బస్తర్ పరిణామాలపై అక్కడి నుండి వచ్చిన ప్రత్యేక సిరీస్‌లో ఇది మొదటి భాగం. బీజాపూర్‌లో మావోయిస్టుల సమావేశంపై తెల్లవారుజామున జరిగిన ఆకస్మిక దాడి ప్రభావం  గ్రామాల మీద  ఎలా ఉన్నదో  ఈ కథనం వివరిస్తుంది.

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ బస్తర్ అడవుల లోతట్టు ప్రాంతంలోని  స్థానిక ఆదివాసీ సముదాయాల  నుండి చేరిన మావోయిస్టు తిరుగుబాటుదారులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యంతో మంద్ర స్థాయి యుద్ధంలో వున్నారు.  ఈ సంవత్సరం ఘర్షణలో పెద్ద పురోగతి సాధించామని, 38 ఎన్‌కౌంటర్లలో 141 మంది మావోయిస్టులను హతమార్చామని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు. ఈ సంఖ్య 2009 సంవత్సరం మినహా గతంలో వచ్చిన వార్షిక సంఖ్య కంటే ఎక్కువ.

ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్న సమయంలో, బీజాపూర్ జిల్లా ఆసుపత్రి ఆవరణ ప్రజలతో నిండిపోయింది. వారిలో వృద్ధులు, పాలు తాగే పసిపిల్లలతో ఉన్న తల్లులు, తల్లి కొంగు పట్టుకుని వేళ్లాడుతున్న చిన్నారులు ఉన్నారు. అడవుల్లోకి  ప్రవేశించే ప్రతి పోలీసు వాహనం వెనుక యువకులు పరుగెత్తుతున్నారు.

రెండు రోజుల క్రితం, ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ భాగంలో వుండే ఈ జిల్లాకు చెందిన పోలీసులు గంగలూర్ గ్రామం దగ్గరలో వున్న కోర్చోలి-నేంద్ర అడవులలో జరిపిన  కాల్పుల్లో 13 మంది మావోయిస్టులను చంపినట్లు పేర్కొన్నారు.

మృతదేహాలతో పాటు  భద్రతా చర్యలో భాగంగా నిర్బంధించబడిన గ్రామస్తులను కూడా బీజాపూర్ జిల్లా కేంద్రానికి తీసుకువచ్చారు. పోలీసులు అధికారికంగా సంఖ్యను ప్రకటించనప్పటికీ, ఈ ప్రాంతంలోని ఏడెనిమిది గ్రామాలకు చెందిన 25-30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

తమ కుటుంబ సభ్యుల జాడ కోసం ఈ గ్రామాల వాసులు ఆస్పత్రి ఆవరణలోకి పోటెత్తారు.

“నేను నా తమ్ముడిని వెతుక్కుంటూ వచ్చాను” అని తోడ్కా గ్రామానికి చెందిన హేమ్లా లచ్చు అనే యువకుడు చెప్పాడు. “అతను పార్టీతో ఉన్నాడు. అతను సమావేశానికి వెళ్ళాడని మాకు తెలుసు.” పార్టీ అంటే అతని ఉద్దేశ్యం , బస్తర్ అడవులలో దశాబ్దాలుగా సాయుధ తిరుగుబాటును కొనసాగిస్తున్న నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్). అందులో స్థానిక ఆదివాసీ సముదాయాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు కూడా ఉన్నారు.

ఉంగా పార్సీ కోసం అతని కుటుంబం కవాడ్‌గావ్ గ్రామం నుండి వచ్చింది. ఏడాది కిందటే అతను పార్టీలో చేరాడని చెప్పారు.

“తప్పిపోయిన మీ  కుటుంబ సభ్యుడు పార్టీలో ఉన్నారా” అని అడిగినప్పుడు, గ్రామస్తులు యిచ్చిన సమాధానంలోని నిజాయితీ ఆశ్చర్యాన్ని కలిగించింది. వారు వెంటనే “అవును” లేదా “కాదు” అని సూటిగా సమాధానం ఇచ్చారు. తిరుగుబాటు గ్రూపుతో అనుబంధాన్ని దాచే ప్రయత్నం చేయలేదు. అలానే,  తప్పిపోయిన వ్యక్తి మావోయిస్టు కాదని, పౌరుడని చెప్పడంలో కూడా వారికి ఎలాంటి సంకోచమూ లేదు.

మా బాబాయి చైతూ పోటాం కోసం వెతుక్కుంటూ వచ్చాం’’ అని కోర్చోలి గ్రామానికి చెందిన బోడు పోటాం చెప్పాడు. “అతను నక్సలైటు  కాదు. ఆయనకు భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు” అని అన్నాడు. (“వో నక్సలీ నహీ హై, ఉస్కీ తో బివీ ఔర్ ఛే బచ్చే హైన్.”)

పోతం మొదట బీజాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ చైతూ  కనిపించలేదు కానీ, తనకు తెలిసిన యితర ముఖాలను గుర్తించాడు. “మేము మా గ్రామానికి చెందిన సరిలా పోటాం అనే అమ్మాయిని చూసాం” అని నాతో చెప్పాడు.

మేము మాట్లాడుతున్నప్పుడు  బీజాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పోలీసు ఆఫీసర్ వచ్చాడు, ఆసుపత్రి కాంపౌండ్‌లో వున్న ప్రజలందరూ అతని వైపు పరుగులు తీశారు. “ఒక్క నిమిషం, ఒక్క నిమిషం” అంటూ అతను సమీపిస్తున్న గ్రామస్థులను  హెచ్చరించాడు. మొబైల్ ఫోన్‌ను చేతిలో పట్టుకుని వున్న, తెల్లటి టీ-షర్టులో ఉన్న పెద్ద బలిష్టమైన వ్యక్తిని చూపిస్తూ “ముందు ఫోన్‌లో చూడండి” అన్నాడు. ఫోన్  స్క్రీన్‌పైన చనిపోయినవారి క్లోజ్-అప్ ఫోటోలు ఉన్నాయి.

ఇతర ఎన్‌కౌంటర్ కేసుల్లో అనుసరించిన పద్ధతిలాగా బీజాపూర్ పోలీసులు కోర్చోలి-నేంద్ర తుపాకీ కాల్పుల్లో మరణించిన వారి ఫోటోలను పత్రికా ప్రకటనలలో భాగంగా విడుదల చేయలేదు.  13 మృతదేహాలను పెట్టిన బ్యాగ్‌లతో పాటు లైట్ మెషిన్ గన్‌లు, .303 రైఫిల్స్, 12 బోర్ రైఫిల్స్, బారెల్ గ్రెనేడ్ లాంచర్లు, కోడెక్స్ వైర్లు, కాట్రిడ్జ్‌లు, పైపులు, వాకీ-టాకీలు, మావోయిస్టు సాహిత్యం, సోలార్ ప్యానెల్‌లను స్థానిక జర్నలిస్టులకు చూపించారు.

వాటిలో సబ్బు, టూత్ బ్రష్, నూనె, క్రీమ్‌లు, మందులు వంటి రోజువారీ ఉపయోగించే వస్తువులు కూడా వున్నాయి. 

ఆసుపత్రి దగ్గర, ఆ పోలీసు తన ఫోన్‌లో చనిపోయిన వారి ఫోటోలను చూపించినప్పుడు రక్తపు  మరకలతో, చితికిపోయివున్న ముఖాలను చూసి చాలామంది చలించిపోయారు. “కుచ్ పెహచాన్ మే హాయ్ నహీ ఆ రహా.” “గుర్తు పట్టడమే కష్టంగా వుంది. ముఖాలు ఉబ్బిపోయాయి, పూర్తిగా రక్తంతో నిండిపోయి వున్నాయి” బోడు పోటం నిరాశతో అన్నాడు .

కాస్సేపటికి మాస్క్‌లు పెట్టుకున్న ఆసుపత్రి సిబ్బంది శవాగారం తలుపులు తెరిచారు. ఇంకా ప్లాస్టిక్ సంచుల్లోనే  చుట్టివున్న మృతదేహాలను బయటకు తీసి నేలపై ఉంచారు. వారి ముఖాలు కనిపించేలా ప్లాస్టిక్ షీట్ జిప్‌ని వెనక్కి లాగడంతో, వచ్చే దుర్వాసనను భరించలేక మహిళలు చీర కొంగుతోనూ, పురుషులు గంచాతోనూ ముక్కు మూసుకుంటూ ముందుకు పరుగెత్తారు.

కొద్ది నిమిషాల్లోనే  కొందరు చనిపోయినవారిలో వున్న తమ కుటుంబ సభ్యులను గుర్తించారు. చనిపోయినవారిలో చైతు పోటం కూడా వున్నాడు. చైతూ సోదరి, భార్య ఏడుస్తుంటే, బోడు పోటం ఏడుస్తున్న తన వారిని ఓదార్చాడు.

మృతదేహాలను గుర్తించిన కుటుంబ సభ్యుల పేర్లను పోలీసులు రిజిస్టర్‌లో నమోదు చేసి, వారి బొటన వేలి ముద్రలు తీసుకున్నారు. అంబులెన్స్‌లను రప్పించి, మృతదేహాలను ఇళ్లకు పంపించారు.

నాలుగు రోజుల తరువాత, చనిపోయిన వారి కుటుంబాలను కలవడానికి  బీజాపూర్ అడవుల గుండా బైక్‌పై ఆ గ్రామాలకు వెళ్లాను. పోలీసులు, తమ  పత్రికా ప్రకటనలో “ముట్‌భేడ్” లేదా “ఎన్‌కౌంటర్‌” జరిగినట్లుగా చెప్పారు.

మసుమెట్ట కొండపై మావోయిస్టుల సమావేశంపైన తెల్లవారుజామున జరిగిన పోలీసుల ఆకస్మిక దాడి కొండ కింది వరకూ ఎలా వచ్చిందో గ్రామస్తులతో మాట్లాడినప్పుడు మరింత వివరంగా తెలిసింది. ఆ గ్రామంలో క్రితం రోజు రాత్రే ఏటా జరుపుకునే ఊరు పండగ ముగిసింది.  యింకా నిద్ర మత్తు లోంచి మేల్కొనని  గ్రామస్థులు, వారి అతిధులు వారి బంధువులు ఈ దాడిని ఏ మాత్రం ఊహించలేదు.

కాల్పుల్లో చనిపోయినవారందరూ మావోయిస్టులు కాదు అని గ్రామస్తులు చెప్పారు. నాకు యింకా అశ్చర్యం కలిగించిన విషయమేమంటే ‘చనిపోయారు’ అని ప్రకటించినవారందరూ చనిపోలేదు.

నేంద్ర గ్రామం బీజాపూర్ జిల్లా కేంద్రానికి దక్షిణంగా 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.  గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. మాసుమెట, గోర్గోన్‌మెట్ట, రెటెన్, మార్కర్, పెండెమెట్ట, కౌర్‌మెట్టలాంటి అనేక అటవీ కొండలతో చుట్టుముట్టబడిన ఈ గ్రామంలో దాదాపు 60 కుటుంబాలు నివసిస్తున్నాయి.

కోహ్లా కోసుమ్ పెన్ దేవి అని పిలిచే కుంజమ్ వంశానికి సంబంధించిన స్థానిక దేవత పేరు మీద నేంద్ర వార్షిక పండుగ లేదా కర్సాద్‌ను ఏప్రిల్ 1నాడు జరుపుకున్నారు.

గంగలూరు, బాసగూడ ప్రాంతాలలో విస్తరించి ఉన్న గ్రామాల నుండి వేలాది మంది ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి నేంద్రానికి వచ్చినట్లు పేర్మ లేదా సముదాయ పూజారి సోను లక్కు తెలిపారు. పెర్మా నివసించే కుగ్రామమైన పెర్మపరాలో ఉత్సవాలు జరిగాయి. ఉదయం ఉత్సవ ఆచారాలు, రాత్రి నృత్యం, మద్యపాన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగాయని అతను చెప్పాడు.

కానీ మరుసటి రోజు తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో సమీపంలోని మాసుమెట్టా కొండపైనుంచి వచ్చిన తుపాకుల మోతలతో అందరూ మేల్కొన్నారు.

కాస్త వెలుతురు రాగానే దేవతను వుంచిన దగ్గరికి పరుగెత్తడాన్ని లక్కు గుర్తుచేసుకున్నాడు. సుక్కు మాసా, గైతా లేదా గ్రామ పూజారి, అతనితో పాటు మరికొందరు మగవాళ్ళు దేవతను ఆలయంలోకి (గడ్డితో కప్పు వేసిన పందిరి) తీసుకువచ్చారు. కొండలపై నుండి దిగివస్తున్న భద్రతా దళాలను చూసి భయపడ్డారు.

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో, మావోయిస్టు ప్రాబల్య భూభాగంలో ఉన్న నేంద్ర వంటి అటవీ గ్రామాల నివాసితులు భద్రతా బలగాలకు భయపడతారు – సకారణంతోనే. మావోయిస్టులపై చర్యలకు బయలుదేరిన భద్రతా బలగాలు పౌరులను కాల్చి చంపినట్లు అనేక సార్లు, న్యాయ విచారణలో నిర్ధారణ అయింది .

అందువల్ల, భద్రతా సిబ్బంది కొండపై నుండి దిగడం చూడగానే అడవి వైపు పరుగెత్తారు. కానీ వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. లక్కు రెండు చేతులూ పైకెత్తి, “మేము ఈ గ్రామానికి చెందిన పెర్మా, గైతాలం, మాపై కాల్చకండి.”అని అరిచాడు. భద్రతా బలగాలు కాల్పులు జరపలేదు. ఆ ఆరుగురిని పట్టుకుని, చేతులు కట్టివేసి, ఒకరి వెనకాల ఒకరిని వరుసగా  నడిపించుకెళ్ళారు.  పసిబిడ్డను ఎత్తుకొని వున్న తన భార్య నొన్ని సన్ను వారిని ఆపడానికి  ప్రయత్నించిందని, తన భర్తను తీసుకెళ్లవద్దని పోలీసులను అభ్యర్థించిందని, ఆమెను కొట్టి, తరిమి కొట్టారని పెర్మా చెప్పాడు. ఆ ఆరుగురిని పల్నార్‌లోని భద్రతా శిబిరానికి తీసుకెళ్ళారు. భద్రతా దళాలు గ్రామంలోకి దండెత్తడం ప్రారంభించాయన్న విషయం వారికి తెలియదు.

పోలీసుల వాదనను తిరస్కరించిన గ్రామస్థులు పోలీసులు దాడి చేసిన ఇళ్ళలో ఒకటైన కమ్లీ కుంజమ్, మానసిక వైకల్యం ఉన్న చెవిటి మూగ బాలిక అని కుటుంబ సభ్యులు చెప్పారు. మహిళలు కూడా వున్న చిన్న భద్రతా సిబ్బంది బృందం ఉదయం 9 గంటలకు ఇంట్లోకి దూరి, కడుపు నొప్పి కాస్త తగ్గి, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కమ్లీని బయటకు లాగారనీ,  కమ్లీకి వంట్లో బాగాలేదని తాను అడ్డుకోబోతే, అవసరమైతే ఆసుపత్రికి తీసుకెళ్తామని మహిళా భద్రతా సిబ్బంది తనతో చెప్పారని ఆమె తల్లి సోమ్లీ కుంజమ్ చెప్పింది.

భద్రతా సిబ్బంది తన మనవరాలిని గ్రామ మార్గంలో కాకుండా అటవీ మార్గం గుండా తీసుకెళ్లడం చూసిన కమ్లీ నానమ్మ జోగ్గి, తన మనవరాలు లైంగిక దాడికి గురవుతుందేమోనని భయపడింది. మర్నాడు అడవిలోకి వెళ్ళిన కమ్లీ వదిన ఐతే కుంజమ్‌కు కమ్లీ గాజు దొరికింది. కమ్లీ తిరిగి రాలేదు. ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టులలో పోలీసులు ఆమెను చేర్చారని కుటుంబ సభ్యులు ఆ తర్వాత గుర్తించారు.

తన కుమార్తె మావోయిస్ట్ అనడాన్ని కొట్టిపారేసిన సోమ్లీ కుంజమ్, ఒకవేళ తన కుమార్తె తప్పు చేసినట్లు పోలీసులకు అనుమానం వుంటే ఎందుకు అరెస్టు చేయలేదు, ఎందుకు చంపారు? అని కన్నీటిపర్యంతమవుతూ, తన బిడ్డను తలుచుకుని “ఇక నన్ను యాయో [అమ్మా] అని ఎవరు పిలుస్తారు? ఇలా క్రూరంగా కాకుండా అనారోగ్యం కారణంగా నువ్వు చనిపోయి వుంటే బాగుండేది కదా” అంటూ వలపోత పోసింది .

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సాయుధ విభాగం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన కంపెనీ నంబర్ 2కు చెందిన 13 మంది మావోయిస్టు కార్యకర్తలను తాము చంపామని ఎన్‌కౌంటర్ గురించి తన పత్రికా ప్రకటనలో పోలీసులు పేర్కొన్నారు. కానీ గ్రామస్థులు తయారు చేసిన మరో జాబితా ప్రకారం చనిపోయిన 13 మందిలో 10 మంది మావోయిస్టులు. కమ్లీతో సహా ముగ్గురు పౌరులు.

జాబితాలో వున్న మరో పౌరుడు, చైతు పోటం (25 సం.) కుటుంబ సభ్యులను ఆసుపత్రిలో కలిసాను. ఆ తరువాత  నేంద్ర పొరుగు గ్రామమైన కోర్చోలిలోని ఇంట్లో అతని భార్య సోమి పోటంను కలిసినప్పుడు, ఆసుపత్రిలో చితికిపోయిన ముఖాల మధ్య కాలి బొటనవేలును చూసేదాకా తన భర్తను గుర్తుపట్టలేకపోయాయని చెప్పింది.

ఎన్‌కౌంటర్ జరిగిన రోజు ఉదయం, గ్రామంలోని ఇతరుల మాదిరిగానే, తాను, తన భర్త తెల్లవారుజామున 4 గంటలకు కోడి మొదటి కూత సమయంలో మసుమెటా కొండ నుండి వచ్చిన కాల్పుల శబ్దాలకు మేల్కొన్నామని సోమి వివరించింది. ఉదయం 7 గంటల సమయంలో తుపాకుల మోతలు ఆగిపోయిన తర్వాత, మహువా సీజన్‌  కావడంతో , ఆరుగురు పిల్లల తండ్రి అయిన చైతు ఇంట్లో కూర్చొని ఒక ఉదయం వృధా చేయకూడదనుకున్న చైతు అడవిలోకి వెళ్లాడు. ప్రతి సంవత్సరం, మహువా సీజన్‌లో, ఆదివాసీలు మహువా చెట్ల నుండి రాలిపోయిన పువ్వులను సేకరించి ఎండబెట్టి సమీపంలోని మార్కెట్‌లలో ఇతర వస్తువులకు బదులుగా అమ్ముకొంటారు. పిల్లలకు వంట చేసి, తినిపించిన తర్వాత తాను తన భర్త దగ్గరికి వెళ్లివుండేదానినని, కానీ భద్రతా దళాలు ఆ ప్రాంతంలో ఉన్నాయనే భయంతో వెళ్లలేదని చెప్పింది.

ఆ రోజు చైతు తిరిగి రాలేదు. మరుసటి రోజు, కోర్చోలి-నేంద్ర అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మరణించినట్లు పోలీసులు ఒక ప్రకటనను ప్రసారం చేయడంతో, అతని కుటుంబం భయాందోళనకు గురై బీజాపూర్‌కు పరుగెత్తింది.

ఏప్రిల్ 4న, ఆసుపత్రి మార్చురీలో ప్లాస్టిక్‌తో చుట్టబడిన అతని మృతదేహాన్ని పోలీసులు మావోయిస్టుగా గుర్తించారు. తన భర్త పౌరుడని నిరసన తెలియచేసినా పోలీసులు వినలేదు. చేయగలిగింది ఏమీ లేక ఆమె అతని మృతదేహంతో తిరిగి వచ్చింది.

ఈ ఆరోపణలపై స్పందన కోసం స్క్రోల్ బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్‌ను సంప్రదించింది. అతను ఫోన్ ఎత్తలేదు, మెసేజ్‌లకు జవాబుయివ్వలేదు. తన భర్త హత్యకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తావా అని అడిగితే సోమి “నాకు మద్దతు లభిస్తే చేస్తాను” అన్నది.

తమ గ్రామానికి దూరంగా, ఏప్రిల్ 2 ఉదయం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న కొన్ని గంటల తర్వాత, తాము ఆరుగురం పల్నార్ క్యాంపులో రాత్రి అంతా ఒకే దగ్గర వున్నామని పెర్మా సోను లక్కు చెప్పారు.

మరుసటి రోజు ఉదయం 7 గంటలకు 11 మృతదేహాలను రెండు పెద్ద ఎస్‌యు‌వి వాహనాలలోకి ఎక్కించమన్నారు- ఒకదానిలో ఐదు; మిగిలిన ఆరు మరొకదానిలో- అని లక్కు చెప్పాడు.

మధ్యాహ్నానికి మరో రెండు మృతదేహాలు వచ్చాయి. వారిలో ఒకరిని కమ్లీ కుంజమ్‌గా గుర్తించాడు. ఆమె మావోయిస్టు యూనిఫాంలో ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరో రాళ్లతో కొట్టినట్లుగా కమ్లీ ముఖం చితికిపోయి వుంది; ఆమె ముఖం ఎలా వికృతమైందో చూపించడానికి తన ముఖంపైన పిడికిలితో గుద్దినట్లుగా అతనికి జ్ఞాపకం వచ్చింది.  ఆమె కళ్ళు, మూతిని బట్టి గుర్తించగలిగాడు.

మరో మృతదేహం సమీపంలోని మెటపాల్ గ్రామానికి చెందిన యువకుడిదని, అతడు మావోయిస్టు అని లక్కు చెప్పాడు. ముఖాలు దెబ్బలతో కమిలిపోయి, గాయాలతో, రక్తంతో నిండిపోయి వుండడం వల్ల చాలా శరీరాలను గుర్తించడం కష్టమైంది. మృతదేహాల పరిస్థితి గురించి వారు తమలో తాము మాట్లాడుకొంటూండడంతో, పోలీసులు వారిని తరిమికొట్టి, త్వరగా బండిలోకి ఎక్కించమన్నారు.

మృతదేహాలను అక్కడి నుంచి జైట్లూర్‌కు తరలించి హెలికాప్టర్‌లో బీజాపూర్‌కు తీసుకెళ్ళారు. ఈ ఆరుగురూ రోడ్డు మార్గంలో జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఏప్రిల్ 7 ఉదయం వదిలిపెట్టేనాటికి వారు మరో నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీలో ఉన్నారు. దగ్గరి నుంచి కాల్చారు.

ఐతి పూనెం, మాల్తీ కుంజమ్ అనే ఇద్దరు మహిళలు, సుద్రు కుంజమ్‌ “తమను చూడగానే పారిపోవడానికి ప్రయత్నించినందువల్ల  వాళ్ళను  చుట్టుముట్టాము”అని ఏప్రిల్ 5 న విడుదల చేసిన పోలీసు ప్రకటనలో తెలిపారు. పోలీసులు వారెంట్ పెండింగ్‌లో వుందడం వల్ల  మరో ఇద్దరు, అయితు పూనెం, ఎంకు పూనెమ్‌లను అరెస్టు చేసినట్లు ఆ ప్రకటన పేర్కొంది.

అయితే మరో అరెస్టు గురించి పోలీసులు తమ ప్రకటనలో  ఏమీ చెప్పలేదు.

ఏప్రిల్ 4న హాస్పిటల్ ఆవరణలో చైతు పోతం మేనల్లుడు పోలీస్ స్టేషన్‌లో సరిలా పోతం అనే అమ్మాయిని చూశానని చెప్పాడు. ఏప్రిల్ 8న నేను ఆమె కుటుంబాన్ని కోర్చోలిలోని వారి ఇంట్లో కలిశాను. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం ఇంట్లో ధాన్యం దంచుతుంటే పోలీసులు సరిలను ఎత్తుకెళ్లారని వారు చెప్పారు.

సరిల నానమ్మ జోగి పోటం ఒక దిగ్భ్రాంతిని కలిగించే విషయాన్ని బయటపెట్టింది: కొండలలో తుపాకుల కాల్పులు ఆగిపోయిన తరువాత, మధ్యాహ్నం సమయంలో, ఆకుపచ్చ పూల ప్రింట్ చీరను ధరించివున్న ఒక మహిళ, హడావిడిగా తమ ఇంట్లోకి వెళ్లి బట్టలు మార్చుకొన్నదని చెప్పింది. “మహిళ మావోయిస్టా” అని అడిగితే ప్రశ్నకు, తనకు తెలియదని, ఆమెను చూడటం అదే మొదటిసారి అని చెప్పింది.

భద్రతా సిబ్బంది ఆమె వెనుకనే ఇంట్లోకి వచ్చి, బయటకు లాగి, పెరట్లోకి తీసుకెళ్ళి, మావోయిస్టు యూనిఫాం వేసుకోమన్నారు అని జోగి వివరించింది. యూనిఫాం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే భద్రతా బలగాలు తమ వెంట తీసుకేళ్ళే అవకాశం ఉందని అన్నది.

పోలీసులు ఆ మహిళను ఈడ్చుకెళ్లారు. వరండాలో కూర్చొని ధాన్యం దంచుతున్న సరిలను కూడా తీసుకెళ్లారు. ఇద్దరినీ కొంతదూరం తీసుకెళ్ళడాన్ని జోగి ఆమె కోడలు ఒక చెట్టు చాటు నుంచి చూసారు. భద్రతా సిబ్బంది మహిళను చుట్టుముట్టారు. తర్వాత జోగికి తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఆ మహిళను చంపేసారు.

చెప్పడాన్ని ఆపేసి, జోగి తన ఇంటి లోపలికి వెళ్లి, ఆ స్త్రీ ధరించిన దుస్తులను బయటకు తెచ్చింది – నీలం పూల ప్రింట్లు ఉన్న ఆకుపచ్చ రంగు చీర, ఎరుపు లంగా, గళ్ళువున్న  ఎరుపు రంగు చొక్కా.

సరిల ప్రాణాలతో బయటపడింది. ఏప్రిల్ 7న ఆమెను పోలీసు కస్టడీ నుండి విడుదల చేసారు. ఆ  మరుసటి రోజు నేను కలిశాను. ఒక చెట్టు కింద తన తల్లి పక్కన కూర్చున్న ఆ అమ్మాయి నిశ్శబ్దంగా వుంది, అడిగినప్పుడు మాత్రమే మాట్లాడింది. తనను మరో దిశలో తీసుకెళ్లారని, తమ ఇంట్లోకి వెళ్ళిన మహిళను కాల్చిచంపిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే పోలీసులు తనను మరో దారిలోకి మళ్లించి తీసుకెళ్లారని చెప్పింది.

పోలీసులు ఆమెను ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయంపై స్పష్టత రాలేదు. పోలీస్ స్టేషన్‌లో, సరిల తాను వేరే గ్రామానికి చెందిన అమ్మాయితో కలిసి వున్నానని, వంట సామాను యిస్తే తామిద్దరం వండుకు తిన్నారు. ఒకరోజు, గోండీలో మాట్లాడిన ఒక పోలీసు ఆమెను వెనక్కి తిరగమని చెప్పి కింద పడిపోయేంతవరకు కొట్టాడని చెప్పింది.

అమ్మా నాన్నలు తనను కలవడానికి ప్రతిరోజూ పోలీసు స్టేషన్‌కు వచ్చారని ఆమెకు తెలుసు. కానీ  ఏప్రిల్ 7 సాయంత్రం ఆమెను విడుదల చేసే వరకు పోలీసులు వారిని కలవడానికి అనుమతించలేదు.

ఈ అలజడి జరిగిన తరువాత పోలీసుల చర్యపై గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కోర్చోలిలో, భద్రతా దళాల నుండి తప్పించుకోవడానికి అడవికి పారిపోయిన వారిలో పప్పు పదం అనే వ్యక్తి ఉన్నాడని, రెండు రాత్రుల తరువాత, అతని మృతదేహం అడవిలో కనబడింది అని గ్రామస్తులు తెలిపారు.  చెట్టుపై దాక్కున్నప్పుడు బహుశా కింద పడి మరణించి ఉండవచ్చు.

నేంద్రలో “మమ్మల్ని భయపెట్టడానికా? భద్రతా దళాలు గ్రామంలోకి ఎందుకు వచ్చాయి అని? పెర్మా ప్రశ్నించాడు. ఊరి పండగలో పాల్గొనడానికి  మావోయిస్టులు వచ్చి ఉంటారేమో అని ఏమో అన్నాను. లేదు, మావోయిస్టులు  గ్రామంలో లేరని పూజారి నొక్కి చెప్పాడు. అయితే, వారు సమీపంలోని మాసుమెటా కొండపై ఉన్నారని అంగీకరించాడు.

మీరు నమ్మినా నమ్మకపోయినా, పోలీసుల చనిపోయిన 13 మంది జాబితాలో ఉన్న వ్యక్తి మావోయిస్టు సమావేశానికి సంబంధించిన వివరణాత్మక కథనం చెప్పాడు.

అతను నేంద్ర సమీపంలోని ఒక గ్రామంలో వుంటాడు. ఒక గోండి అనువాదకుడితో పాటు, నేను అతని కుటుంబాన్ని వెతుక్కుంటూ ఆ గ్రామానికి వెళ్లాను, వారు శోకసంద్రంలో మునిగి వుంటారని ఊహించాను. కానీ, ఆ వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడని గ్రామస్థులు నవ్వుతూ చెప్పారు.

మేము చేరుకునేటప్పటికి అతను సమీపంలోని సరస్సులో చేపలు పడున్నాడు. మేం వచ్చిన ఉద్దేశాన్ని వివరించడానికి గోండి అనువాదకుడు సరస్సు ఒడ్డుకు వెళ్లాడు. ఫోటోలు తీయవద్దని, తన పేరును చెప్పవద్దని అభ్యర్థిస్తూ, అతను తన కథను వివరించడానికి ఒక పెద్ద రాయిపై కూర్చున్నాడు.

ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం నేంద్ర గ్రామంలో పండుగ ముగుస్తున్నందున, మావోయిస్టులు కొంతమంది గ్రామస్తులను తాము గత మూడు రోజులుగా అంతర్గత సమావేశం నిర్వహిస్తున్న  సమీపంలోని మాసుమెటా కొండకు పిలిచారు.

ఇతరులతో పాటు, అతను రాత్రి 9 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడ యూనిఫారం ధరించిన 150 మంది మావోయిస్టులు, 50 మంది పౌరులు ఉన్నట్లు అంచనా వేసాడు. గ్రామస్థులతో మావోయిస్టులు ఏమి చర్చించాలనుకుంటున్నారో అతనికి తెలియదు – సమావేశం మరుసటి రోజు ముగుస్తుంది అనే విషయం మాత్రమే అతనికి తెలుసు.

క్రితం రోజు అడవి ఎలుగుబంటి వారిపై దాడి చేయడంవల్ల,  ఆ రాత్రి భద్రతా బలగాలు దొంగచాటుగా మాసుమెటా కొండపైకి వచ్చి కాల్పులు జరిఫేంతవరకు, మరో అడవి ఎలుగుబంటి వచ్చి వుంటుందని మావోయిస్టులు పొరబడ్డారు.

తొలి తూటాలతో ఇద్దరు మావోయిస్టులు దాదాపు తక్షణమే చనిపోయారు. ఇతర మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై ఎదురు కాల్పులు జరిపారు. తరువాత ఏర్పడిన గందరగోళంలో, ఆ గ్రామస్తుడు అడవుల గుండా తప్పించుకునే మార్గం దొరికే వరకు కనపడకుండా వున్నాడు. మావోయిస్టులు కూడా అక్కడి నుంచి తప్పించుకోగలిగారు.

“తమ ఆకస్మిక దాడిలో ఎక్కువ మంది మావోయిస్టులు దొరకనందుకు కలత చెందిన బలగాలు గ్రామాలలోకి పరిగెత్తాయి” అని ఆ వ్యక్తి గుర్తుచేసుకున్నాడు. మావోయిస్టులు కూడా గ్రామాల్లో ఆశ్రయం తీసుకోవడం వల్ల  ప్రయోజనం లేకపోయింది.

రెండు రోజుల తర్వాత ఆ వ్యక్తి తాను దాక్కున్న స్థలం నుంచి బయటకు వచ్చాక తనను చనిపోయిన మావోయిస్టుగా పోలీసులు ప్రకటించారని తెలుసుకున్నాడు. అతని పేరు రాసిన మృతదేహాన్ని ఆసుపత్రి నుండి ఎవరు తీసుకెళ్లారు అని నేను అడిగితే, నవ్వాడు. అతని భార్య హత్యకు గురైన మావోయిస్టుల్లో ఒకరి మృతదేహాన్ని తీసుకెళ్ళింది. “మేమంతా కలిసి అతన్ని గ్రామంలో ఖననం చేసాము,” అని చెప్పాడు.

పోలీసుల మృతుల జాబితాలో వుంది బతికి బయటపడింది తాను ఒక్కడినే కాదు అంటూ నన్ను మరింత ఆశ్చర్యపరిచాడు. పోలీసులు హతమార్చినట్లు చెబుతున్న ఓ సీనియర్ మహిళా మావోయిస్టు నిజానికి బతికే ఉన్నదని ముసిముసినవ్వులు నవ్వాడు.

మరిన్ని వివరాలు చెప్పడానికి ఇష్టపడక, అతను వెళ్ళిపోడానికి  లేచాడు. అతను చేపలు పట్టే వలల వద్దకు తిరిగి వెళ్ళాడు, నేను సమాధానం లేని ప్రశ్నలతో తిరిగి వచ్చాను.

https://scroll.in/article/1071347/dead-maoist-talking-the-aftermath-of-a-security-operation-in-chhattisgarh

Leave a Reply