భారత ప్రభుత్వానికి ప్రకటన రూపంలో శాంతి చర్చలు ప్రారంభించడానికి నిషేధిత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తమ సంసిద్ధతను తెలియజేసిన తరువాత,  భారత ప్రభుత్వ నాయకత్వం తాను బస్తర్‌లో శాంతి కోసం కట్టుబడి ఉన్నానని విశాల ప్రపంచానికి చూపించడానికి అనేక వాక్చాతుర్య ప్రకటనలు చేసింది. ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకుల పైన కూడా ‘అర్బన్ నక్సల్స్’గా ఎర్ర ముద్ర వేసే పనిలో తీరిక లేకుండా ఉన్న గృహమంత్రి అమిత్ షా, నక్సలైట్లను తన సోదరులుగా భావిస్తున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించాడు.

అమిత్ షా బహిరంగంగా శాంతి కేకలు వేస్తున్నప్పటికీ, ఆయన ఆధ్వర్యంలోని భద్రతా బలగాలు బస్తర్‌లో మావోయిస్టుల ఊచకోతను కొనసాగిస్తూనే ఉన్నాయి. బస్తర్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టు పార్టీ శాంతి చర్చల ప్రతిపాదన చేసిన కేవలం వారంరోజుల లోపలే , అంటే 2025 ఏప్రిల్ 12న ఆ పార్టీ కార్యకర్తలు ముగ్గురు మరణించారు. ఈ ఘటన సుక్మా, బిజాపుర్ జిల్లాల సరిహద్దులోని దట్టమైన అడవుల్లో జరిగింది. పాలిగుడా, గుంద్రాజ్‌గూడెం అడవుల్లో అగ్రశ్రేణి మావోయిస్టు నాయకులు ఉన్నట్లు వచ్చిన గూఢచార నివేదికల ఆధారంగా జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్), కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) ల సంయుక్త బలగాలు సోదాలు చేసాయి.

2024 ఏప్రిల్ 21వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట కొండలపైన మరో దాడి చేసింది. రాజ్య బలగాలు మొదటగా కాల్పులు జరిపినప్పుడు మాత్రమే ఆత్మరక్షణ కోసం కాల్పుల జరపాలి; శత్రువును నష్టపరచడానికి లేదా దాడిచేయడానికి జరిపే వ్యూహాత్మక / సైనిక కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలి అని మావోయిస్టు పార్టీ, వాయవ్య ప్రాంత ప్రతినిధి రూపేష్ ఒక లేఖ ద్వారా తమ పార్టీ ప్రజా విముక్తి గెరిల్లా సైన్య సభ్యులు, కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, తద్విరుద్ధంగా, భారత రాజ్యం కేవలం 1,000 మంది పార్టీ సభ్యులను చుట్టుముట్టడానికి కనీసం 20,000 మంది బలగాలను పంపింది. కాల్పులు జరపడమే కాదు, గ్రామాల పైన బాంబులు వేస్తున్నాయని, “భారత రాజ్య బలగాలు జరుపుతున్నఅతి పెద్ద మావోయిస్టు వ్యతిరేక సైనిక చర్య”లో భాగంగా ఊచకోతకు గురవుతామనే భయంతో ఊరు వదిలివెళ్లిపోవాలనుకుంటున్న ఆదివాసులను అడ్డుకుంటున్నాయని అనేక నివేదికలు వచ్చాయి. (సుబ్రమణియమ్, 2025).

 నిర్భీతిగా తన రిపోర్టులను రాస్తున్నందుకు బస్తర్‌నుంచి బలవంతంగా పంపివేసిన ఒక జర్నలిస్టు, “సైనిక చర్య ప్రారంభమైన రెండు రోజుల తరువాత, ఏం జరుగుతోందో గమనించడానికి నేను కొండల దిగువ ప్రాంతానికి వెళ్ళాను. ఏప్రిల్ 23వ తేదీన తెలంగాణలోని పలాం గ్రామానికి సమీపంలో పసుపు రంగు ప్లాస్టిక్ షీట్లలో చుట్టిన మృతదేహాలతో ఉన్న పెద్ద పికప్ వాన్‌ను చూసాను. బహుశా అందులో మావోయిస్టుల మృతదేహాలు ఉన్నాయి” అని తన వ్యాసంలో రాసారు.

. . కొత్తపల్లి గ్రామానికి చేరుకున్న అరగంట తర్వాత, మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో, రెండు హెలికాప్టర్లు ఆకాశంలో కనిపించాయి. అవి కొండల మీదుగా ఎగురుతూ, దుర్గంపాడ్ వెనుక కర్రెగుట్ట వైపు అదృశ్యమయ్యాయి. 20-25 నిమిషాల పాటు ఎడతెగని కాల్పుల శబ్దాలు వినిపించాయి. హెలికాప్టర్లు వెళ్ళిపోయాక, భయానక నిశ్శబ్దం ఏర్పడింది. కాల్పులు ఆగిపోయాయి…

ఏప్రిల్ 21వ తేదీన వేలాది సంఖ్యలో భద్రతా బలగాలు కొండ దిగువన క్యాంప్ చేయడానికి వచ్చినప్పటి నుంచి ఇదే పద్ధతి కొనసాగుతోందని గ్రామస్తులు చెప్పారు.. రోజుకు నాలుగు సార్లు ఉదయం 7, 11 గంటలకు, మధ్యాహ్నం 3.30, సాయంత్రం 6 గంటలకు హెలికాప్టర్లు కనిపిస్తాయని, ఆ సమయంలో కాల్పులు జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు.

 భారతదేశ రాజ్యం శాంతి సందేశాన్ని పట్టుకొని నిలబడలేదనీ, బస్తర్‌లో తన నిజమైన జాతి విధ్వంసక ఉద్దేశాలను దాచడానికి ప్రయత్నిస్తోందనీ ఇది తెలియచేస్తూంది. బైలదిలాలోని ఇనుప ఖనిజాలను ఆర్సెలార్ మిట్టల్, ఎన్‌సిఎల్‌లకు అమ్మాలనే ప్రభుత్వం తీసుకున్న మరో చర్యను బట్టి ఇది మరింతగా స్పష్టమవుతుంది. బైలాదిలా ఇనుప ఖనిజ గనులు దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బైలాదిలా కొండ శ్రేణిలో ఉన్నాయి. ఈ కొండల క్రింద ప్రపంచ వ్యాప్తంగా దొరికే అత్యుత్తమ నాణ్యత గల ఇనుప ఖనిజాలనిల్వలు 14 నిల్వలుగా విభజితమై ఉన్నాయి. జపనీస్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ యుమెరా జపనీస్ స్టీల్ మిల్స్  ఈ ప్రాంతాన్ని కనుగొన్నాక 1955-56 సంవత్సరాల మధ్య ఈ గనుల వాణిజ్యపర ఆవిష్కరణ జరిగింది. భారతదేశ తూర్పు తీరానికి సమీపంలో ఉండటం వల్ల సామ్రాజ్యవాద శక్తులకు ప్రత్యేక ఆసక్తిని కలిగించింది. భారత ప్రభుత్వం ఎలాంటి సంకోచమూ లేకుండా, ఇనుప ఖనిజాన్ని తక్కువ ధరకు అమ్మడానికి జపనీస్ స్టీల్ మిల్స్‌తో  ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది; ఆ తర్వాత త్వరలోనే, అంటే 1965లో ఈ మిల్లు ప్రారంభమైంది.

ఈ గనులు ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎం‌డి‌సి) నిర్వహణలో ఉండేవి. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ, ఎప్పుడూ కూడా, ప్రత్యేకించి బస్తర్‌లోని ఆదివాసీ రైతాంగ లేదా సాధారణంగా భారతీయ ప్రజల ప్రయోజనాలకోసం సేవపని చేయలేదు. ఆర్సెలర్ మిట్టల్ నడిపే పైప్‌లైన్ ద్వారా ఎన్‌ఎం‌డి‌సి ఇనుప ఖనిజాన్ని జపనీస్ సామ్రాజ్యవాదులకు అతి తక్కువ ధరకు అమ్ముతోంది.

ఈ గనుల తవ్వకం వల్ల ఇప్పటికే ఆదివాసీ రైతులు నీటిపారుదల కోసం ఉపయోగించే శంఖాని, దంఖాని అనే రెండు నదులు కాలుష్యమయ్యాయి. సామ్రాజ్యవాదులకు ఇనుప ఖనిజాన్ని తక్కువ ధరకు అమ్మడానికి భారత రాజ్యం ప్రత్యేక రైల్వే లైన్లను కూడా ఏర్పాటు చేసింది. బస్తర్‌లో ఇటువంటి గనుల తవ్వకాల కార్యకలాపాలు మరింతగా విస్తరించకూడదని మావోయిస్టులు డిమాండ్ చేశారు. కానీ రాజ్యం అటువంటి డిమాండ్లను ఏ మాత్రం లెక్కచేయలేదు; ఇప్పటికే ఈ గనులను కార్పొరేట్‌లకు అమ్మడం ప్రారంభించడంతో ఈ ప్రాంతాలలో ఆ  గనుల తవ్వకాలు మరింతగా పెరగనున్నాయి.

విదేశీ సామ్రాజ్యవాదానికి మిత్రులైన భారతదేశంలోని పెద్ద కార్పొరేట్ సంస్థలు సమీపంలోని గడ్చిరోలిలో కూడా ఇటువంటి మైనింగ్ కార్యకలాపాలను చేపట్టడం వల్ల అడవుల విధ్వంసం జరుగుతోంది; ఆ ప్రాంతంలోని ఆదివాసీ రైతాంగం నిర్వాసితులవుతున్నారు. 2011 సంవత్సరంలో లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాంతంలో గనుల తవ్వకాన్ని ప్రారంభించింది. గనులతవ్వకాలు  ప్రారంభమైనప్పుడు ఆదివాసీ రైతాంగం తీవ్రంగా నిరసించారు. గనుల తవ్వకానికి అవసరమైన మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తూ ఈ ప్రాంతంలో పనిచేస్తున్న మావోయిస్టులు అనేక దాడులు చేశారు; లాయిడ్ మెటల్స్ ఉపాధ్యక్షుడిని చంపారు. మావోయిస్టుల ఈ దాడులు తాత్కాలికంగా గనుల తవ్వకాల కార్యకలాపాలను నిలిపివేసాయి. ఆ తరువాత, భారత రాజ్యయంత్రాంగం అందించిన మొత్తం భద్రతతో ఈ ప్రాంతంలో అడపాదడపా గనుల తవ్వకాలు జరిగాయి. నిరసన తెలుపుతున్న, ఇక ముందు గనుల తవ్వకాలు జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నించిన ఆదివాసీ రైతాంగంపైనా, మావోయిస్టులపైనా దాడి చేయడానికి ఈ ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర సాయుధ పోలీసుబలగాలు ఉన్నాయి. ఈ భద్రతా దళాల మద్దతుతో గనుల తవ్వకాలు కొనసాగడంతో ప్రాంతంలోని నేల, నదులు విషపూరితమయ్యాయి. గడ్చిరోలిలోని 41 కుటుంబాలు ఉన్న ఒక్క మల్లంపడి గ్రామంలోనే 22 కుటుంబాలు తమ వ్యవసాయాన్ని కొనసాగించలేకపోయాయి. గనుల నుండి వచ్చే బురదతో పొలాలు నిండిపోయాయి; మంచినీటి వనరులు కూడా తీవ్రంగా కలుషితమయ్యాయి. అనేక నదులు, వాగులు ఎర్రగా మారాయి. నది నీరు మురికై పోయి, పశువులకు కూడా పనికిరాకుండా పోవడంతో గ్రామస్తులు నీటి కోసం బోర్ బావులపై ఆధారపడవలసి వచ్చింది.

అదేవిధంగా, జార్ఖండ్‌లోని సరండా అడవుల  ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమం వెనుకంజ వేయడంతో ఆదివాసీ రైతాంగాన్ని దొర్జన్యంగా వారి భూమి నుండి తరలించారు. భద్రతా బలగాలు అనేక మంది ఆదివాసీ రైతుల భూమి పట్టాలను ధ్వంసం చేసి గనుల తవ్వకాలకు అడ్డంకి తొలగించాయి. గనుల తవ్వకాల వల్ల కలిగే కాలుష్యం కారణంగా ఈ ప్రాంతంలోని ఆదివాసీ రైతులకు కాలేయం, మూత్రపిండాల సంబంధిత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.

రాజ్యం ఈ అభివృద్ధి నమూనానే బస్తర్‌లో కూడా అమలుచేయాలని చూస్తున్నది. అంటే సామ్రాజ్యవాదులు, వారి మిత్రదేశాలు, కార్పొరేట్లు, ఆదివాసీ రైతుల భూమిని స్వేచ్ఛగా దోపిడీ చేయగల స్థితి నెలకొనడమే భారత రాజ్యానికి శాంతి అంటే అర్థం.

2000ల సంవత్సరం ప్రారంభంలోనే ఈ భూముల అమ్మకం కోసం రాజ్యామూ కార్పొరేట్‌ల మధ్య అనేక బహిరంగ, రహస్య అవగాహనా ఒప్పందాలు, కాంట్రాక్టులు జరిగాయి. కాంకేర్ జిల్లాలోని చార్‌గావ్‌లో ఇనుప ఖనిజం తవ్వకం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిక్కో కంపెనీతో ఒప్పందంపైన సంతకం చేసింది. ఈ ప్రాంతంలో తవ్వకాల వల్ల పరల్‌కోట్, మెండకి నదులు కాలుష్యమవుతాయి. ఆదివాసీ రైతుల నిరసనలూ మావోయిస్టు ఉద్యమమూ ఈ ప్రాంతంలో పూర్తి స్థాయి మైనింగ్ చేయడానికి రాజ్యమూ కార్పొరేట్‌లకు ఒక అడ్డంకిగా మారాయి. 2015లో మైనింగ్ కంపెనీలు ఉపయోగించిన 29 వాహనాలను మావోయిస్టులు తగలబెట్టారు; ఆ తర్వాత, 2017లో అలాంటి 19 వాహనాలను, పరికరాలను ధ్వంసం చేశారు. ‘చార్‌గావ్‌ ఖదాన్ విరోధి జనసంఘర్ష్ సమితి’ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలోని గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు; నిరసన తెలుపుతున్న ఆదివాసీ రైతాంగాన్ని రాజ్యం వేధించింది. భద్రతా బలగాల వేధింపుల కారణంగా గ్రామంలోనూ సమీప అడవుల్లోనూ తిరగడానికి భయపడుతున్నామని చాలా మంది మహిళలు అంటున్నారు.

అదేవిధంగా, 2000ల ప్రారంభంలో ఇంద్రావతి నదిపై ఆనకట్టలను నిర్మించే ప్రయత్నాలు జరిగాయి. ఇంద్రావతి నదిపైన బోధ్‌ఘాట్ సమీపంలో ఒక ప్లాంట్ నిర్మించాలని భావించారు; ఈ ప్రాజెక్ట్ 13,750 హెక్టార్ల వ్యవసాయ భూమిని, 9,309 హెక్టార్ల అడవులను నిర్మూలిస్తుంది. ఛత్తీస్‌గఢ్, సమీప రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఒడిశాలో ఉన్న పెద్ద పరిశ్రమలకు విద్యుత్తును ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం; ఆదివాసీ రైతుల అభివృద్ధి కోసం కాదు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆదివాసీ రైతులు తమ జీవనోపాధిని, భూమిని, అడవులను కోల్పోతారు. ఆదివాసీ రైతుల ప్రతిఘటన, మావోయిస్టు ఉద్యమం ఈ ప్రాజెక్ట్ సాకారం కాకపోవడానికి ప్రధాన కారణాలు (గత 40 సంవత్సరాలుగా ప్రక్రియ నడుస్తోంది).

ఈ విధంగా, బస్తర్‌లో రాజ్యం కోరుకునే శాంతి అంటే ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఉండడం అని స్పష్టమవుతుంది. ఇలాంటి శాంతిని సాధించడానికి, బస్తర్ భూమిని దోచుకోవడానికి ఆ ప్రాంతంలోని ఆదివాసీ రైతులను నిర్వాసితులను చేయడానికి ప్రయత్నిస్తోంది. భారత ప్రభుత్వం చేసిన ఈ దాడివల్ల బస్తర్‌లో జరుగుతున్న ప్రజాస్వామిక ప్రతిఘటన తాత్కాలికంగా వెనుకంజ వేసింది. ఈ స్థితిని ఉపయోగించుకుని ఆదివాసీ రైతాంగ నిర్వాసిత్వానికి దారితీసే గనుల తవ్వకం, ఇతర మౌలిక సదుపాయాల కార్యకలాపాలను తీవ్రతరం చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

కార్పొరేట్ దోపిడీని సఫలం చేయడానికి సైనికీకరణ చేస్తున్న రాజ్యం  ఎల్‌పిజి (లిబరలైజేషన్-ప్రైవెటేజేషన్-గ్లోబలైజేషన్) సంస్కరణలు ప్రారంభించిన తర్వాత మన దేశంలోని ఇటీవలి గతాన్ని పరిశీలిస్తే, ఈ కార్పొరేట్ దోపిడీకి మద్దతు ఇచ్చే నయా-ఉదారవాద విధానాలతో పాటు భారతదేశంలో సమాజాన్ని సైనికీకరించే ప్రయత్నం కూడా జరిగిందని గమనించవచ్చు. సైద్ధాంతికంగా, బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు విధానాల ద్వారా ఇది జరుగుతోంది. దీనితో పాటు, రాజ్యం దేశంలో నిఘాను, పోలీసు నియంత్రణను పెంచింది; వ్యక్తిగత స్వేచ్ఛపైన రాజ్య పరిధి విస్తృతమైంది. ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాలను అణచివేయడానికి రాజ్య ఏజెన్సీలను ఉపయోగించడం; పౌర పరిపాలనా యంత్రాంగంపై పోలీసుల నియంత్రణ ఎక్కువవుతోంది. ప్రజా ఉద్యమాన్ని అస్థిరపరిచేందుకు వివిధ ప్రాంతాలలో ఇన్ఫార్మర్ నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేస్తున్నారు.

భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా రైతాంగ ప్రతిఘటనను అడ్డుకోడానికి బీహార్‌లో రణవీర్ సేన, సన్‌లైట్ సేన వంటి మిలీషియాలను ఏర్పాటు చేయడం 1990’ల చివరలో చూసాం. ఈ ఫాసిస్టు మిలీషియాలు ఆధిపత్య కుల వర్గాలకే పరిమితం కావడం; ఇతర సెక్షన్లు ఎం‌సి‌సి‌ఐ, సి‌పి‌ఐ (ఎం‌ఎల్)పీపుల్స్ వార్ వంటి విప్లవ శక్తుల నాయకత్వంలో ఈ సైన్యాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉండటం అనేది ఇందులో రాజ్యం ఎదుర్కొన్న ఒక పరిమితి. ఈ ప్రాంతంలో లిబరేషన్ పార్టీ కూడా పనిచేస్తున్నప్పటికీ, వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు; ఎందుకంటే వారు విప్లవ పంథాను విడిచిపెట్టడం వల్ల ఈ శక్తులను పెద్దగా ప్రతిఘటించలేకపోవడంతో అణగారిన కుల నేపథ్యాల నుండి వచ్చిన వారి కార్యకర్తలు ఎక్కువగా మరణించారు.

తమిళనాడులో ‘కీజ్వెన్మణి ఊచకోత’ వంటి కార్మిక వర్గ ఉద్యమాలపై దాడి చేయడానికి భూస్వామ్య వర్గాలు ఆధిపత్య కులాలను సమీకరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ సమాజంలోని ఒక నిర్దిష్ట సెక్షన్‌ని ఫాసిస్టు భావజాలం కింద సంఘటితం చేసి, వారికి ఆయుధాలు సమకూర్చి, ఫాసిస్టు మిలీషియాగా మార్చి, ప్రజలపైన విచ్చలవిడి హింసను ప్రయోగించడానికి వదలడాన్ని ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు.

ఇదే కాలంలో, దేశంలో బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం పెరుగుతోంది. తాను ఆధారపడిన సామ్రాజ్యవాద శక్తుల ఒత్తిడి కారణంగా, దేశ పాలకవర్గం నయా-ఉదారవాద విధానాలను అమలు చేయాల్సి వచ్చింది. చారిత్రాత్మకంగా, అటువంటి విధానాలను అమలు చేయడానికి ఫాసిజాన్ని తీసుకురావాల్సిన, సమాజాన్ని సైనికీకరించాల్సిన అవసరం ఉందని మనం చూడవచ్చు. నయా-ఉదారవాదం అమలు అయిన మొదటి నయా వలసలలో ఒకటి చిలీ. ఈ ఆర్థిక విధానాలను ఫాసిస్టు పినోచెట్ ప్రభుత్వం అమలు చేసింది. పినోచెట్ ప్రజలను విభజించి, ఒక విభాగాన్ని సైనికీకరించగలిగాడు; ఈ విభాగాన్ని సహకరించేవారిగానూ ఇన్ఫార్మర్లుగానూ ఉపయోగించుకున్నాడు. పౌరులు చిత్రహింసకుల పాత్రను కూడా పోషించారు.

ప్రజలలో పరస్పర అనుమానం, భయాలు ఉన్నాయి కాబట్టి చిలీ చిత్రనిర్మాత ప్యాట్రిసియో గుజ్మాన్ ఈ పరిస్థితిని దేశ ‘విచ్ఛిన్న ఆత్మ’గా అభివర్ణించాడు. నయా-ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఏ విధమైన ప్రతిఘటననైనా అణచివేయడానికి చిలీ సమాజం సైనికీకరణమైంది. సైనికీకరణ లేకుండా ఈ విధానాలను అమలు చేయడం రాజ్యానికి దాదాపు అసాధ్యం అవుతుంది; సామాజిక సరళీకరణ కంటే ఆర్థిక సరళీకరణ చాలా అవసరమని చెబుతూ హాయక్, ఫ్రైడ్‌మాన్ వంటి సాంకేతిక నయా-ఉదారవాద ఆర్థికవేత్తలు ఈ ఫాసిజాన్ని సమర్థించారు. ఈ విద్యావేత్తలు అభివృద్ధి గురించిన పోస్ట్‌ మోడర్నిస్ట్ లియోటార్డియన్ తర్కంతో తీవ్రంగా ప్రభావితమయ్యారు. పెట్టుబడిదారీ అభివృద్ధిని స్వాభావికంగా విముక్తి కలిగించేదిగానూ మానవాళికంటే పూర్వమే ఉన్న సహజ నియమంగానూ భావించారు. మధ్య భారతదేశంలో కూడా అభివృద్ధికి సంబంధించి అదే తర్కాన్ని ఉపయోగించడాన్ని చూడవచ్చు; పెట్టుబడిదారీ-సామ్రాజ్యవాద అభివృద్ధి స్వాభావికంగా విముక్తిని కలిగిస్తుంది అని భావిస్తారు కాబట్టి దానిని వ్యతిరేకించే వారినెవరినైనా అభివృద్ధి వ్యతిరేకులుగానూ వెనుకబడినవారుగానూ చూస్తారు.

భారతదేశంలోపల విభజనను సృష్టించడానికి, నయా ఉదారవాదం అమలయ్యేలా చూడడానికి దేశాన్ని సైనికీకరణ చేయడానికి పాలకవర్గం ఉపయోగించిన సాధనం బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం. బాబ్రీ మసీదు హింసాత్మక కూల్చివేత ద్వారా హిందూత్వ రాజకీయాలు ఊపందుకోవడాన్ని; దేశంలో మత సామరస్యం నెలకొనడాన్ని 1995 సంవత్సరంలో చూసాం. పాలకవర్గం క్రమంగా మిలిటెంట్ బ్రాహ్మణీయ హిందూత్వాన్ని తమ ఆధిపత్య సిద్ధాంతంగా స్వీకరించి దేశంలో కొత్త ఆధిపత్య ఏకీభావాన్ని తేవడానికి ప్రయత్నించింది. దేశంలోని మైనారిటీలపై దాడి చేయడానికి సాయుధ మూకలను తయారు చేసింది; అవి బాబ్రీ మసీదును కూల్చివేసాయి. ‘హిందూ ఖత్రే మే హై’ (హిందువులు ప్రమాదంలో ఉన్నారు) అనే కథనాన్ని ప్రజలను సమీకరించడానికీ వారిని సైనికీకరించడానికీ ఉపయోగించాయి.

ప్రజలలో ఒక సెక్షన్‌ను సమీకరించడానికి పాలక వర్గాలు ఒక ఊహాత్మక శత్రువును సృష్టించి వారి బాధలన్నింటికీ ఆ ఊహాత్మక శత్రువు కారణమని నిందించాయి. మైనారిటీలపైనా, సామ్రాజ్యవాద మద్దతుతో భారతదేశాన్ని దోపిడీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలపైనా దాడి చేయడానికి పాలకవర్గాలు ఈ సెక్షన్ ప్రజలను ఉపయోగించాయి. ఈ మూకలు పాలక వర్గాల ఆదేశాన్ని పాటించే మిలీషియాగా రూపొందాయి. నరేంద్ర మోడీ సాగించిన మారణహోమం ద్వారా గుజరాత్‌లో అటువంటి విభజన, సమాజ సైనికీకరణ జరిగింది.

పాలక వర్గాలు మరింత వ్యాపార సానుకూల ఫాసిజం నమూనాలతో ప్రయోగాలు చేస్తున్నాయి. హిందూత్వ ఫాసిజం తనతో పాటు అశాంతి పరిస్థితులను తీసుకువచ్చింది. ఇది వ్యాపార సౌలభ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీనిని మరింతగా అర్థం చేసుకోవడానికి కర్ణాటకను ఉదాహరణగా తీసుకోవచ్చు. సాంకేతిక కేంద్రమైన బెంగళూరులో వ్యాపారాన్ని ప్రభావితం చేసే అల్లర్లలాంటి పరిస్థితులు కార్పొరేట్‌లకు ఇబ్బందిగా మారాయి కాబట్టి వారు రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి నిధులను సమకూర్చారు; ఇది హిందూత్వ ఫాసిజం బలంగా ఉన్న గత ఎన్నికలలో జరిగింది. అశాంతి పరిస్థితులను సృష్టించింది కాబట్టి రాహుల్ బజాజ్, గోద్రేజ్ వంటి కార్పొరేట్‌లలో ఒక వర్గం మోదీ గుజరాత్ మోడల్‌తో అసంతృప్తి చెందింది.

సిపిఐ (మార్క్సిస్ట్) చేప్పే సామాజిక (సోషల్) ఫాసిజం అనేది ఒక ఫాసిస్టు భావజాలం; అది మరింత ‘లౌకిక’మైనది; ‘ప్రజా అశాంతికి’ తక్కువ అవకాశం కలిగి ఉంది కాబట్టి బడా బూర్జువా వర్గంలోని ఒక వర్గానికి సముచితమైన సాధనం. క్యాడర్ పునాదిని ఏర్పాటు చేసుకోవడానికి సిపిఐ (మార్క్సిస్ట్) తన సోషల్ ఫాసిస్టు, రివిజనిస్ట్ భావజాలాన్ని ఉపయోగించి సృష్టించిన హమద్ వాహిని వంటి ఫాసిస్టు మిలీషియాలు, పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, సింగూర్, లాల్‌గఢ్‌లలో పరిశ్రమల స్థాపన కోసం ప్రజలను నిర్వాసితులను చేయడానికి, రైతుల భూమిని లాక్కోడానికి ఆ ప్రాంతంలో మారణహోమ హింసాకాండను  అమలుచేసాయి.

లాల్‌గఢ్‌లో మావోయిస్టుల నేతృత్వంలోని సాయుధ ప్రతిఘటన, సింగూర్ నందిగ్రామ్‌లలో నిరాయుధ ప్రజాస్వామిక పోరాటాల వల్ల పాలక వర్గాలు వెనుకంజ వేసాయి. వారి మిలీషియాలు నాశనం అయ్యాయి; భూమి ప్రజల చేతుల్లోనే ఉంది. బడా బూర్జువా వర్గం తమకు ఏకైక పరిష్కారం హిందూత్వ ఫాసిజం అని గ్రహించింది; దీనితో పాటు ఫాసిస్టుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే బడా బూర్జువా వర్గాలలోని శక్తివంతమైన గుజరాత్ లాబీ ఇతర సెక్షన్లపైన ఒత్తిడి తెచ్చింది. ఫాసిజం కాలంలో ఫాసిస్టు బూర్జువా వర్గం చట్టపరమైన, చట్టేతర చర్యల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చి మిగిలిన బూర్జువా సెక్షన్లను ఒకే పార్టీ కిందకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని ఇటాలియన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు టోగ్లియట్టి  చెప్పాడు. ఇదే లక్షణం భారతదేశంలో కూడా కనిపించింది. అదానీ నేతృత్వంలో గుజరాత్ ‘పునరుజ్జీవన బృందంగా’ పిలిచే  ఒక ఆసక్తి సమూహం బూర్జువా వర్గంలోని ఇతర వర్గాలపై ఒత్తిడి తెచ్చి ఐక్యతను సృష్టించే ప్రయత్నం చేసింది.

పశ్చిమ బెంగాల్‌లోని లాల్‌గఢ్ పోరాటం తర్వాత గుజరాత్ మోడల్ ఫాసిజం అత్యంత అనుకూలంగా అనిపించడంతో టాటా వంటి పారిశ్రామికవేత్తలు గుజరాత్‌కు పారిపోయి అక్కడ తమ కర్మాగారాలను నిర్మించుకున్నారు. 2002లో జరిగిన జాతి విధ్వంస హింస ద్వారా సమాజాన్ని సైనికీకరించగలిగిన అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వారిని ఆహ్వానించాడు. ప్రజలు ఒక ఊహాత్మక శత్రువుకు వ్యతిరేకంగా సంఘటితం కావడంతో ముస్లిం సమాజంపైన జరిగిన జాతి నిర్మూలన దాడుల ద్వారా ఫాసిస్ట్ మిలిషియాలు ఏర్పాటయ్యాయి; బలపడ్డాయి.

ఫాసిజం ఈ సమాజపు ఆత్మనే  విచ్ఛిన్నం చేసి ప్రజల మధ్య అపనమ్మకానికీ అనైక్యతకూ దారితీసింది. సమాజంలో ఉన్న ఈ విభజనను ఉపయోగించి, మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను పెద్ద కార్పొరేట్‌లకు అమ్మగలిగాడు. ప్రజలకు చెందిన ప్రభుత్వ భూములను మేత భూములలాగా అదానీ వంటి పెద్ద కార్పొరేట్‌లకు అమ్మేసాడు. మోడీ పాలనలో ముంద్రాలో 7350 ఎకరాల భూమిని అదానీకి అమ్మేసారు. గుజరాత్‌లో మోడీ పాలనలో 50 కి పైగా మత్స్యకార గ్రామాలను నాశనం చేశారు; 4,000 ఎకరాలకు పైగా భూమిని అదానీకి అమ్మేసారు. అటువంటి చర్యలకు వ్యతిరేకంగా జరిగే ఏ విధమైన నిరసనలనైనా బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టుల మిలీషియాలు అణిచివేశాయి. దేశంలోని బడా బూర్జువా వర్గం కోసం హిందూత్వ ఫాసిస్టులు మత్స్యకారుల గ్రామాలను నాశనం చేస్తూనే ఉన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని కాషాయ ఉగ్రవాద ప్రభుత్వం కూడా ఇలాంటి ఫాసిస్టు మిలీషియాలను నిర్మించింది; బస్తర్‌లో సాయుధ, నిరాయుధ ప్రజాస్వామిక ప్రతిఘటనపై దాడి చేయడానికి ఉద్దేశించిన సల్వాజుడుం లేదా పవిత్ర వేట అనే మిలీషియాను సృష్టించింది., ఆదివాసీ రైతాంగంలోని ఒక సెక్షన్‌ని, ముఖ్యంగా వారిలో ఉన్న లంపన్ సెక్షన్‌ని, క్రిమినల్ గూండాలను భూస్వామ్య వర్గాల కింద సంఘటితం చేయడానికి, సైనికీకరించడానికి రాజ్యం ప్రయత్నించింది. ఈ ప్రాంతంలో గనుల తవ్వకాలను, మౌలిక సదుపాయాల ఏర్పాటును సులభతరం చేయడానికి సల్వాజుడుం అనేక గ్రామాలను తగలబెట్టి, ఆదివాసీ రైతులను నిర్బంధ శిబిరాల్లోకి తరలించింది. ఆదివాసీ రైతుల సాయుధ, నిరాయుధ ప్రతిఘటన సల్వా జుడుంను ఓడించింది. ఆ విధంగా దేశంలో కార్పొరేట్ దోపిడీకి అవసరమైన పరిస్థితులను సృష్టించడానికి ప్రజలపై హింసను పురివిప్పడానికి రాజ్యం ఫాసిస్టు మిలీషియాలను విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభించిందని మనం చూడవచ్చు.

సాయుధ ప్రతిఘటన లేని, నిరాయుధ ప్రతిఘటన మాత్రమే ఉన్న కేరళలోని విజింజం వంటి ప్రాంతాలలో కూడా ఫాసిస్టు మిలీషియాలు సంఘటితం అయ్యాయి. బడా బూర్జువా అదానీ నిర్మిస్తున్న ఓడరేవుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మత్స్యకారులకు వ్యతిరేకంగా కాషాయ ఫాసిస్టు మూకలను సమీకరించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కేరళలోని ఎర్ర ఫాసిస్టు సిపిఐ (మార్క్సిస్ట్) కాషాయ ఫాసిస్టులతో కలిసి కవాతు చేసింది. లాయిడ్ మెటల్స్, ఇతర కార్పొరేట్ల గనుల తవ్వకానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలుపుతున్న మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కూడా రాజ్యం అలాంటి మిలీషియాలను తయారుచేయడానికి ప్రయత్నిస్తోంది.

నరేంద్ర మోదీ, అమిత్ షా ఈ ప్రాంతంలో తమ వికసిత్ భారత్ యాత్ర చేస్తున్నప్పుడు, ఫాసిస్టు మూకలతో ఉన్న అనేక వాహనాలు ఈ ప్రాంతంలో కనిపించాయి.  రామరాజ్యం, బజరంగ్ దళ్‌కి సంబంధించిన సంగీతంతో స్పీకర్లు బిగ్గరగా మ్రోగాయి; ప్రజలను సమీకరించడానికి బాల రాముడి ప్రతిమను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దేశంలోని వివిధ అణచివేతలకు దోపిడీకి గురైన, సముదాయాల పైన జాతి విధ్వంసక హింసను సృష్టించే ఉద్దేశ్యంతో బజరంగ్ దళ్ దేశవ్యాప్తంగా పనిచేస్తోంది. ఆయుధ శిక్షణనిస్తోంది. త్రిశూల్ దీక్ష అనే దీక్షతీసుకునే  కార్యక్రమంలో యువతకు ఆయుధ శిక్షణనిస్తున్నారు. ఆ విధంగా సైనికీకరణమైన యువత మైనారిటీలపైన విచ్చలవిడిగా హింసాకాండను జరుపుతుంది. నుహ్‌లో జరిగిన హింసాకాండ, చర్చిలపై దాడిలాంటివన్నీ అలాంటి దాడులకు ఉదాహరణలు. ప్రజలను తమ నిజమైన వైరుధ్యాల నుండి దృష్టి మరల్చడానికి, ఫాసిజం కింద వారిని సంఘటితం చేయడానికి ఇటువంటి మారణహోమ హింస అనేది ఒక పద్ధతి.

దీనితో పాటు, దేశంలోని జమ్మూ వంటి వివిధ ప్రాంతాలలో నక్సలైట్లకు వ్యతిరేకంగా బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిరసనలు పెరుగుతున్నాయని చూడవచ్చు. ఈ రెండు లక్షణాలను కలిపి చూస్తే, దేశవ్యాప్తంగా ప్రజలపై జరుగుతున్న యుద్ధంలో బజరంగ్‌దళ్‌ను ఒక శక్తిగా ఉపయోగిస్తున్నారనే నిర్ధారణకు త్వరగానే వస్తాం. దేశంలోని విప్లవోద్యమం బజరంగ్‌దళ్‌పైన బలమైన చర్య చేపట్టాల్సిన అవసరం ఉన్నది. నిఘాను విస్తృతంగా ఉపయోగించడం, రాజ్య నిర్మాణంలోని ప్రతి అంశాన్ని సైనికీకరించడం అనేది రాజ్యం ఉపయోగిస్తున్న మరో పద్ధతి. బస్తర్‌లో అనేక కార్యకలాపాలలో నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టిఆర్‌ఒ) పాల్గొంది. ఆ సంస్థ సేకరించిన ఉపగ్రహ డేటాను బస్తర్‌లో డ్రోన్ దాడులను చేయడానికి ఉపయోగించారు. ఈ దాడుల్లో  అనేకమంది ఆదివాసీ రైతాంగం ప్రాణాలు కోల్పోయారు.

ఎన్‌ఎస్‌ఎ మద్దతుతో ఎన్‌టిఆర్‌ఒకు శిక్షణనిచ్చి ఏర్పాటు చేసారు. ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడించిన వర్గీకృత దస్తావేజుల  ప్రకారం, ఎన్‌ఎస్‌ఎ కింద అమెరికా అభివృద్ధి చేసిన రహస్య ప్రపంచ నిఘా నెట్‌వర్క్ అయిన ఎస్‌ఎస్‌పిఎసిలో భాగంగా ఎన్‌టిఆర్‌ఒ ఉంది. అమెరికా ప్రభుత్వం సామూహిక నిఘా కోసం ఎస్‌ఎస్‌పిఎసిను ఉపయోగిస్తుంది. ఎన్‌టిఆర్‌ఒ సేకరించిన మన దేశప్రజల వ్యక్తిగత డేటాను ప్రజలకు తెలియకుండా ఒక విదేశీ ప్రభుత్వం ఉపయోగించుకుంది. భారత రాజ్యం ప్రారంభించిన సైనికీకరణ విధానం సామ్రాజ్యవాద శక్తుల ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే కాకుండా వారి సైనిక ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవడాన్ని చూడవచ్చు.

1990ల చివర, 2000ల ప్రారంభంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నక్సలైట్ ఉద్యమ ఫలితంగా ఉద్భవించిన ప్రజల ప్రజాస్వామిక ప్రతిఘటనపై దాడి చేయడానికి రహస్య సమాచార సేకరణను, నిఘాను విస్తృతంగా ఉపయోగించడాన్ని చూడవచ్చు. ఈ ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి భారత రాజ్యం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోను ఏర్పాటు చేసింది. కళా, క్రీడా క్లబ్‌లు, సంఘాలతో సహా ప్రజలకు సంబంధించిన  ఏ రకమైన రాజకీయ, రాజకీయేతర సంస్థపైనైనా విస్తృతంగా నిఘా పెడుతున్నారు. ఎస్‌ఐబి అనేక ఎన్‌కౌంటర్ హత్యలు చేసింది. రాష్ట్రంలో పౌర, ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలపై దాడులు చేసారు, చంపారు కూడా. ప్రజా ఉద్యమాలను పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి భారతదేశం అంతటా అసాధారణ అధికారాలనిచ్చారు. పౌర పాలనా యంత్రాంగం కూడా ఎస్‌ఐబి  అధికారుల ఆదేశాలను పాటించాలి. కార్యకర్తలను ఎస్‌ఐబి అపహరించి, హెలికాప్టర్‌లలో తరలించి, ఆపై వారిని చంపిన సందర్భాలు ఉన్నాయి. ఎస్‌ఐబికి అధికార పరిధిలేని ఢిల్లీ నుండి కోబడ్ గాంధీని అపహరించారు; అతని అరెస్టు నమోదు అయ్యే వరకు చట్టవిరుద్ధంగా తమ కస్టడీలో ఉంచుకున్నారు. ఎస్‌ఐబికి అతన్ని అరెస్టు చేసే అధికారాలు కూడా లేవు. తెలంగాణలో ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలపైన దాడి చేసి చంపడానికి లొంగిపోయిన మావోయిస్టులు, ఇతర దుండగులతో నర్సా కోబ్రాలు, నల్లమల కోబ్రాలు, నయీమ్ గ్యాంగ్ వంటి మిలీషియాలను ఎస్‌ఐబి సృష్టించింది. అటువంటి మిలీషియాలు అనేక మంది ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలను బెదిరించాయి, వేధించాయి, చంపాయి. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘంలోని ప్రముఖ సభ్యులు పురుషోత్తం , అజామ్ అలీ వంటి వారిని ఈ ముఠాలు చంపాయి.

కార్పొరేట్ దోపిడీ విధానానికి వ్యతిరేకంగా ఏ రూపంలోనైనా జరిగే ప్రతిఘటనను నివారించడానికి శ్రామిక ప్రజలపైన నిఘా సంస్థల తీవ్ర నిఘాను పెట్టారు. గత సంవత్సరాల్లో ప్రజల ప్రతిఘటనపైన దాడి చేయడానికి ఎన్‌ఐ‌ఎ, ఇడి తదితర కేంద్ర సంస్థలను ఉపయోగించుకోవడాన్ని మనం చూడవచ్చు. ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలు జి ఎన్ సాయిబాబా, సాంస్కృతికరంగ కార్యకర్త హేమ్ మిశ్రాను అరెస్టు చేయడంతో ప్రారంభించి; ఉపా కింద మహారాష్ట్రలో విద్యార్థి కార్యకర్తలు, రాడికల్ అంబేద్కరైట్‌లతో సహా మహారాష్ట్రలో అరుణ్ ఫెరేరా తదితర అనేక మంది  కార్యకర్తల అరెస్టు; ఆ తరువాత భీమా కోరెగావ్ కేసు; దేశవ్యాప్తంగా పౌర హక్కుల ఉద్యమాల నాయకత్వాన్ని; రోనా విల్సన్, స్టాన్ స్వామి, సుధా భరద్వాజ్ వంటి వారిని కల్పిత కేసుల కింద అరెస్టు చేశారు. ఈ తప్పుడు కేసులన్నింటినీ ఎన్‌ఐ‌ఎ తదితర కేంద్ర సంస్థలు తయారుచేశాయి. వీటిని కార్పొరేట్ దోపిడీ, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే రాజకీయ ఖైదీల హక్కులు, దేశంలోని అణచివేత, దోపిడీలకి గురవుతున్న వారి హక్కుల అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించే పౌర, ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాలను అంతం చేయడానికి ఉపయోగిస్తున్నారు. పెగాసస్ సాఫ్ట్‌‌వేర్‌ను ఉపయోగించి ఎన్‌ఐ‌ఎ,  ఇతర ఏజెన్సీలు ఈ కార్యకర్తల ఎలక్ట్రానిక్ పరికరాల్లో తప్పుడు ఆధారాలను అమర్చాయి. ఇది రాజ్యాలు సాధారణంగా తమ శత్రువులపై ఉపయోగించే ఒక రకమైన సైబర్ దాడి. ఈ దేశంలోని ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలను రాజ్యం శత్రువులుగా చూస్తుంది. లక్నో కుట్ర కేసు వంటి కొత్త కేసులను తయారు చేసి కార్మిక హక్కుల కార్యకర్త అనిరుధ్ రాజన్‌ను, నిర్వాసిత్వ వ్యతిరేక కార్యకర్త అజయ్ కుమార్‌లను ఉపా కింద అరెస్టు చేశారు. దేశంలోని విద్యార్థి కార్యకర్తలు, మేధావులను కూడా లక్ష్యంగా చేసుకున్న ఎన్‌ఐ‌ఎ వారిని వేధింపులకు గురి చేసింది. వారి కుటుంబాలను కూడా వేధిస్తున్నది; భయోత్పాతాన్ని సృష్టిస్తున్నది.

ప్రజా ఉద్యమాలపై దాడి చేయడానికి పారామిలిటరీని ఉపయోగించడం అనేది రాజ్యం సైనికీకరణకు చేస్తున్న ప్రయత్నానికి మరొక ఉదాహరణ. రాజ్యాన్ని ప్రతిఘటిస్తున్న ప్రజలపైన రాజ్యమే మానవహనన యుద్ధాన్ని ప్రారంభిస్తుంది.  ఇది మొదట నాగాలాండ్, కశ్మీర్ వంటి జాతీయ విముక్తి ఉద్యమాలలో కనిపించింది.  కానీ మధ్య, దక్షిణ, తూర్పు భారతదేశంలో కార్పొరేట్ దోపిడీని ప్రతిఘటిస్తున్న రైతాంగం మీద కూడా ప్రయోగించడం ప్రారంభించారు.

ఆదివాసీ ప్రజలు భారత రాజ్యాన్ని ప్రతిఘటిస్తున్న ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలలోనూ ఖనిజ సంపద కలిగిన ఇతర మధ్య భారతదేశంలోని రాష్ట్రాలలోనూ ప్రజలపైన ఈ యుద్ధం మొదట ఆపరేషన్ గ్రీన్ హంట్ రూపంలో ప్రారంభమైంది. సల్వాజుడుం, సెంద్రా, హమద్ వాహిని వంటి ఫాసిస్టు మిలీషియాలను ఈ ప్రాంతాలలో అడ్డుకోవడం వల్ల రాజ్యం క్షేత్రస్థాయిలో అర్ధ సైనిక బలగాలను విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభించింది. కార్పొరేట్ దోపిడీ నిరాటంకంగా కొనసాగడానికి ఈ భద్రతా బలగాలు జాతి విధ్వంసక హింసను అమలుచేస్తూ, మహిళలు, బాలికలపై అత్యాచారాలు చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, ప్రతిఘటనను అంతం చేయడానికి, ఈ ప్రాంతాలలో జనాభాను నిర్వాసితులను చేయడానికి ప్రయత్నిస్తాయి.

అందువల్ల, కార్పొరేట్ దోపిడీ అనుకూలత కోసం ఈ సమాజాన్ని సైనికీకరించడానికి రాజ్యం చేస్తున్న ప్రయత్నాన్ని మనం చూడవచ్చు. కేరళ వంటి ప్రాంతాలలో జనమైత్రి పోలీసింగ్‌ను ఏర్పాటు చేసారు. పోలీసింగ్‌లో సమాజ భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూడడానికి రాజ్యం ప్రయత్నిస్తున్న ప్రాంతాలలో ఇన్ఫార్మర్ నెట్‌వర్క్‌‌లను తయారుచేసే ప్రయత్నం ఇది.

కేరళలో సమాజాన్ని మరింత సైనికీకరించడానికి మాదకద్రవ్యాలపై జరిపే యుద్ధాన్ని రాజ్యం ఉపయోగిస్తున్నట్లు మనం చూడవచ్చు. మాదకద్రవ్యాలపై యుద్ధం పేరుతో ముస్లిం మైనారిటీని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. మాదకద్రవ్యాల వ్యతిరేక విధానం పేరుతో షాడో పోలీసింగ్, యువతను, ముఖ్యంగా కార్యకర్తలను ఎత్తుకెళ్లడం నిత్యకృత్యంగా మారింది. కార్మికవర్గ ప్రాంతాలలో, ముఖ్యంగా దళిత కాలనీలలో లేదా వలస కార్మికులు నివసించే ప్రాంతాలలో గాలింపు సర్వసాధారణం అయింది. సివిల్ దుస్తుల్లో ఉండి నీడలా అనుసరించి వేధించే ఈ షాడో పోలీసుల టీం మీద అనేక ఫిర్యాదులు రావడంతో రద్దుచేసారు.

ముస్లిం సముదాయపు అసమ్మతిని అణచివేయడానికి దేశవ్యాప్తంగా వారిపై ఇన్ఫార్మర్ నెట్‌వర్క్‌‌లను ఉపయోగించారు. మహారాష్ట్ర వంటి ప్రాంతాలలో, ముస్లింలు నివసిస్తున్న ప్రాంతాలలో ఉండే ఇన్ఫార్మర్లు అందించిన సమాచారం ఆధారంగా ప్రజాస్వామిక దృక్పథం కలిగిన ముస్లింలనూ రాజ్యమూ అది అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలనూ సందేహించేవారిని అరెస్టు చేశారు. సిమితో సంబంధాలు కలిగి ఉన్నారని పెట్టిన కేసులు చాలా మటుకు తప్పుడువని తేలాయి. రాజ్యం తన ప్రజలను దోచుకోవడానికి సైనికీకరణను ఒక మార్గంగా విస్తృతంగా ఉపయోగిస్తోంది.

పెద్ద కార్పొరేట్లు ఈ దేశాన్ని దోచుకోవడాన్ని సులభతరం చేయడానికి రాజ్యం సమాజాన్ని సైనికీకరణ చేస్తోందనే విషయాన్ని స్పష్టంగా చూడవచ్చు. సమాజంలోని పాలక వర్గాలు ఈ సైనికీకరణను నిరోధించడానికి ఏకైక మార్గం, ప్రజల కోసం ప్రజా సైనికీకరణ.

ప్రజలను సాయుధులను చేయడం– కుటుంబానికి ఒక తుపాకీ రాజ్య వ్యవస్థలను, బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజాన్ని ఉపయోగించి దేశ పాలక వర్గాలు సమాజాన్ని సైనికీకరించడానికి తీవ్రంగా ప్రయత్నించడాన్ని మనం గమనించవచ్చు. రాజ్య అణచివేతను ఎదుర్కోవడానికి రాజ్యాంగబద్ధ మార్గాలను అనుసరించడానికి ప్రయత్నించిన ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలను అరెస్టు చేసారు; హత్య చేశారు. నందిగ్రామ్‌లో లాగా అహింసా పద్ధతిలో ప్రతిఘటించినప్పుడు కూడా రైతులపై దాడి చేసి చంపడానికి మిలిషియాలను పంపారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం, ముఖ్యంగా ఆదివాసీ రైతాంగం, నిరాయుధంగా రాజ్యాన్ని వ్యతిరేకించినప్పుడల్లా ప్రతికూల అనుభవాన్ని ఎదుర్కొన్నది. ఇంద్రవెల్లి ఊచకోత వంటి ఘటనలు అటువంటి ప్రతిఘటన ఫలితంగానే జరిగాయి. ఇంద్రవెల్లిలో తమ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న బయటి వారిపై రైతాంగం చేసిన అహింసాయుత పోరాటంలో ఆదివాసీ రైతులు పాల్గొన్నారు. రాజ్యాంగబద్ధ పోరాటాలను విశ్వసించే సీపీఐ(ఎంఎల్)లోని కొండపల్లి సీతారామయ్య వర్గం ఈ పోరాటానికి నాయకత్వం వహించింది. ఈ ఆదివాసీ రైతులను భారత రాజ్యం దారుణంగా ఊచకోత కోసిన ఫలితంగా వారు సీపీఐ(ఎంఎల్) (పీడబ్ల్యూ) పార్టీలో చేరారు. అందువల్ల, భారత ప్రభుత్వం భారత సమాజాన్ని సైనికీకరించే విధానాన్ని ప్రారంభించక ముందే, ఆదివాసీ రైతాంగం తమను తాము రక్షించుకోవడానికి ఆయుధాలు చేపట్టవలసి వచ్చింది.

నక్సలైట్ ఉద్యమమూ ఆ తరువాత మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సాయుధ ప్రతిఘటనా బ్రిటిష్ వలసవాద కాలం నుండి ఉన్న ఆదివాసీ రైతాంగ ప్రతిఘటనకు కొనసాగింపు. బిర్సా ముండా, గుండాధుర్‌ నేతృత్వంలో, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో బయటి జోక్యానికి వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటన ప్రారంభమైంది. వలసవాదం కింద జరిగిన ఈ ప్రతిఘటన భౌతిక పరిస్థితులతో లోతుగా ప్రభావితమవడం వల్ల ఉనికిలో ఉన్న భావజాలం కూడా ఆ భౌతికత్వ స్వభావాన్ని కలిగి ఉంది. నక్సలైట్ ఉద్యమ కాలంలో ఈ భావజాలం మారింది కానీ ఇది అదే పోరాట కొనసాగింపు; ఇది స్వభావంలో సామ్రాజ్యవాద వ్యతిరేకమైనది;  భూస్వామ్య వ్యతిరేకమైనది.

భారత రాష్ట్రం ప్రారంభించిన సైనికీకరణ అంటే రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక నిరసనలు మాత్రమే, ప్రత్యేకించి నయా ఉదారవాదం ఆవిర్భావం తరువాత, ఏ సామూహిక ఉద్యమాల విజయానికి దారితీయలేవని మావోయిస్టు పార్టీ సరిగ్గా విశ్లేషించగలిగింది. కేవలం పిఎల్‌జిఎ మాత్రమే సాయుధమవలేదు; ఒక ప్రాంతంలోని విప్లవ ప్రజానీకం అంతా సాయుధులయ్యారు; వారు రాజ్యాధికారానికి వ్యతిరేకంగా పోరాడదలుచుకున్నారు. భారతదేశంలో మావోయిస్టు ఉద్యమం అంటే కేవలం కొంతమంది గెరిల్లాలు మాత్రమే అడవిలో తిరుగుతూ భద్రతా బలగాలను ఎదుర్కోవడం కాదు. భారతదేశంలో మావోయిస్టు ఉద్యమం అంటే ప్రజా వ్యతిరేక రాజ్యానికి వ్యతిరేకంగా సామూహిక ప్రజల సాయుధ ప్రతిఘటన.

మావోయిస్టు పార్టీ, పిఎల్‌జిఎ  కలిసి మిలిషియాలను ఏర్పాటు చేస్తున్నాయి. భీభత్సాన్ని సృష్టిస్తున్న శత్రువు నుంచి తమ భూమిని, గ్రామాలను రక్షించుకోవడానికి శిక్షణ పొందిన గ్రామస్తులే ఈ మిలీషియా. మావోయిస్టులు పనిచేస్తున్న ఈ ప్రాంతాలన్నింటిలో వేలాది మంది గ్రామస్తులను  మావోయిస్టులు సాయుధులను చేసారు. జాతి నిర్మూలన రాజ్యం నుండి తమను తాము రక్షించుకోవడానికి వారిని సమీకరించి, అవసరమైన ప్రాథమిక శిక్షణనిస్తారు.

లాల్‌గఢ్‌లో మనం చూసినది, బస్తర్, జార్ఖండ్ తదితర ప్రాంతాలలో మనం చూస్తున్నది ఇదే ప్రజల ప్రతిఘటనా సైన్యం. అనేక ఆదివాసీ ప్రాంతాలలో రాజ్యం తన జాతి విధ్వంసక అభివృద్ధి నమూనా అమలు జరగకుండా ఉండేలా చూస్తారు. అందువల్లనే 2000ల ప్రారంభంలో సంతకాలు చేసిన అవగాహనా ఒప్పందాలు ఇప్పటికీ బస్తర్‌లో ఎటువంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు దారితీయలేదు. ఈ ప్రాంతాలలో గత 40

 సంవత్సరాలుగా ప్రాజెక్టులు వరుసలో ఉన్నాయి. అదే సమయంలో, హస్‌దేవ్ అరణ్య వంటి ప్రాంతాలలో నిరాయుధ అహింసా పోరాటంలో పాల్గొంటున్న ప్రజలను భారత రాజ్యం తన సైనిక శక్తితో దారుణంగా అణచివేసింది. హస్‌దేవ్‌లో, అదానీ ప్రతి నిమిషం ఒక చెట్టును నరికివేస్తున్నాడు; ఫలితంగా ఆదివాసీ రైతులు నిర్వాసితులవుతున్నారు. హస్‌దేవ్‌లో, ప్రజలు తమ సొంత అడవులను రక్షించుకోలేకపోయారు; దండకారణ్యంలో సాయుధులవడం వల్ల ప్రజలు తమను తాము రక్షించుకోగలిగారు. అందువల్ల దండకారణ్యంలో ప్రజలు తమ స్వయంప్రతిపత్తిని నిలబెట్టుకోగలుగుతున్నారు. ప్రజలు తమ శత్రువులపైన నిఘా పెట్టగలుగుతున్నారు; అవసరమైనప్పుడు వారి నుండి రక్షించుకోగలుగుతున్నారు.

రాజ్యంలోని సామాజిక ఫాసిస్టు మిలీషియాలను ప్రతిఘటించడానికి లాల్‌గఢ్‌లో సిద్ధూ-కన్హు మిలీషియాను నిర్మించారు. హమద్ వాహిని, జాతి విధ్వంసక సామాజిక ఫాసిస్టు సీపీఐ (మార్క్సిస్ట్)లను నందిగ్రామ్, సింగూర్, లాల్‌గఢ్‌లలో ప్రజలు ఓడించారు. ఇతరులను తమ రాజకీయాలను కొనసాగించడానికి సీపీఐ (మార్క్సిస్ట్) పార్టీ అనుమతించని ప్రాంతాలు ఇవి. స్థానిక పార్టీ యూనిట్లు భూమిని నియంత్రించాయి; ఈ పార్టీ ఆదివాసీ రైతులను వేధించింది; ఈ పార్టీ ప్రజా వ్యతిరేక రాజకీయాలను కొనసాగిస్తూ దాక్కునేందుకు ఉపయోగించే ముసుగు మార్క్సిజానికి అవమానకరమైనది; ఈ నిరంకుశ శక్తుల ఆఫీసులను తగలబెట్టి ప్రజలు తమను తాము విముక్తి చేసుకున్నారు.

ఇటువంటి మిలీషియాలను ఇతర ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేశారు; ఒడిశాలోని నియమగిరి కొండలలో వేదాంత కంపెనీ గని తవ్వకాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ కొండలు బాక్సైట్‌తో నిండి ఉండడం వల్ల ఈ ప్రాంతానికి సాగునీరు అందించే అనేక వాగులు ఉన్నాయి. రుతుపవనాల నుండి వచ్చే వర్షపు నీరు పోరస్ బాక్సైట్ కొండలలోకి  చొచ్చుకుపోయి అనేక వాగులను సృష్టించింది. ఈ కొండలను తవ్వితే కనక నియమగిరిలోనే కాకుండా ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో నీటిపారుదల వ్యవస్థ దెబ్బతింటుంది. ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఈ ప్రాంతాలలో తవ్వకం జరిగితే అవసరమైన నీరు అందదు. అంతేకాకుండా, నియమగిరి కొండలు తమ  దేవుడు నియమరాజా నివాసం అనే  ఆదివాసీ రైతాంగ విశ్వాసమూ;  పర్యావరణ, సాంస్కృతిక పరంగా కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడానికి ప్రేరణనిచ్చింది. తమ పారామిలిటరీని ఉపయోగించి ఈ ప్రాంతంలోని ఆదివాసీ రైతాంగాన్ని తుడిచిపెట్టడానికి భారత రాజ్యం ప్రయత్నించింది. మావోయిస్టులు ప్రజలకు మద్దతునిచ్చారు; అర్ధ సైనిక బలగాల హింస నుండి తమను రక్షించుకోవడానికి గ్రామస్తులు నియమగిరి సురక్ష సేన అనే మిలీషియాను ఏర్పాటు చేసుకున్నారు. అత్యధిక ప్రజలు నియమగిరి సురక్షసేనలో సభ్యులుగా చేరారు. దాంతో వేదాంత మైనింగ్ ప్రాజెక్టును భారత రాజ్యం రద్దు చేయవలసి వచ్చింది.

దండకారణ్య అడవులలో భూమ్కల్ మిలీషియా ఈ పని చేస్తోంది. దండకారణ్య జోన్‌లో, గ్రామ స్థాయి మిలీషియాలను ప్రాంత స్థాయి, మరింత పెద్దవైన ప్రాంతీయ స్థాయి మిలీషియాలుగా అభివృద్ధి చేసారు. బస్తర్‌లో వందలాది గ్రామాలను తగలబెట్టిన, వందలాది మంది మహిళలపై అత్యాచారం చేసిన, పిల్లలను కూడా చంపిన ఫాసిస్టు మిలీషియా అయిన సల్వా జుడుం నుంచి వారు గ్రామాలను రక్షించారు. అర్ధ సైనిక బలగాలు బస్తర్‌లో విచ్చలవిడిగా అమలుచేస్తున్న హింసాకాండ నుండి వారు గ్రామాలను రక్షించుకోవడాన్ని కొనసాగిస్తున్నారు.

మావోయిస్టులు ఆయుధాలను వదిలేయాలని రాజ్యం డిమాండ్ చేస్తోంది అంటే పీపుల్స్ గెరిల్లా సైన్యమే కాదు, మిలీషియా కూడా తమ ఆయుధాలను వదిలేయాలని కోరుకుంటోంది. అలా చేస్తే కనక ఆదివాసీ రైతాంగం భారత రాజ్యం కార్పొరేట్ దోపిడీ కోసం అమలుచేస్తున్న హింస నుండి తమను తాము రక్షించుకోలేని పరిస్థితులకు దారితీస్తుంది. కార్పొరేట్ కంపెనీల దోపిడీ కోసం హింసాప్రయోగం జరుగుతోంది. బజరంగ్ దళ్ వంటి ఫాసిస్టు మిలీషియాలు ప్రజలపై జరుగుతున్న ఈ యుద్ధంలో చేరడానికి తమ సుముఖతను వ్యక్తం చేశాయనీ సైద్ధాంతికంగా తమ కేడర్‌ను అందులో పాల్గొనడానికి కూడా సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నాయనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

అందుకే నందిని సుందర్, అపూర్వానంద్ వంటి మేధావుల వాదనలను సందేహించాల్సిన అవసరం ఉంది. ఆదివాసీ రైతాంగం మావోయిస్టులకు మద్దతు ఇవ్వడం లేదని; వారు రాజ్య హింస, మావోయిస్టుల మధ్య ఇరుక్కుపోయారని; రాజ్యమే తన సొంత రాజ్యాంగాన్ని అనుసరించడానికి నిరాకరించే పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని అనుసరించమని మావోయిస్టులను కోరుతూ కొంతమంది విద్యావంతులు అభివృద్ధి చేసిన “సాండ్‌విచ్ సిద్ధాంతం” అనే సిద్ధాంతాన్ని వారూ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ‘రాజ్యాంగ మార్గం’ బస్తర్‌లోని ఆదివాసీ రైతాంగ  నిర్వాసిత్వానికి దారి తీస్తుంది తప్ప మరొకటి కాదు.

అదేవిధంగా, అపూర్వానంద్ విద్యావేత్తగా తన వృత్తి జీవితమంతటా, ఇటీవల ‘ది ఫాల్స్ వార్ ఇన్ బస్తర్’ అనే వ్యాసంలో కూడా మావోయిస్టులపై దాడి చేశాడు. అపూర్వానంద్ వ్యాప్తి చేస్తున్న అబద్ధాలన్నింటిని తిప్పికొట్టడానికి ఈ వ్యాసం మాత్రమే సరిపోదు. కానీ బస్తర్‌లో యుద్ధం జరగడం లేదని, మావోయిస్టులు ప్రజల కోసం, బస్తర్‌లోని ఆదివాసీ రైతాంగం కోసం పనిచేయడం లేదని ఆయన చేసిన రెండు ప్రధాన ఆరోపణలలో ఒకదాన్ని పరిశీలించవచ్చు.

గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పెద్ద మైనింగ్ ప్రాజెక్టులు లేకుండా చేయడానికి మావోయిస్టులు మిలీషియాలను ఏర్పాటు చేసారు; ప్రజలను సాయుధులను చేసారు. మావోయిస్టులు, పిఎల్‌జిఎ, మావోయిస్టులు సంఘటితం చేసిన ప్రజా మిలీషియాలు ఉండడం  వల్లనే ఈ ప్రాంతంలో గనుల తవ్వకాలు లేకుండా చూసుకోగలిగారు. ఇది కాదనలేని వాస్తవం. నిరాయుధ అహింసా పోరాటాలు చేయకుండా ఆదివాసీ రైతాంగాన్ని మావోయిస్టులు నిరోధించారనే వాదన కూడా అసంబద్ధమైనది. బస్తర్‌లో ఆదివాసీ రైతులు చేసిన హర్రకోడర్ పోరాటం వంటి అనేక అహింసా పోరాటాలను మావోయిస్టులు సమర్థించారు. హర్రకోడర్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు మావోయిస్టు పార్టీకి చెందిన పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్ కమిటీతో సహా వివిధ జోనల్ కమిటీలు ఇచ్చిన ప్రకటనలు ఉన్నాయి. నియమగిరి వంటి ప్రాంతాలలో కూడా ఆదివాసీ రైతులు అహింసాయుత పోరాటం చేయకుండా ఏ విధంగానూ ఆపలేదు.

భారత రాజ్యం నిషేధించేనాటికి మూలవాసీ బచావో మంచ్ బస్తర్‌లో చాలా సంవత్సరాలుగా పనిచేస్తోంది. మావోయిస్టులు అటువంటి సంస్థల కార్యకలాపాలను ఏ విధంగానూ ఆపలేదు లేదా వాటిని అడ్డుకోలేదు. బస్తర్‌లో యుద్ధం లేదని రాజ్యం చెబుతోందని, ఇది పూర్తి అబద్ధమని అపూర్వానంద్ వ్యాసంలో పేర్కొన్నారు. బస్తర్‌లో యుద్ధం చేస్తున్న రాజ్యం, అక్కడ ఎలాంటి యుద్ధం జరగడం లేదని అంటోంది. జెనీవా ఒప్పందాలకు విరుద్ధంగా వారు చేస్తున్న చర్యలు; ఐసిసి లేదా ఇతర అంతర్జాతీయ సంస్థలు కలిగించుకోకుండా ఉండేలా చూడడానికి యుద్ధం అనే వాస్తవాన్ని దాచిపెడుతూ ఈ యుద్ధాన్ని కొనసాగించాలనుకుంటున్నారు.

తమిళనాడులో ఉన్న పుదు జననాయకం లాంటి కొన్ని ఇతర గ్రూపులు కూడా బస్తర్, కేరళలలో మావోయిస్టుల వ్యూహం, ఎత్తుగడలపైనా ప్రశ్నలు లేవనెత్తాయి; వారిని లిన్‌పియావోయిస్టులు, ఫోక్విస్మో అనుచరులు అని పిలిచాయి. భారతదేశంలోని మావోయిస్టులు ప్రపంచ ప్రజాయుద్ధానికి మద్దతు ఇవ్వరు లేదా లిన్‌పియావో లాగా విప్లవాధికారాన్ని నమ్మరు అని అన్నాయి.

మావోయిస్టులు ఫోక్విస్మోను ఎప్పుడూ కూడా విమర్శిస్తూనే ఉన్నారు. ఫోక్విస్మో అనేది కామ్రేడ్ చే గువేరా, రాడికల్ ఫ్రెంచ్ రచయిత రెగిస్ డెబ్రే అభివృద్ధి చేసిన సిద్ధాంతం. చిన్న చిన్న సంచార గెరిల్లాలు లేదా ఫోకోలు విప్లవానికి కేంద్రంగా ఉంటాయని, అటువంటి ఫోకోల ఉనికి, వాటి సహజ స్వభావం వారిని విప్లవకారులుగా చేస్తుంది అని వారు నమ్ముతారు. వారు వీరోచిత చర్యల ద్వారా ప్రజలను సంఘటితం చేయడానికి ప్రయత్నిస్తారు; ఫోకోకు ఉన్న స్వాభావిక నైతిక ఆధిపత్యం ప్రజలను ఫోకోను అనుసరించేలా చేస్తుందని వారు నమ్ముతారు. అంతేకాకుండా, వారికీ రైతాంగం పట్ల తిరస్కార భావం ఉన్నది. ప్రజలు తమను తాము మూర్ఖులు, స్వార్థపరులు అని అనుకునేంతవరకు విప్లవంలో పాల్గొనరు; అందుకు సమర్థత లేనివారు అని భావిస్తారు.

భారతదేశంలోని మావోయిస్టులు భావజాలాన్ని ఉపయోగించి ప్రజలను సంఘటితం చేసారు; వారు ప్రజలపై నమ్మకం ఉంచి, వారి పై ఆధారపడి, మిలీషియా ద్వారా తమను తాము రక్షించుకోగలిగే సమర్థులుగా తయారు చేయడానికి ప్రయత్నించారు. అలా కాకపోయే ఉంటే కనక, పార్టీ పట్ల లేదా పార్టీ లక్ష్యం పట్ల సానుభూతితో ఆదివాసీ రైతాంగం పార్టీలో సభ్యులుగా ఎందుకు చేరుతున్నారు? రాజ్య అణచివేత, దోపిడీ విధానాల వ్యతిరేక పోరాటాల్లో ప్రజలు పాల్గొనే ప్రజా ఉద్యమాలపైన మావోయిస్టులు తమ దృష్టి సారించారు. రైతాంగం తమ పోరాట ముఖ్యమైన పునాదిలో ఒకరని మావోయిస్టులు నమ్ముతారు; ఫోసిస్మో రైతులను స్తబ్దులుగా, సమాజాన్ని మార్చగల సామర్థ్యం లేనివారిగా చూస్తుంది. బస్తర్‌లోని ఆదివాసీ రైతాంగాన్ని విప్లవ శక్తులుగా కూడా భావిస్తారు. రైతాంగం స్తబ్దమైన ప్రేక్షకులు కాదనీ తమ స్వంత విముక్తిని సాధించుకునే పోరాటంలో చురుకుగా పాల్గొంటారు అనీ భావిస్తారు.

కర్ణాటకలోని మాల్నాడ్ నుండి వైయనాడ్‌లోని ట్రై జంక్షన్  వరకు “మినీ లాంగ్ మార్చ్” అని పిలిచే మావోయిస్ట్ పార్టీ రాజకీయ-సైనిక ప్రచారం ఈ ఆరోపణకు దారితీస్తే కనక  పుదియ  జననాయగం ఉద్యమం గురించి లోతుగా అధ్యయనం చేయాలి. పశ్చిమ ఘాట్స్ స్పెషల్ జోనల్ కమిటీ ఈ చర్యలను ప్రజలలో సమరశీలతను పెంచే ఉద్యమాలుగా చూస్తోంది. ఈ ప్రాంతంలో జరిగిన అనేక ప్రజా  పోరాటాలలో పిఎల్‌జిఎ పాలుపంచుకుంది. ఇది ఆదివాసీ రైతులకు చిన్న అటవీ ఉత్పత్తులను పొందటానికి అడవులకు వెళ్లగలిగేలా చేస్తుంది. 2010వ దశకంలో కేరళలో రాజకీయ, సైనిక ప్రచారం ప్రారంభమైన తరువాత పశ్చిమఘాట్‌లలో రోడ్డు నిర్మించగలిగారు. కేరళలో అనేక సమరశీల చర్యలను చేపట్టడానికి ప్రజలు స్వయంగా ఏర్పాట్లు చేశారు.

అభివృద్ధి నమూనాను అమలుచేయడానికి సమాజాన్ని సైనికీకరించడానికి ప్రయత్నిస్తున్న రాజ్యం నుండి ప్రజలను రక్షించడమే కాకుండా, అధికారం ప్రజల చేతుల్లో ఉండేలా చూడడానికి కూడా మావోయిస్టులు ప్రయత్నించారు; ప్రజల కోసం ప్రజలు నిర్వహించే, వారి అవసరాలను తీర్చే అభివృద్ధి నమూనాను కూడా ప్రవేశపెట్టారు.

భారతీయ రాజ్య పెట్టుబడిదారీ – సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాకు సమాజాన్ని సైనికీకరించడం అవసరం అవుతుంది. ఇది అణగారిన వర్గాల నరమేధం పైనా దోపిడీ పైనా ఆధారపడి ఉంటుంది.

మావోయిస్టులు ఈ అభివృద్ధి నమూనాకు ప్రత్యామ్నాయ నమూనాను కూడా అందించారు. 50 సంవత్సరాల “స్వాతంత్ర్యం” తర్వాత కూడా, ఆదివాసీ రైతాంగం ఆదిమ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. నాగలి కూడా ఆదివాసీ రైతులకు తెలియదు. వారికి తమ సొంత అడవులు అందుబాటులో లేవు; తమ అడవుల ఉత్పత్తులను సేకరించలేరు. ఈ అటవీ ఉత్పత్తులను సేకరించడానికి  లంచమో మరింకొకటో అడిగే దోపిడీ అటవీ అధికారులతో వ్యవహరించాల్సి వచ్చింది. ఆ ప్రాంతంలో ఎలాంటి విద్యా సౌకర్యమూ లేదా పాఠశాల విద్య లేదు.

1980లలో దండకారణ్య ప్రాంతానికి మావోయిస్టులు వచ్చినప్పుడు [మొదట సిపిఐ(ఎమ్-ఎల్)పీపుల్స్ వార్; ఆ తరువాత 2004లో ఎం‌సి‌సి‌ఐతో విలీనం అయ్యి సిపిఐ(ఎమ్-ఎల్)(మావోయిస్ట్) పార్టీ] వారు మొదట తెందు ఆకు రేట్ల సమస్యను లేవనెత్తారు. అప్పటి వరకు ధరలు చాలా తక్కువగా ఉండేవి; ఈ సమస్యపై ప్రజలను సంఘటితపరిచారు; ప్రజా పోరాటాల ద్వారా వారు తెందు ఆకు రేట్లను పెంచగలిగారు. పోరాటం ఇంకా రూపు చెందని  దశలో కూడా పోలీసు అణచివేత ఉండింది.

ఆదివాసీ రైతులు ఈ రాజ్య అణచివేతకు వ్యతిరేకంగా సాయుధులవడం ప్రారంభించారు. అప్పుడు పోరాటం అటవీ శాఖకు వ్యతిరేకంగా జరిగింది; అటవీ శాఖ అధికారులను ఆ ప్రాంతం నుండి తరిమికొట్టారు; ఫలితంగా ప్రజలు తమ సొంత భూమిని సాగు చేసుకోవడానికి, అడవులలోకి వెళ్లగలిగారు; అడవుల నుండి వనరులను స్వేచ్ఛగా పొందగలిగారు.  మావోయిస్టులు జార్ఖండ్‌లో తెందూ ఆకు రేట్లను పెంచారని, ఆ ప్రాంతంలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు అమలయ్యేలా చూసారని  అల్పా షా తన పుస్తకం నైట్‌మార్చ్‌లో రాసారు.

అవినీతిపరులైన అటవీ అధికారులు, ఇతర వెనుకబడిన శక్తులు ప్రజలపై అధికారాన్ని చెలాయించడం కొనసాగించేలా చేయడానికి 1985 నాటికి పోలీసులు ఈ గ్రామాలపై దాడి చేయడం ప్రారంభించారు. దండకారణ్యంలోని ప్రజలూ ఆదివాసీ రైతాంగమే దీనికి వ్యతిరేకంగా పోరాడారు. సుర్సుండి గ్రామంలో, ఆదివాసీ రైతులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి కాల్పులు జరిపినప్పుడు, ప్రజలు ప్రతిఘటించి, తమను తాము రక్షించుకోవడానికి పోలీసుల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బస్తర్‌లో ఉద్యమం రాజ్యానికి వ్యతిరేకంగా ‘వీరోచిత’ చర్యలు చేస్తున్న ప్రజల నుండి వేరుచేయబడిన గువేరా ‘ఫోకో’లు కాదని, రాజ్యానికి వ్యతిరేకంగా తమను తాము రక్షించుకోవడానికి మావోయిస్టు పార్టీ ప్రజలను సంఘటితం చేస్తుందని ఇది స్పష్టం చేస్తుంది. డిసెంబర్ 2000 తర్వాత, దండకారణ్యంలోని అన్ని గ్రామాలలో మిలీషియాలు పెద్ద ఎత్తున ఉనికిలోకి రావడం ప్రారంభించాయి; వీటిలో గ్రామస్తులు కూడా ఉన్నారు.

మావోయిస్టుల హయాంలో బస్తర్‌లో కూడా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు; ఆదివాసీ రైతాంగం చేపల కోసం ఆధారపడే అనేక చెరువులను అభివృద్ధి చేసారు. కాలువల నిర్మాణం చేయడంతో నీటిపారుదల మరింత అభివృద్ధి అయింది. దండకారణ్య ప్రాంతంలో పండ్ల తోటలను పెంచడం మొదలుపెట్టారు;  స్థానిక జనాభా ఇంతకు ముందెన్నడూ చూడని పండ్లు అందుబాటులోకి వచ్చాయి. సహకార వ్యవసాయాన్ని కూడా ప్రవేశపెట్టారు; వాస్తవానికి, దేశంలోని అనేక ప్రాంతాల నుండి అంతరించిపోతున్న విత్తన రకాలు దండకారణ్యంలో ఉన్నాయి.  పెద్ద ఎత్తున పెట్టుబడిదారీ వ్యవసాయానికి బదులుగా సహకార వ్యవసాయంపైన పెట్టిన ఈ దృష్టి, పర్యావరణానికి సంబంధించిన ప్రజా కేంద్రీకృత స్థిరమైన అభివృద్ధి నమూనాను నిర్ధారిస్తుంది. విభిన్న నీటిపారుదల పద్ధతులు, వ్యవసాయ అభివృద్ధి దండకారణ్యంలో ఆకలిని లేకుండా చేసాయి. వాస్తవానికి, 1996లో భారతదేశాన్ని తాకిన కరువు దేశవ్యాప్తంగా అనేక ఆదివాసీ ప్రాంతాలను నాశనం చేసింది; కానీ దండకారణ్యాన్ని తాకలేదు. ఇది అభివృద్ధి నమూనా విజయ ఫలితం. అందువలన, ప్రజల సమస్యలు కేంద్రీకృతంగా ఉన్న అభివృద్ధి నమూనా మొదట భారతదేశంలో కనిపించింది. ఈ కాలంలోనే పాఠశాల విద్య, ఆధునిక ఆరోగ్య సౌకర్యాలను కూడా ప్రవేశపెట్టారు. మావోయిస్టులు అభివృద్ధిని, విద్యను వ్యతిరేకిస్తున్నారనే ఆరోపణ పూర్తిగా అబద్ధం. వారు ఈ ప్రాంతంలోని ఆదివాసీ రైతాంగ అభివృద్ధి జరిగేలా చూశారు; పాఠశాల విద్య, ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలను కల్పించాలని రాజ్యాన్ని డిమాండ్ చేస్తూనే  ఉన్నారు. రాబోయే గనుల తవ్వకాల పరిశ్రమల కోసం నగరాలకు , ఓడరేవులకు అనుసంధానించడానికి నిర్మిస్తున్న పెద్ద రోడ్లు, జలవిద్యుత్ కేంద్రాలు, గనుల మొదలైనవాటి మౌలిక సదుపాయాల కోసం జరిగే నిర్మాణాలను వారు వ్యతిరేకిస్తున్నారు; ఇవి పర్యావరణ కాలుష్యానికి, ఆదివాసీ రైతుల నిర్వాసిత్వానికి దారితీస్తాయి. మావోయిస్టులు ప్రజా-కేంద్రీకృత అభివృద్ధి నమూనాను కోరుకుంటున్నారు. మావోయిస్టు ఉద్యమం ఒక కోణంలో దేశంలోనే అతిపెద్ద పర్యావరణ ఉద్యమాన్ని, సుస్థిర ప్రజా అభివృద్ధి నమూనాను నొక్కి చెబుతుంది!

ఈ అభివృద్ధి నమూనా ప్రజాస్వామిక స్వభావాన్ని కలిగి ఉండేలా చూసుకోవడానికి, విప్లవ ప్రజా కమిటీలను (ఆర్‌పిసి- రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ)ఏర్పాటు చేసారు. ఆర్‌పిసిలలో పాల్గొనే ప్రతినిధులను గ్రామసభ ఎన్నుకుంటుంది. ఆర్‌పిసిలోని తమ ప్రతినిధులలో ఎవరినైనా తిరిగి పిలిపించుకోవడానికి ప్రజలకు అనుమతి ఉంటుంది; మరే ఇతర ప్రజాస్వామిక రాజ్యం కూడా ప్రజలకు ఈ అధికారాన్ని ఇవ్వదు. ఈ ఆర్‌పిసిల ద్వారా పన్నులు వసూలు చేస్తారు; అభివృద్ధి కార్యకలాపాలు జరుగుతాయి. ఆర్‌పిసిలను సంఘటితం చేశారు; జనతన సర్కార్ రూపంలో గ్రామాల్లో ప్రజల అధ్వర్యంలో నడిచే ప్రాంతీయ స్థాయి పరిపాలనా యంత్రాంగ శాఖలను కూడా ఏర్పాటుచేసారు. ఆర్‌పిసిలు, జనతన సర్కార్ తీసుకున్న నిర్ణయాలు బస్తర్‌లో అమలు అవుతాయి. ఈ రకమైన ప్రభుత్వ రూపం గ్రామసభలకు పూర్తి సార్వభౌమత్వాన్ని నిర్ధారిస్తుంది; ఇది పెసా చట్టం ద్వారా వచ్చిన రాజ్యాంగ హక్కు కూడా. గ్రామసభ నుండి వస్తుంది కాబట్టి ఆర్‌పిసిలకు సంబంధించి అధికారం రాజ్యాంగ విరుద్ధమైనది కాదు; భారత రాజ్యం ఈ ప్రజా ప్రభుత్వ చట్టబద్ధతను గుర్తించాలి.

అపూర్వానంద్, పుదియ జననాయకం ఆరోపణలు మళ్ళీ ప్రశ్నార్థకంలోకి వచ్చాయి. ప్రియమైన అపూర్వానంద్! మావోయిస్టులు ఆదివాసీ రైతాంగం కోసం ఏమీ చేయలేదని మీరు నిజంగా అనుకుంటున్నారా? మీ గాంధీ అహింసా రాజకీయాలు జలియన్ వాలాబాగ్‌లో ప్రజలపైన దారుణంగా దాడి చేయడానికి దారితీశాయి. తమను తాము రక్షించుకోవడానికి వారి దగ్గర ఆయుధాలు లేవు కాబట్టి జలియన్‌వాలాబాగ్‌లో ఒక రోజులో దాదాపు 400 మంది మరణించారు. బస్తర్‌లో వైమానిక దాడులతో ప్రజలపై దాడి చేస్తున్నది అర్ధ సైనిక బలగాలైనప్పటికీ మరణాల సంఖ్య జలియన్ వాలాబాగ్ మారణహోమానికి దగ్గరగా లేదు.

బస్తర్‌లో 400 మందిని చంపడానికి రాజ్యానికి ఒక సంవత్సరం పట్టింది; వారిలో సగానికి పైగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులు; పౌరులు లేదా మిలీషియా సభ్యులు కాదు. బస్తర్‌లో మార్క్సిజం-లెనినిజం-మావోయిజం ప్రజలను రక్షిస్తోంది; అది లేకపోతే వారు ఊచకోతకు గురయ్యేవారు. నిజమైన ప్రజాధికారం, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాల అస్థిత్వం  మావోయిస్టులు ఫోకోయిస్టులు అనే వాదనను తిప్పికొడుతుంది. బస్తర్ పైనా, మావోయిస్టు ఉద్యమంపైనా పుదియ జననాయగం తమ వైఖరిని పున:విశ్లేషించుకోవడానికి ప్రయత్నించాలి.

రాజకీయ-సైనిక క్యాంపెయిన్ సమయంలో ప్రజల విశ్వాసాన్ని దృఢపరచడానికి మీ పొరుగు రాష్ట్రం కేరళలో ఉన్న పిఎల్‌జిఎ సరిపోతుంది. ఈ కాలంలో దోపిడీ, అటవీ అధికారులకు వ్యతిరేకంగా ప్రజలు అనేక స్వతంత్ర పోరాటాలు చేశారు. పిఎల్‌జిఎ ఉనికి కారణంగా వారు చిన్న అటవీ ఉత్పత్తులను సులభంగా పొందగలిగారు. ప్రజల అభివృద్ధి నమూనా కూడా బీజ దశలో ఉద్భవించింది; పిఎల్‌జిఎ నాయకత్వంలో ప్రజల కోసం, ప్రజల చేత ఒక కొత్త మార్గం నిర్మాణమైంది.

బస్తర్‌లోనూ భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోనూ ఉద్భవించిన ఈ నిజమైన ప్రజాస్వామిక, నూతన ప్రజాస్వామిక, నూతన ప్రజాధికారాన్ని భారత రాజ్యం నిర్మూలించాలనుకుంటోంది. శాంతి చర్చల కుట్ర ద్వారా, దోపిడీ అభివృద్ధి నమూనాను అమలుచేయడం కోసమూ  ప్రజల అభివృద్ధి నమూనాను పూర్తిగా నిర్మూలించడం కోసమూ మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలివేయాలని రాజ్యం డిమాండ్ చేస్తోంది. రాజ్యం సైనికీకరణను ఆపివేస్తేనే నిజమైన శాంతి చర్చలు జరుగుతాయి; ఎందుకంటే రాజ్య సైనికీకరణను ఎదుర్కోవడానికి మాత్రమే ప్రజలు సాయుధులయ్యారు. మావోయిస్టుల డిమాండ్లు రాజ్యాంగ విరుద్ధమైనవి కావు; అమరుడైన మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆజాద్ తమ డిమాండ్లు రాజ్యాంగ పరిధులకు అతీతం కాదని పేర్కొన్నారు. వాస్తవానికి, భారత రాజ్యం రాజ్యాంగంలోని రక్షణలను సరిగ్గా అమలు చేసి ఉంటే మావోయిస్టులు లేదా ఆదివాసీ రైతాంగం ఆయుధాలను చేపట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదని, సామ్రాజ్యవాదులపై ఆధారపడటం, వారి పార్లమెంటు వర్గ స్వభావం మొదటి నుంచీ భారత రాజ్యాన్ని ప్రజా వ్యతిరేకిగా మార్చాయి అని వివరించారు.

రాజ్యం నియమించిన బంధ్యోపాధ్యాయ కమిటీ కూడా మావోయిజం, నక్సలైట్ ఉద్యమాలు సామాజిక-ఆర్థిక సమస్య కారణంగా ఉద్భవించాయని, సామాజిక-రాజకీయ పరిష్కారాలు అవసరమని పేర్కొంది. విద్యార్థులు, మేధావులు, శ్రామిక వర్గం, రైతాంగం తదితర ప్రజాస్వామిక దృక్పథం ఉన్న ప్రజలందరూ మావోయిస్టుల డిమాండ్లకు మద్దతు ఇవ్వాలి. మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలివేయాలని రాజ్యం చేస్తున్న డిమాండ్‌ను ఖండించాలి. అదే సమయంలో, ఈ ఉద్యమానికి దారితీసిన సామాజిక-ఆర్థిక సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేయాలి; తద్వారా నిజమైన శాంతి పరిస్థితులు ఏర్పడతాయి. తమను తాము రక్షించుకునే ప్రజల హక్కుకు నందిని సుందర్, అపూర్వానంద్ వంటి మేధావులు మద్దతునివ్వాలి; ప్రజలను నిరాయుధులను చేయాలని డిమాండ్ చేయడం మానేయాలి.

రచయిత్రి జర్నలిస్టు; వైనాడ్, కేరళ

అనువాదం : కె. పద్మ

Bhattacharyya, A. (2016). Storming the gates of heaven: The Maoist Movement in India : a Critical Study, 1972-2014.

Shah, A. (2019). Nightmarch: Among India’s Revolutionary Guerrillas. University of Chicago Press.

Togliatti, P. (1976). Lectures on fascism.

Azad. (2016). Maoists in India: Writings and Interviews.

Speaks, A. (2022, October 13). ഫാഷിസവും ചങ്ങാത്ത മുതലാളിത്തവും ശക്തിപ്പെട്ടത് എങ്ങനെ? https://asianspeaks.com/adani-and-modi-fascism-and-crony-capitalism-part-1-k-sahadevan/

Political Prisoners in India: on the state’s conspiratorial lawsuits and agencies. (2024, August 13). NAZARIYA MAGAZINE. https://nazariyamagazine.in/2024/08/13/political-prisoners-in-india-on-the-states-conspiratorial-lawsuits-and-agencies/

AMNESTY INTERNATIONAL. (2008). The case against Augusto Pinochet. https://www.amnesty.org/en/wp-content/uploads/2021/06/amr220042008en.pdf

Damkondawahi Bachao Sangharsh Samiti, Visthapan Virodhi Jan Vikas Andolan, The Scroll, Ground Report, The Wire, dvoice, Indie Journal, Newslaundry, Visthapan Virodhi Jan Vikas Andolan, & Community Network Against Protected Areas. (2023). A report on Mining, Repression and Resistance. In Forum Against Corporatization and Militarization, Anti-Displacement Movement & State Repression Public Meeting and Press Conference. Damkondawahi Bachao Sangharsh Samiti. https://scroll.in/article/1056602/the-cost-of-protesting-against-mining-in-gadchiroli

Statement on Operation Clean. (2024, July 25). Forum Against Corporatization and Militarization.

Chandrasekhar, A. (2017, August 4). The anatomy of a fake surrender: a movement against bauxite mining in Odisha’s Niyamgiri hills and the state’s efforts to circumvent it. The Caravan.

https://caravanmagazine.in/vantage/odisha-bauxite-mining-fake-surrender-niyamgiri

Anuradha Ghandy Memorial Lecture. (n.d.). No one killed the Dalits. In Text of the Seventh Anuradha Ghandy Memorial Lecture 2015. http://sanhati.com/wp-content/uploads/2015/11/lecture-with-footnotes.pdf

Guevara, C. (2002). Guerrilla Warfare. Rowman & Littlefield Publishers.

Debray, R. (2004). La guerrilla del Che. Siglo XXI.

Tse-Tung, M. (2020). On Guerrilla Warfare (GraphyCo Editions).

“As Maoists Ask for Ceasefire, Security Forces Shell Hills Sheltering Top Insurgent Leaders.” Scroll.in, 27 Mar. 2024, https://scroll.in/article/1081780/as-maoists-ask-for-ceasefire-security-forces-shell-hills-sheltering-top-insurgent-leaders.

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply