విరసం మిత్రుడు పాణి తో చేపట్టిన సంభాషణను ‘కొలిమి’  “ఫాసిజం-విప్లవోద్యమం- సాహిత్య విమర్శ” అనే పుస్తకంగా జనవరి 2024 లో ప్రచురించింది. పుస్తకం శీర్షికలో సాహిత్య విమర్శ అనే పేరుంది గానీ ఇందులో ఎటువంటి సాహిత్య వాచక ప్రస్తావనలు లేవు. దేని గురించి అయినా రొటీన్ గా ఆలోచించే సంప్రదాయ సాహిత్యకారులు, సాహిత్య విమర్శకులు ఎవరైనా దీనిని చదివితే చాలా నిరాశ పడిపోతారు. ఇది సాహిత్య విమర్శ కానే కాదని, ఫక్తు ‘రాజకీయ విమర్శ’ అని పెదవి విరవొచ్చు. ఇంకా కొందరైతే ‘మావోయిస్టు విప్లవ విమర్శ’ అని కూడా కొట్టి పారేయవచ్చు.

కానీ నిరంతరం మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే మనం రొటీన్ ఆలోచనల నుంచి బయటపడాలి. నిత్యం చలనంలో ఉన్న సమాజాన్ని దాని చలనంలోనే క్యాప్చర్ చేయాలంటే మన ఆలోచనలు కూడా చలనంలోనే ఉండాలి. అంటే, నిరంతరం సరికొత్తగా ఆలోచిస్తే గాని చలనశీల సమాజాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేం. మార్పును వ్యతిరేకించే వాళ్లను , ప్రగతి వ్యతిరేకులను మామూలుగా సంప్రదాయవాదులు అని అంటాం. కానీ  మార్పును, ప్రగతిని కోరుకునే వాళ్లలోనూ నిలువనీటి ఆలోచనలు ఉంటే వాళ్లు కూడా సంప్రదాయవాదుల కంటే భిన్నం ఏమీ కాదు.

కనుక మనం సమాజాన్ని ఎలా చూస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అంటే, దృక్పథం చాలా కీలకమైనది. అందులోనూ శాస్త్రీయ దృక్పథం చాలా అవసరమైనది. ఉదాహరణకు- నిరంతర వర్గ పోరాటం ద్వారా మౌలిక సామాజిక మార్పును తేవాలనుకుంటున్న వాళ్లకు గతితార్కిక చారిత్రక భౌతిక వాదమనే శాస్త్రీయ దృక్పథం ఉన్నప్పటికీ, దానికదిగా సిద్ధాంతం కాదు. సిద్ధాంతం ఎప్పుడూ సిద్ధాన్నం కాదు. ఆ శాస్త్రీయ దృక్పథం వెలుగులో మానవ జీవితాన్ని సమాజాన్ని అర్థం చేసుకోవాలి. నిజంగా అర్థం చేసుకోవడం అంటే పోరాటాచరణలో  ఉండడమే. అలా పోరాటాచరణ ద్వారా అర్థం చేసుకుంటూనే, సిద్ధాంతాన్ని నిర్మించుకుంటాం. అలా ఒక్కసారి నిర్మాణమైన సిద్ధాంతాన్ని ఎల్ల కాలాలకు యాంత్రికంగా అనువర్తింపజేయలేం. నిర్దిష్ట స్థల, కాలాల్లో నిరంతరం మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా సరికొత్త సిద్ధాంత భావనలను రూపొందించుకొని, సిద్ధాంతాన్ని ఎప్పటికప్పుడు శాస్త్రీయంగా నిర్మించుకోవాలి. అలా నిర్మించుకోవాలంటే- పరమ సిద్ధాంత వాదం, పరమ ఆచరణ వాదమూ రెండూ పనికిరావు. ఎందుకంటే వివిధ వర్గాలుగా విభజితమైన అసమ సమాజంలో సిద్ధాంతం, ఆచరణ రెండు వేర్వేరుగా ఉండే పరిస్థితులే ప్రబలంగా ఉంటాయి. కనుక నిరంతర వర్గ పోరాటాచరణ ద్వారా సిద్ధాంతం, ఆచరణ రెండూ కలగల్సిన ఉమ్మడి జీవన తలాన్ని సృష్టించుకోవడం ద్వారానే సిద్ధాంతాన్ని సరికొత్తగా నిర్మించుకుంటాం. తద్వారా పోరాటాచరణను చారిత్రకంగా ఫలవంతం చేసుకుంటాం. దీనినే వేరే మాటల్లో చెప్పాలంటే- మౌలిక మార్పైన విప్లవ లక్ష్యానికి తగినట్టుగా అంతకంతకూ ప్రగతి దాయకంగా మనల్ని మనం మార్చుకోవడమే, సరికొత్తగా నిర్మించుకోవడమే సరైన మార్గం. అందులో భాగంగా సామాజిక వాస్తవికతను ప్రతిఫలించే ఆలోచనా రంగమైన సిద్ధాంతం విషయంలోనూ ఇదే సరియైనది.

అందుకే పాణి ఈ సంభాషణకు చాలా కాన్షియస్ గానే “ఫాసిజం-విప్లవోద్యమం-సాహిత్య విమర్శ” అనే టైటిల్ ను పెట్టాడని నేను దృఢంగా నమ్ముతున్నాను.

ఆయన దృష్టిలో సాహిత్యం సామాజిక జీవితంతో సంబంధంలేని శుద్ధ ఆలంకారిక క్రీడ కాదు. ఒక్క రచయితకు మాత్రమే సంబంధించిన స్వీయ ప్రతిభా విశేషం కూడా గాదు. అందరు మనుషుల్లాగే రచయిత కూడా భావోద్వేగ జీవి. సామాజిక వాస్తవికతతో సంపర్కం వల్ల వివిధ భావోద్వేగాలు ప్రేరేపితమై తనదైన అనుభవాన్ని పొందుతాడు. అట్టి భావోద్వేగపూరితమైన అనుభవాల ద్వారానే రచయిత సామాజిక వాస్తవికతను గ్రహిస్తాడు. ఆ గ్రహింపులో అనేక స్థాయిలతో కూడిన తేడాలుంటాయి.

అయితే సామాజిక శాస్త్రాలు సామాజిక వాస్తవికతను ఒకానొక బిందువు వద్ద క్యాప్చర్ చేసి పరిశీలించి, అధ్యయనం చేస్తాయి. కానీ సాహిత్యం మాత్రం సామాజిక వాస్తవికతను దాని చలన క్రమంలోనే క్యాప్చర్ చేస్తుంది. అందువల్ల సామాజిక శాస్త్రాలు పట్టుకోలేని సూక్ష్మాతిసూక్ష్మ విషయాలను సైతం సాహిత్యం పట్టుకోగలుగుతుంది. కనుక సాహిత్యానికి సమాజమే కీలక భూమిక అయినప్పటికీ, సాహిత్యం చాలా భిన్నమైన, మానవీయమైన సామాజిక ఉత్పత్తి అని చెప్పవచ్చు.

ఇలాంటి సాహిత్యాన్ని విశ్లేషించే సాహిత్య విమర్శ కూడా మిగతా సామాజిక విమర్శలన్నిటికంటే అంత్యంత భిన్నంగా ఉంటుంది. అయితే ఆ సాహిత్య విమర్శ ఎంత శాస్త్రీయంగా ఉన్నదనే దాన్ని బట్టి దాని మానవీయత, భిన్నత్వం ఆధారపడి ఉంటాయి.

అలాగే సాహిత్య విమర్శ ఏదయినా  అంతిమంగా సామాజిక విమర్శయే  అయినప్పటికీ ఈ పుస్తక శీర్షికలో మాత్రం పాణి సాహిత్య విమర్శ అనే పేరే పెట్టాడు. ఎందుకంటే- అన్ని సామాజిక శాస్త్ర విమర్శల కంటే భిన్నంగా సామాజిక వాస్తవికతను ఆయన దాని చలన క్రమంలో సూక్ష్మ పరిణామాలతో సహా రచయతల, పాఠకుల హృదయాలకు దగ్గరగా అత్యంత మానవీయంగా, సృజనాత్మకంగా విశ్లేషించదల్చుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే – సాహిత్య విమర్శ సాహిత్య వాచకానికి సంబంధించినది మాత్రమే కాదని, దానికి బయట చుట్టూ ఉన్న మొత్తం సమాజపు రాజకీయార్థిక, సాంస్కృతిక, భావజాల క్రమాలతో కూడిన జీవన ప్రపంచమంతా దాని కార్యక్షేత్రం గా ఉంటుందని చెప్పడం కోసమే శీర్షికలో రచయత  సాహిత్య విమర్శ అనే పేరే పెట్టాడు.

ఇటువంటి శాస్త్రీయమైన మార్క్సిస్టు సాహిత్య విమర్శ సిద్ధాంతం ద్వారానే పాణి ఫాసిజాన్ని,  దానికి వ్యతిరేకంగా జరుగుతున్న విప్లవోద్యమాన్ని ఈ పుస్తకంలో అత్యంత లోచూపుతో విశ్లేషించాడు. భారత ఫాసిజం ఒక ఘటన కాదని, అది సుదీర్ఘ క్రమపరిణామం అని, అది ఒక్క భారతీయ జనతా పార్టీతోనే వచ్చింది కాదని చెప్తాడు. వలసానంతర  దశలో భారత దేశంలో కొనసాగిన ఎన్నికల రాజకీయాల్లో, పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలోనే  నేటి ఫాసిజానికి మూలాలున్నాయని అంటాడు.  భారతదేశ  ఫాసిజానికి ఎన్నికల రాజకీయ పార్టీలన్నీ కారణమే అని పేర్కొంటాడు.

అలాగే రాజీ లేకుండా నిరంతర వర్గ పోరాటాలతో భారత రాజకీయార్థిక వ్యవస్థను సమూలంగా మార్చాలనే లక్ష్యంతో నేటి విప్లవోద్యమం కొనసాగుతున్నదని, అటువంటి విప్లవోద్యమాన్ని అర్థం చేసుకోవాలంటే – అన్ని కోణాల్లోంచి దానిని పరిశీలించి లోతైన అధ్యయనం చేయాలని, రొటీన్ ఆలోచనల నుంచి బయటపడి మనం కొత్తగా ఆలోచించాలని, మొక్కవోని ధైర్య సాహసాలతో నిరంతరం పోరాడే ప్రజలతో మమేకమైతే తప్ప విప్లవోద్యమ ప్రస్థానాన్ని సక్రమంగా అర్థం  చేసుకోలేమని అంటాడు.

ముఖ్యంగా నేటి భారత ఫాసిస్టు సందర్భంలో మార్క్సిస్టు సాహిత్య విమర్శ కార్యక్షేత్రాన్ని పునర్ నిర్వచించుకొని, మరింత విస్తరించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ పుస్తకం నొక్కి చెప్పిందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

Leave a Reply