్రియాశీలంగా మారింది. దీంతో అప్పటి బిజెపి ప్రభుత్వం ఇక ఆకాశ దాడులకు పూనుకున్నది. కానీ అప్పటికే న్యాయస్థానాలతో సహా రాజ్యాంగ సంస్థలన్నిటిని ఫాసిస్టు భావజా లంతో కూడిన శక్తులతో నింపేసింది. ఫలితంగా ఆదివాసులపై  రాజ్యాంగ వ్యతిరేకమైన, మానవ వ్యతిరేకమైన ఈ వైమానిక దాడులకు భారత ప్రభుత్వం పూనుకున్నప్పటికీ, బయటి ప్రజల నుండి ఎటువంటి వ్యతిరేకతా రాలేదు.

కనుక నేటి భారత ఫాసిజం పనితీరుకు ఆదివాసులపై జరుగుతున్న వైమానిక దాడులనే ప్రబల నిదర్శనంగా మనం పేర్కొనవచ్చు. ఇలా కార్పోరేటీకరణ, హిందుత్వతో కలగలిసిపోయి నేటి భారత ఫాసిజంగా పరిణమిస్తున్న క్రమాన్ని లోతుగా పరిశీలిస్తే మనం స్పష్టంగా చూడవచ్చు. ఇప్పుడు మనం ఫాసిజాన్ని సామాజిక, సాంస్కృతిక ప్రక్రియ అని, కార్పొరేటీకరణను ఆర్థిక ప్రక్రియ అనీ వేర్వేరుగా చూసే పరిస్థితి లేదు. రెండూ కలగలిసిన భారత ఫాసిజం అనేకానేక సూక్ష్మరూపాలలో సమాజమంతటా విస్తరించి పనిచేస్తోంది. ముఖ్యంగా భారత ఫాసిస్టులు రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసి, ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి సైనికీకరణనే బలోపేతం చేస్తున్నారు.ఒక్క మాటలో చెప్పాలంటే–భారత ఫాసిజం హిందుత్వ సాంస్కృతిక నియంతృత్వం, కార్పొరేటీకరణ, సైనికీకరణ అనే త్రిముఖ వ్యూహంతోపని చేస్తున్నది. కనుక హిందుత్వ ఫాసిజం, భారత కార్పొరేటీకరణ ఒకే నాణానికి బొమ్మ బొరుసూ లాంటివి. అలాగాకుండా,  హిందుత్వ ఫాసిజాన్ని కార్పొరేటీ కరణను వేర్వేరుగా చూస్తున్న ప్రగతిశీలవాదులు నేటి భారత ఫాసిజాన్ని అర్థం చేసుకోవడంలో గందరగోళానికి గురవుతారు. కానీ దండకారణ్య ఆదివాసీ పోరాటకారులు మాత్రం భారత ఫాసిజాన్ని హిందుత్వ కార్పోరేట్ ఫాసిజంగా సరిగ్గానే అర్థం చేసుకుంటున్నారు. ఇది నేటి ఆదివాసీ ఉద్యమాల పరిణతిని, ఆధునికమైన ముందుచూపును, చారిత్రక దార్శనికతను ఏకకాలంలో సూచిస్తున్నది.

అందుకే దండకారణ్య ఆదివాసులపై నేటి వైమానిక  దాడుల సమస్య కేవలం ఆ ఆదివాసులదే కాదు. మావోయిస్టులదీ కాదు. మొత్తంగా భారత ప్రజల సమస్య ఇది. అందరికందరూ సీరియస్ గా పట్టించుకోవలసిన దేశవ్యాప్త ఉమ్మడి సమస్య ఇది. అలా పట్టించుకోకపోతే దండకారణ్యం లోకి వెళ్ళిన సైన్యం రేపు ఏ ఊర్లో కైనా, ఎవరి దగ్గరకైనా సునాయాసంగా రావచ్చు. మనదాకా రాదని భారత (రాజ్యాంగం) ప్రజాస్వామ్యం అయితే గ్యారెంటీ ఇవ్వదు గాక ఇవ్వదు.                                                                         

Leave a Reply