కుటుంబంమోర్గాన్ ఈనాటి న్యూయార్కు లో నివసిస్తున్న ఇరాక్యూ ఇండియన్ల మధ్య తన జీవితంలో అధిక భాగాన్ని గడిపాడు. వారి తెగలలో ‘సెనేకా’ అనే తెగకు దత్తు పోయాడు కూడా. వారిలో ఒకవిధమైన దంపతీ వివాహ పద్దతి [ఒకభర్తా, ఒకభార్య] అమలులో వుంది. అయితే, ఈ బంధాన్ని సులువుగా తెంచేసుకోవచ్చు. దానికి ఆయన ‘జంట కుటుంబం’ అని పేరు పెట్టాడు.[జంట కుటుంబం అనేదానికి వేరే అర్ధం కూడా వుంది. అది తర్వాత చూస్తాం] వారికి కలిగిన సంతానం ఏ జంట తాలూకా పిల్లలో అందరికీ తెలుస్తుంది. అలాగే గుర్తిస్తారు కూడా. తల్లీ, తండ్రీ, కొడుకూ, కూతురూ, తోబుట్టువూ, తోడ బుట్టిన వాడూ ఎవరు ఎలా పిలవాలో సందేహించనవసరం లేదు. కానీ, కొంత తేడా వుంది. ఇరాక్యూ మగవాడు తన బిడ్డల్నే కాకుండా తన సోదరుల బిడ్డల్ని కూడా తన కొడుకులూ, కూతుర్లూ అనే పిలుస్తాడు. వారు కూడా అతనిని ‘తండ్రి’ అనే పిలుస్తారు. తోబుట్టువుల బిడ్డల్ని మేనల్లుడూ, మేనకోడలూ అంటారు. ఆడవాళ్ళు కూడా అంతే. తన అక్కచెల్లెళ్ళ పిల్లల్ని కూతుర్లు గానే భావిస్తారు. ఇది చాలా ప్రాంతాలలో వుంది. అమెరికాలోని ఇండియన్ తెగలలోనే కాకుండా, భారతదేశంలోని ఆదిమ వాసులలోనూ, దక్షిణ భారతంలోని ద్రవిడ తెగలల్లోనూ ఇది వుంది.


దీనికి కారణం ఏమిటి? ఆఫ్రికా, ఆస్ట్రేలియాలలో కూడా సర్వత్రా కొద్ది మార్పులతో ఈ వ్యవస్థే కనబడుతూ వుంది. కనుక దానిని ఒక చరిత్ర క్రమంలో వివరించాలే గానీ, ‘మాక్ లెన్నాన్’ లాగ ఏదో చెప్పెయ్య కూడదు. ప్రస్తుతం మనం ‘ఏక భార్యా, ఏక భర్త’ అనే పద్ధతినే అంగీకరిస్తాం. ఒక పురుషుడు ఎక్కువ మంది భార్యల్ని కట్టుకున్నా, ఒక స్త్రీ ఎక్కువ మంది భర్తల్ని కలిగి వున్నా దాన్ని మనం దాచి పెడతాం. కానీ, ఆదిమ చరిత్రను అధ్యయనం చేస్తే, ఏక కాలంలో స్త్రీలు అనేక మంది పురుషులతో సంబంధాన్ని, అలాగే పురుషులు అనేక మంది స్త్రీలతో సంబంధాన్నిఒక పద్ధతిగా అవలబించిన రోజులు వున్నాయనీ, అందుచేత బిడ్డల్ని అందరూ వుమ్మడి బిడ్డలు గానే పరిగణించేవారని బోధపడుతూ వుంది. అలాంటి పరిస్థితులు ఎన్నో మార్పులు పొంది, పొంది చివరకు ‘ఏక భార్యా, ఏక భర్త’[దంపతీ పద్ధ‌తి ఏర్పడిందని తెలుస్తున్నది. ప్రారంభకాలంలో చాలామంది వుమ్మడి వివాహబంధంలో ఇమిడి వుండేవారు. కానీ, క్రమంగా ఒక్కో మార్పు వచ్చినపుడల్లా వారి సంఖ్య తగ్గిపోతూ వుండేది. చివరకు ఆ బంధంలో ఒక్క జంటని మాత్రమే ఇముడ్చుకునే స్థితి ఏర్పడింది. అదే ఈనాడు కూడా అమలులో వుంది.అసలు ఆదిమ కాలంలో విచ్చలవిడి సంబంధాలుండేవి. తెగ లోని ప్రతి స్త్రీ, ప్రతి మగవానికీ భార్య. అలాగే ప్రతి మగవాడూ, ప్రతి స్త్రీకి భర్త.[ ఈ భార్యా, భర్త అనే మాటలు అప్పుడు లేవు. అసలు మాటలే లేవు. కేవలం శారీరక సంబంధాలే.] ఇటువంటి కుటుంబం ఒకనాడున్నదనే విషయం విషయంలో మోర్గాన్ తన సహచరుల విషయంలో ఏకిభవించాడు. 18 వ శతాబ్దం నుండి ఇలాంటి సమాజం గురించి చెప్పుకోవడం వుంది. అటు వంటి స్థితి ఒకటున్నదని గాఢంగా నమ్మి, పరిశోధనలు జరిపిన మొదటి వ్యక్తి ‘బాహోఫెన్’ [ఈ బాహోఫెన్ 1861 నాటివాడు. అంటే, మోర్గాన్ కంటే ముందువాడు] ఆయన చేసిన గొప్ప సేవల్లో అదొకటి. ఆయన కనిపెట్టినది ‘గుంపు పెళ్లి’. ఏ వావి వరసలూ లేని లైంగిక సంబంధాల వ్యవస్థ అంతకు చాలా కాలం పూర్వానిది.

అటువంటి పద్ధతి ఒకటున్నదని, అవశేషాల ఆధారంతో తప్ప, ప్రత్యక్షంగా వాటి జాడ తీయడం ఇంచు మించు అసాధ్యమైన పని. అది అంత ప్రాచీనదశకు చెందినది. దాన్ని చర్చకు తేవడమే ‘బాహోఫెన్’ చేసిన గొప్ప పని. కొంత మందికి మానవ జాతిలో ఈ దశ ‘అవమానమని వారి వూహ. అటువంటి స్థితి ఒకటుండేదని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని అంటారు.ఆ తర్వాత వచ్చింది “గుంపు పెళ్లి”.[కొన్ని గుంపులు కలిస్తే ఒకతెగ. కొన్ని తెగలు కలిస్తే ఒక కూటమి. గుంపు అన్నా గణం అన్నా ఒకటే. అంటే, ఒకే తెగలో ఒకగుంపుకీ, మరో గుంపుకీ పెళ్లి చేస్తారు. అదే గుంపు పెళ్లి. ఒక గుంపులో కొన్ని వందల మంది వుంటారు. ఆనాటికి పిల్లలు పుట్టడానికి పురుషుడు కూడా కారణం అని తెలియదు. పిల్లలు పుట్టడం స్త్రీ ద్వారానే అని కనిపిస్తున్నది కాబట్టీ, స్త్రీ ద్వారానే పిల్లలకు గుర్తింపు. ఒకస్త్రీకి పుట్టిన సంతానం అంతా…కొడుకులూ, కూతుర్లూ, మనమలూ, మనవరాళ్ళూ అందరూ ఆమె గణానికే చెందుతారు. ఆ గణంలో ఎవరు వృద్ధురాలైతే ఆమే ఆ గుంపుకి నాయకురాలు. ఇదే మాతృస్వామ్య వ్యవస్థ.


ఈ గుంపు పెళ్ళిలో, మొదటి గుంపులో స్త్రీ, తనకు పెళ్లి జరిగిన రెండవ గుంపులోని మగవాళ్ళందరితో కలుస్తుంది. అలాగే మొదటి గుంపులోని మగ వాళ్ళు, రెండవ గుంపులోని స్త్రీ లందరితోనూ కలుస్తారు. ఒక కొత్త పద్దతి వచ్చిందంటే, మరుచటి రోజునుండే అందరూ ఆచరిస్తారని కాదు. గతంలోని పద్ధతులు కొన్నాళ్ళ వరకూ కొనసాగుతాయి. క్రమంగా పాత పద్ధతి పోయి కొత్త పద్ధతి స్థిర పడుతుంది. ఈ మార్పుకు కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది.


స్త్రీ, పురుష సంబంధాలలో ‘విశృంఖలత్వం’ అంటే ఏమిటి? ఇప్పుడు, ఇది వరకూ వున్న నిర్బంధాలూ,  నిషేధాలూ లేకపోవడమే విశృంఖలానికి అర్ధం. “వావి తప్పడం”అనే భావం కూడా అలా వచ్చిందే. [వావి అంటే ‘సరైన’ అని అర్ధం. వావి తప్పడం అంటే సరైన సంబంధాన్ని తప్పడం అని అర్ధం] మొట్ట మొదటి దశలో సోదరీ సోదరులు భార్యాభర్తలుగా వుండేవారు. అంతేకాదు, తలిదండ్రులకూ, బిడ్డలకూ మధ్య లైంగిక సంబంధాలు ఉండేవి. కొన్ని జాతులలో నేటికీ ఆమోదయోగ్యం గానే వుంది. పార్దియన్లూ, పర్షియన్లూ, సిధియన్లూ, హుణులూ మొదలయిన వారిని గురించి, ప్రాచీన గ్రీకులూ, రోమన్లూ రాసిన విషయాలు అటుంచి, బేరింగ్ జలసంధి ప్రాంతాలలో వున్న కవియట్లు, అలాస్కా సమీపం లోని కద్యాక దీవి వాసులూ, బ్రిటీష్ ఉత్తర అమెరికా భాగంలోని తిన్నే ప్రజలలో ఇటువంటి ఆచారాలు వున్నాయని ‘బాన్ క్రాఫ్ట్’ రాశాడు. మనుషులు కల్పించుకొన్న నిషేధాలలో ‘వావి’ చాలా ముఖ్యమైనది.ఆదిమ సమాజాన్ని కేవలం వ్యభిచార గ్రుహపు రంగు కళ్ళద్దాలతోనే ఊహించగలవారు, ఆ సమాజాన్ని అర్ధం చేసుకోలేదని నా వూహ. గుంపు పెళ్లి గురించి చర్చించేటప్పుడు ఈ విషయానికి మళ్ళీ వద్దాం. స్త్రీ, పురుష సంబంధాలు స్వేచ్చగా వుండిన ప్రాచీన స్థితి నుంచి…ఏనాడో చాలా కాలం క్రిందట కుటుంబం యొక్క ప్రాథ‌మిక రూపం – రక్త సంబంధీకుల కుటుంబం ఏర్పడిందని మోర్గాన్ చెప్పాడు.
రక్త సంబంధీకుల కుటుంబం: ఇది కుటుంబ వ్యవస్థ  ప్రప్రథ‌మ దశ.

ఒక కుటుంబంలో తాతలూ, అవ్వలూ ఒకరికొకరు భార్యాభర్తలు. వీరి సంతానం అయిన స్త్రీ, పురుషులు ఒకరికొకరు భార్యాభర్తలు. మళ్ళీ వీళ్ళ సంతానం ఒకరికొకరు భార్యాభర్తలు. [అంటే, ఒకే రక్త సంబంధీకులు. అన్నా, చెల్లెళ్ళు] ఈ దశలో సోదరీ సోదరుల మధ్య దాంపత్య సంబంధాలు వుండడం సర్వ సాధారణం. కానీ, తర్వాత కాలంలో “అది నమ్మశక్యంగా లేద”ని అన్నారు. “సోదరుడ్ని, సోదరి భార్యగా కౌగలించుకోవడం ఎక్కడైనా విన్నామా?” అని ‘వాగ్నేర్’ ఆశ్చర్యం ప్రకటించాడు. దానికి మార్క్స్ “ఆదిమకాలంలో సోదరి భార్య గానే ఉండేది. అది ఆనాడు నీతి బద్ధమే”[1884 ముద్రణకు ఎంగెల్స్ వివరణ]
రక్త సంబంధీకుల కుటుంబ రూపం నేడు ఎక్కడా కనిపించదు. ఎంతో వెనకబడి వున్న ప్రజలలో కూడా చరిత్రలో తెలిసినంతవరకు దీనికి సాక్ష్యాధారాలతో కూడిన ఉదాహరణ కనబడలేదు. అయినా అటువంటి కుటుంబ రూపం ఒకటి వుండి వుండాలి. దానిని మనం ఒప్పుకోక తప్పదు. హవాయి దీవుల ప్రజలలో కనిపించే రక్త బంధుత్వపు తరాలు ఇటువంటి కుటుంబ రూపంలోనే ఏర్పడగలవు. ఆ రక్త బంధుత్వపు చిన్నెలు ‘పొలినీషియా’ అంతటా అమలులో వున్నాయి. [అయితే, వాగ్నేర్ మిత్రుడు బొన్యే, మార్క్స్ వాదనను వ్యతిరేకించాడు]
పునాలువన్ కుటుంబం: తలిదండ్రులకీ, సంతానానికి మధ్య లైంగిక సంబంధాల నిషేధం కుటుంబ నిర్మాణంలో మొదటి మెట్టు. ఆ తర్వాత వచ్చిన సోదరీ సోదరుల మధ్య లైంగిక సంబంధాల నిషేధం రెండో మెట్టు. ఇంచుమించు సమాన వయస్కులు కావడం చేత సోదరీ సోదరుల మధ్య లైంగిక సంబంధాలను నిషేధిచడం చాలా ముఖ్యమూ, కష్టము కూడాను. ఇది క్రమక్రమంగా అమలులోకి వచ్చింది. ప్రారంభంలో తల్లీ బిడ్డల మధ్య లైంగిక సంబంధాలు నిషేధించి వుండాలి. అది కూడా ప్రారంభంలో చెదురుమదురుగా అవలంబించి, చివరకు సాధారణ ఆచారంగా పరిణమించి ఉంటుంది. [హవాయి ద్వీపాలలో అక్కడక్కడ నేటికీ ఈ ఆచారం కనిపిస్తూనే వుంటుంది.] క్రమంగా ఈ నిషేధాన్ని ఒకటి, రెండు, మూడు తరాలకు చెందిన వేలు విడిచిన సోదరీ సోదరులకు కూడా విస్తరింప జేసి వుంటారు.[ఈ మార్పులు అనేవి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా వచ్చేయని అనుకోకూడదు. కొన్ని ప్రాంతాలలో కట్టుబాట్లు కొంత భిన్నంగా ఉండవచ్చు. ఒక మార్పు జరిగింది అంటే, అందరూ వెంటనే అంగీకరిస్తారని అనుకోలేము. కొంతమంది వ్యతిరేకించవచ్చు. అలా, కొన్ని వందల సంవత్సరాలు పట్టిందనే అర్ధం] సోదరీ, సోదరుల మధ్య దాంపత్య సంబంధాలు విధిగా అనుసరిస్తున్న తెగల కన్నా, ఆ ఆచారాన్ని నిషేధించిన తెగలు వేగంగా, బాగా అభివృద్ధి చెందాయనడం నిర్వివాదాంశం.


‘పునాలువా’ అనే మాటకి అర్ధం `సన్నిహిత సహచరులు, సహా భాగులు’. దీనిలో ఎన్నో మార్పులు కాల క్రమేణా జరిగాయి. దీని ప్రధాన లక్షణం కుటుంబం లో భార్యలూ, భర్తలూ ఒకరినొకరు ఉమ్మడిగా అనుభవిస్తారు. అయితే, ఇందులో భార్యల సోదరులూ, స్వయానా సోదరులూ, వేలువిడిచిన సోదరులూ కూడా మినహాయించారు. అలాగే మరోవైపు భర్తల అక్కచెల్లెళ్ళు కూడా. [అంటే, అన్నా చెల్లెళ్ళ సంబంధం మినహాయించారు] ఒక స్త్రీ యొక్క అక్కచెల్లెళ్ళ భర్తలు, ఆమెకు భర్తలే. అలాగే, ఒక పురుషుడి యొక్క అన్నదమ్ముల భార్యలు ఆయనకు భార్యలే.


[ఇంత వరకూ చదివినదానిని ఒకసారి చూద్దాం. ఆదిమ కాలంలో ఇంకా గుహల్లోనే నివసిస్తున్న కాలంలో ప్రక్రుతిలో ఏది లభ్యం అయితే అదే ఆహారం. అలాంటి కాలంలో విచ్చలవిడిగా సంబంధాలుండేవి. తల్లీకొడుకుల మధ్యా, తండ్రీకూతుర్ల మధ్యా, అన్నా చెల్లెళ్ళ మధ్యా ఇలా వావివరసలు లేవు. అసలు పిల్లలు పుట్టడానికి మగవాడు కారణం అని కూడా తెలియదు. స్త్రీ ద్వారా పిల్లలు పుట్టడం తెలుస్తున్నది కాబట్టి, ఒకస్త్రీకి పుట్టిన సంతానం అంతా ఆమె గణం. ఒక్కో గణానికీ ఒక్కో పేరు. కొంగా, లేడీ, డేగా, కాకీ ఇలా …ఆ గణంలోని సభ్యులు అంతా ఆ గణం పేరు వున్న పక్షినీ, లేదా జంతువును తినరు. అదొక నియమం. ఆ పక్షిని ఆ గణ సభ్యులు తప్ప, మిగతా గణాలు తినవచ్చు.


గణాలుగా విభజన జరిగిన తరువాత గణానికీ, గణానికీ మధ్య పెళ్లి. అదే “గుంపు పెళ్లి”. ఈ గుంపు పెళ్లి వలన ఎలాంటి మార్పు జరిగిందంటే..ఒక గుంపులోని స్త్రీ పురుషులు, పెళ్లి జరిగిన గుంపు లోని స్త్రీ పురుషులందరి తోనూ కలుస్తారు. తన గుంపులోని వాళ్ళతో మాత్రం కలవరు. ఉదాహరణకు కొంగ గుంపుకూ, లేడి గుంపుకూ పెళ్లి జరిగిందనుకొందాం. కొంగ గుంపులోని వాళ్ళు, లేడి గుంపులోని వాళ్ళందరితోనూ కలవచ్చు. తన సొంత గుంపు అయిన కొంగ పేరు గల గుంపు వాళ్ళతో మాత్రం కలవకూడదు. దీనివలన తల్లీకొడుకుల మధ్య సంబంధం తెగిపోయింది. ఎలాగంటే…రెండు వేరు వేరు గుంపుల్లోని స్త్రీ పురుషులకు పుట్టిన పిల్లలు వున్నారు. ఉదాహరణకు ఒకమగ పిల్లవాడు పుట్టాడు. వాడు ఎదిగిన తర్వాత ఎదుటి గుంపుల్లోని స్త్రీ లందరి తోనూ కలుస్తాడు. కానీ, తన తల్లి తో కలవడు. ఎందుకంటే, తన తల్లి తన గుంపులోనే వున్నది కదా! కాబట్టి ఆ సంబంధం తెగిపోయింది. కానీ, అది తండ్రీ కూతుర్ల మధ్య జరగలేదు. ఎలాగంటే, అదే ఒక ఆడపిల్ల పుట్టినదనుకుందాం. ఆమె ఎదిగిన తర్వాత ఎదుటి గుంపులోని మగ వాళ్ళందరి తోనూ కలిసినపుడు అందులో తన తండ్రి కూడా వుంటాడు.తరువాత కాలంలో వచ్చిందే జంట పెళ్లి. మామూలుగా ఇప్పటి భాషలో అయితే, జంట అంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు. కానీ, ఇక్కడ జంట అంటే అదికాదు. ఒక గుంపులోని స్త్రీకి, భర్తతోనూ, భర్త అన్నదమ్ములతోనూ, అన్నదమ్ముల వరసయ్యే మగవాళ్లతోనూ సంబంధాలుంటాయి. అలాగే పురుషుడికి కూడాను. భార్యతోనూ, భార్య అక్కచెల్లెళ్ళతోనూ, అక్క చెల్లెళ్ళ వరసయ్యేవారితోనూ. ఇదే పులనావా కుటుంబం అంటే. దీనివలన తండ్రీ కూతుర్ల మధ్య సంబంధాలు నిషేధం అయింది.](ఇంకా ఉంది)

Leave a Reply