(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  ఈ సంచిక‌లో కొంద‌రి సాహిత్య‌కారుల అభిప్రాయాలు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ)

1. కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి చేరాల్సిన తీరం ఏదైనా ఉన్నదా?

అవును. కథా రచనకు జీవితానుభవం మౌలిక మైన వనరు అన్నమాట నిజమే. అయితే అనుభవం దానికదే కథ కాదు. అది వొక ముడిసరుకు మాత్రమే. సంఘటన కూడా దానికదే కథ కాదు. భిన్న స్థల కాలాల్లో భిన్న అనుభవాలు రూపొందే  క్రమం, అది నేర్పే పాఠాలు కథలవుతాయి. అదే విధంగా సంఘటనలు జరగడానికి కారణమయ్యే భౌతిక పరిస్థితులు, వాటి నుంచి పుట్టే ఘర్షణ, దాని ఫలితంగా యేర్పడే మార్పు యిదంతా కథగా మారుతుంది. అనుభవాన్ని అధిగమించడమంటే అనుభవాన్ని కళగా  తీర్చిదిద్దడమే. అనుభవానికి ఆవలి తీరం సృజనే. నిర్దిష్టమైన  వైయక్తిక అనుభవాలను సాధారణీకరించడానికి  కథా సామగ్రి అవసరమౌతుంది.  మానవానుభవాలూ వాటిని సృజనాత్మకంగా వ్యక్తీకరించడానికి అవసరమయ్యే సాధనాలు కూడా సమాజం నుంచి సమకూర్చుకోవలసినవే. సాహిత్యమైనా మరే యితరమైన కళ అయినా ఆ  పునాదిపై నిర్మించుకోవాల్సిన సౌధమే. 

2. ఈ కోణంలో వర్తమాన కథను మీరు ఎలా చూస్తారు?

స్వీయ జీవితానుభవం నమోదు చేయటం దగ్గర కథకులు ఆగిపోకూడదు. విస్తృతం కావాలి. అనుభవాల సంపుటిని శకలాలుగా గాక సమగ్రంగా చూడాలి. వాటి కార్య కారణ సంబంధాన్ని అన్ని కోణాల్లోంచీ తెలుసుకోవాలి. జీవితంలోని సమాజంలోని సంఘర్షణనీ సంక్లిష్టతనీ పట్టుకోవాలి. వైరుధ్యాల్ని చూడగలగాలి. వాటికి పరిష్కారాన్ని అన్వేషించాలి. సామాజిక శాస్త్రాల వెలుగులో లోతుగా అధ్యయనం చేయాలి. ప్రతి రచయిత  తన కాలానికి చెందిన సమాజాన్ని దాని చలనాన్ని నిర్దిష్టంగా గుర్తించగలగాలి. మానవీయ విలువల్ని సరైన రీతిలో నిర్వచించుకోవాలి. సాహిత్యంలోకి కళాత్మక వ్యక్తీకరణగా తర్జుమా చేసుకోవాలి. వర్తమాన తెలుగు కథ  ఆ దిశలోనే నడుస్తోంది. కథ మన సమాజంలో చలనశీలంగానే వుంది. యువ రచయితలెందరో  కుల మత ప్రాంత లింగ వర్గ ఆధిపత్యాల కింద నలిగిన జీవితాలకు చెందిన భిన్న పార్శ్వాల్ని ఆవిష్కరిస్తున్నారు. చింతకింది శ్రీనివాసరావు జూపాక సుభద్ర పసునూరి రవీందర్ వేంపల్లె షరీఫ్ పూడూరి రాజిరెడ్డి ఎమ్మెస్ కృష్ణజ్యోతి వంటి రచయితలు స్వీయానుభవం దగ్గర మొదలై ఆ పరిధిని దాటి  కొత్త వస్తువుల్నీ యితివృత్తాల్ని స్వీకరించి  రాసున్న కథలు కథ విస్తృతికి ఉదాహరణగా కనిపిస్తాయి.  ఇటీవల ఎండపల్లి భారతి (ఎదారిబతుకులు, బతుకీత) ఇండస్ మార్టిన్ (కటికపూలు) సోలోమోన్ విజయకుమార్(మునికాంతపల్లి)  స్వీయ జీవితానుభవ నేపధ్యం నుంచి రాసిన కథల్ని చూసాం. వాటిలో కఠిన జీవన వాస్తవికత స్థానికత భాష వ్యక్తీకరణ రీతులు  ఎంతో సహజంగా అమరాయి. ఎక్కడా కృత్రిమ శిల్పానికి తావు లేదు. మల్లిపురం జగదీష్ పద్దం అనసూయ పలమనేరు బాలాజీ వంటి రచయితలు ఆదివాసి జీవితాల్లో చోటు చేసుకుంటున్న సాంస్కృతిక చలనాన్ని నిర్దిష్టంగా నమోదు చేస్తున్నారు. అలాగే షాజహానా సంపాదకత్వంలో ఇరవై ముగ్గురు ముస్లిం రచయిత్రులు రాసిన కథలు వెలుగులోకి వచ్చాయి. వాళ్లలో చాలామంది తొలిసారిగా కథలు రాశారు. సాహిత్యంలో కొత్త గొంతులు బలంగా వినిపిస్తున్నాయి. కొత్త జీవన పార్శ్వాలు తెలుస్తున్నాయి. కొత్త ఆలోచనలు విచ్చుకుంటున్నాయి. కొత్త జీవితం ఆవిష్కారమౌతోంది.  సమాజంలోని అన్ని మూలాల్లోకి  కథ చొచ్చుకువెళుతోంది. పాతుకుపోయిన విలువల్ని ప్రశ్నించి ఖండిస్తోంది. అదే సమయంలో  తెలుగు కథ అర్బనైజ్  కావటం కూడా గమనిస్తాం. ఈ నాగరికథల భాష విలక్షణంగా ఉంటుంది. వ్యక్తీకరణ విలక్షణంగా ఉంటుంది. ఇతర భాష సాహిత్యాల అధ్యయన ప్రభావం కూడా వీటి మీద  కనిపిస్తుంది. ఈ కథల్లో కొత్త ప్రయోగాల పట్ల యితివృత్తాల పట్ల ఆసక్తిని కూడా చూడగలం. అయితే అవి ఎక్కువగా వ్యక్తి కేంద్రంగా నడుస్తున్నాయి. సామూహిక జీవితాలు  సమూహాల ఆకాంక్షలు వెనకతట్టుపట్టాయి. ఈ దారిలో  మెహర్,  వెంకట సిద్ధారెడ్డి, కన్నెగంటి చంద్ర, స్వాతికుమారి బండ్లమూడి,  శ్రీ సుధ మోదుగు వంటి కొత్త కథకులు కథతో  అనేక ప్రయోగాలు చేస్తున్నారు.  

3. ఇవాళ మన చుట్టూ ఒక కొత్త కథా ఆవరణ ఉన్నది. చాలా మంచి కథలు వస్తున్నాయి. అందులోని అనుభవం వల్ల మనకు కొత్త కథలని అనిపిస్తోందా? లేక  దృక్పథం వల్ల కొత్త కథలని అనిపిస్తోందా?

అనుభవాలనీ దృక్పథాలనీ విడదీసి చూడలేము. ఎవరైనా నేను కేవలం నా జీవిత అనుభవాన్ని లేదా సామాజిక అనుభవాన్ని మాత్రమే రాస్తున్నాను నాకు దృక్పథంతో పనిలేదు అంటే అంతకంటే పెద్ద వంచన లేదు.  ప్రతి రచయితకీ వొక ప్రాపంచిక  దృక్పథం ఉంటుంది. దాన్ని విడిచి చేసే రచన నేల విడిచి చేసే సాము వంటిదే. దృక్పథ రాహిత్యం గొప్ప అని భావించే ఆధునికోత్తరవాదులు కొందరు తయారయ్యారు. వాళ్లు కళ కళ కోసమే లాగా కథ కథ కోసమే అని ప్రచారం చేస్తారు. ఆ ప్రచారం వెనుక కూడా ఒక దృక్పథం ఉంటుంది. ప్రయోజనం వుంటుంది. రాజకీయ ఆలోచన ఉంటుంది. నిర్దిష్ట సామాజిక దృక్పథం/నిబద్ధత  సృజన స్వేచ్ఛకు ఆటంకం అని చెప్పడం కూడా సరికాదు అని నా భావన. దృక్పథం జీవితానికే కాదు కళాభివ్యక్తికి సైతం స్పష్టతనిస్తుంది.  సరైన వస్తు రూపాల ఎంపికకి దృక్పథమే దోహదం చేస్తుంది.

సమాజంలో, సాహిత్యంలో ఆధిపత్యాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక భావనలు బలపడుతోన్న కొద్దీ  అనేక సెక్షన్ల నుంచి అస్తిత్వాల నుంచి రచయితలు పుట్టుకొస్తారు. ఆ క్రమంలో కొత్త వస్తువులు కొత్త జీవితం కొత్త నేపథ్యాలు కొత్త భాష కొత్త ప్రయోగాలు కథలోకి అనివార్యంగా  ప్రవేశిస్తున్నాయి. అయితే కేవలం కొత్తదనం ఒక కథని గొప్పగానో మంచిగానో తీర్చిదిద్దలేదు. దాని ట్రీట్మెంట్ పర్స్పెక్టివ్ రెండూ ప్రధానమే. సరైన శిల్పం లేక దృక్పథం లేక కేవలం నూతన వస్తువు అయినంత మాత్రాన అది ఉత్తమ కథ కాలేదు.

4. అసలు జీవితానుభవానికి, దృక్పథానికి ఉమ్మడి క్షేత్రం ఎలా ఉంటుంది? తేడా ఎలా ఉంటుంది?

జీవితానుభవాలని సైతం  దృక్పథం నుంచి వేరు చూడాల్సిన అవసరం లేదు. అనుభవ సారమే వొక దృక్పథం ఏర్పడడానికి పునాది నిర్మిస్తుంది.. మానవ సంచిత జ్ఞానం నుంచి సమాజ హితం కోసం భిన్న దృక్పథాలు పుడతాయి.  కొన్నిసార్లు  వాటి మధ్య వైరుధ్యాలు చోటు చేసుకోవచ్చు. ఏది మంచి ఏది చెడు అనేది ఆచరణలో ఫలితాలను బట్టి నిర్ధారించుకుంటున్నాం. ఆచరణలో వ్యక్తుల  వైఫల్యాలను సిద్ధాంతాలకు ఆపాదించలేం. సొంత అనుభవమే అంతిమ పాఠం కాదు. అలా అనుకోవడం వల్ల అపజయాలతో నిరాశ చెందే అవకాశం వుంది. అనుభవాల వుమ్మడి క్షేత్రం దృక్పథమే. అది సామూహిక ఆచరణలోనే రూపొందుతుంది. రాటుతేలుతుంది. ఫలితాలనిస్తుంది. సాహిత్య సృజన వుమ్మడి ఆచరణలో భాగం అనుకున్నప్పుడు అది ఉన్నతీకరించే మానవీయ సంవేదనలు ప్రతిపాదించే విలువలు మంది మంచికి దోహదపడతాయి, పడాలి. కళ అంతిమ లక్ష్యం అదే. 

5. అనుభవానికి, కళకు ఉన్న సంబంధాన్ని వర్తమాన కథల ఆధారంగా ఎలా చెప్పవచ్చు?

జీవితానికి మించిన కళ ఏముంటుంది? జీవితానికి దూరమైన కళ ఎందుకు? దాన్ని ఎలా ఆవిష్కరిస్తామన్నదే ముఖ్యం. జీవితాన్ని దాని అన్ని పార్శ్వాల్నీ అది ఎదుర్కొనే సమస్త సంక్లిష్టతలనీ అనేక స్థల కాలాల్లో అది పొందే పరివర్తననీ అందుకు కారణమయ్యే చోదక శక్తుల్నీ సృజనాత్మకంగా చెప్పడంలో తెలుగు కథ ఎప్పుడూ ముందే వుంది. అయితే యివాళ దాని పరిధి విస్తృతమైంది. దాని ప్రయాణం బహుముఖీనమైంది. యథాతథ స్థితిని అది అంగీకరించడం లేదు. గుణాత్మకమైన మార్పుని కోరుకుంటుంది. ప్రజల జీవన సంఘర్షణని కళాత్మకంగా వ్యక్తీకరిస్తుంది. నిర్మాణపరంగా కొత్త పోకడలను అందిపుచ్చుకుంటుంది.  విప్లవోద్యమంలో పుట్టిన కథనీ దాని పరిణామాన్నీ చూసినప్పుడు యీ విషయాన్ని బలంగా చెప్పగలం. కొత్త సామాజిక విలువల కోసం పడే తపన ఉద్యమ కథల్లో ప్రతి తరంలోనూ కనిపిస్తుంది. మనిషి పురోగతికి ఆటంకమయ్యే విలువలతో అది నిరంతరం పోరాడింది. విప్లవ కథలో అనుభవానికి అర్థం మారుతుంది. అనుభవం వ్యక్తిగతం కాదు. సమూహానిది. అది నేర్ప పాఠం దాని ఫలితాలు సమూహానివే. కథయినా మరే యితర కళాభివ్యక్తి అయినా సామాజిక వుత్పత్తిలో, పరిణామంలో భాగమే.   

6. ప్రయోగం వల్ల కథ అనేక అర్థాలను సంతరించుకుంటుంది. అయితే ఇటీవలి కథల్లో  దృక్పథం వల్లనే మంచి ప్రయోగంగా మారిన కథలకు,  ప్రయోగం వల్లనే దృక్పథ సమస్య వచ్చిన కథలకు ఏమైనా ఉదాహరణలు ఇవ్వగలరా?  

చాలా సందర్భాల్లో ప్రయోగం అంటే రూప పరమైన ప్రయోగమే అని అనుకుంటారు. కానీ వస్తు పరమైన ప్రయోగం కూడా ఉంటుంది. స్వీకరించే వస్తువే కొత్తది అయినప్పుడు వస్తు పరమైన ప్రయోగం చేసినట్లే. మూస వస్తువుల్ని బ్రేక్ చేసి కొత్త వస్తువు స్వీకరణ కూడా ప్రయోగమే. ఆధునిక సమాజంలో సంభవించే మార్పులన్నీ కథకి వస్తువులే. అయితే వాటిని రచయిత చూసే దృష్టిని బట్టీ రూప పరమైన వైవిధ్యాన్నీ  విలక్షణతనీ ఎంచుకుంటాయి.  ఉదాహరణకి యిటీవల ఈమాట వెబ్ మాగజైన్ లో పూర్ణిమ తమ్మిరెడ్డి రాసిన ‘ఎడిట్ వార్స్’ కథ చూడండి. అందులో వస్తువు మాత్రమే కాదు అది ప్రతిపాదించిన తాత్వికత కూడా చాలా సమకాలీనమైనది. అది నూటికి నూరు శాతం ఇవాళ్టి కథ. వర్చ్యువల్ రియాలిటీ వికృత రూపం చూపించిన వినూత్న కథ అది. సత్యం ఎంతగా  పెళుసుబారిపోయిందో అందులో అద్భుతంగా ఆవిష్కృతమైంది. Manufacturing and manipulation of truth ని కళ్ళ ముందు నిలబెట్టిన శ్వేత విషాదం (black comedy కి వ్యతిరేకం) ఇది. ఆ కథలో ఆమె  విలువల మధ్య జరిగే ఘర్షణలో రచయితగా తాటస్థ్యాన్ని పాటించడానికి ప్రయత్నించినా తనదైన దృక్పథాన్ని దాచుకోలేకపోవడం గమనిస్తాం. ఎంత జాగరూకత వహించినా రచయిత స్వరం ఎక్కడో వొకచోట బహిర్గతం కాకపోదు. సత్యం వక్రీకరణకి గురౌతున్న క్రమం పట్ల రచయిత్రి  క్రోధం ఆ ఆ కథకు ప్రాణం. ఫాసిస్టు పాలనలో అసత్యం సత్యంగా చెలామణి కావడానికి యెన్ని ఎత్తుగడలు వేయగలదో ఎన్ని అవతారాలు ఎత్తగలదో నిరూపించడానికి ఆమె కనపడీ కనపడని వ్యంగ్యాన్ని ఆశ్రయించారు. ప్రయోగం దృక్పథం రెండూ హాయిగా యెటువంటి పొరపొచ్చాలు లేకుండా సహజీవనం చేయగలవని చెప్పడానికి ఆ కథ మంచి ఉదాహరణ.   వాస్తవికతని ఆశ్రయించడం అంటే కాల్పనికతకి చోటు లేకుండా చేయడం  అని కొందరు భావిస్తారు. వాస్తవికత కాల్పనికత ఈ రెండిటినీ పరస్పరం విరుద్ధమైన ద్వంద్వంగా భావించడం వల్ల వచ్చిన చిక్కు ఇది. కాల్పనికత అంటే సృజనాత్మకతే.

7. ఒక కథ ప్రభావం పాఠకుల మీద శిల్పం వల్ల మిగిలి (గుర్తు ఉండటం) ఉంటుందా? లేక దృక్పథం అందించే  ఎరుక వల్ల మిగిలి ఉంటుందా?

ఒక కథని గుర్తుపెట్టుకోవడానికి శిల్పం దృక్పథం రెండూ అవసరమే అని నేను భావిస్తాను. కేవలం శిల్పం వల్ల కథ  నాలుగు కాలాలు నిలిచి ఉంటుంది అని చెప్పటం కష్టమేమో.  రూప వాదులు దృక్పథాన్ని కావాలనే తిరస్కరిస్తారు. కొందరు దృక్పథానికి  రెండవ స్థానం ఇస్తారు. అలాగే దృక్పథానికి మాత్రమే ప్రాధాన్యం యిచ్చి శిల్పాన్ని నిర్లక్ష్యం చేయడం కూడా తప్పే. మంచి శిల్పం  లేదా ప్రయోజనోద్దిష్ట  ప్రయోగం కథకి అదనపు అందాన్ని  జోడిస్తుంది. ఒక దృక్పథాన్ని ప్రచారం చేయడానికి శిల్పాన్ని కాదనటం  దృక్పథానికి కూడా నష్టం చేస్తుంది.  ప్రజా సాహిత్యాన్ని సృజించేవాళ్ళు ఈ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోవాలి.  నిజానికి వస్తు శిల్ప దృక్పథాలకు పోటీ పెట్టడమే తప్పు. ఆ మూడు కలిసే ఉంటాయి. ఒక విధంగా చూస్తే నిజాన్ని చెప్పటానికి అలంకారాలు అక్కర లేదు. దాచిపెట్టి ముసుగు వేసి మాట్లాడాల్సిన అవసరం లేదు.   సత్యాన్ని మరుగుపరచే శిల్పం వంచనే. కళ్ళు మిరిమిట్లు గొలిపే  శిల్పం సత్యావిష్కరణకి దర్శనానికి ఆటంకమయ్యే ప్రమాదం వుంది.  సత్యం దానికదే కరవాలం అంచులా తలతలలాడుతుంది. మోతాదు మించిన రూపవ్యామోహం కథాంతరంగాన్ని తెలుసుకోడానికి అడ్డువస్తుంది. దృక్పథాన్ని మింగేసే ప్రయోగం నిష్ప్రయోజనం. కొన్నాళ్ళ కింద చింతలపల్లి అనంతు సారంగలో రాసిన ‘సాయేనా’ కథ చూద్దాం. ఆధునిక వెబ్ టెక్నాలజీని వుపయోగించుకుని రాసిన ప్రయోగ పరంగా సరికొత్త కథ అది. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సినిమా టీవీ వాట్సాప్ యూ ట్యూబ్ వంటి అనేక సామాజిక మాధ్యమాలు అర్థోపక్షేపకాల్లా (interludes) కథని నడుపుతాయి. ఆ కథ అంతవరకే గుర్తుంటుంది. అది చెప్పే కథాంశాలు రచయిత దృక్పథం చాలా సమకాలీనమైనప్పటికీ అన్నీ మరపున పడిపోయాయి. కథలో ఆవిష్కారమయ్యే మానవ సంవేదనలతో సహానుభూతి చెందడానికి ప్రయోగం తోడ్పడినప్పుడే  కథ నాలుగు కాలాలు నిలిచి ఉంటుంది.  అందుకు వుదాహహరణగా అనేక రూప ప్రయోగాల్ని స్వీకరిస్తున్న బమ్మిడి కథలు కనిపిస్తాయి. వస్తు రూప దృక్పథాల మేలిమి మేళవింపుగా తెలుగు కథ అధిరోహించాల్సిన శిఖరాలు కొత్త కథకులకు ఛాలెంజ్ గా వున్నాయి.  

8. ఈ ప్రభావం వైపు నుంచి వర్తమాన కథను ఎలా చూడవచ్చు?

కొత్తగా రాయడమే పరమార్థం కాదు. ఈ స్పృహని కొత్త కథకులు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. విలక్షణత సమూహంలో గుర్తింపు నిస్తుంది. నిజమే. కానీ అది వికృతం కాకూడదు. ప్రయోగం చాపల్యం కాకూడదు. దాని అర్థం మూసలో వొదిగి వుండమని కాదు. ఈ అవగాహన కొత్త కథకులకు ఉందనే నేను అనుకుంటున్నాను. ఆధునిక సమాజంలో వస్తున్న మార్పుల్ని  వర్తమాన కథ చూడగలుగుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. వొకప్పుడు కథ సమాజంలోకి చూసినంతగా మనిషి అంతరంగంలోకి చూడలేదని ప్రథ వుండేది. ఇప్పుడు కథ మనిషి లోపలికి  బయటకీ సమంగా చూడగలుగుతుంది.  అయితే మనిషి పరాయీకరణ వెతనీ భిన్న అస్తిత్వాల వేదననీ  పట్టుకున్నంతగా అందుకు మూలాల్ని చూడలేక పోతుందేమో అని అనుమానం కలుగుతుంది. అందుకు కారణం  వ్యక్తుల్ని సమూహం నుంచి వేరు చేసే ప్రణాళికలు, విద్వేష రాజకీయాలు  బలంగా అమలు కావడమే. అందులో భాగంగానే సాహిత్యంలో కెరీరిస్టులు తయారవుతున్నారు. పోటీ పెరిగింది. గుర్తింపు ఆరాటం ఎక్కువైంది. స్వీయాత్మక ధోరణి జీవితంలో పెచ్చు పెరిగింది. అనిబద్ధతకీ స్వేచ్ఛకీ మధ్య గీతలు చెరిగిపోతున్నాయి. దీని ప్రభావం  సాహిత్య సృజనపై పడకుండా జాగ్రత్త పడాలి. వర్తమాన తెలుగు కథ, కథకులు ఈ విషయంలో అప్రమత్తం కావాలని ఆశంస.

One thought on “వ‌ర్త‌మాన క‌థా ప్రయాణం బహుముఖీనం

  1. 👍
    మా సత్యం (31-10-2021)
    బళ్ళారి
    17-10-2021 నాటి
    వ‌సంత‌మేఘం లో తెలుగు క‌థ‌కులు, సాహిత్యం ఒక సంభాష‌ణ.
    సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో సంభాష‌ణ ఒక నూతనత్వాన్ని స్పురింప చేస్తూ పాఠకుల్లో జిజ్ఞాస కలిగిస్తోంది. నిర్వాహకులకు ఉద్యమాభి వందనాలు.
    “వ‌ర్త‌మాన క‌థా ప్రయాణం బహుముఖీనం” లో
    ఎ కె ప్రభాకర్ గారు తాత్వికతతో నిశితంగా, లోతుగా , పరిశీలించి సాహిత్యంలో కొత్త గొంతులను స్వాగతిస్తూనే విస్తృతమైన తెలుగు కథ యొక్క పరిధిని నిజాయితీతో సంభాషించారు. విమర్శనాత్మకమైన
    విశ్లేషణ లో లేవనెత్తిన అంశాలు పాఠకుల దృష్టికి తీసుకొచ్చారు.
    ” నిర్దిష్ట సామాజిక దృక్పథం నిబద్ధత, సాహిత్యంలో కెరీరిస్టులు,అనిబద్ధతకీ
    స్వేచ్ఛకి మధ్య ఉన్న ప్రభావం సాహిత్య సృజన పై పడకుండా కథకులు జాగ్రత్త వహించాలి”అని చెబుతూనే
    “దృక్పథ రాహిత్యం గొప్ప అని భావించే ఆధునికోత్తరవాదులు కొందరు తయారయ్యారు. వాళ్లు కళ కళ కోసమే లాగా కథ కథ కోసమే అని ప్రచారం చేస్తారు.” నిజమే సార్ కళ కవిత్వం ,నాటకం, చిత్రకళ, కథ ఏదైనా భౌతిక పునాది సమాజమే.
    దృక్పథ రాహిత్యంతో కథా రచయితలలో గతితార్కిక చారిత్రక భౌతిక జ్ఞాన సిద్ధాంతం వారి జీవిత దృక్పథానికి దూరంగానే నెట్టారు. అందుకు కారణం అనార్కిజం విధానం లోనే ఆనందం పొందుతారు.
    కథ కథ కొరకే అని పరితపించే అలాంటి వారికి మేల్కొలుపుగా ఇలాంటి కథకుల జీవన గమనానికి సంబంధించి..
    నాకు ఈ సందర్భంలో కవిత్వం పై ఎర్ర జెండా కవితా సంకలనం లో నటరాజ్ రాసిన ” కధన బేరి నినాదం”
    లోని కవిత వాక్యాలు గుర్తుకొస్తున్నాయి.
    ” జీవితమే ఒక యుద్ధం మైనపుడు, జీవన పథాన్ని
    యుద్ధమే నిర్దేశిస్తుంది” అంటాడు. ప్రాచీన కాలం నుంచి కూడా విశ్వ శ్రేయస్సే కావ్యం అన్నారు. (వాల్మీకి/ వ్యాస మహర్షిలు రామాయణ మహాభారత రచనలు పురాణ ఇతిహాసాలు అయినప్పటికీ కూడా కళ కోసమే కళగా వారు రచించలేదు ఒక సామాజిక రాజకీయ దృక్పదం అంతర్లీనంగా వ్యక్తమవుతోంది.)
    విశ్వశ్రేయస్సునే కోరాయి.
    ముగింపుగా
    ‘ కవిత్వం పై ఎర్ర జెండా’ కవితా సంకలనం లో పినాకపాణి 1993 లో రాసిన కవిత
    ” రక్తసిక్తమైన దారుల గుండా….” కవితా చరణాలు గుర్తుచేసుకుంటూ
    ” ఇప్పుడు మనతో నడిచేవాడే మనవాడు
    దృశ్యాన్ని చూచేదాకా
    ఇరుకు దారులను
    చీల్చుకుంటూ
    పతాకావిష్కరణ కు సిద్ధం కావాలసిందే!”. ముందుకు మునుముందుకు వెళ్దాం.
    ఎ కె ప్రభాకర్ గారికి అభినందనలు.

Leave a Reply