శాంతి కోసం ప్రయత్నించవలసి వచ్చిందంటేనే  సమాజంలో అశాంతి నెలకొని ఉన్నట్టు. ఈ ప్రయత్నం ఎందాక నడుస్తుందో ఇప్పటికిప్పుడు  చెప్పలేకపోవచ్చు. శాంతి సాధనకు ఉండగల మార్గాలన్నీ వాడుకోలేకపోయినా సరే,  అశాంతి గురించి ఆలోచించే అరుదైన సందర్భం వచ్చిందని భావించవచ్చు. అశాంతికి కారణాలను లోతుగా వెతకవచ్చు. అయితే ఈ పని చాలా ఓపికగా  జరగాలి. వీలైనంత ఓపెన్‌ మైండ్‌తో వ్యవహరించాలి. దానికి సిద్ధమైతే మామూలప్పుడు గ్రహించిన విషయాలనే మరోసారి సూక్ష్మస్థాయిలో చూడ్డానికి వీలవుతుంది. అప్పుడు కొత్త కోణాలు కనిపిస్తాయి. అది ఎట్లా ఉంటుందంటే, సమాజమే తన అనుభవాలను, విశ్వాసాలను, వైఖరులను తరచి చూసుకున్నట్లుగా ఉంటుంది. ఇదంతా సమాజాన్నంతా తీవ్ర అశాంతికి లోను చేస్తున్న అశాంతి సన్నివేశాన్ని అధిగమించడానికి దోహదం చేస్తుంది. 

నిజానికి ఏ సమాజంలోనైనా అశాంతి అప్పటికప్పుడు పుట్టుకరాదు. చరిత్ర పొడవునా కారణాలెన్నో ఉంటాయి. మనం చూసినా చూడకపోయినా అశాంతి ఎన్నో రూపాల్లో వ్యక్తమై ఉండవచ్చు. పరిష్కార ప్రయత్నాలూ జరిగి ఉంటాయి. అయినా మన దేశంలో అశాంతి ఒక తీవ్రమైన సమస్యగా మారిన మాట వాస్తవం. అందువల్ల శాంతిని సాధించుకోడానికి సమాజమే పెనుగులాడవలసి వస్తున్నది. సీపీఐ మావోయిస్టు పార్టీకి-ఆ పార్టీ ప్రభావం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా కేంద్ర ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరగాలనే పౌర సమాజ ఆకాంక్ష చాలా లోతైనది. దీనికి కారణమైన అశాంతిని ఎట్లా చూస్తాం? అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. సమాజాన్ని కలవరపాటుకు లోను చేస్తున్న ఈ అశాంతి  విస్తృతి రూపాన్ని ఇప్పటికైనా చూడక తప్పదు. ఈ హత్యాకాండ మన సమాజపు అశాంత వ్యక్తీకరణ మాత్రమే.   కాబట్టి ఈ సమస్య శాంతి`అశాంతి మధ్యనే తేలేది కాదు. అశాంతి పొరలను విప్పి చూడాల్సిందే. సంక్షుభిత ప్రజా జీవితాన్ని చూడకుండా, దాని వెనుక భిన్న తలాల్లో  సమాజం పని తీరును గ్రహించకుండా అశాంతికి కారణాలు వెతకడం కష్టం. ఇదంతా చాలా పెద్ద పని అనిపించవచ్చు. తక్షణంగా జరగవలసిన శాంతి ఒప్పందానికి ఇదంతా పెను భారం అనిపించవచ్చు. అందువల్ల కనీసం హింస దగ్గరికౖెెనా వెళ్లవలసిందే. హింస గురించి ఆలోచించకుండా  అశాంతిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు.

మధ్యభారతదేశంలో సాధారణ అదివాసీ జాతి హననం జరుగుతున్నదని, ఇది ఆగిపోయి శాంతి నెలకొనాలని ప్రజాస్వామికవాదులు కోరుకుంటున్నారు. హింసకు పరిష్కారంగా శాంతి చర్చలను ప్రతిపాదించారు. ఆ రకంగా శాంతి గురించిన ఆలోచనను వాళ్లూ హింస దగ్గర ఆరంభించారు. అయితే అశాంతి లాగే, హింస కూడా దానికదే పరమం కాదు. హింసా మూలాల అన్వేషణలోనే మానవీయ పరిష్కారాలు దొరుకుతాయి. మావోయిస్టుల తుపాకులను, భారత ప్రభుత్వ సైనిక బలగాలను సమానంగా చూసి, అటూ ఇటూ తుపాకులు ఉన్నందు వల్లనే హింస జరుగుతున్నదని అనుకుంటే అది హింసా రూపం మీద వ్యాఖ్య  అవుతుందిగాని, హింసా మూలాల అన్వేషణ అనిపించుకోదు. అప్పుడు అశాంతికి మనం వెతికే పరిష్కారాలు అరగొరగానే ఉంటాయి. అయినా ప్రయత్నించాల్సిందే. అశాంతి ఎంత లోతైనదో, ఎన్ని రూపాల సారంగా ఘనీభవించిందో, ఎన్ని క్రమాల్లో ఇక్కడి దాకా వచ్చిందో, దాన్నంతా మార్చే ప్రయత్నం కూడా అనేక రూపాల్లో సాగవలసిందే.  ఆ రకంగా భారత ప్రభుత్వానికి, మావోయిస్టు పార్టీకి మధ్య చర్చలు జరగవలసిందే. దానికి కృషి చేయాల్సిందే.

హింస తగదు, దాన్ని నివారించాలనే శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తి మీద ఇప్పటికే  ఇరు పక్షాల వైఖరులు తేటతెల్లమయ్యాయి. శాంతి చర్చలు జరగాలంటే ముందు ప్రభుత్వం కగార్‌ పేరుతో చేస్తున్న హత్యాకాండను ఆపేయాలని మావోయిస్టు పార్టీ ప్రతిపాదించింది.  కొత్త సైనిక క్యాంపులు ఏర్పాటు చేయవద్దని ఇంకో ప్రతిపాదన చేసింది. ఈ రెండూ ఒకే డిమాండ్‌లో భాగం.

ఆదివాసీ జాతి హననానికి కారణమైన కగార్‌ను నిలిపివేస్తే తక్షణంగా హింస తగ్గుతుందని ఈ ప్రతిపాదన అర్థం.  అశాంతి తొలగిపోయి శాంతి ఏర్పడటానికి ఇదొక మార్గమని భావించారు. దీనికి ప్రభుత్వం సిద్ధమైతే తాము తక్షణం కాల్పుల విరమణ ప్రకటిస్తామని కూడా చెప్పారు. అంటే తమ వైపు నుంచి కూడా హింస జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ పడ్డారు. ఆ తర్వాత శాంతి చర్చలు జరపవచ్చని సూచించారు. ఇది హింస, అశాంతి పట్ల మావోయిస్టుల  వైఖరిని తెలియజేస్తుంది. ఇది తక్షణంగా జరగాల్సిన శాంతి చర్చలకు ఉపయోగపడే ప్రాతిపదికే కాదు. మొత్తంగా అశాంతి తొలగాలంటే హింస ఆగిపోవాలనే మానవీయ వైఖరి. మేం కాల్పులు జరపమనే  ఒప్పందానికి తమంత తామే సిద్ధం కావడం ఆయుధాలకంటే రాజకీయ ప్రక్రియల మీద వాళ్లకు ఉండే అవగాహనను తెలియజేస్తుంది.

కానీ చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వంగాని, కేంద్ర హోం మంత్రిగాని ప్రస్తుత శాంతి చర్చల ప్రతిపాదనల్లోని స్పూర్తి దగ్గరికే రాలేదు. పదిహేను నెలల్లో 450 మందిని హత్య చేయడం వల్లే, అందులో మూడొంతుల మంది సాధారణ ఆదివాసులు ఉండటం వల్లే,   ఈ శాంతి చర్చల ప్రతిపాదన మేధావుల నుంచి  వచ్చిందనే సంగతే పట్టించుకోలేదు.  హింసకు తాను కారణమని కాకుండా మావోయిస్టులు తుపాకులు వదిలిపెడితే శాంతి చర్చలు జరుపుతామని అన్నది. అంటే ఈ హత్యాకాండకు మావోయిస్టుల దగ్గర ఉన్న తుపాకులు కారణమని చెప్పదల్చుకున్నది. ఈ ప్రతిస్పందనలో చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని 400 సైనిక క్యాంపుల ఊసే లేదు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల కోసం వెచ్చించిన పన్నెండు లక్షల సాయుధ బలగాల ప్రస్తావనే లేదు. కాబట్టి శాంతి స్థాపనకు ఇరు పక్షాల చర్చలనే ప్రజాస్వామిక ప్రక్రియ దగ్గరికి వెళ్లకుండా మావోయిస్టులు ఆయుధాలు వదలాలని కండీషన్‌ పెట్టింది. ఇది హింసపట్ల పాలకుల వైఖరిని తెలియజేస్తుంది. ఇక శాంతిని, చర్చలను వాళ్లు ఎట్లా అర్థం చేసుకుంటారో ఊహించవచ్చు. అశాంతి పట్ల పౌర సమాజపు సంవేదనలను వాళ్లు కనీసంగా గ్రహించలేదు. అసలు అలాంటి విషయాలను తెలుసుకోగల చూపు, వ్యక్త్తిత్వం ఉన్నాయా? అనే సందేహం కలుగుతుంది.  మౌలికంగా హింస పట్ల వైఖరినిబట్టే ఇలాంటివి తెలుసుకోగలుగుతారు. ఇతరులతో వ్యవహారశైలి ఉంటుంది. ప్రజలు నిర్మించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన శాసన అధికారాన్ని ఆ ప్రజలను హింసించడానికే వాడుతున్నప్పుడు ఇక ప్రత్యేకంగా హింస మీద వేరే వైఖరి ఎట్లా ఉంటుంది? ఇది అంతిమంగా నాగరికతా విలువలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి సంబంధించింది. తమ దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి కాబట్టి యుద్ధంలో తాము కూడా వాడాల్సి వస్తుందని, అది అశాంతికి దారి తీయవచ్చు కాబట్టి, శాంతి చర్చల కోసం  కాల్పుల విరమణకు సిద్ధమే అని మావోయిస్టులు అన్నారు. అంటే తమ తుపాకుల మీద తామే ఆంక్షలు పెట్టుకోడానికి సిద్ధమై చర్చకు సానుకూల వాతావరణం కల్పించాలని సూచించారు.  శాంతి చర్చలు ఒక రాజకీయ ప్రక్రియ అనే అవగాహన వాళ్లకు పుష్కలంగా ఉంది. అందువల్ల ఆ రాజకీయల వెనుక ఉండే తాత్వికత వాళ్లను నడిపించింది.  తక్షణ చర్చనీయాంశమైన  ఆదివాసీ హత్యాకాండ ఆగడానికి తాను ఏం చేయాలో గ్రహించి, దానికి సిద్ధపడిరది.

కానీ ప్రభుత్వానికి తను ప్రయోగిస్తున్న హింస పట్ల రెండో అభిప్రాయమే లేదు. అది ఉండదగినదనే అనుకుంటోంది. అసలు ఈ శాంతి చర్చలకు కారణమైన ఆదివాసులను చంపేయడం అనే సమస్యను పూర్తిగా దాటవేసింది. దానికి సంబంధించిన సైనిక మోహరింపు గురించి ప్రస్తావనే లేదు. ఇది శాంతి చర్చలపట్ల ప్రభుత్వంలో ఉన్న అమిత్‌షా, లేక విజయ్‌శర్మ అనే వ్యక్తుల వైఖరులను మాత్రమే తెలియజేయడం లేదు. హింస, శాంతి పట్ల రాజ్యం వైఖరిని తెలియజేస్తోంది. అంటే  ఆదివాసీ జాతి హననం కొనసాగేదే అని రాజ్యం చెప్పదల్చుకున్నది. ప్రజలందరినీ సమానంగా చూడమని రాజ్యాంగం చెబుతుంది. కానీ రాజ్యం మాత్రం కార్పొరేట్ల కోసం తాను పని చేయాలని, వాళ్ల కోసం ఆదివాసులపై లేదా మొత్తంగా సమాజంపై ఈ హింస తప్పదనే వైఖరితో ఉంటుంది. భారత ప్రభుత్వం తాను రాజ్యాంగబద్ధురాలై ఉండాలా? లేక కార్పొరేట్ల ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలా? అనే సందిగ్థతకు గురి కాలేదు. ఇది హింసపట్ల ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తుంది.  మావోయిస్టులు  తుపాకులు  వదిలేయాలని అంటుందేగాని తాను ప్రయోగించే హింస గురించి మాట్లాడదు. తాను ప్రయోగించే హింస ‘రాజ్యాంగబద్ధమే’ అని రాజ్యం అనుకుంటుంది. కాబట్టి అది చర్చనీయాంశమే కాదు. ఈ వైఖరి ఉన్నందు వల్ల పాలకులకు హింస అనేది ఒక సమస్య కాదు. అది చర్చించేదీ కాదు. కాబట్టి దాని పరిష్కారానికి రాజకీయ ప్రక్రియలు అవసరం అని అనుకోరు. 

సాధారణ ఆదివాసుల హత్యాకాండ ఆగాలని పౌర సమాజం కోరుకుంటే, ప్రభుత్వం మావోయిస్టుల తుపాకుల దగ్గరికి చర్చను తీసికెళ్లింది. ఈ చిక్కుముడిని ఎట్లా విప్పాలి? ఏ భాషలో, ఏ వైఖరితో మాట్లాడితే ఇది వీడుతుంది? దేన్ని చర్చనీయాంశం చేయాలి? శాంతి చర్చలు జరగాలంటే ముందు మనుషులను చంపడం ఆపేయాలి అనే చిన్న విషయం ప్రభుత్వం పట్టించుకోదల్చుకోలేదు. అందుకే దేశవ్యాప్తంగా శాంతి చర్చల ప్రయత్నం జరుగుతోంటే ప్రభుత్వం మాత్రం తనకు అలవాటైన పద్ధతిలో 11వ తేదీ ముగ్గురిని చంపేసింది.  14వ తేదీ బస్తర్‌లో ఎప్పుడో మావోయిస్టులు పెట్టిన మందుపాతర్లు వెలికి తీసి, పేల్చేశారు. తద్వారా మావోయిస్టు ప్రమాదాన్ని ఎత్తి చూపదల్చుకున్నారు. హింస, అశాంతి ప్రజల వైపు నుంచి తలెత్తే సమస్యలని, వాటికి కారణమైన వాళ్లను అణచివేయడమే శాంతి స్థాపన అని, అది అహింస అని పాలకుల అభిప్రాయం. మనం ఏది హింస అంటున్నామో అదే అశాంతిని తొలగించడానికి ప్రభుత్వానికి ఏకైక రాచ మార్గం.

ఇలాంటి వైఖరి ఉన్న ప్రభుత్వాన్ని శాంతి చర్చలకు సిద్ధం చేయాల్సిన వాళ్లు చాలా హేతుబద్ధ వాదనలు  ముందుకు తేవాలి. అశాంతిని, హింసను చాలా వైపుల నుంచి చర్చించాలి. అది మానవీయంగా ఉండాలి. ఈ యుద్ధంలో భాగం కాని మిగతా సాధారణ ప్రజల విశ్వసనీయతను సంపాదించుకోవాలి. హింస ఏ వైపు నుంచి జరుగుతున్నదో, ఎందుకు జరుగుతున్నదో గ్రహించి దాన్ని చర్చనీయాంశం చేయాలి. సాధారణ ఆదివాసులు కేంద్రంగా జరగాల్సిన శాంతి చర్చల వల్ల కలిగే ప్రయోజనాలను అందరికీ వివరించాలి. ఒక రకంగా ఈ శాంతి చర్చలు  కేవలం ఆదివాసులకే మేలు చేయవని, సమాజానికంతా మేలు కలుగుతుందని చెప్పగలగాలి. శాంతి చర్చల నిర్వహించుకొని, కొన్ని పరిష్కారాలను కనుగొనడం వల్ల సమాజం రాజకీయంగా, సాంస్కృతికంగా ఎదుగుతుందని చెప్పాలి.

కానీ ప్రభుత్వం మాత్రం మావోయిస్టులు ఆయుధాలు అప్పగించి లొంగిపోతే,  వాళ్లకు ఉపాధి కల్పిస్తే సమస్య పరిష్కారమవుతుందని అనుకుంటుంది. ఇలాంటి ప్రభుత్వాన్ని శాంతి చర్చలకు సిద్ధమయ్యేలా చేయడం ఇవాళ పౌర సమాజం ముందున్న అతి పెద్ద పని. శాంతి చర్చలు జరుగుతాయా? లేదా? అనే సందేహం కూడా కొందరికి ఉండవచ్చు. అదెలా ఉన్నా శాంతి గురించి ప్రభుత్వంతో జరిగే ఈ సంభాషణ తప్పక సమాజానికి మేలు చేస్తుంది. శాంతి చర్చలకు  ప్రభుత్వం మావోయిస్టుల  ఆయుధాలను అడ్డంగా తీసుకొస్తుందని, అది ప్రతిష్టంభనకు దారి తీస్తుందని ఎవరైనా చెప్పగలరు.  కాబట్టి శాంతి చర్చలకు ఉండగల అవకాశాలను విశ్లేషించాలి. ఈ ప్రక్రియ వెనుక  ఉన్న అవగాహనను వివరించాలి. మధ్య భారతదేశంలోని హింస మాత్రమేగాక దేశమంతా హింసలో, అశాంతిలో తల్లడిల్లుపోతున్న తరుణంలో శాంతి గురించి చర్చ తప్పక మన సమాజాన్ని ఒకడుగు ముందుకు తీసుకపోతుంది. హింస ద్వారా ముందుకు పోయేదేమీ ఉండదు. హింసామూలాల అన్వేషణే ఎప్పటికైనా సరైన పరిష్కారాన్ని అందిస్తుందని కూడా ఈ శాంతి చర్చలు భరోసా ఇస్తాయి. అందు కోసం కూడా తప్పక ఈ శాంతి చర్చలు సఫలం కావడానికి అందరూ కృషి చేయాలి. 

Leave a Reply