ఆటోమొబైల్ కంపెనీ మారుతీకి చెందిన మనేసర్ ప్లాంట్‌లో కార్మికుల పోరాటంలో జరిగిన  హింసాత్మక ఘటనల తర్వాత 2012లో తొలగించబడిన కార్మికులు తమ ఉద్యోగాలను తిరిగి పొందాలని డిమాండ్ చేస్తూ మనేసర్ తహసీల్ కార్యాలయం వద్ద నిరవధిక ధర్నా ప్రారంభించారు.

హర్యానాలోని మానేసర్‌లోని మారుతీ సుజుకీ ప్లాంట్‌లో 2012లో యాజమాన్యం తొలగించిన 100 మందికి పైగా కార్మికులు,  సుదీర్ఘమైన 12 సంవత్సరాల తర్వాత,  2024 సెప్టెంబర్ 18 నాడు తిరిగి తమను పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ గేటు దగ్గర నిరవధిక ధర్నాకు కూర్చున్నారు. సత్యం ఆటో యూనియన్, లుమాక్స్ మజ్దూర్ యూనియన్, ఎఎస్‌ఐ యూనియన్, బెల్సోనియా ఆటో కాంపోనెంట్స్ ఎంప్లాయీస్ యూనియన్, దేగానియా మజ్దూర్ యూనియన్, హై-లెక్స్ మజ్దూర్ యూనియన్, హెచ్‌ఎం‌ఎస్‌ఐ, హోండా మోటోకార్ప్ యూనియన్ తదితర కార్మిక సంఘాలు మద్దతును, సంఘీభావాన్ని తెలిపాయి.

 2012లో యాజమాన్యం వెంటవెంటనే తొలగించిన కార్మికులకి న్యాయం చేయాలని మారుతీ సుజుకీ కార్మికుల పోరాట కమిటీ పోరాడుతోంది. 2012 నుండి, కార్మికులు తమ కేసులు పెండింగ్‌లో ఉన్న లేబర్ కోర్టులో విచారణకు హాజరవుతున్నారు. ఈ వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉంది కాబట్టి తాము పెద్దగా ఏమీ చేయలేమని హర్యానాలోని అన్ని రాజకీయ పార్టీలు – కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు -కార్మికులకు తెలిపాయి.

అక్టోబరు 5న హర్యానాలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఉద్యోగాలు, భవిష్యత్తు లేక ఏళ్ల తరబడి పోరాడుతున్న కార్మికులు, తమ సమస్యపై రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో  ఈ నిరవధిక ధర్నాను ప్రారంభించారు .

 12 సంవత్సరాల క్రితం, 2012 జూలై 18 , దళిత కార్మికుడు జియా లాల్‌ను సస్పెండ్ చేయడంపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కార్మికుల పోరాటంలో, యూనియన్, యాజమాన్యం మధ్య ప్రతిష్టంభన కారణంగా, కార్మికులకు, కంపెనీక నియమించుకున్న గూండాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది;  ఫలితంగా హెచ్‌ఆర్ మేనేజర్ అవనీష్ కుమార్ దేవ్ మరణించాడు. అమానవీయ పని పరిస్థితులు, కాంట్రాక్టులకివ్వడం తదితర సమస్యలపై పోరాడటానికి యూనియన్ ఏర్పాటు చేసుకోవడం కోసం 2011 లో మనేసర్‌లోని మారుతీ సుజుకి కార్మికులు తమ పోరాటాన్ని ప్రారంభించారు. తమ డిమాండ్ల కోసం పోరాడడానికి  సంఘం పెట్టుకొంటామని కార్మికులు ఒత్తిడి చేయడాన్ని మారుతీ యాజమాన్యం తీవ్రంగా వ్యతిరేకించింది.

 ఆగ్రహానికి గురైన కార్మికుల విస్ఫోటనం, వారి తక్కువ వేతనాలు, అనిశ్చిత పని పరిస్థితులు, ఫ్లోర్ మేనేజర్‌లు కార్మికులను అవమానించడం, వారి స్వతంత్ర యూనియన్‌తో కంపెనీ యాజమాన్యం చర్చలకు ఇష్టపడకపోవడానికి వ్యతిరేకంగా 2011 నుండి కార్మికులు చేసిన మూడు సమ్మెలతో సహా సెప్టెంబరు 18 నాటి హింసాత్మక  దురదృష్టకర ఘటన పరాకాష్ట..   జపనీస్ మేనేజ్‌మెంట్, ఇండియన్ రెసిస్టెన్స్: ది స్ట్రగుల్స్ ఆఫ్ మారుతీ సుజుకి వర్కర్స్  (2023)అనే  పుస్తకం, ఆ రోజున కార్మికులు తమ ఆవేశాన్ని ఎందుకు అదుపుచేసుకోలేకపోయారనే విషయాన్ని వివరిస్తుంది. 

 జూలై 18 ఘటన తరువాత, ప్లాంట్ లోపల హింసకు పాల్పడ్డారని, హెచ్ ఆర్ మేనేజర్ మరణానికి కార్మికులను ప్రత్యక్షంగా బాధ్యులను చేస్తూ  మారుతీ యాజమాన్యం వందలాది మంది పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించింది. ఘటన జరిగిన నెల రోజుల్లోనే మొత్తం 546 మంది పర్మినెంట్ కార్మికులు, 1800 మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలగించింది. యూనియన్ ఆఫీస్ బేరర్లు సహా వందలాది మందిని విచక్షణారహితంగా అరెస్టు చేశారు. చాలా మంది కార్మికులు తీవ్ర పోలీసు అణచివేతను ఎదుర్కొన్నారు. రాజకీయ నాయకులు, మీడియా, వ్యాపార నాయకులు కార్మికులపై “ఉదాహరణాత్మకమైన శిక్ష”, “నిర్ధారణ చర్యలు” డిమాండ్ చేసారు. మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ ఆర్‌సి భార్గవ ఈ సంఘటనను ” వర్గ దాడి ” గా అభివర్ణించారు. ఫ్యాక్టరీ కార్మికులపై కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యూస్ ఛానెల్ CNBC TV-18లో హెచ్‌ఆర్‌ని హత్య చేసినందుకు దోషులుగా తేలిన కార్మికులకు మరణశిక్ష విధించడమే తన లక్ష్యం అని చెప్పాడు. మారుతీ వర్కర్స్ స్వతంత్ర యూనియన్‌ను నేరంగా పరిగణించి, కార్మికుల పోరాటాన్ని అణిచివేయడానికి రాష్ట్ర-కార్పొరేట్-మీడియా కుమ్మక్కై పని చేస్తోంది.

 2017మార్చి 18 న, నిందితులైన 148 మంది కార్మికులలో పన్నెండు మంది యూనియన్ ఆఫీస్ బేరర్లు, జియా లాల్‌తో సహా మారుతీ కార్మికులలో 13 మందికి  కోర్టు జీవిత ఖైదు విధించింది. నలుగురు కార్మికులకు ఐదేళ్ల జైలు శిక్ష, మరో పద్నాలుగు మందికి మూడేళ్ల జైలుశిక్ష విధించింది. 5 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన తర్వాత నూట పదిహేడు మంది కార్మికులు నిర్దోషులుగా విడుదలయ్యారు.

  కంపెనీ, హర్యానా ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం 546 మంది అరెస్టయిన కార్మికులలో 426 మందికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలను సేకరించలేకపోయింది; వారిలో 117 మందిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసినప్పటికీ కంపెనీ వారిని తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోలేదు. చట్టపరమైన ప్రక్రియలు ముగియడానికి సంవత్సరాలతరబడి పడుతుంది కాబట్టి, ఇది కార్మికుల వేధింపులను మరింత పెంచింది;  వారిలో చాలా మంది బతకడానికి గిగ్-వర్క్ (ఒక కార్మికుడు వేర్వేరు యాజమానుల దగ్గర పని చేయడం) వంటి చిన్న చిన్న పనులు , తక్కువ వేతనం వచ్చే ఉద్యోగాలను చేపట్టవలసి వచ్చింది.

హత్య తదితర కల్పిత నేరాల కింద జీవితకాల శిక్ష విధించబడిన 13 మంది కార్మికులకు సుమారు దశాబ్దం తర్వాత బెయిల్ మంజూరు అయింది; వారిలో ఇద్దరు విడుదలకు ముందే మరణించారు.

మారుతీ సుజుకి (మనేసర్) నుండి తొలగించబడిన కార్మికులు గత కొన్నేళ్లుగా తమను కంపెనీ తిరిగి పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వారు ఈ విషయాన్ని పదేపదే హర్యానా ప్రభుత్వానికి తెలియజేసారు; ప్రభుత్వం జోక్యం చేసుకుని కోల్పోయిన తమ ఉద్యోగాల్ని తిరిగి పొందడంలో సహాయం చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం, జూలై 18న , హర్యానాలోని మూడు మారుతీ ప్లాంట్‌లలో ఉన్న పర్మినెంట్ వర్కర్స్ యూనియన్‌లు తమ ఇతర డిమాండ్‌లతో పాటుగా తొలగించబడిన కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ కార్యక్రమాలను నిర్వహిస్తాయి.  అయితే గత రెండేళ్లుగా ఆ కార్మికుల పోరాటం ఉధృతమైంది. వారు మారుతీ సుజుకి పోరాట కమిటీ (ఎం‌ఎస్‌సి‌సి) పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.  గత నెలలో కమిటీ మారుతీ మజ్దూర్ న్యాయ్ కన్వెన్షన్‌ను (మారుతీ కార్మికుల న్యాయ సదస్సు)నిర్వహించింది. ఆ సదస్సులో ఆమోదించిన తీర్మానం ప్రకారం, సెప్టెంబర్ 18నాడు , గుడ్‌గావ్ జిల్లా కలెక్టర్  కార్యాలయం దగ్గర వందమందికి పైగా ఉద్యోగంలోంచి తీసివేసిన కార్మికులు ఒకచోట చేరి ధర్నాలో పాల్గొనడానికి మనేసర్‌కు వెళ్లారు. . తమ డిమాండ్లను పట్టించుకోకుంటే ఉద్యోగాల నుంచి తొలగించిన కార్మికుల కుటుంబ సభ్యులతో కలిసి నిరవధిక ధర్నాకు దిగుతామని కార్మికులు తెలిపారు.

మారుతి కార్మికులు మానేసర్‌లో ధర్నాకు అనుమతించడం 12 ఏళ్లలో ఇదే తొలిసారి అనే కోణంలో కార్మికులు ధర్నా చేయడం ప్రముఖమైనది. కార్మిక శాఖ ఇప్పటి వరకు పనిలోంచి తీసివేసిన కార్మికులకు పదే పదే బూటకపు హామీలనే ఇస్తున్న నేపథ్యంలో రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇందులో పాత్ర ఉండవచ్చు .

 అయితే తొలుత మనేసర్‌లో కంపెనీ గేట్‌ నం 2 ముందు ధర్నా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కార్మికులు లేఖను ఇచ్చారు; యాజమాన్యం సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఫ్యాక్టరీ గేట్ నుండి 500 మీటర్ల వద్ద నిరసనను అనుమతించింది. కార్మికులు మానేసర్‌కు చేరుకుని నిర్దేశిత దూరంలో ధర్నా చేయాలని కోర్టు అనుమతినిచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికల సాకుతో మానేసర్‌ తహసీల్‌ కార్యాలయం దగ్గర వారిని ఆపి ధర్నాకు కూర్చోకుండా అడ్డుకున్నారు. కార్మికులు ప్రతిఘటించడంతో తప్పక పోలీసులు ధర్నాకు అనుమతించారు.

తమ ధర్నాపై విధించిన ఆంక్షలపై ప్రతిస్పందిస్తూ, ఉద్యోగ విరమణ పొందిన కార్మికుడు, ఎం‌ఎస్‌ఎస్‌సి సభ్యుడు ఖుషీరామ్ ఇలా అన్నారు: “…మేము ప్రభుత్వం, కోర్టు, లేబర్ కమిషనర్‌ల దగ్గరికి వెళ్ళాము. కానీ నేడు, కార్మిక శాఖ, భారత రాజ్యాంగం, భారత న్యాయ వ్యవస్థ కంటే జపాన్ యాజమాన్యం గొప్పదిగా కనిపిస్తోంది. రాజకీయ నాయకులు మనకు బోధించే జాతీయవాదం పాకిస్తాన్‌కు సంబంధించి మాత్రమేనని, జపాన్ యాజమాన్యం విషయానికి సంబంధించి కాదని స్పష్టమైంది. ఇక్కడ కూర్చున్న కార్మికులు భారతీయ పౌరులు; వారు భారత రాజ్యాంగం, భారత న్యాయ వ్యవస్థను అనుసరిస్తారు. 12 ఏళ్లుగా ప్రదర్శన చేస్తున్నాం. మా వైపు నుండి తప్పుగా ప్రవర్తించిన ఒక సందర్భాన్ని అయినా వారిని చూపించమనండి. అయినా మమ్మల్ని ‘ఉగ్రవాదులుగా’ పరిగణిస్తున్నారు…”

ప్రస్తుతం, మారుతీ సుజుకి మజ్దూర్ సంఘ్ (ఎం‌ఎస్‌ఎం‌ఎస్ ) కంపెనీ యాజమాన్యంతో ఒక పరిష్కారానికి చర్చలు జరుపుతోంది; రిట్రెంచ్‌మెంట్ కార్మికుల డిమాండ్ వారి డిమాండ్‌ల జాబితాలో భాగం. తమ డిమాండ్‌పై యాజమాన్యం వ్యాఖ్యానించడం లేదని ఎం‌ఎస్‌ఎస్‌సి  తెలియజేసింది; తే ఎం‌ఎస్‌ఎస్‌సి, ఎం‌ఎస్‌ఎం‌ఎస్‌లు దీనికి సంబంధించి రెగ్యులర్‌గా కలిసి చర్చిస్తున్నాయి.   ఎం‌ఎస్‌ఎం‌ఎస్‌ రిట్రెంచ్ చేయబడిన కార్మికుల డిమాండ్‌లకు మద్దతు ఇస్తుంది.

మారుతీలోని రిట్రెంచ్ అయిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొనేలా యాజమాన్యాన్ని ఒప్పించడంలో మారుతీ సుజుకీ కార్మికుల పోరాటం విజయం సాధించినట్లయితే, అది భారత శ్రామిక-వర్గ ఉద్యమ చరిత్రలో కార్మికవర్గానికి గణనీయమైన విజయం అవుతుంది..

దళిత నేపథ్యానికి చెందిన ‘జియా లాల్’ మారుతి మనేసర్‌లో కూలీగా ఉండేవాడు. పని చేస్తున్న సమయంలో, ఒక సూపర్‌వైజర్ అతన్ని కులం పేరు పెట్టి తిట్టాడు. దూషించాడు. జియాలాల్ నిరసన తెలపడంతో అతన్నే పని నుంచి తీసేసారు.

దీనికి వ్యతిరేకంగా యూనియన్ నిరసన వ్యక్తం చేయడంతో, మారుతి యాజమాన్యం బాగా ప్రణాళికాబద్ధమైన కుట్రలో భాగంగా హింసకు పాల్పడింది, ఆపై కార్మికుల నిర్బంధాలు, అరెస్టులు ప్రారంభమయ్యాయి. జియా లాల్‌తో పోలీసుల వ్యవహారం ఎలా వుండిందో… స్వయంగా జియాలాల్ మాటల్లోనే..

 ‘‘పోలీసులు వ్యవహరించిన తీరును వివరించడం కష్టం.. ఇప్పటికీ నాకు గాభరా వేస్తుంది .. ఊపిరి ఆగిపోయినట్లు అనిపిస్తుంది.. వాళ్లేం చేశారో చెప్పడం కష్టం.. నీళ్లతో నిండిన తొట్టిలో తలను ముంచేవారు.. ఊపిరాడేది కాదు..  చనిపోతాడని అనిపించినప్పుడు, తల బయటకు తీసి, మళ్లీ ముంచేవారు.

అసభ్య పదజాలంతో తిడుతూనే ఉండేవారు. మా అమ్మ, చెల్లి తిట్లు లేకుండా మాట్లాడే వాళ్ళే కాదు. అలాంటి తిట్లను నేను సహించలేను. అందుకే మాంఝీతో గొడవ జరిగింది.

నన్ను అనధికారికంగా నాలుగు రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంచారు. అరెస్టు చూపలేదు. 16న కోర్టుకు తీసుకెళ్ళారు.

ఆ నాలుగు రోజుల్లో నేను అనుభవించింది ఏమి చెప్పను? బతకననుకున్నాను. సెక్టార్ 10 పోలీస్ స్టేషన్ హెడ్ పేరు ‘బలారా’. నన్ను పూర్తిగా నగ్నంగా చేసాడు. వెనుకవైపు బ్యాటరీ పెట్టారు. కాళ్లకు కరెంట్ షాక్ యిచ్చారు. నన్ను ఉదయం తొమ్మిది గంటలకు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగి తీసుకొచ్చారు. ఇది 14వ తేదీన జరిగింది. నా గుదంలో  కరెంటు పెట్టారు. అలా అరగంట పాటు చేస్తూనే ఉన్నారు. లోపల నిప్పు పెట్టినట్లు అనిపించింది. ఎంతో బాధ కలిగింది. ఎంతో నొప్పి పెట్టింది. నేను చనిపోతానని అనుకున్నాను. మొద్దుబారిపోయాను. చాలా రోజులవరకు మల విసర్జన సరిగా జరిగేది కాదు. కళ్ళు మిరుమిట్లుగొలిపేవి.  మండిపోతూండేది.

పళ్ళు కటకటలాడేవి. అరిచేవాణ్ణి. పరిస్థితి చాలా విషమించినప్పుడు తాగేందుకు నీళ్లు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ కరెంట్ పెట్టేవాళ్ళు. సగం చచ్చిపోయినట్లయ్యాక ఆపారు. ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ మొదలుపెట్టారు.

ఒకసారి నా కాలు విరగ్గొట్టారు. కింద పడుకోబెట్టి ఇద్దరు వ్యక్తులు ఒక్కో కాలును పట్టుకుని తమ వైపుకు లాగేవారు. ఒకతను తన వైపుకు లాగుతుంటే, మరొకతను మరొక వైపుకు లాగేవాడు. నేను రెండు ముక్కలుగా విడిపోతానేమోననిపించింది. అప్పుడు ఒక చెంచాతో ఒక చుక్క నీరు ఇచ్చేవాళ్ళు.

రెండు లక్షల రూపాయలు ఇస్తే కేసు సులభం అవుతుందని పోలీసు చెప్పాడు. చిన్న నేరానికి చలాన్ జారీ చేస్తామన్నారురు. అక్క తమ్ముడికి ఫోన్ చేసాను. వాళ్ళు తమ దగ్గర డబ్బులు లేవని చెప్పారు. వాళ్ళకు ఎక్కడ నుండి వస్తుంది? మేమంతా పేద కూలీలం.

మీకు ఇంకో విషయం చెబుతాను. 14వ తేదీన పోలీసులు వార్తాపత్రికలతో “జియాలాల్ ఎక్కడున్నాడో తెలుసుకున్నాం. రెండు రోజుల్లో పట్టుకుంటాం” అని చెప్పారు. వాళ్ళు అలా చెప్పినప్పుడు నేను వారి కస్టడీలోనే ఉన్నాను. అక్కడే పోలీస్ స్టేషన్‌లో. మరో రెండు రోజుల్లో పట్టుకుంటామనేది దినపత్రికలో ప్రచురితమైంది. ఈ విషయాన్ని పోలీసులు ప్రకటించారు. నేను కూడా చదివాను. అక్కడే పోలీస్ స్టేషన్‌లో చదివాను. రెండు రోజుల తర్వాత అరెస్ట్ చూపించారు. నన్ను కోర్టులో హాజరుపరిచారు.”

(ఫ్యాక్టరీ జపనీస్ రెసిస్టెన్స్ హిందుస్తానీ, పేజీ-23)

2024 సెప్టెంబర్ 30 నాడు పెద్ద సభ జరపబోతున్నారు. ఆదేరోజు చండీగఢ్ లేబర్ కమిషనర్ చర్చలకు పిలిచాడు.

సెప్టెంబర్ 20, 2024

సంబంధిత వీడియో హిందీలో ఈ క్రింద యిచ్చిన లింక్ లో వుంది. కార్మికులు గత పన్నెండేళ్లుగా తాము పడుతున్న బాధలను వివరించారు.

https://www.newsclick.in/manesar-maruti-workers-struggling-justice-12-years#:~:text=Twelve%20years%20ago%2C%20in%20July,fired%20even%20before%20the%20investigation.

Leave a Reply