విప్లవోద్యమం స్త్రీలను ఒక విశాలమైన ప్రపంచంలోకి తీసికెళుతుంది. వేల ఏళ్ల సంకెళ్ల నుంచి విముక్తమయ్యేందుకు రెక్కలు తొడుగుతుంది. పితృస్వామ్యమనే అత్యంత హేయమైన బందీఖాన నుంచి సుందరమైన స్వేచ్ఛాతీరంలోకి నడిపిస్తుంది. సొంత ఆస్తి పునాదిగా, లైంగిక శ్రమ విభజన అనే ఇరుకు గోడల మధ్య నిర్మాణమైన కుటుంబం నుంచి ఉత్పత్తిదాయకమైన, సృజనాత్మకమైన వర్గపోరాటంలో భాగం చేస్తుంది. అప్పుడు స్త్రీలు చేయగల అద్భుతాలు ఎట్లా ఉంటాయో, అవెంత సాహసికంగా పదునెక్కుతాయో తెలుసుకోవాలంటే మిడ్కో జీవితంలోకి తొంగి చూస్తే చాలు. 

ఆమెలాంటి వేలాది, లక్షలాది నూతన మహిళలను అర్థం చేసుకోడానికి ఆమె నడచిన దారులను గమనిస్తే సరిపోతుంది. రేణుక ఒక మధ్య తరగతి ఉపాధ్యాయుడి కూతురు. ఆమె కుటుంబ వారసత్వం ఏమోగాని, తెలంగాణలోని కడివెండిలాంటి వీరోచిత వర్గపోరాట వారసత్వం ఉన్నది. విప్లవాన్ని ఎన్నెన్ని చెరగుల చూడవచ్చునో, నిర్మించవచ్చునో, ఊహించి నిజం చేయవచ్చునో ఆమె పుట్టి పెరిగిన కడివెండి ఒడిలో ఆమె నేర్చుకున్నది. ఏది ప్రత్యక్షమో, మరేది పరోక్షమోగాని, 1990ల విప్లవోద్యమ దశలో కేవలం తెలుగు ప్రాంతాల నుంచే వందలాది పట్టణ కార్మికవర్గ, మధ్య తరగతి కుటుంబాల నుంచి అమ్మాయిలు విప్లవోద్యమానికి ఆకర్షితులయ్యారు. ఆనాటికి ఆలోచనా రంగంలో హోరు మీదున్న స్త్రీవాదానికన్నా భిన్నంగా పితృస్వామ్యాన్ని, లైంగిక వివక్షను, కుటుంబ వ్యవస్థను, మొత్తంగా ఈ సామాజిక వ్యవస్థను దాని చారిత్రక క్రమంలో తెలుసుకున్నారు. పితృస్వామ్యాన్ని ఓడిరచాల్సిన మహిళలకు విప్లవమే ఎందుకు పరిష్కారం కావాలనే వాదనలను అధిగమించి, విప్లవమే పితృస్వామ్యాన్ని మట్టుపెట్టగల అజేయశక్తి అని వాళ్లు గ్రహించారు. ఆచరణాత్మక పితృస్వామ్య వ్యతిరేక భావజాల, సాంస్కృతిక, రాజకీయార్థిక పోరాటాలను విప్లవంలోనే వాళ్లు సమగ్రంగా తెలుసుకున్నారు. అందుకే విప్లవమే ఏకైక పరిష్కారంగా ఎంచుకున్నారు.

అలాంటి వాళ్లలో రేణుక ఒకరు. ఆమె రేణుకగా తెలిసినదానికన్నా మిడ్కోగానే ఎక్కువ మందికి తెలుసు. విప్లవమంటే సకల సృజనాత్మకతల సమాహారం కాబట్టి, నేల మీది నుంచి సమున్నతంగా మానవతను, విముక్తిని ఎత్తిపట్టగల శక్తికలది కాబట్టి రేణుకను తనకు తగినట్లు అది తీర్చిదిద్దుకున్నది. ఆమె  విప్లవానికి ఎన్నెన్ని రూపాల్లో పని చేసిందో మనకు తెలియదుగాని, ఆమె మిడ్కోగా పరిణమించిన తర్వాత ఆ మిణుగురు పురుగు కాంతి దండకారణ్యం నుంచి తెలుగు సాహిత్య రంగంలోకి కాగడాలా ప్రసరించింది. కథలు చదివే అలవాటున్న వాళ్లెవరూ ఆమె కథల పర్యావరణానికి దూరంగా ఉండలేరు. రేణుకకు దండకారణ్యం ఇచ్చిన పర్యాయపదం ‘మిడ్కో’ అయినట్లే, మిడ్కో అనే సృజనజీవికి ఎల్లకాలాలకు చెదరని చిరునామా ‘మెట్ల మీద’.

కానీ రచయిత్రిగా ఆమె ‘మెట్ల మీద’కు చేరుకోడానికి చేసిన ప్రయాణంలో ప్రతి కథా ఆ కథకు సరిసమానమే. ఆమె కథలను ఒకసారి వరస క్రమంలో చదవండి. విప్లవం ముట్టుకొనే స్త్రీల జీవన కోణాలన్నిటినీ ఆమె కథలు చేసింది. విప్లవమెంత ఆర్దృంగా, సున్నితంగా, ఉన్నతంగా స్త్రీని అర్థం చేసుకుంటుందో, ఆ క్రమంలో తానెంత విశాలమవుతుందో.. మిడ్కో కథలుగా మలిచింది. స్త్రీని గ్రహించలేకపోతే విప్లవానికి మరే అర్హత లేదేమో.. అన్నంతగా విప్లవోద్యమం స్త్రీల కోసం, స్త్రీల చుట్టూ తిరుగుతోంది. రచయిత్రిగా రేణుక దృక్పథం ఇదే. విప్లవంలోని స్త్రీ గురించి సరేÑ  సాధారణ మహిళల్లోని మాతృత్వం, సహచర్యం, ప్రేమ, బాల్యం వంటి భావనల చుట్టూ రేణుక రాసిన కథలు మరే  స్త్రీ రచయితలు రాయగలిగేవి కావు. స్త్రీ జీవితంలోని విషాదాన్ని, దు:ఖాన్ని, విధ్వంసాన్ని మాత్రమే కాదు, స్త్రీల ఔన్నత్యాన్ని, సామర్థాన్ని, సృజనాత్మకతను విప్లవోద్యమం గ్రహించిన తీరునంతా, తీర్చిదిద్దిన క్రమాన్నంతా రేణుక కథలుగా రాసింది.

ఒక్క మాటలో చెప్పాలంటే విప్లవానికి`స్త్రీకి ఉండే సంబంధమే ఆమె కథా వస్తువు. కావాలంటే ఇప్పుడు ప్రతి కథా ఇతివృత్తాన్ని లోతుగా చూడవచ్చు. మైదాన ప్రాంతపు విద్యావంత కుటుంబాల్లోని, గ్రామీణ ఇండ్లలోని ఏ మహిళ జీవితానుభవాన్నయినా అక్కడంతా ఆవరించి ఉండగల విప్లవోద్యమ రూపాల్లోంచి ఆమె కథలు ఎన్నుకున్నది.  స్త్రీల చుట్టూ ఉండే అనేకానేక సంప్రదాయ, బూర్జువా సౌందర్యభావనలకు భిన్నంగా వాళ్ల  జీవిత సంఘర్షణే, వాళ్లు పొందే ఎరుకే, వాళ్లు  ఎంచుకొనే ఆచరణే, వాళ్లలోని పరమ సౌందర్యమని పాఠకులకు అనిపిస్తుంది. మిడ్కో కథల్లోని ఆకర్షణ అంతా ఇదే. స్త్రీల జీవితంలోని అలవిగాని దు:ఖాన్ని, అంతులేని ప్రేమను, తిరుగులేని సాహసాన్ని, అసాధారణ త్యాగాన్ని రేణుక విప్లవంలోంచి చూసింది. అందువల్ల లక్షలాది తెలుగు కథల్లో, వేలాది తెలుగు నవలల్లో కనిపించని అద్భుతమైన స్త్రీ ఆమె కథల్లో కనిపిస్తుంది.

సున్నితంగా ఉండటమంటే దృఢంగా ఆలోచించడం, ఆచరించడం అనే అర్థాలను ఆమె స్త్రీ పాత్రలు పదే పదే చెబుతుంటాయి. మామూలుగా అయితే ఇదొక వైరుధ్యమనిపిస్తుంది, పొసగని వ్యవహారం అనిపిస్తుంది. కానీ అదే ఉండగల వాస్తవం. ఆమె తొలి రోజుల్లో ప్రధానంగా మధ్య తరగతి కుటుంబ స్త్రీల గురించి రాసిన కథల్లోనూ, దండకారణ్యం వెళ్లాక రాసిన విప్లవ ప్రభావంలోని ఆదివాసీ మహిళల గురించి రాసిన కథల్లోనూ మనకు కనిపించే సున్నితత్వం అదే. మనుషులు ఇంత సున్నితంగా ఉంటారా? ఉండాలా? అనిపించిన ప్రతిసారీ ఇంత దృఢంగా ఉండగలరన్నమాట..! అనిపిస్తుంది. మిడ్కో కథల్లోని స్త్రీ పాత్రల  గాంభీర్య ప్రవర్తన, సున్నితమైన అవలోకన మనకు చాలా గొప్పగా అనిపిస్తాయి. అచ్చంగా రేణుకలాగే. ఆమెను ఎరిగినవాళ్లు  ఎన్నడైనా ఆమె గడిబిడిగా మాట్లాడం చూసి ఉండరు. మాటలో, పనిలో, పలుకులో, వ్యవహారంలో సున్నితంగా ఉండటం ఆమె సహజ లక్షణమో, విప్లవ లక్షణమోగాని ఆమె కథలన్నీ అలాంటి సున్నితమైన చూపు వల్లనే కళాత్మకతను సంతరించుకున్నాయి. తీవ్రమైన దు:ఖం సహితం జీవితంలోని సహజమైన విషయంగా  భావిస్తుంది కాబట్టి ఆమె పాత్రలు ఎక్కడా కృతకంగా ఉండవు. విలువలను సంతరించుకొనే మానవ వ్యక్తిత్వం ఎంత సహజంగా, నేల మీద నింపాదిగా ఉంటుందో రేణుక కథల్లో చూడవచ్చు.

విప్లవం గురించి రాసిన మిడ్కో కథల్లో ఎందరో సాహసవంతులైన పురుషులు, పిల్లలు, వెరసి ప్రజలు..కామ్రేడ్స్‌ కనిపిస్తారు. వీళ్లందరి వ్యక్తిత్వాలు సహితం స్త్రీ పాత్రల పరస్పర ప్రభావాల్లో, సంఘర్షణల్లో రూపుదాల్చుతాయి. అందుకే  విప్లవం గురించి రాయడమంటే స్త్రీల గురించి రాయడమనే తార్కిక సత్యం ఆమె కథల నిండా పరుచుకొని ఉంటుంది. మిడ్కో తొలి కథల్లోనే ఈ గ్రహింపు ఉందని కూడా రుజువు చేయవచ్చు. విప్లవానికి ఆవల స్వీయాత్మక దృష్టితో, ఉదారవైఖరితో, ఉత్తుత్తి మానవతావాదంతో ఆమె స్త్రీల జీవితాన్ని ఎన్నడూ చూడలేదని కూడా ఒక్కో కథను తీసుకొని విశ్లేషించవచ్చు. అట్లాగే స్త్రీ అనుభవం స్త్రీలదే, దానికదే ప్రత్యేకం, దాన్ని రాయడమే సాహిత్య పరమ లక్ష్యం.. అని  కూడా ఆమె ఒక్క కథ రాయలేదు.  స్త్రీ అనుభవం.. అది నగరమైనా, పల్లెలైనా, అటవీ ప్రాంతమైనా ఈ మొత్తం వ్యవస్థలో భాగం అనే మౌలిక భావన ఆమెకు  మొదటి నుంచీ ఉన్నది. అందుకే ఆమె చూపే స్త్రీ అనుభవం మొత్తంగా మానవ అనుభవం అనిపిస్తుంది. అందువల్లనే అది విప్లవానికి ఒనరుగా మారింది. రేణుక ఆదివాసుల అడవుల్లోని మిణుగురు పువ్వేగాక మనందరి జీవితాల్లోని వెలుగు పువ్వు అయింది. ఆ కాంతిరేఖ ఆమె భౌతికకాయంతో మలిగిపోయేదికాదు. మనుషులు తమనుతాము విముక్తం చేసుకొని, ఈ స

మాజాన్ని సుందరంగా తీర్చిదిద్దేరోజు దాకా తోడుగా ఉంటుంది. 

3 thoughts on “రేణుక పర్యాయపదం మిడ్కో

  1. 1999 ప్రారంభంలో తిరుపతిలో ఒక ఫ్రెండ్ ఇంట్లో ఆమెను కలుసుకున్నాను. రాత్రి చాలా సేపు మంచి చర్చ జరిగింది. ఆమెను చూడడం అదే తొలిసారి, అదే చివరిసారి కూడా.మనుషులు ఇంత దగ్గరై, ఇంత దూరమవడం ఊహించనిదే. కామ్రేడ్ మిడ్కోకు అరుణారుణ జోహార్లు..

    1. While reading martyred comrade Midko’s story ‘mother’s love’ it moved me again, it is so beautiful when someone so simply reminded of one’s own experiences somewhere . One can feel the pain of such loss without ever meeting that person!

Leave a Reply