2026 ఏప్రిల్ 9

జన్ చౌక్

ఒడిశాలోని కలహండి జిల్లా, కాందమాల్ గ్రామంలో స్థానిక పోలీసులు,  గూండాలు కలిసి నిర్వహించిన దాడులను, దౌర్జన్యాలను;  గ్రామస్తుల ఇళ్లను ఛిన్నాభిన్నం చేయడం వంటి చర్యలను ప్రోగ్రెసివ్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ తీవ్రంగా ఖండించింది. స్థానిక నివాసితుల నుండి అందిన సమాచారం ప్రకారం, ఏప్రిల్ 7వ తేదీ తెల్లవారుజామున సుమారు 2:00 గంటల సమయంలో, పోలీసులు—కొందరు ప్రైవేటు వ్యక్తులతో కలిసి—గ్రామంలోకి ప్రవేశించారు. గ్రామస్తులు బయటకు వచ్చినప్పుడు, వారిపై బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. పలువురు గ్రామస్తులను కర్రలతో కొట్టారు. ఈ దమనకాండ ఫలితంగా, ఇద్దరు మహిళల తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ అణచివేత చర్య మరుసటి రోజు తెల్లవారుజాము వరకు కొనసాగింది. అయితే పోలీసుల కథనం ప్రకారం, “చట్టాన్ని ఉల్లంఘించినవారిని” అరెస్టు చేయడానికి వెళ్ళినప్పుడు గ్రామస్తులే తమపై దాడి చేశారని వారు అన్నారు.

సిజిమాలి బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి కాందమాల్ ఒక కీలక కేంద్రం. ఈ ప్రాజెక్టు కలహండి, రాయగడ జిల్లాలలోని తువాముల్ రాంపూర్,  కాశీపూర్ బ్లాకులలో విస్తరించి ఉంది.  2023 మార్చిలో, ఒడిశా ప్రభుత్వం 1,549 హెక్టార్ల విస్తీర్ణంలో బాక్సైట్ వెలికితీత కోసం మెస్సర్స్ వేదాంత లిమిటెడ్‌కు 50 ఏళ్ల మైనింగ్ లీజును మంజూరు చేసింది. ఈ భూభాగంలో 699 హెక్టార్ల అటవీ భూమి కూడా ఉంది. అప్పటి నుండి, ‘మా మాటి మాలి సురక్షా మంచ్’ నాయకత్వంలో స్థానిక గ్రామస్థులు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఈ వేదిక సిజిమాలి కొండలు, అడవులను పరిరక్షించే ప్రచారానికి నాయకత్వం వహిస్తూ, ఐదవ షెడ్యూల్ కింద రాయగడ,  కలహండిలోని ఆదివాసి సముదాయాల హక్కుల కోసం చురుకుగా పోరాడుతోంది. నిరసనకారులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు; ప్రస్తుతం ఈ విషయం అక్కడ విచారణలో ఉంది.

ఏప్రిల్ 3న జారీ చేసిన నిషేధాజ్ఞల పర్యవసానంగానే, ఏప్రిల్ 7న దాడులు,  సోదాలు జరిగాయి. ఆ రోజున, భారీ సంఖ్యలో పోలీసులు,  పరిపాలనా యంత్రాంగ అధికారులు కాందమాల్ గ్రామాన్ని దిగ్బంధించారు. సిజిమాలి బాక్సైట్ గనులకు వెళ్లే రహదారిని నిర్మించాలన్న నిర్ణయానికి సంబంధించిన ప్రకటనను లౌడ్‌స్పీకర్ల ద్వారా చెప్పారు. రాయగడ ఉప కలెక్టర్ ఆదేశాల మేరకు జారీ చేసిన ఈ ఉత్తర్వు, నిర్మాణంలో ఉన్న రహదారికి 100 మీటర్ల పరిధిలో నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించింది. ఈ ఉత్తర్వును ఉల్లంఘిస్తే, ‘భారతీయ న్యాయ సంహిత’ లోని సెక్షన్ 163 కింద కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులను హెచ్చరించారు. అయినప్పటికీ, ఆ నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ, నిరసనకారులు ఏప్రిల్ 4 నుండి ఏప్రిల్ 6 వరకు కొండలపైనే మకాం వేసి ఉన్నారు; తద్వారా నిర్మాణంలో ఉన్న రహదారి మార్గంలోకి ప్రవేశించకుండా పరిపాలనా యంత్రాంగాన్ని,  పోలీసులను వారు అడ్డుకున్నారు.

ఏప్రిల్ 7న జరిగిన దాడులు, గ్రామస్తులపైన పోలీసుల హింసాకాండ;  ఇళ్లపైన జరిగిన దాడులు—గనుల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న వారిపైన, స్థానిక ప్రైవేటు వ్యక్తుల సహకారంతో, పాలక యంత్రాంగమూ,  పోలీసులూ సాగిస్తున్న భయోత్పాత ప్రచారం ఇప్పుడు మరింత తీవ్రమైందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తమను లక్ష్యంగా చేసుకోవడానికి నిషేధాజ్ఞలను వినియోగిస్తారేమోనని ప్రజలు ఇప్పటికే ఆందోళనలు కలిగి ఉన్నారు. ఏప్రిల్ 7 ఉదయం, వారి ఆందోళనలే నిజమని రుజువయ్యాయి.

ఏప్రిల్ 7 నాటి ఘటనలకు ముందే,  2026 మార్చిలో భారీ ఎత్తున అరెస్టులు జరిగాయన్న విషయాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం. తలంపదర్ అనేది కలహండి జిల్లాలోని తువాముల్ రాంపూర్ బ్లాక్‌లో ఉన్న, 120 కుటుంబాలతో కూడిన ఒక చిన్న గ్రామం. ఈ ఉద్యమంలో ఈ గ్రామం కీలక పాత్ర పోషిస్తోంది. మార్చి 11న, వేదాంత సంస్థకు చెందిన ఒక మద్దతుదారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, తలంపదర్ గ్రామానికి చెందిన 21 మంది ఆదివాసీలను అరెస్టు చేశారు.

ఫిర్యాదు ప్రకారం, నిందితుడు మరో 40–50 మంది గ్రామస్తులతో కలిసి కుమ్మక్కై, ఫిర్యాదుదారుని ఇంటిలోకి బలవంతంగా చొరబడి, ఫిర్యాదుదారునితో పాటు అతని సోదరుడితో సహా మరో ఆరుగురిపై దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో తన సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కలహండి జిల్లాలోని కార్లపట్ పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన ఈ  ఎఫ్‌ఐఆర్‌లో—హత్యాయత్నం (109(1)), స్వచ్ఛందంగా తీవ్ర గాయాలు కలిగించడం (117(2)), అల్లర్లు సృష్టించడం (191(3)), మ నేరం చేసే ఉమ్మడి ఉద్దేశంతో చట్టవిరుద్ధంగా గుమిగూడటం (190) వంటి భారతీయ న్యాయ సంహిత కిందకు వచ్చే పలు సెక్షన్లను పొందుపరిచారు. అరెస్టు అయిన వారిలో 19 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు గల పది మంది మహిళలు ఉన్నారు. ఈ మహిళల్లో కనీసం ఒకరు గర్భిణి కాగా, ఇద్దరు తమ పాలిచ్చే శిశువులను వదిలి వచ్చారు.

అది శిక్షాత్మక చర్యల విషయమైనా, లేదా సెప్టెంబర్ 2024లో ‘మా మాటి మాలి సురక్షా మంచ్’ సభ్యులపై జరిపిన విచక్షణారహిత అరెస్టుల వ్యవహారమైనా సరే.

నాయకులు, కార్యకర్తలే కాకుండా, మైనింగ్ కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్న మొత్తం ఆదివాసీ, దళిత సముదాయాలను ప్రైవేట్ కార్పొరేషన్లు, ప్రభుత్వ అధికారాల ఉమ్మడి బలంతో వేధిస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వ్యవసాయంపైనా, అడవుల నుండి కట్టెల సేకరణపైనా తమ జీవనోపాధి కోసం ఆధారపడే ఈ సముదాయానికి, ఈ అరెస్టులు, నిషేధాజ్ఞలు, రాత్రిపూట దాడులు, హింసలు తీవ్రమైన వినాశనాన్ని కలిగిస్తున్నాయి. ప్రధానంగా రైతులు, కూలీలుగా ఉన్న ఈ స్థానిక నివాసితులకు, ఇటువంటి నిషేధాజ్ఞలు వారి జీవనోపాధిపైనా, నిత్యవసరాలపైనా ప్రత్యక్ష దాడి. బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించడం అనేది న్యాయవ్యవస్థకున్న ‘విధేయత’ స్వభావాన్ని బయటపెట్టడమే కాకుండా, ఒక చట్టబద్ధమైన పోరాటాన్నే ఎలా నేరంగా పరిగణిస్తున్నారో, తద్వారా అందులో పాల్గొన్న ప్రజల జీవితాలను, జీవనోపాధిని పూర్తిగా ఎలా నాశనం చేస్తున్నారో కూడా తెలియజేస్తుంది.

లింగరాజ్ ఆజాద్, సురేష్ సంగ్రామ్‌లతో సహా తలంపడార్ గ్రామస్థులను తక్షణమే విడుదల చేయాలని పీయూడీఆర్ డిమాండ్ చేసింది. గ్రామస్థులపై నేరారోపణలు, ఉగ్రవాద ప్రేరేపిత దాడులను తక్షణమే నిలిపివేయాలని కూడా డిమాండ్ చేసింది. మైనింగ్ ప్రాంతానికి అనుసంధాన రహదారి నిర్మాణానికి సంబంధించి ఏప్రిల్ 3న జారీ చేసిన నిషేధాజ్ఞను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆ సంస్థ మరో డిమాండ్ చేసింది. అక్రమ దాడులు, హింస, విధ్వంసం, ఏకపక్ష అరెస్టులకు బాధ్యులైన పోలీసు సిబ్బందిపై చర్య తీసుకోవాలని కూడా అది డిమాండ్ చేసింది.

(దీపికా టాండన్;  షహానా భట్టాచార్య ఈ ప్రకటనను విడుదల చేశారు.)

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply