వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క పోలింగ్‌తో కూలిపోదని రుజువైంది. అయినా హిందుత్వ ఫాసిస్టు దురహంకారానికి ఎన్నికల్లో కూడా ప్రజలు కళ్లెం వేశారు. అబద్ధాలు, వంచనలు, వక్రీకరణలు, ప్రలోభాలతో సాగిన ఎన్నికల ప్రచారంలో సహితం ప్రజలు నిజాలు తెలుసుకోగలిగారు. ఫాసిస్టు నరేంద్ర మోదీ కళ్లలో భయం బట్టబయలైంది. రాముడు కాపాడలేడని కూడా తేలిపోయింది. ‘మందబుద్ధి’ని రెచ్చగొట్టి ఎల్లకాలం చెలామణి కాలేరని స్పష్టమైంది. ప్రజల వివేకం, సత్యాసత్యాల ఎరుక ఎంత తీక్షణంగా ఉంటాయో బీజేపీకి అనుభవంలోకి వచ్చింది. సంకీర్ణ ప్రభుత్వం మోదీ నియంతృత్వాన్ని అదుపు చేస్తుందనే నమ్మకం లేకపోగా ఫాసిస్టు పాలనలో భాగస్వాములు పెరిగారు. ప్రపంచబ్యాంకు ఏజెంట్‌ అనే సార్థక నామధేయుడైన చంద్రబాబు మతతత్వ ప్రభుత్వానికి కొమ్ముకాచి హిందుత్వ కార్పొరేటీకరణ మరింత ముందుకు పోవడానికి సహజంగానే అండగా నిలబడ్డాడు. 

గత పదేళ్లలో హిందుత్వీకరణ, కార్పొరేటీకరణ, సైనికీకరణ పెరిగినట్లుగానే వాటికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు  ఉధృతమయ్యాయి. గతంలో లేని కొత్త ప్రజాస్వామిక పోరాట శక్తులను ఫాసిజం విడుదల చేసింది. అనేక కొత్త పోరాట రూపాలను కార్పొరేటీకరణ అనివార్యం చేసింది. సాయుధ ప్రతిఘటనలను, నిరాయుధ శాంతి పోరాటాలను జమిలిగా ఎట్లా నడపవలసి ఉన్నదో సైనికీకరణ ప్రజా అనుభవంలో భాగం చేసింది. సారాంశంలో కార్పొరేట్‌ హిందుత్వకు సరిధీటుగా కాకపోయినా ఫాసిజాన్ని అంగీకరించబోమని భారత ప్రజలు ఎలుగెత్తి చాటారు. దారుణమైన నిర్బంధం, అణచివేత, దోపిడీ, హత్యాకాండ ఎంత చెలరేగినా ప్రతిఘటిస్తామని ప్రజలు నిరూపించారు. ప్రజా క్షేత్రమే ఫాసిజాన్ని, కార్పొరేటీకరణను ఎప్పటికైనా తుదముట్టించగలదని గత పదేళ్ల పోరాట చరిత్ర తేల్చిచెప్పింది. మన చుట్టూ ఉన్న ఆశా నిరాశల ప్రపంచం తప్పక ఆశావహంగానే మారుతుందనే భరోసా కూడా ఇన్నేళ్ల విషాదం అందించింది. 

ఇక్కడి నుంచి ఇంకా ముందుకు ఎట్లా సాగాలి? దానికి అవసరమైన వ్యూహం ఎలా ఉండాలి? ఇప్పటికీ విడివిడిగా ఉన్న పోరాట శక్తులన్నీ కార్పొరేట్‌ హిందుత్వకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాట రూపాలను చేపట్టాలి? జీవన రంగాలన్నిట్లో మరింత సృజనాత్మకంగా, మిలిటెంట్‌గా, విశాల ప్రాతిపదిక మీద పోరాటాలను ఎట్లా నిర్మించాలి? వాటన్నిటినీ ఎట్లా సమన్వయం చేయాలి? తెలిసిగాని, తెలియకగాని ఫాసిజానికి లోబడిన పీడిత ప్రజలందరినీ ఎట్లా బైటికి తీసుకురావాలి? ఫాసిజానికి ఉన్న సమ్మతిని ఎట్లా బద్దలు కొట్టాలి? అనే లోతైన ప్రశ్నలు మరోసారి సంధించుకోవాల్సిన సమయం ఇది. ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితిలో గణనీయమైన మార్పులు జరగకపోయినా దేశం ఒక కొత్త దశలోకి ప్రయాణిస్తున్నది. 

అవతలి శిబిరం చాలా స్పష్టంగా ఉంది. ఎన్నికల్లో ఫాసిస్టుల అంచనాలు కాస్త తారుమారైనా సమాజం మీద, ప్రజల మనసు మీద, సంస్కృతీ భావజాలాల మీద వాళ్ల పట్టు పదిలంగానే ఉన్నది. కులం, పితృస్వామ్యం, బ్రాహ్మణిజం ఉన్నంత వరకు ఈ దేశంలో హిందుత్వ ఫాసిజానికి మరణం లేదు. కార్పొరేట్‌ రాజకీయార్థిక పునాది మీద ఫాసిజం బలపడుతూనే ఉంటుంది. అధికార సంకీర్ణంలోని పార్టీలకుగాని, ప్రతిపక్ష కూటమిలోని పార్టీలకుగాని కార్పొరేట్‌ భారత్‌ను స్థాపించడమే లక్ష్యం. ఇందులో ఇంకో మాట లేదు. దీనికి ఆటంకంగా ఉన్న లౌకిక ప్రజాస్వామిక శక్తులను, విప్లవోద్యమాన్ని నిర్మూలించాలనే విషయంలో కూడా తేడా లేదు. 

ఈ మొత్తానికి ప్రధాని ‘వికసిత భారత్‌’ అనే పేరు పెట్టాడు. దీన్నే న్యూ ఇండియా అన్నాడు. నిజానికి ఇది ఫాసిస్టు పరిభాష. ఆర్‌ఎస్‌ఎస్‌ పుట్టడానికి ముందే సావార్కర్‌ ఇచ్చిన హిందుత్వ నిర్వచనంలోనే హిందూ రాష్ట్ర భావన ఉన్నది. హిందూ రాష్ట్రకు కార్పొరేట్‌ రాజకీయార్థిక పునాది ఉండాలని ఇటీవల ఫాసిస్టులు స్పష్టపరుచుకున్నారు. దీన్ని 2047 నాటికి సాధించాలనుకుంటున్నారు. ఇది కేవలం సంఫ్‌ుపరివార్‌ ఆశయమే కాదు, దాని రాజకీయ ప్రతినిధి అయిన బీజేపీ లక్ష్యం కూడా ఇదే. ఈ ఎన్నికల సందర్భంలో తనకు 2047 దాకా భగవంతుడు అప్పగించిన కార్యక్రమం ఉందని, దాన్ని సాధిస్తానని మోదీ ప్రకటించాడు. దీన్ని ఆయన వికసిత భారత్‌ అంటున్నాడు. కానీ వాస్తవానికి అది కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర. సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన పార్టీలన్నీ మోదీ చెబుతున్న ఈ వికసిత భారత్‌ కతలకు మురిసిపోతున్నాయి. 

కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర స్థాపించాలంటే అన్ని ప్రజాస్వామిక చైతన్యాలను నిర్మూలించాలి. లౌకిక విలువలను కాలరాయాలి. రాజ్యాంగ ఆదర్శాలను తుత్తునియలు చేయాలి. వీటన్నిటికీ వెన్నెముకలా ఉన్న విప్లవ చైతన్యాన్ని తుడిచేయాలి. పీడిత అస్తిత్వ ప్రజలను విముక్తి దిశగా నడిపించే, కార్పొరేటీకరణను సమరశీలంగా ఎదుర్కొనే విప్లవోద్యమాన్ని పూర్తిగా దెబ్బతీయాలి. మధ్యభారత దేశంలో కార్పొరేటీకరణను, సైనికీకరణను శక్తివంతంగా ఎదుర్కొంటున్న ఆదివాసులను చంపేయాలి. 

దీని కోసమే ఆపరేషన్‌ కగార్‌ అనే అంతిమ యుద్ధం నడుపుతున్నారు. ఈఏడాది జనవరి 1వ తేదీ నుంచి కగార్‌ పేరిట ఇప్పటికి 130 మందిని చంపేశారు. ఇందులో సాధారణ ఆదివాసులు ఎక్కువగా ఉన్నారు. విప్లవకారులూ ఉన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చాక కూడా మధ్యభారత దేశంలో ఆదివాసుల హత్యాకాండ ఆగలేదు సరికదా, మరింత తీవ్రమైంది. రాజ్యాంగ విలువలను, విధానాలను, ఎన్నికల ప్రక్రియను ఖాతరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల మీద యుద్ధానికి తెగబడిరది. నరేంద్రమోదీ ఈ ఎన్నికల్లో గతంలోకంటే పెద్ద ఎత్తున ముస్లిం వ్యతిరేకతను చాటుకున్నాడు. రెండో దశ పోలింగ్‌ ఆయ్యాక ఆయనకు ఓటమి భయం పట్టుకుంది. హిందూ ఓట్లను కొల్లగొట్టడానికి ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టాడు. ఇండియా కూటమితో ఎన్నికల పోరాటాన్ని ముస్లింల మీదికి మళ్లించాడు. కాంగ్రెస్‌ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేసి ముస్లింలకు ఇస్తారని ప్రచారం చేశాడు. అయోధ్య బాల రామాలయానికి తాళం పడుతుందని రెచ్చగొట్టాడు. సరిగ్గా అట్లాగే మావోయిస్టు వ్యతిరేకతను గతంలో కంటే తీవ్రంగా బైటపెట్టుకున్నాడు. మావోయిస్టు భయంతో ఆయన దేశమంతా పిచ్చెక్కినట్లు తిరిగి నోటికి వచ్చినంతా మాట్లాడాడు. అమిత్‌షా అయితే ఏకంగా ఈ ఎన్నికల్లో మోదీని మళ్లీ ప్రధానిని చేస్తే రెండేళ్లలో మావోయిస్టులందరినీ చంపేస్తామని అన్నాడు. 

హిందుత్వ భావజాల పునాది ఉన్న బీజేపీ సహజంగానే ఎన్నికల్లో సహితం మావోయిస్టు వ్యతిరేక, ముస్లిం వ్యతిరేక భావజాల యుద్ధానికి దిగింది. ఆదివాసులను, ముస్లింలను, మావోయిస్టులను తొలగించి హిందూ రాష్ట్రగా ఈ దేశాన్ని మార్చాలనే లక్ష్యంతో ఎన్నికల్లో బీజేపీ తలపడిరది. ఈ మొత్తం నిర్మూలన పేరే వికసిత భారత్‌. ఈ విడత బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం తన మిత్ర పక్షాలతో కలిసి ఈ లక్ష్యం కోసం పని చేయబోతోంది. ఇది ఎట్లా ఉండబోతోందో ముందుచూపుతో పరిశీలించాలి. దానికి వ్యతిరేకంగా పోరాట ఎత్తుగడలు తయారు కావాలి. ప్రజలు అందుకోవలసిన ఈ పోరాటాలకు మద్దతుగా వారిని భావజాల సాంస్కృతిక రంగాల్లో సమాయత్తం చేయాలి. ఈ లక్ష్యంతో విరసం తన ఆవిర్భావ దినం సందర్భంగా ఈ సదస్సు ఏర్పాటు చేస్తోంది. అందరికీ ఇదే ఆహ్వానం.

పతాకావిష్కరణ

జూలై 4 గురువారం ఉదయం 10:30 గంటలకు

ప్రారంభ ఉపన్యాసం

అరసవిల్లి కృష్ణ

వక్త : హెత్మామ్‌

(కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక కమిటీ, ఢిల్లీ)

అధ్యక్షత   :   రాంకి 

వక్త   :    వరలక్ష్మి 

అధ్యక్షత   :   రాము

వక్త   :   పాణి

అధ్యక్షత   :   శివరాత్రి సుధాకర్‌

వక్త   :   రివేరా

అధ్యక్షత   :   సాగర్‌

విరసం నాటక ప్రదర్శన, 

ప్రజా కళామండలి, అరుణోదయ 

సాంస్కృతిక   కార్యక్రమాలు వుంటాయి.

విప్లవరచయితల సంఘం 

Leave a Reply