కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల వైద్య సౌకర్యాలలో కోత విధింపును నిరసిస్తూ ఆరోగ్య పధకాలను మెరుగు పరచాలని డిమాండ్ చేస్తూ వేలాది రైల్వే, డిఫెన్స్, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, పారామిలిటరీ తదితర పెన్షనర్లు ఆందోళన చేశారు . నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్సీసీపీఏ) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పధకం (సీజీహెచ్ఎస్) అదనపు డైరెక్టర్ (ఏడీ) కార్యాలయాల ఎదుట భారీ ధర్నాలు నిర్వహించి ప్రధాన మంత్రి తదితరులకు వినతి పత్రాలు సమర్పించారు.

 హైదరాబాద్ బేగంపేటలో వందలాది రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్న ధర్నాలో ఎన్సీసీపీఏ డిప్యూటీ సెక్రటరీ జనరల్ పాలకుర్తి కృష్ణమూర్తి సీజీహెచ్ఎస్ ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స అందించాలని, అదనపు మొత్తాలను డిమాండ్ చేసే విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్లను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్దతిపై ప్రైవేటీకరణ ప్రతిపాదనను విరమించుకోవాలని టాప్రా నాయకులు ఎన్. సోమయ్య విజ్ఞప్తి చేశారు.

సీజీహెచ్ఎస్ కు ఉద్యోగులు ప్రతి నెలా తమ జీతంలో చందా చెల్లిస్తున్నారని, రిటైరైన తర్వాత కూడా 120 నెలల సబ్సిక్రిప్షన్ చెల్లించారని కానీ ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ తో లింక్ చేసి వైద్య సౌకర్యాలను కుదించాలనే నిర్ణయాన్ని రద్దు చేయాలని సీసీజీజీఓఓ జాతీయ చైర్మన్ వి. కృష్ణ మోహన్ కోరారు.

రైల్వే ఆసుపత్రులలో, సీజీహెచ్ఎస్ లో నిపుణులైన వైద్యులను, పారా మెడికల్ మరియు ఇతర సిబ్బందిని వెంటనే నియమించాలని ఏఐఆర్ఆర్ఎఫ్ నాయకులు స్వామి కోరారు.

విశాఖపట్నం డాబా గార్డెన్స్ సెంటర్ లో వందలాది రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్న ధర్నాలో ఏసీజీఈపీఏ ప్రధాన కార్యదర్శి యం. చంద్రశేఖర రావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి దశాబ్దమైనా ఆంధ్రప్రదేశ్ లో సీజీహెచ్ఎస్ ఏడీని నియమించక పోవటంతో, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (కాట్) బెంచ్ ను ఏర్పాటు చేయకపోవడంతో ప్రతి చిన్న విషయానికి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లి ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుందని విమర్శించారు .

గుంటూరులో పెన్షనర్ల కార్యదర్శి నాగేశ్వరరావు ధర్నాలో ప్రసంగిస్తూ డాక్టర్లు సూచించిన మందులన్నింటిని ఒకేసారి సరఫరా చేయాలని, చికిత్స మరియు రోగనిర్ధారణ పరీక్షల రేట్లను కాలానుగుణంగా సవరించాలని సూచించారు.

వైద్య బీమా పథకాన్ని వెంటనే ప్రారంభించాలని,110వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఫిక్స్‌డ్ మెడికల్ అలవెన్స్ ను రూ.1000/- నుండి రూ.3000/- కు పెంచాలని ఎన్సీసీపీఏ సెక్రటరీ జనరల్ కె. రాఘవేంద్రన్ చెన్నై ధర్నాలో డిమాండ్ చేశారు.

ఈశాన్య రాష్ట్రాల్లో కేవలం గౌహతిలో మాత్రమే ఏడీ ఆఫీసు ఉండటంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఎన్నో అగచాట్లకు గురవుతున్నారని, దేశంలోని అన్ని జిల్లాల్లో సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ సెంటర్లను, అన్ని రాష్ట్ర కేంద్రాల్లో ఏడీ ఆఫీసులను ఏర్పాటు చేయాలని అసోం ధర్నాలో ఏఐపీఆర్ పీఏ ప్రధాన కార్యదర్శి ద్విజేంద్ర దేబ్ నాథ్ డిమాండ్ చేశారు.

స్వయం ప్రతిపత్తి గల సంస్థలలో, చట్టబద్ధమైన సంస్థల్లో మరియు ఎన్ఐఏ జైపూర్‌లో పదవీ విరమణ పొందిన వారికి సీజీహెచ్ఎస్ ద్వారా వైద్య చికిత్సలు అందించాలని ఎన్సీసీపీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కృష్ణ శర్మ రాజస్థాన్ ధర్నాలో కోరారు.

ఏడవ సీపీసీ నోషనల్ పే స్ట్రక్చర్ ఆధారంగా వార్డులు కేటాయించాలని, సర్వీసు కాల పరిమితితో సంబంధం లేకుండా ఎన్ పీఎస్ కింద రిటైరైన వారందరినీ సీజీహెచ్ఎస్ లో చేరడానికి అనుమతించాలని ఏఐబిడీపీఏ ప్రధాన కార్యదర్శి కే.జీ. జయరాజ్ తిరువనంతపురం ధర్నాలో విజ్ఞప్తి చేశారు.

దేశవ్యాప్తంగా వేలాదిమందితో జరిగిన ధర్నాల్లో నాయకులు న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించనట్లైతే దశలవారీగా ఆందోళనలను ఉధృతం చేస్తామని, ఐక్య ఉద్యమాలతో కలిసికట్టుగా పోరాడి సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.

Leave a Reply