ఛత్తీస్‌గఢ్‌లోని హస్‌దేవ్ అడవుల్లో పర్సా బొగ్గు గని కోసం చెట్లను నరికివేయడానికి నిరసన తెలియచేసినందుకు స్థానిక ఆదివాసీ సమాజం మూల్యం చెల్లించాల్సి వచ్చింది. నిరసనకారులపై పోలీసులు పాశవికంగా లాఠీచార్జి చేశారు, ఇందులో హస్‌దేవ్ బచావో సంఘర్ష్ సమితి కార్యకర్త రాంలాల్ కరియం, పలువురు ఆదివాసీలు తీవ్రంగా గాయపడ్డారు.  ఆగ్రహించిన ఆదివాసీ గ్రామస్తులు విల్లులు, బాణాలు, గులేరులతో చెట్ల నరికివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగడంతో కొంతమంది పోలీసులు కూడా గాయపడినట్లు సమాచారం. తొలుత ఘర్షణల అనంతరం భారీ పోలీసు బలగాల మోహరింపు మధ్య చెట్ల నరికివేతను ప్రారంభించారు.

 హస్‌దేవ్ అడవుల్లోని పర్సా బొగ్గు గని కోసం అటవీ- పర్యావరణ శాఖ అనుమతులు నకిలీ పత్రాల ఆధారంగా ఉన్నాయని నిరసన తెలియచేస్తున్న గ్రామస్తులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్ ఖండించింది. బ్లాక్‌లో మైనింగ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది.  ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్ కన్వీనర్ అలోక్ శుక్లా మాట్లాడుతూ “మధ్య భారత ఊపిరితిత్తులుగా తరచుగా వర్ణించబడే హస్‌దేవ్ అడవులు పురాతనమైనవి; ప్రాచీనమైనవి; లోటును భర్తీ చేయలేనివి. ఈ ప్రాంతంలోని చెట్లు, సహజ నీటి ప్రవాహాలు ఉత్తర ఛత్తీస్‌గఢ్ అంతటా స్వచ్ఛమైన గాలి, నీటి సరఫరాలను నిర్వహించడానికి కీలకమైనవి. తరతరాలుగా, బిలాస్‌పూర్, కోర్బా వంటి నగరాలకు స్వచ్ఛమైన త్రాగునీటిని సరఫరా అయ్యేలా చూసేందుకు, స్థానిక సముదాయాలు ఈ అడవులను సంరక్షిస్తున్నాయి” అని వివరించారు.

 170,000 హెక్టార్ల విస్తీర్ణంలో 23 బొగ్గు బ్లాకులను కలిగి ఉన్న హస్‌దేవ్ అరంద్ మధ్య భారతదేశంలో చాలా దట్టమైన అటవీప్రాంతంలో అతిపెద్దది . దట్టమైన అటవీ ప్రాంతంలో మొత్తం ఐదు బిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇప్పటివరకు, ఛత్తీస్‌గఢ్‌లోని పర్సా ఈస్ట్ – కాంటా బసన్ (పిఇకెబి) బొగ్గు బ్లాకుల కోసం హస్‌దేవ్ అడవిలో 137 హెక్టార్లలో జీవవైవిధ్యం అధికంగా ఉన్న అడవులలో వేలాది చెట్లు నరికివేతకు గురయ్యాయి. రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్‌కి పిఇకెబి, పర్సా బొగ్గు బ్లాకులను కేటాయించారు;  రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్‌  “గని విస్తరణ-కార్యనిర్వాహకుడు” (మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్)గా అదానీ గ్రూప్ పిఇకెబి గని నుండి బొగ్గును తవ్వకాలు జరుపుతోంది.

 1,898 హెక్టార్ల దట్టమైన అటవీప్రాంతంలో విస్తరించి ఉన్న పిఇకెబి బ్లాక్‌ను రెండు దశల్లో తవ్వాలి- దశ 1లో 762 హెక్టార్లు, దశ 2లో 1,136 హెక్టార్లు. స్థానిక సముదాయాలు, అటవీ హక్కుల కార్యకర్తల నుండి  తీవ్ర వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో, నిరంతరం, విస్తృతంగా అడవులను నాశనం చేయడం ద్వారా మైనింగ్‌కు వ్యతిరేకంగా ప్రజల ఉద్యమాలు, ఇప్పటివరకు ఒక బొగ్గు గని, పిఇకెబి (పర్సా ఈస్ట్ కేటే బసన్) మాత్రమే మొదలైంది. తదుపరి మైనింగ్ కోసం కొత్త బ్లాకులను తెరవడానికి అదానీ-ప్రభుత్వ అనుబంధం ద్వారా దుర్మార్గపు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

 చత్తీస్‌గఢ్ బచావో ఆందోలన్‌కి చెందిన పర్యావరణ కార్యకర్త అలోక్ శుక్లా, పి‌ఇ‌కెబి బ్లాక్‌లో రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్  గనుల తవ్వకాలలో 1వ దశలో 762 హెక్టార్ల అడవులను క్లియర్ చేయడానికి 2022తో ముగిసిన ఒక దశాబ్దంలో దాదాపు 150,000 చెట్లను నరికివేశారని అంచనా వేశారు. వార్తా వెబ్‌సైట్  ‘ది వైర్ ‘ ప్రకారం , 2022లో 43 హెక్టార్ల కంటే ఎక్కువ చెట్లను, 2023 ప్రారంభంలో అదే ప్రాంతంలో మరో 91 హెక్టార్లలో చెట్లను నరికివేసారు. 2023 డిసెంబర్ 21 నుండి మరిన్ని అటవీ నిర్మూలన కార్యకలాపాలు జరిగాయి. వన్యప్రాణులు, జీవవైవిధ్య సంస్థలు “మైనింగ్‌పై పూర్తి నిషేధం సిఫారసు చేయలేదు” కాబట్టి హస్‌దేవ్ అరంద్ అడవులలో మైనింగ్ కోసం రాబోయే సంవత్సరాల్లో సుమారు 273,000 చెట్లను నరికివేయవచ్చని  2024 జూలై లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ రాజ్యసభకు తెలియజేసింది. పర్సా ఈస్ట్ కేతే బాసన్ మైన్‌లో 94,460 చెట్లు నరికినట్లు నివేదికలో పేర్కొన్నట్లు మంత్రి తెలిపాడు.

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పరిశోధనా సంస్థ అయిన వైల్డ్‌ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా  2021లో చేసిన అధ్యయనం గురించి మంత్రి మాట్లాడుతున్నాడు.  ఇప్పటికే తవ్వకాలు మొదలుపెట్టిన పి‌ఇ‌కెబి బ్లాక్‌లోని కొన్ని భాగాలలో మాత్రమే మైనింగ్ కార్యకలాపాలను అనుమతించాలని; హస్‌దేవ్ కోల్‌ఫీల్డ్ లోని ప్రాంతాలు, చుట్టుపక్కల భూములను మైనింగ్ కోసం ‘నో-గో ప్రాంతాలు’గా (ప్రవేశించడానికి వీలులేని) ప్రకటించాలి అని సిఫారసు చేసింది.

ప్రభుత్వ పరిశోధనా సంస్థ ప్రకారం, హస్‌దేవ్ అరంద్ “అరుదైన, అంతరించిపోతున్న, ప్రమాదానికి గురవుతున్న జంతుజాలానికి” నిలయంగా ఉంది. కలప, పండ్లు, ఔషధ మూలికలు, ఆకులు జీవనోపాధికి మూలాధారమే కాకుండా, టేకు, వేప, మహువా, జామున్ తదితర 30 కంటే ఎక్కువ జాతుల చెట్లు కూడా వున్నాయి; స్థానిక సముదాయాలు తమ దేవతలుగా పూజిస్తాయి.

ఆహారం, మేత, ఔషధ మొక్కలకు ఇంధనం; ఈ ప్రాంతంలోని సామాజిక-సాంస్కృతిక విలువలతో సహా అటవీ వనరులపై ఆధారపడిన స్థానిక ఆదివాసీల ఆదాయంలో 70% వరకు నాశనం అవుతుందని నివేదిక పేర్కొంది. నివేదిక ఈ ప్రాంతంలో “తిరుగులేని, గొప్ప జీవవైవిధ్యం” ఉనికిని పేర్కొంది. “అందువలన, అటవీ విస్తీర్ణాన్ని కొనసాగించడం, దాని మొత్తం పర్యావరణ సమగ్రతను కాపాడుకోవడం చాలా అవసరం” అని పేర్కొంది.

పదివేల చెట్లను కోల్పోవడమే కాకుండా, మైనింగ్ వల్ల వందలాది ఆదివాసీ కుటుంబాలు నిరాశ్రయులయ్యే, ఇంకా వేలాది మంది నిర్వాసితులయ్యే ప్రమాదం ఉంది. గత అనేక సంవత్సరాలుగా, హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి, సేవ్ హస్‌దేవ్ ఫారెస్ట్ కమిటీ,  గ్రామసభ నాయకులు, ఆదివాసీ హక్కుల కార్యకర్తలు నిరంతరం చెట్ల నరికివేతను తీవ్రంగా నిరసిస్తున్నారు.

 ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్ (సి‌బి‌ఎ) 2024 అక్టోబర్ నాడు ఒక ప్రకటనలో హరిహర్‌పూర్, సాల్హి, ఫతేపూర్ గ్రామసభలు అడవిని తొలగించడానికి (ఫారెస్ట్ క్లియరెన్స్‌) ఎప్పుడూ సమ్మతి ఇవ్వలేదని, మైనింగ్ కోసం అటవీ శాఖ యిచ్చే అనుమతులను నిరంతరం వ్యతిరేకిస్తున్నాయని పేర్కొంది. ఈ గ్రామసభలు ఏ రూపంలోనూ తమ సమ్మతిని ఇవ్వలేదు; కానీ 2018లో, అవసరమైన అనుమతులు పొందేందుకు సర్పంచ్ కార్యదర్శిని ఫోర్జరీ పత్రాలను రూపొందించడానికి కంపెనీ బలవంతం చేసిందని సి‌బి‌ఎ ప్రకటన ఆరోపించింది.

 2021లో 30 గ్రామాలకు చెందిన ప్రతినిధులు కాలినడకన 300 కిలోమీటర్లు ప్రయాణించి రాయ్‌పూర్‌కు చేరుకున్నారని, అక్కడ వారు రాష్ట్ర గవర్నర్‌ను కలిశారని ప్రకటన పేర్కొంది. కంపెనీపై వచ్చిన అవకతవకల ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిస్తామని గవర్నర్‌ వారికి హామీ ఇచ్చారు. పెరుగుతున్న పర్యావరణ ఆందోళనలు, ప్రజల ఒత్తిడికి ప్రతిస్పందనగా, ఛత్తీస్‌గఢ్ శాసనసభ 2022 జూలై 27న హస్‌దేవ్ అడవులలో బొగ్గు తవ్వకాలు జరపకూడదని పేర్కొంటూ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇంకా, ఈ సంవత్సరం, కంపెనీ సమర్పించిన నకిలీ గ్రామసభ పత్రాలపై ఛత్తీస్‌గఢ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ విచారణ ప్రారంభించింది.

కానీ, ఎస్‌టి కమీషన్ తాను కనుగొన్న విషయాలను విడుదల చేయడానికి ముందే, లేదా అసెంబ్లీ ఈ విషయంలో తదుపరి చర్చలు జరపకముందే, చెట్లను నరికి అడవులను తొలగించడానికి  అటవీ గ్రామాలలో 2024 అక్టోబర్ 16  రాత్రి నుండి భారీ పోలీసు బలగాలను మోహరించారు; మరోవైపు అడవులను కాపాడుకోవాలనే పట్టుదలతో గ్రామస్తులు రాత్రంతా జాగారం చేశారు. తెల్లవారుజామున, గ్రామస్తులను అడవుల నుండి బలవంతంగా తరిమికొట్టడానికి పోలీసులు క్రూరమైన అణిచివేత ప్రారంభించారు; ఫలితంగా కొంతమంది గ్రామస్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్, పర్సా బొగ్గు గనిలో చెట్ల నరికివేతను తక్షణమే ఆపాలని, కంపెనీ మోసపూరిత చర్యలపై దర్యాప్తు నివేదికను త్వరగా విడుదల చేయాలని, ఈ మోసానికి పాల్పడిన అధికారులు, కంపెనీ ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సర్వ ఆదివాసీ సమాజ్, ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్, ఆదివాసీ విద్యార్థులు 2024 అక్టోబర్ 17న  షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్‌ను, కార్యదర్శిని కలిసి నకిలీ గ్రామసభ పత్రాలకు సంబంధించిన దర్యాప్తు నివేదిక, దాని సిఫార్సులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అక్టోబర్ 17, 2024

Leave a Reply