1 ప్రేమతో.. రేష్మాకు!

రేష్మా..
నీ పెరట్లోని
మొక్కలు
నీలాగే అందంగా ఉన్నాయి
తెలుసా..!

ఆ రోజు
ఉదయం
నేను పెరట్లోకి
వెళ్తే
అవేవో నా కోసమే
పెంచినట్టుగా
అనిపించింది

అలా
మొక్కలన్నీ ఒక్కసారి
నా వైపు
చూస్తే
సిగ్గుతో తల దించుకున్నాను
తెలుసా..!

మందారం చెట్టు నీడలో
మల్లెపూల పరిమళంతో
స్నానం చేయడం
అంటే మామూలు
విషయం కాదు కదా

నా జీవితంలో
ఊహించని
అదొక అందమైన స్వప్నం
తెలుసా..!

మల్లెలన్నా .. మందారం అన్నా
నాకు ప్రాణం
రేష్మా..

వాటిలో నా ప్రాణం
ఉందే.. కాసిన్నీ
నీళ్లు
పోయడం
మరిచిపోకు
రేష్మా!
(రేష్మాతో నేను)


2.నా మదిని దోచిన చెలి

నీల్సో..
ఆ రాత్రి నీతో గడిపిన
మధుర క్షణాలను ఎలా మరిచిపోగలను?
ఆ మిణిగురుల వెలుతురులో
నీతో ఏకాంతాన్ని ఎలా మరిచిపోగలను!

ఇది గమ్మత్తయిన ప్రపంచం
దాంట్లో నువ్వూ నేనూ
ఓ మట్టి ముద్దలం
నిజాయితీకి, నీతికి స్థలం లేదిక్కడా?

నిఖార్సైన నీ ప్రేమ ముందు కాలం చిన్నబోయింది
నీ ప్రేమకు నేను ఎప్పుడూ దాసోహిని

నీకు తెలుసా.. నీల్సో
నీ తడి కన్నీళ్లు..
నా హృదయాన్ని మెత్తగా తడిపేశాయి
ఆ హృదయ భారం
నా జీవితంలో మోయలేనంతగా
మారిపోయింది
మళ్ళీ జన్మంటూ ఉంటే..!
నీ కడుపులో బిడ్డగా పుడతానే..!

7.6.2024
5:22 pm

3. ఒక కల కోసం

జీవితమన్నాక స్వప్నం
ఉండాలి

వాస్తవానికి దగ్గరగా
దేహానికి హత్తుకుపోయేలా
స్వప్నం ఉండాలి


యుద్ధభూమిలో
చిగురిస్తున్న
లే లేత స్వప్నమై ఉండాలి

కలలన్నీ ఆవిరై
నదుల వెంట రక్తలై పారుతుంటే
రెండు దేహాలు ఒక్కటై
కలిపోయిన చోట
కొత్త స్వప్నం
చిగురించాలి

గుండెలయ తప్పిన చోట
ఆశలన్నీ
పిడికిలో
బంధించి
కొత్త శ్వాసకు
జీవం పోయాలి

ఆ స్వప్నం
అమరత్వాన్ని
ముద్దాడేలా
బహు సుందర స్వప్నమై ఉండాలి.

(నాది అనంతమైన స్వప్నం.
మండుతున్న అడవిలో సుందర స్వప్నం ఉండాలి)
21.6.2024





Leave a Reply