వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇద్దరు వ్యక్తులు కార్మికుల నిరసనను ‘మాస్టర్‌మైండ్’ చేశారన్న యూపీ పోలీసులు, ప్రధాన స్రవంతి మీడియా కథనం ‘నిరాధారం’ అని ఆదివారం, ఏప్రిల్ 19నాడు జరిగిన విలేకరుల సమావేశంలో కార్యకర్తలు తెలిపారు. అదుపులోకి తీసుకున్న కొందరు కార్యకర్తల ఆచూకీని వెల్లడించడానికి పోలీసులు, పరిపాలనా యంత్రాంగం నిరాకరించాయని కూడా వారు చెప్పారు.

ఇటీవల జరిగిన నోయిడా కార్మికుల నిరసనలో పాల్గొన్న కార్మికులను, కార్యకర్తలను ఉత్తరప్రదేశ్ పోలీసులు, యంత్రాంగమూ “వేధింపులకు”, “అణచివేతకు” గురిచేశారని, అలాగే నోయిడా హింసాకాండలో వారు కూడా భాగస్వాములని ఏప్రిల్ 19 నాడు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యకర్తలు, న్యాయవాదులు, పాత్రికేయులు తెలిపారు.

రాష్ట్ర పోలీసులు, ప్రధాన స్రవంతి మీడియా ముందుకు తెస్తున్న కథనం “అబద్ధం” అని, విషయాన్ని నిజంగా దర్యాప్తు చేయడానికి బదులుగా కార్యకర్తలను, కార్మికులను కించపరిచేలా ఉందని విలేకరుల సమావేశంలో కార్యకర్తలు తదితరులు పేర్కొన్నారు.

కనీస వేతనాల పెంపు, ఓవర్‌టైమ్ (అదనపు సమయం) పనికి రెట్టింపు చెల్లింపు, పని ప్రదేశాలలో గౌరవం, ఇతర న్యాయమైన, సరైన డిమాండ్ల కోసం నోయిడాలో తలెత్తిన కార్మికుల ఉద్యమానికి ప్రతిస్పందనగా.. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏప్రిల్ 11న నలుగురు కార్యకర్తలను (ముగ్గురు మహిళలతో సహా) అదుపులోకి తీసుకున్నారని సామాజిక కార్యకర్త శ్రీజ తెలిపారు.

ఎటువంటి కారణం చూపకుండా సాయంత్రం 6:55 గంటల ప్రాంతంలో బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ నుండి పోలీసులు వారిని పట్టుకున్నారని, వారిని బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించారని శ్రీజ చెప్పారు.

ఈ కార్యకర్తలు తమ అదుపులో ఉన్నారో లేదో వెల్లడించడానికి కూడా నోయిడా పోలీసులు, పరిపాలనా యంత్రాంగం నిరాకరించాయని, వారి ఆచూకీని తెలపలేదని కూడా కార్యకర్తలు పేర్కొన్నారు.

ఏప్రిల్ 12న, ఆ నలుగురు కార్యకర్తల గురించి ఏదైనా సమాచారం లభిస్తుందనే ఆశతో ఇతర కార్యకర్తలు, న్యాయవాదులు సూరజ్‌పూర్ కోర్టుకు చేరుకున్నప్పుడు, నోయిడా పోలీసులు ఆ కార్యకర్తలను, న్యాయవాదులను కూడా “కిడ్నాప్” చేశారు. “కార్మికులు, న్యాయవాదులు, మానవ హక్కుల సంఘాలు, కార్మిక అనుకూల మేధావుల నుండి వచ్చిన భారీ ఒత్తిడి కారణంగా అర్థరాత్రి విడుదల చేయటానికి ముందు.. పోలీసులు తమను అసభ్యంగా దూషించారని, భౌతికంగా వేధించారని, బెదిరించారని” కార్యకర్తలు ఒక ప్రకటనలో తెలిపారు.

ఏప్రిల్ 11న ఉత్తరప్రదేశ్ పోలీసులు ‘మజ్దూర్ బిగుల్’ సంస్థకు చెందిన ముగ్గురు మహిళలతో సహా ఎనిమిది మంది కార్మిక కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని సియాసత్ డైలీ ఏప్రిల్ 13న నివేదించింది. ఈ నిర్బంధం చట్టవిరుద్ధమని పౌర సమాజ బృందాలు తెలిపాయి. నలుగురు వ్యక్తులు విడుదలయ్యారని, మిగిలిన నలుగురు కోర్టు ఉత్తర్వుల ప్రకారం 15 రోజుల పాటు జైలులో ఉన్నారని వారు పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ కార్యకర్తలపై “దుష్ప్రచార యుద్ధాన్ని” కూడా ప్రారంభించారు. “గౌరవప్రదమైన వేతనాలు, మెరుగైన పని పరిస్థితుల వంటి ప్రాథమిక హక్కుల కోసం నిరసన తెలుపుతున్న కార్మికుల న్యాయమైన ఉద్యమాన్ని పోలీసులు కించపరుస్తున్నారు” అని కార్యకర్తలు విలేకరుల సమావేశంలో చెప్పారు.

సామాజిక కార్యకర్త ప్రియంవద మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ పోలీసులు, “గోదీ మీడియా” ఈ కార్మికుల నిరసనలను ఒక “కుట్ర”లో భాగంగా ప్రచారం చేశారని, చివరికి ఈ నిరసనలకు “పాకిస్తాన్ కనెక్షన్లు”, “నక్సల్ కనెక్షన్లు” ఉన్నాయని అల్లికలు అల్లారని, అరెస్టు చేసిన కార్మిక కార్యకర్తలను “కుట్రకు మాస్టర్‌మైండ్‌లు”గా చిత్రించారని పేర్కొన్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ నుండి గురువారం తమకు “సాంకేతిక డేటా” అందిందని, సామాజిక కార్యకర్తలు ఆదిత్య ఆనంద్, రూపేష్‌ల హ్యాండిల్స్ పాకిస్తాన్ నుండి నిరంతరం నిర్వహించబడుతున్నాయని పోలీసులు క్లెయిమ్ చేశారు.

“ఆదిత్య, రూపేష్ వాట్సాప్ గ్రూపులను సృష్టించి హింసను ప్రేరేపించిన మాస్టర్‌మైండ్‌లు అని ఉత్తరప్రదేశ్ పోలీసులు, ప్రధాన స్రవంతి మీడియా ప్రచారం చేస్తున్న కథనం నిరాధారం” అని ప్రియంవద అన్నారు.

ఆదిత్య ఆనంద్, రూపేష్ అడ్మిన్లుగా ఉన్న వాట్సాప్ గ్రూపులో రూపేష్ నుండి అసలు ఎటువంటి సందేశాలు లేవని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఆ గ్రూపులో ఆదిత్య వీడియో విన్నపాలు తరచుగా పోస్ట్ చేయబడ్డాయని, నిరసన శాంతియుతంగా జరగాలని, హింసను ప్రేరేపించడానికి పరిపాలనా యంత్రాంగం చేసే ఎటువంటి ప్రయత్నానికైనా లొంగకూడదని ఆయన నిరంతరం చెబుతున్నారని ఆమె తెలిపారు. “ఏప్రిల్ 11న నిరసన తెలుపుతున్న కార్మికులతో ఆయనే [ఆదిత్య ఆనంద్] ప్రతిజ్ఞ చేయిస్తున్న వీడియో సాక్ష్యం కూడా ఉంది. సమ్మె శాంతియుత పద్ధతిలో జరగాలని ఆయన వారిని కోరారు, అలాగే కార్మికులకు మద్దతు ఇవ్వాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.”

న్యాయం కోసం గళం విప్పుతున్న విద్యార్థులు, కార్యకర్తలు అణచివేతను; అక్రమ జైలు శిక్షను ఎక్కువగా ఎదుర్కొంటున్నారని, పౌరులపై తాము చేస్తున్న నేరాలను దాచడానికి ప్రభుత్వం కుట్రలను “వండి వార్చుతోందని” అడ్వకేట్ కోలిన్ గొన్సాల్వేస్ పేర్కొన్నారు.

కార్మికుల ఆగ్రహానికి గురైన పోలీసు వాహనం

“ఈ దేశ కార్మికులకు జీవన వేతనాన్ని అందించడంలో తన వైఫల్యాలను, అసమర్థతను దాచుకోవడానికి ఈరోజు ప్రభుత్వం అన్ని నియమాలను, చట్టపరమైన ప్రక్రియలను ఉల్లంఘిస్తోంది” అని గొన్సాల్వేస్ అన్నట్లు ఆ ప్రకటన పేర్కొంది. అయితే, ఇటువంటి “ఎత్తుగడలు” ఈ దేశంలోని న్యాయ ప్రేమికులను గళం విప్పకుండా ఆపలేవని, ప్రభుత్వం నోరు మూయించడానికి చేస్తున్న ప్రయత్నాలకు సమాధానంగా మరింత మంది ప్రజలు గళం విప్పుతారని ఆయన అన్నారు.

విలేకరుల సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయవాది కవల్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ఒక ప్రజా ఉద్యమం తలెత్తగానే, దానిపై ఒక “కుట్ర”, “మాస్టర్‌మైండ్” అనే కథనాన్ని అల్లడం ఇప్పుడు దాదాపు ఒక ఊహించదగిన నమూనాగా మారిందని అన్నారు.

“పోలీసులు, గోదీ మీడియా చేస్తున్న ఇటువంటి చౌకబారు విన్యాసాల వెనుక ఉన్న అసలు నిజాన్ని ఈ దేశ కార్మికులు, శ్రమజీవులు అర్థం చేసుకోవడం నేర్చుకున్నారు” అని కౌర్ పేర్కొన్నారు. ఆమె ఇంకా ఇలా అన్నారు, “కార్మికులు అత్యంత దయనీయమైన, అనిశ్చిత పరిస్థితుల్లో పని చేయాల్సి వస్తే, వారి జీతం స్లిప్పుల్లో రూ. 18,000 అని ఉండి వారికి కేవలం రూ. 11,000 మాత్రమే చెల్లిస్తే, వారికి చట్టబద్ధమైన హక్కు అయిన డబుల్ ఓవర్‌టైమ్ ఇవ్వకపోతే, పని ప్రదేశంలో వారిని నిరంతరం వేధింపులకు గురిచేస్తే.. అప్పుడు అటువంటి దోపిడీ, అణిచివేత పరిస్థితులకు వ్యతిరేకంగా నిరసన తెలపడం కార్మికుల ప్రాథమిక రాజ్యాంగ హక్కు. ఏ వివేకం ఉన్న వ్యక్తి కూడా వారిని ‘దేశద్రోహులు’ అని గానీ, ఆ ఉద్యమాన్ని ఒక ‘కుట్ర’ అని గానీ అనలేరు.”

2022లో అదానీ గ్రూప్ స్వాధీనం చేసుకున్న ఎన్‌డిటివి వంటి మీడియా సంస్థలు, ఆదిత్య ఆనంద్‌ను నోయిడా కార్మికుల నిరసన వెనుక ఉన్న “మాస్టర్‌మైండ్” అని పేర్కొన్నాయి. అంతేకాకుండా, ఏప్రిల్ 19న తమిళనాడులోని తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్‌లో అతడిని అరెస్టు చేసినట్లు తెలిపాయి. మరొక మీడియా సంస్థ ‘ఇండియా టుడే’, నోయిడా కార్మికుల అశాంతి వెనుక మూడు “వ్యవస్థీకృత సమూహాలు” ఉన్నాయని పోలీసులు తెలిపినట్లు, ఒక వామపక్ష సంస్థ సభ్యుడిని అరెస్టు చేసినట్లు పేర్కొంది.

విలేకరుల సమావేశంలో అడ్వకేట్ కబీర్ మాట్లాడుతూ.. నిరసనల్లో అసలు పాల్గొనని వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారని ఎత్తిచూపారు. ఢిల్లీ, లక్నో వంటి ప్రాంతాల నుండి పాత్రికేయులు, మేధావులు, రచయితలను ఎటువంటి కారణం లేకుండా, కేవలం వారు కార్మికులకు అనుకూలంగా మాట్లాడినందుకే అరెస్టు చేశారని ఆయన అన్నారు. అంతేకాకుండా, న్యాయవాదులు కూడా కోర్టు ఆవరణలోకి ప్రవేశించలేకపోతున్నారని, తమ వృత్తిపరమైన బాధ్యతలను నిర్వహిస్తున్నందుకు పోలీసులు వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఎటువంటి సరైన చట్ట ప్రక్రియలను పాటించడం లేదని, వాస్తవానికి వాటిని బహిరంగంగా ఉల్లంఘిస్తున్నారని, అరెస్ట్ మెమోలు తయారు చేయడం లేదని, కనీసం బంధువులకు కూడా సమాచారం అందించడం లేదని ఆయన తెలిపారు.

మానవ హక్కుల కార్యకర్త హిమాంశు కుమార్ కార్మికుల హక్కులపై పెరుగుతున్న దాడుల గురించి, వారి క్షీణిస్తున్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. కార్మికుల ఎముకలను వరకు పిండేస్తున్నారని, రోజుకు 13 గంటల పని గంటలు ఇప్పుడు సాధారణమైపోయాయని అన్నారు.

ఢిల్లీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సరోజ్ గిరి మాట్లాడుతూ.. అసలైన ‘కుట్ర’ ప్రభుత్వానిదేనని ఎత్తిచూపారు. ప్రతి కార్మిక ఉద్యమం నుండి కార్మికులను అదృశ్యం చేయడం, వారిని దోపిడీకి గురిచేసిన కాంట్రాక్టర్లపైన చర్యలు తీసుకుంటామని ప్రకటనలు చేస్తూ, పెద్ద పెట్టుబడిదారుల పాత్రను “తెలివిగా దాచిపెట్టడం” ప్రభుత్వ కుట్ర అని ఆయన పేర్కొన్నారు.

https://thewire.in/news/noida-workers-protest-lawyers-activists-allege-witchhunt-by-up-police-illegal-detentions-false-narratives

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply