మూడోసారి నరేంద్రమోదీ సంకీర్ణ ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చాడు. భారత ప్రజలు విచక్షణతో తీర్పు ఇచ్చారు. దేశంలోని రెండు కూటములకు తగిన ప్రాధాన్యతనిచ్చారు. ఇది ఎన్నికల సమీకరణల మీద విశ్లేషణ. అయితే మొత్తానికి భారతీయుల సంతోషకర దినాలకు కాలం చెల్లింది. నిరుద్యోగం, ఆర్థిక కుంగుబాటు భారతీయ కుటుంబాలలో సర్వసాధారణమైంది. అసంఘటిత కార్మికులలో పనిభద్రత ఒక సవాలుగా మారింది. భారతదేశంలోని కొన్ని నగరాలలో జరుగుతున్న అభివృద్ధికి, నమూనా ముఖ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు వలస కూలీల అవసరం ఏర్పడుతుంది. దేశాన్ని కలిపే అనేక రైళ్ళు వలస కూలీలతో నిండి ఈ మహా నగరాల వైపు వెళుతున్నాయి. గ్రామాలలో ఉపాధి తగ్గింది. నరేంద్ర మోది మేకింగ్ ఇండియా కాలంలో కలిసి పోయింది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా భారత సమాజం అభద్రత వైపు ప్రయాణం చేస్తుంది.
ఇది గత పదేళ్ల మోది పాలన. ప్రజల జీవిక కోసం అవసరమయ్యే ఏ నిర్మాణం వైపు దృష్టి పెట్టలేదు. ఉపాధిమార్గం కలిగించే పరిశ్రమల నిర్మాణం జరగలేదు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతుకు బాసటగా నిలవలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్, రాముడు విగ్రహాలు, నూతన పార్లమెంట్ ఇవి మాత్రమే నరేంద్రమోది స్వప్న రహస్యాలు. కొన్ని వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మాణం వెనుక ఏ మంత్రి ఉన్నారో తెలియని రహస్యం కాదు. మొత్తంగా ఫ్లైఓవర్ల కాంటాక్ట్ నితిన్ గడ్కరీ వారసుల చేతిలో ఉంది. వందే భారత్ రైలు అనేక ప్యాసింజర్ రైళ్లను ఆపివేయగలిగింది. అనేక చిన్న రైల్వే స్టేషన్‌లలో పిచ్చి మొక్కలు మొలకెత్తాయి. అయినా మోది మూడోసారి ఈ దేశ ప్రధాని కాగలిగారు. దీని వెనుక వున్న కారణం ఏమిటి? ఏ పునాదిపై భారతీయ జనతా పార్టీ ఆధారపడి ఉంది? ఈవీఎం గోల్మాల్ ఇక్కడ అనవసరమైన చర్చ. వీటిని దాటి ఏమైనా చర్చ చేయగలమా? ఒడిస్సా వంటి ఆదివాసీ, వెనకబడిన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఏమిటి? రెండు దశాబ్దాల నవీన్ పట్నాయక్ పాలనాపరమైన వైఫల్యం కాకపోవచ్చు. సంఫ్‌ు పరివార్ అల్లిన దేవుని విశ్వాసం ఒక కారణం కావచ్చు. ఒడిస్సాలో రాజకీయ శూన్యతను దేవుని ద్వారా ద్వారా భర్తీ చేసింది.
తాజాగా ఎన్నికలు జరిగిన తీరు నరేంద్ర మోది విద్వేష ప్రసంగాలు భారత ప్రజల హృదయాలను గాయం చేశాయి. అయితే ప్రజల మధ్య వున్న ఐక్యత అనే భావోద్వేగం ముందు నరేంద్రమోది ఉవాచ తేలిపోయింది. మానవ జీవితంలోని సంక్లిష్టమైన స్థితి ముందు నరేంద్ర మోది బ్రాహ్మణీయ హిందుత్వ నిలబడలేదు. అంత మాత్రాన ఈ దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ బలంగా లేదని అనలేం. ప్రజలు సంఘపరివార్‌తోనే ఉన్నారా? మత రాజకీయాలు..అభివృద్ధి నమూనాతో ముడిపడి ఉంటాయి. మేకింగ్ ఇండియా అనే నినాదంతో ముందుకు వచ్చి నరేంద్ర మోది అన్ని రకాల ఉపాధి అవకాశాలను ధ్వంసం చేసాడు. ఈ విధ్వంస క్రీడ సాధారణ మధ్యతరగతి ప్రజల దైనందిక జీవితంలో వెలితిని నింపింది. నాలుగు వందల మెజారిటీ అనే పెద్ద మాటను ఊదర గొట్టిన బిజెపి కనీసం పాస్ మార్కులను కూడా దాట లేక పోయింది. అయినా మోది మూడోసారి ప్రధాని కాగలిగాడు కదా అంటే నితీష్, చంద్రబాబు నాయుడుల ఊతం పనికి వచ్చింది. కల్వకుంట్ల చంద్రశేఖర రావు భారతీయ రాష్ట్ర సమితి తన ఓటు బ్యాంకును బిజెపికి మళ్ళించి తను ఓడి బిజెపిని గెలిపించారు.
నూతన తరం చాలా అత్యధిక సంఖ్యలో భారత జనాభాలో ఉంది. మతం దేవుడనే భావజాలానికి వారు దూరం జరిగారా? ఏదైనా విచక్షణ వారిని ఆవరించిదా? అనే దాన్ని కూడా ఈ ఎన్నికల ఫలితాల ద్వారా కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే ఎన్నికల్లో గెలుపు కోసం చేసే ప్రయత్నంలో తాత్కాలిక భావోద్వేగాలు వుంటాయి. ముఖ్యంగా కాషాయి పార్టీ ఈ భావోద్వేగ రచనలో ముందు భాగాన వుంటుంది. ఈ భావోద్వేగం తాత్కాలిక రసాయన చర్యను ఈఎన్నికలు నిరూపించాయా? అనేది కూడా చర్చనీయాంశమే. మొత్తం మీద మత ఆధారిత రాజకీయాలకు కాలం ముగిసిందనే భావనకు రాలేం. ఇది ఒక మేరకు తాత్కాలిక విరామం మాత్రమే. మూడోసారి మోది ప్రధాని అయినట్లే అంతరంగిక భద్రత చట్టానికి కూడా అజిత్ దోవల్ మూడోసారి ఎన్నికయ్యారు.
భారతదేశంలో ఏం జరుగుతోందని ఎన్నికల ఫలితాల ద్వారా ఆలోచించేవారిలో ఎక్కువ మంది కశ్మీర్, మణిపూర్, దండకారణ్యంలో జరుగుతున్న దాడిని గమనంలోకి తీసుకోలేదు. రాజ్యం మధ్యభారతంలో ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నదీ కనీసంగా వీరి నోటీసులో లేదు.
భారతదేశంలో దండకారణ్యం ఒక భాగమని అందరికి తెలిసిన విషయమే. ఇవాళ అక్కడ యుద్ధం కొనసాగుతున్నది. ఈ యుద్ధంలో వందల సంఖ్యలో ఆదివాసులు మూల్యం చెల్లిస్తున్నారు. మిగతా భారతదేశానికి దండకారణ్యంకు సంబంధం దాదాపుగా తెగిపోయింది. ఆదివాసులు ఈ దేశ ప్రజలు కారు అని భావనతోనే దేశంలోని అనేక వర్గాలు ఉన్నాయి. ఆదివాసులు, మావోయిస్టులు పోలీసుల విషయంగా మిగిలిపోయింది. దండకారణ్యంలో గోదావరి తీర ప్రాంతంలో జరుగుతున్న దాని గురించి మీడియా ఎంతో కొంత చెబుతూనే ఉన్నది. అయినా దేశం మౌనంగానే ఉండదలిచింది. మావోయిస్టుల లేదా ఆదివాసీల నిర్మూలన వెనుక పాలకవర్గ ఆర్థిక ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. మావోయిస్టుల వైపు నుండి ఎలాంటి ప్రతి చర్య లేకుండానే కొనసాగుతున్న ఏకపక్ష దాడి ఇది. ఆరు నెలల కాలంలో వందలాది ఆదివాసులు చనిపోతున్నారు. ఇది కచ్చితంగా ఆదివాసులకు, బహుళజాతి సంస్థలకు మధ్య జరుగుతున్న ఆర్ధిక రాజకీయ సంఘర్షణ. భారత పాలక వర్గాలు ఇక్కడ దళారీలు మాత్రమే.
ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ పదేళ్ల కాలంలో ఈ యుద్ధాన్ని తీవ్రం చేసింది. దీనికి సంబంధించిన ప్రజల భావనా ప్రపంచాన్ని బుల్డోజ్ చేసింది. ఇందులో సాధారణ ప్రజా జీవితం కూడా ఉంది. ఎవరిని కదిపినా నిరాశ, నిస్పృహ కనబడుతున్నాయి. అనేక అనిశ్ఛితిల మధ్య ప్రజలు కనీస జీవితాన్ని వెదుక్కుంటున్నారు. ఈ ఎన్నికల సందర్భంలో ఒక పక్క ఈ దేశ ప్రజా సమూహాల మీద యుద్ధం జరుగుతోంటే ఇంకో పక్క మిగతా ప్రజలను వంచించేందుకు మోదీ నూతన దేవుడిగా అవతరించాడు. తనను తాను దైవదూతగా చెప్పుకున్నాడు. ముస్లింలను, దళితులను, ఆదివాసులను, వారి సంస్కృతిని హేళన చేశాడు. ఇంత విచిత్రమైన ప్రధానమంత్రిని ఈ దేశ ప్రజలు గతంలో చూడలేదు. కశ్మీర్‌లో ఘోర ఓటమి వల్ల కలిగిన అక్కసుతో పదేళ్ల కిందటి ఒకానొక ప్రసంగాన్ని ఆసరా చేసుకొని అరంధుతిరాయ్, షాకత్ హుస్సేన్‌పై ఉన్న పాత కేసులను మోదీ ప్రభుత్వం తిరగదోడిరది. ఇక రెండో వైపు రెండు తెలుగు రాష్ట్రాలలో తిరగి ఎన్‌ఐఏ విచారణ వేధింపులు ప్రారంభమైనాయి. ఇతర రాష్ట్రాల్లోని కేసులు చూపి తెలుగు రాష్ట్రాలలోని ప్రజాసంఘాల బాధ్యులను కట్టడి చేసే ఒక వ్యూహం అమలు చేస్తున్నది. దండకారణ్యంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోడానికి నిజనిర్ధారణకు వెళ్లిన అరవైమంది ప్రజాసంఘాల బాధ్యులను ఛత్తీస్‌ఘడ్ అంచును కూడా తాకనివ్వలేదు.
వీటన్నిటి మధ్య పద్దెనిమిదవ లోక్‌సభ సమావేశమైంది. ఈ కలగూరగంప ఎన్‌డీఏ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదు. భారతదేశంలో విద్వేష రాజకీయాలకు, వివేకవంతులైన ప్రజలకు మధ్య ఘర్షణ ఎలా ఉంటుందో చూడాల్సిందే. దీన్ని సరైన దారిలో మలిచే బాధ్యతను ప్రత్యామ్నాయ రాజకీయాలు స్వీకరించాల్సి ఉంది.