కేరళకు చెందిన స్వతంత్ర జర్నలిస్టు కామ్రేడ్ రెజాజ్ పైన పెట్టిన కల్పిత కేసుకు సంబంధించి మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటీఎస్) సిబ్బంది 2025 జూన్ 2న ఢిల్లీలో ఉన్న నజరియా వెబ్ పత్రిక సంపాదకవర్గ సభ్యురాలు* కామ్రేడ్ వల్లిక తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి వల్లికతో  మాట్లాడాలన్నారు. ప్రశ్నించడానికి లేదా అరెస్టు చేయడానికి ఎలాంటి వారెంట్ లేదా నోటీసు తీసుకురాలేదు కాబట్టి వల్లిక వాళ్ళను కలవదు అని చెప్పారు. జర్నలిస్టు రెజాజ్‌పై పెట్టిన కేసుకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులివ్వడానికి రాకపోతే కనక “ఆమె ఎక్కడ ఉంటుందో మాకు తెలుసు. మీకు చెప్పకుండానే తీసుకు వెళ్లగలం, ఆ తరువాత ఆమె ఎక్కడ ఉందో ఎవరికీ తెలియకుండా పోతుంది” అని కామ్రేడ్ వల్లిక తల్లిదండ్రులను ఎటీఎస్ బెదిరించింది.

న్యాయపాలన, సహజ న్యాయసూత్రాలను అమలుచేయడానికి బదులు శిక్షారాహిత్యమైన,

అధికారులు శాసించే పంచాయతీ పాలనలాగా చట్టపాలన స్ఫూర్తి తయారవుతోంది. తాము చెప్పినట్లు చేయకపోతే కనక కామ్రేడ్ వల్లికను తాము చాలా సులభంగా అరెస్టు చేయగలమని అంటున్నారు. మహారాష్ట్ర ఎటిఎస్ రాష్ట్రస్థాయి చట్టబద్ధ సంస్థ అని, తమ న్యాయపరిధికి వెలుపల ఉన్న రాష్ట్రంలో పనిచేస్తున్నారు కాబట్టి , ఉపా కేసులు అయినప్పటికీ న్యాయ ప్రక్రియ ప్రకారం అవసరమైన సరియైన వారంటు లేదా కనీసం ఢిల్లీలోని జిల్లా మేజిస్ట్రేటు నుంచి తీసుకోవాల్సిన అనుమతి పత్రమూ లేకుండా కామ్రేడ్ వల్లికను అరెస్టు చేస్తామంటూ బెదిరించడం ఈ అంశాన్నే సూచిస్తోంది.

ఇది వారి భూస్వామ్య అహంకారానికి స్పష్టమైన నిదర్శనం – ఎవరైనా తమ చట్టవిరుద్ధమైన డిమాండ్లకు, దౌర్జన్యకర ప్రవర్తనకు కట్టుబడి ఉండటానికి నిరాకరిస్తే కనక వారిపై ఉపా కేసులను పెట్టడం / బెదిరించడం పూర్తిగా ఆమోదయోగ్యమని ఎటిఎస్ భావిస్తూంది. ఈ విధంగా కామ్రేడ్ వల్లికను వేధిస్తూ,  బెదిరిస్తూ,  మరుసటి రోజు (జూన్ 3)  విచారణకు హాజరు కావాలని బలవంతం చేసారు. తమ స్వంత రాజ్యాంగపరమైన హామీలను ఉల్లంఘించి, ఎటువంటి చట్టపరమైన నోటీసు లేదా వారెంట్ లేకుండా, భారత రాజ్యం కామ్రేడ్ వల్లికను వెంటాడి వేధిస్తూ ఉంది; ఏకపక్షంగానూ చట్టవిరుద్ధంగానూ దర్యాప్తులను నిర్వహిస్తోంది

 సామ్రాజ్యవాదం తోడ్పాటుతో, దళారీ నిరంకుశ ఫాసిజం నాయకత్వంలో ఏర్పడిన, అర్ధ వలస, అర్ధ భూస్వామ్య విధానపు నిరంకుశ పాలనా యంత్రాంగానికి ఉండే నిజమైన అణచివేత స్వభావాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. కామ్రేడ్ రెజాజ్ ఉపన్యాసకుడిగా ఉన్న ఒక పత్రికా సమావేశంలో ఒక కరపత్రాన్ని పంపిణీ చేస్తున్న కామ్రేడ్ వల్లిక అనుకోకుండా అతనితో కాస్సేపు మాట్లాడింది అనే ఒక వాస్తవం తప్ప ఎలాంటి ఆధారాలు లేకుండా కామ్రేడ్ వల్లికను నాలుగు గంటలకు పైగా ప్రశ్నించారు. ఈ మొత్తం కసరత్తు ఉద్దేశ్యం స్పష్టంగా వేధింపు, భయపెట్టడం, బెదిరించడమే.

నజారియా మ్యాగజైన్‌ను మూసివేయమని ఎటిఎస్ అధికారులు ఆమెను హెచ్చరించారు; అలా చేయకపోతే, ఆపరేషన్ కగార్‌ను విమర్శించడం అనే “తప్పుడు మార్గంలో” నడుస్తోంది కాబట్టి  అరెస్టు చేస్తామన్నారు. నజరియా పత్రికను తీసుకురావడాన్ని కొనసాగిస్తే కనక ఆమె తల్లిదండ్రులకు తెలియజేయకుండా నాగ్‌పూర్ తీసుకెళ్ళిపోతామని బెదిరించారు;  “ఎటిఎస్ అనుమతి లేకుండా కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవనీ;  ఎటిఎస్ ‘కాదు’ అంటే ‘కాదు’అనీ; కాబట్టి తాము అరెస్టు చేస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉండదు” అని బెదిరించారు.

న్యాయవ్యవస్థ,  కార్యనిర్వాహక,  ప్రభుత్వ యంత్రాంగాల పాత్రలు వేరు వేరుగా ఉంటాయని, అవి ఒకదాని పనిలో మరొకటి జోక్యం చేసుకోకూడదని భారత రాజ్యాంగంలో పేర్కొన్న “అధికారాల విభజన”ను పూర్తిగా  విస్మరిస్తోంది. విచారణ సమయంలో, ఎటిఎస్ రెజాజ్ పైన అసంబద్ధమైన ఇస్లామోఫోబిక్ ఆరోపణలు చేసింది,  “లవ్ జిహాద్” అని రెజాజ్‌ని నిందించింది; అతను ఆన్‌లైన్‌లో స్నేహం చేయడం ద్వారా మహిళలను ఇస్లామిక్ సంస్థలలో చేరుస్తున్నాడని, వారిని శృంగార సంబంధాలకు ఆకర్షించి,  వివాహం చేసుకుని,  “పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులకు” పంపుతున్నాడని ఆరోపించారు. మరి మీరు రెజాజ్‌ను “పట్టణ నక్సల్” అని పిలుస్తున్నారు కదా అని కామ్రేడ్ వల్లిక ప్రశ్నిస్తే  “ఆదివాసీ ప్రాంతాలలో పట్టణ నక్సల్స్ తమ స్థావరాన్ని కోల్పోతున్నారు కాబట్టి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నారు” అనే ఒక కొత్త రకమైన కుట్ర సిద్ధాంతాన్ని బయటపెట్టారు.

ఆధారాలు లేకపోయినప్పటికీ కార్యకర్తలకు,  ప్రజలవైపు మాట్లాడేవారికి నిషేధిత సంస్థలతో సంబంధాలను అంటకట్టడమనే ఒక నియమంగా మారిన ప్రమాదకరమైన ఉదాహరణను ప్రతిబింబించడమే కాక,  బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ మనస్తత్వాన్ని కలిగిన ఎటిఎస్ సిబ్బంది బహిరంగంగా చిలకపలుకుల్లాగా ఆర్ఎస్‌ఎస్‌ను ప్రచారం చేస్తున్నాయి. “ ’కేరళ స్టోరీ’ నుండి ఇషాను కాపాడాము, తరువాతి వంతు నీదే, కేరళ స్టోరీ, బస్తర్-ద నక్సల్ స్టోరీ సినిమాలను చూడు” అని వల్లికతో అన్నారు.  ఈ సినిమాలు భారతదేశ ప్రజల “వాస్తవికతను, అనుభవాన్ని” చూపిస్తాయని ఆర్ఎస్ఎస్-బిజెపిలు ప్రచారం చేస్తున్నాయి.  భారత రాజ్యం ఎన్‌కౌంటర్‌లలో ఆదివాసులను హత్య చేస్తునట్లు వస్తున్న వందలాది నివేదికల లాగా 6 నెలల మంగ్లీని క్రూరంగా హత్య చేయడం అనేడి వీరికి కేవలం మీడియా జిమ్మిక్కు మాత్రమే.

ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని తాను ఎందుకు వ్యతిరేకిస్తుంది అనే స్పష్టత  ఎటిఎస్‌కు ఉన్నది. ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం అంటే నక్సల్స్‌కు మద్దతు ఇవ్వడంతో సమానం;  దేశ, అభివృద్ధి వ్యతిరేకతలను వ్యక్తం చేయడం. కానీ, ఆపరేషన్ కగార్‌ను విమర్శించడం అంటే అభివృద్ధికి వ్యతిరేకం కాదు; నిజమైన దేశభక్తి. ఎందుకంటే నిజమైన దేశభక్తులు మాత్రమే సామ్రాజ్యవాద, భూస్వామ్యవిధాన వ్యతిరేకులవుతారు; సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల, బడా భూస్వాముల వనరుల, లాభాల దాహాన్ని తీర్చడం కోసం తమ సొంత ప్రజలను చంపడాన్ని వ్యతిరేకిస్తారు.

ఆపరేషన్ కగార్ అనేది బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం రూపంలో విదేశీ కార్పొరేట్ ప్రయోజనాలకు సేవ చేయడానికి తన ప్రజలను నరహత్య చేయడానికి ప్రేరేపించిన భూస్వామ్య, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ భారతీయ రాజ్య వర్గ ప్రయోజనాల వ్యక్తీకరణ. భారతదేశంలో, మరీ ముఖ్యంగా భారతదేశంలోని ప్రధాన ప్రాంతాలలో మావోయిజంతో పోరాడుతున్నాం అనే పేరుతో భారత ప్రభుత్వం అనేక కార్యకలాపాలను ప్రారంభించింది.

హేయమైన సల్వా జుడుం ఏర్పాటుతో మొదలై ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో కొనసాగింది. ఆ తరువాత సమధాన్-ప్రహార్ పేరుతోనూ, ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్‌గఢ్‌లోనూ ఆపరేషన్ క్లీన్ పేరుతో ఝార్ఖండ్‌లోనూ కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్ మావోయిస్టు ఉద్యమం పైన  చివరి దెబ్బగా, బస్తర్‌లో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఉంది. సామ్రాజ్యవాద సంక్షోభ సందర్భమూ, ఛత్తీస్‌గఢ్ ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే కోణంలోనే ఆపరేషన్ కగార్‌ను కూడా చూడాలి.

సామ్రాజ్యవాదుల మార్గదర్శకత్వంలో, మంద్రస్థాయి ఘర్షణ (ఎల్ఐసి) తన రాజకీయ, సైనిక వ్యూహంగా భారత రాజ్యం తన సొంత ప్రజలపైన యుద్ధం చేస్తోంది. ఎల్ఐసి కింద, అత్యంత క్రూరమైన విప్లవ వ్యతిరేక యుద్ధ వ్యూహం, భారత రాజ్యం లెక్కలేనన్నిపోలీసు క్యాంపులు, ఫార్వర్డ్ ఆపరేషనల్ బేస్‌లను నిర్మించి, డ్రోన్ దాడులను, బస్తర్ మొదలైన ప్రాంతాలలో వైమానిక బాంబు దాడులను మోహరించడం ద్వారా సైనికీకరణను అనేక రెట్లు పెంచింది. కానీ ఎటిఎస్ ప్రకారం, ఆపరేషన్ కగార్‌ను విమర్శించకూడదు; ఎందుకంటే రాజ్య వ్యతిరేకత అంటే దేశ వ్యతిరేకత. ఎవరు నిజంగా దేశ వ్యతిరేకులు అని మనం నిర్ణయించుకోవాలంటే రాజ్యం ఎవరికి సేవ చేస్తోంది అని మనం అడగకూడదా?

కామ్రేడ్స్ రెజాజ్‌ను, వల్లికను, నజారియా పత్రికలను నిరాధారంగా వెంటాడి వేధించడాన్ని, ఎర్ర ముద్ర వేయడాన్ని, భారతీయ రాజ్యం చేస్తున్న కుట్రపూరిత బెదిరింపును తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ప్రచురణను రాకుండా చేయడానికి లేదా మూసివేయడానికి చేస్తున్న బెదిరింపులను దృఢంగా తిరస్కరిస్తున్నాం; ఫాసిస్ట్ బెదిరింపులకు తలవొంచం. నజారియాపై ఈ నిరాధారిత దాడిని ఖండించాలని ప్రజాస్వామిక, విప్లవకర, న్యాయం కోసం పోరాడే అన్ని సంస్థలు, వ్యక్తులకు పిలుపునిస్తున్నాం. అంతర్జాతీయంగా ఉన్న మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్ సంస్థలు, ప్రచురణలు, సిద్ధాంతకర్తలందరికీ మాతో సంఘీభావంగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

“మనం జీవితంలో మానవాళి కోసం పని చేయగలిగే స్థానాన్ని ఎంచుకుంటే కనక ఎటువంటి బరువూ మనల్ని కుంగదీయదు, ఎందుకంటే అవి అందరి ప్రయోజనం కోసం చేస్తున్న త్యాగాలు; అప్పుడు మనం చిన్న, పరిమిత, స్వార్థపూరిత ఆనందాన్ని అనుభవించం;  మన ఆనందం ల్క్షలాది మందికి చెందినదై ఉంటుంది;   మన పనులు నిశ్శబ్దంగానే కానీ నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. మన చితాభస్మం పైన ఉన్నతమైన ప్రజలు తమ వెచ్చటి  కన్నీళ్లను కురిపిస్తారు. ” – కార్ల్ మార్క్స్, ఒక యువకుడి ప్రతిస్పందన (రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఎ యంగ్ మ్యాన్)

1.  సామ్రాజ్యవాద వతిరేక భూస్వామ్య వ్యతిరేక, ఫాసిస్టు వ్యతిరేక, రివిజనిస్టు వ్యతిరేక పోస్ట్ మోడర్నిజమ్ వ్యతిరేక విధానంతో మార్క్సిజం-లెనినిజం-మావోయిజం ఆలోచనా విధానం కలిగిన అంతర్జాల పత్రిక నజరియా సంపాదక బృంద సభ్యురాలు

https://www.facebook.com/nazariya.kal.క

2025 జూన్ 4

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply