డియర్ సాయి 
నీవు మరణించావని అంటే
నేనెట్ల నమ్ముతాను
ఈ రాజ్యం కదా
నిన్ను నిలువునా హత్య జేసింది..!


నీవు వీల్ చెర్ నుండి కదలలేవని
అడుగు కదప లేవని
విశ్వమంతా తెలిసినా
నీ ఆలోచనల సృజనకు
జడుసుకున్న ఈ రాజ్యం
సూడో నేత్రపు
కత్తుల బోను ప్రహారలో
బంధించింది కదా సాయి..!!



నాలుగు గోడల తరగతి గదుల నడుమ
నల్లబోర్డు మీద విద్యార్థులకు
ప్రపంచ గతిని మార్చే పాఠాలు చెప్పినందుకు
నక్సలైట్ గా ముద్రలు వేసిన రాజ్యం
నీ అక్షర కణానికి
దాని గుండె గవాక్షాలు మూసుకపోయాయి..!


డియర్ సాయిబాబా
నీవు దశాబ్ద కాలం మగ్గిన
ఆ చీకటి కుహరపు గోడల్లో
ఏ వెలుగును చూడలేదు
కానీ
నీ మనసంతా
నీవు తిరిగిన తరగతి గదులే
నీ ఆలోచనలంతా
ఆదీవాసిల కోసమే
నీవు స్వేచ్ఛను కాంక్షించి
ప్రశ్నలను నాటావు
ప్రత్యామ్నాయ దారిలో
శోషిత సమూహం కోసం
పరితపించిన వాడివి
నాలుగు చక్రాల కుర్చీ
నాలుగు పాదాల రాజ్యాన్ని
ధిక్కరించిన
విప్లవ స్వాప్నికుడివి..!!


ఆంధ్రలో పుట్టి
తెలంగాణను కోరిన
కాశ్మీరియత్ ప్రజలు పక్షమై సాగిన
దండకారణ్యం మీదగా
పాలస్తీనాను ఎదలకు హత్తుకున్న వాడివి
హద్దులు లేని ప్రపంచాన్ని కాంక్షించి
భారత దేశపు రాజధానిని
తరగతి గదిగా మార్చిన వాడివి
నీవే కదా
నా ప్రియమైన సాయిబాబా
ఇక నీకు మరణం అంటే
ఎట్లా ఒప్పుకునేది
నీ త్యాగపు దారులే
రేపటి సుందర స్వప్నపు సమాజం
అందులో నీవు ఉంటావు సాయి..!!

2 thoughts on “విప్లవ స్వాప్నికుడు

Leave a Reply