అవును...
వాళ్ళిప్పుడు రాజ్యం చేతిలో
దెబ్బమీద దెబ్బ తింటున్నారు..
వాళ్ళ సహచరులెందరో అమరులవుతున్నారు...
నిజమే..
సామ్రాజ్యవాదుల, దళారీ కార్పొరేట్ల
ఆజ్ఞల్ని శిరసావహించిన
కాషాయ అష్టదిగ్బంధనంలో
వాళ్ళ 'పొత్తిళ్ళలోని ప్రజాసైన్యం'
చుట్టుముట్టివేయబడుతున్నది.
నిజమే..
జనతన సర్కార్....
వాళ్ళ నాలుగు దశాబ్దాల శ్రమ ఫలితం..
అదొక ఒక ప్రత్యామ్నాయ
ప్రజా స్వయం పరిపాలనా యంత్రాంగం...
అదొక భవిష్యత్ సోవియెట్ నమూనా..
దాన్నిప్పుడు
హస్తినాపుర రాక్షస కబంధహస్తాలు
చిదిమివేస్తున్నాయి...
నిజమే..
అయినప్పటికీ ...
వాళ్ళ ఈ ఓటమి తాత్కాలికం...
గెరిల్లా స్థావరప్రాంతాలు గెరిల్లా ప్రాంతాలుగా,
గెరిల్లా ప్రాంతాలు గెరిల్లా స్థావరప్రాంతాలుగా
చేతులు మారడం
ప్రపంచ విప్లవ చరిత్రలో
అపూర్వం కాదు.
అంచేత...
ప్రపంచవ్యాప్త విప్లవ పరిస్థితి
అంతకంతకూ తీవ్రమవుతున్న నేపధ్యంలో
వాళ్ళు త్వరలోనే
దెబ్బకాచుకొని లేచినిలబడతారు.
జబ్బచరిచి లేచినిలబడతారు.
తప్పదు...
వాళ్ళు
తాము తలపడుతున్న భారత రాజ్యం
అత్యంత శక్తివంతమైన రాజ్యాల్లో ఒకటని
అక్షరాభ్యాసం చేసినప్పుడే నేర్చుకున్నవాళ్లు.
ఈ రాక్షస రాజ్యాన్ని కూలదొయ్యడం అంటే
వెయ్యి మైళ్ళ ప్రయాణం అనే ఎరుకను
ముందునుండే తమ
అతిస్పష్టమైన అవగాహనలో
పొందుపరచుకున్నవాళ్లు.
వాళ్ళు
భారత విప్లవ వ్యూహం పట్ల
ముందెవరికీ లేనంతటి స్పష్టత కలిగివున్నవాళ్ళు.
మార్క్సిజం, లెనినిజం, మావోఇజాలను
దేశ నిర్దిష్ట పరిస్థితులకు
సరిగ్గా అన్వయించి
వర్గ వైరుధ్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాళ్లు
విప్లవానికి ఎవరు ప్రధాన శత్రువులో
ఎవరు నిజమైన మిత్రులో
పరిణతితో కూడిన అవగాహన కలిగిఉన్నవాళ్లు.
దేశాన్నింకా విముక్తం చెయ్యకుండానే
మొన్నటి రష్యా వలే, నిన్నటి చైనా వలే
ప్రపంచ ప్రగతిశీల శక్తులెన్నిటిచేతనో
తమ అగ్రగామిదళంగా భావింపబడుతున్నవాళ్లు.
దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలో
ఓడిపోతూ గెలుస్తూ
మళ్ళీ ఓడిపోతూనే,
గెలవడం ఎలాగో
నేర్చుకుంటున్నవాళ్ళు.
యుద్ధం చేస్తూనే
యుద్ధవిద్యను అభ్యసిస్తున్నవాళ్ళు.
వాళ్లు కూడగట్టిన సైన్యం
చారెడు భూమికి నోచుకోని
నిరుపేద రైతుబిడ్డల, కూలిబిడ్డల ప్రజాసైన్యం.
వందల వేలఏళ్ల
అణచివేతకు గురై
సమాజపు అట్టడుగు లోతుల్లోకి
నెట్టివేయబడ్డవాళ్ళ సైన్యం అది.
అది అక్షరం అంటే ఏంటో తెలియని
అతి సామాన్యులు
అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి
అనే స్థాయికి అసమాన్యులుగా ఎదిగిన
మట్టిమనుషుల సైన్యం.
సాల్వాజుడుం అత్యాచారాలనీ
ఫ్యూడల్ పురుషాహంకారాన్నీ
ధిక్కరించి వచ్చిచేరిన
ఆదివాసీ ఆడబిడ్డల సైన్యం అది.
ఆ సైన్యంతోనే....
అమెరికన్ శాటిలైట్ల,
ఇజ్రాయిలీ డ్రోన్ల,
హెలికాప్టర్ల, బాంబుదాడుల,
షెల్లింగుల, విషవాయువుల
శతృ దిగ్బంధాల్ని అధిగమిస్తూ
నాలుగులక్షల పారామిలిటరీ సైన్యాల
చుట్టుముట్టి అణచివేత కాంపెయిన్లను,
అనంత త్యాగాల నెత్తుటి బాటలో
మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొంటున్న
సాహసోపేత కమ్యూనిస్టు దళపతులు వాళ్ళు.
అవును...
వాళ్ళిప్పుడు రాజ్యం చేతిలో
దెబ్బమీద దెబ్బ తింటున్నారు..
నిజమే....
అంతమాత్రం చేతనే...
వాళ్ళ వ్యూహంలోనే
మౌలికమైన పొరపాటు ఉందనీ
వాళ్ళ అర్ధవలస అర్ధభూస్వామ్య అవగాహనకి
కాలం చెల్లిపోయిందనీ,
ఇంకెక్కడి భూస్వామ్యం అనీ
అసలు సామ్రాజ్యవాదం అనేదే లేదనీ
గోచీలు ఎగగట్టి
దశాబ్దాలుగా అరిగిపోయిన మీ పాత రికార్డులనే
మళ్ళీ వినిపించడం లంకించుకున్న
'మార్క్సిస్టు' పండితమ్మన్యులారా,
ఒడ్డున కూర్చుని తమరు చేస్తున్న
మీ పడకకుర్చీ సిద్ధాంత వల్లెవేతలు ఇక ఆపండి.
పేరుకే పార్లమెంట్ అనేదొకటి ఉండి
బూర్జువా ప్రజాస్వామిక హక్కులయినా
లేశమాత్రంలేని దేశంలో...
వాళ్ళనిపుడు అస్త్రసన్యాసం చేసి,
రొచ్చుకంపు కొడుతున్న
ఆ పార్లమెంటు పందులదొడ్లోనే దొర్లమని
ఉచిత సలహాలివ్వడం
తమరిక కట్టిపెట్టండి.
వాళ్ళ ఎత్తుగడల్లో పొరపాట్లు దొర్లి ఉంటే....
తమ శత్రువు కర్కశత్వాన్ని
కాషాయ రాజ్య కసాయితనాన్ని
తక్కువగా అంచనావేసి ఉన్నట్లయితే...
ఆ పొరపాట్ల నుండి
గుణపాఠాలు నేర్చుకొని తీరుతారు వాళ్ళు.
భరతఖండ విముక్తికై
చీకటి కోటల్ని ధ్వంసిస్తూ,
అమరులైన సహచరుల
ఆశయాల అడుగుజాడల్లో
దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని
కొనసాగించితీరుతారు వాళ్ళు.
సకల పీడిత జాతులనూ ఏకంచేస్తూ
అరుణ పతాకాన్ని సమున్నతంగా ఎత్తిపట్టి
అంతిమ విజయం
సాధించితీరుతారు వాళ్ళు.
తప్పదు...
"కాలం పురోగమిస్తోంది - ఆగదు
విప్లవం జ్వలిస్తోంది - చావదు
ఉద్యమం నెలబాలుడు
పెరిగి పెద్దవాడై
వినూత్న జీవిత మహాకావ్యాన్ని రచిస్తాడు - తప్పదు."
Related