దళిత బహుజన విద్యార్ధుల పై ఉన్నత విద్యా సంస్థలలో అమలు జరుగుతున్న కుల వివక్షను నిర్మూలించి సమానత్వ భావనలు నెలకొల్పడానికి బహుజనులు, ప్రజాస్వామికవాదులు చేసిన నిరంతర పోరాటాల ఫలితంగా దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ విద్యా కమిటీ చేసిన సిఫార్సులను ఆధారం చేసుకుని ఇంతకు ముందు యూజిసి వివక్ష పరిధిలో ఉన్న ఎస్సి,ఎస్టీలతో పాటు ఓబిసిలను కూడా ఈ సిఫార్సుల పరిధిలోకి చేర్చారు.ఒకప్పుడు దళిత బహుజనులకు విద్య నిషేదించిన మనువాద అగ్రవర్ణాలు నేడు రాజ్యాంగం ప్రకారం లభించిన రిజర్వేషన్ల ద్వారా ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్ధుల పట్ల అగ్రవర్ణాల విద్యార్ధులు,అధ్యాపకులు చూపుతున్న వివక్ష,వేదింపులు,దాడులు నిరంతరం జరుగుతూ,ఏటేటా పెరుగుతున్నాయి.వేలాది యువ జీవితాలు సర్వ నాశనమవుతున్నాయి.వీటికి ప్రతిఘటనగా బహుజన సమాజం ఆందోళనలు,వత్తిడి ఫలితంగా 2012 లో యూపిఏ ప్రభుత్వం మొదటి సారి ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా యూజిసి నియమ నిబంధనలు రూపొందించింది.ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.వీటిని మనువాద అగ్రకుల వైస్ చాన్సలర్ లు,ఇతర యాజమాన్యాల చేతిలో ఉన్న ఏ ఒక్క యూనివర్సిటీ,విద్యా సంస్థ అమలు చేయలేదు.2014 లో ఆర్ ఎస్ ఎస్ – బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనువాదులు మరింత రెచ్చిపోయారు.మొత్తం విద్యా వ్యవస్థను తమ హిందూత్వ భావజాలానికి అనుగుణంగా మార్చుకునే వ్యూహంలో భాగంగా దళిత బహుజన విద్యార్ధులను విద్యకు దూరం చేసే దాడులు తీవ్రమైయ్యాయి.ప్యాకల్టీలో, అడ్మినిస్ట్రేషన్ లో తిష్టవేసిన అగ్రకులాల లెక్చరర్లు,ప్రొఫెసర్లు, అధికారులు అణగారిన కులాలకు చెందిన విద్యార్ధులను బహిరంగంగానే దారుణమైన
వివక్షకు,అణచివేతకు పాల్పడి ఎందరో ఉత్తమ విద్యార్ధిని, విద్యార్ధుల కేరీర్ లను నాశనం చేయడమే గాక వారి ప్రాణాలను కూడా బలిగొన్నారు.ఆర్ ఎస్ ఎస్ – బిజెపి ఫాసిస్టు శక్తులు ఒక వ్యూహం ప్రకారం అందిస్తున్న సహకారం , ప్రోత్సాహం వల్ల అనేక యూనివర్సిటీలు అగ్రకులాలకు అగ్రహారాలుగా దళిత బహుజన కులాలకు వెలివాడలుగా మారిపోయాయి.ఈ పరిణామాలపై ఏ ఒక్క చర్యా తీసుకోని యూజిసి 2012 నుంచి ప్రతి సంవత్సరానికి రెండు సార్లు నియమనిబంధనలు పాటించమని పదిసార్లు సర్క్యులర్ లు జారీ చేసి చేతులు దులుపుకుంది.ప్రభుత్వం వివక్షను ఆపడానికి ఏలాంటి అధికారాలు,వ్యవస్థ గానీ రూపొందించకుండా పరిస్థితి మరింత దిగజారడానికే దోహదపడింది.యూజిసి సర్వే ప్రకారం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల కాలంలో విద్యా సంస్థల్లో కుల వివక్షత 118.4 శాతానికి పెరిగిపోయింంది.1160 కు పైగా కేసులు నమోదయ్యాయి.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అమరుడు రోహిత్ వేముల (దళిత)17 జనవరి 2016 లో ఈ వివక్షకే బలయ్యాడు.ఇదే విధంగా 22 మే 2019 లో మెడికల్ విద్యార్థిని డా.పాయల్ తాడ్వి (ఆదివాసీ)కూడా ఇదే విధంగా ప్రాణాలు కోల్పోయింది.రోహిత్ తల్లి రాధిక, తాడ్వి తల్లి ఇరువురు కలిసి ఈ రకమైన హత్యల నివారణ కై నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలని సుఫ్రీంకోర్టులో 2019 లో పిటిషన్ వేశారు.ఐదు సంవత్సరాలు సాగిన ఈ కేసు విచారణ సందర్భంగా,దానిలో భాగంగా చివరికి 2025 లో సుఫ్రీం కోర్టు యూజిసి నిర్లక్ష్యం పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసి సరికొత్త నియమ నిబంధనలతో కూడిన కఠినంగా అమలు చేయగల వ్యవస్థలతో కూడిన కుల వివక్ష వ్యతిరేక నియమాలను రూపొందించమని ఆరు వారాల గడువు ఇచ్చింది.ఇందులో భాగంగా పుట్టినవే ఇప్పటి యూజిసి నియమాలు.ఈ నిబంధనలు విడుదలైన తరువాత అగ్రకులాల విద్యార్ధులందరూ నేరస్థులని ఈ నిబంధనలు చెబుతున్నాయని అసత్య వాఖ్యానం చేస్తూ యూపిలోని బరేలి నగర మెజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి తన పదవికి రాజీనామా చేశాడు.శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ” వివక్ష అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించలేదు.అది మాటల ద్వారానా లేదా ఒకరి ఆలోచనల ద్వారానా ? అనేది స్పష్టంగా చెప్పాలి.చట్టాన్ని అమలు చేసే ప్రక్రియ స్పష్టంగా,కచ్చితమైనదిగా,అందరికీ సమానంగా ఉండాలి.క్యాంపస్ లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించే బదులు,యూజిసి ఈ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలి లేదా అవసరమైన సవరణలు చేయాలని కోరుతున్నాను” అని కుతర్కానికి దిగింది.యూజిసి ప్రకారం వివక్ష పై ఫిర్యాదు, విచారణ, శిక్షలకు ఒక నిర్ధిష్టమైన వ్యవస్థ తొలిసారి ఏర్పడింది.అందుకే ఇంతకాలం యూనివర్సిటీలలో అణగారిన కులాల వారిని వేదించి చంపుకుతింటున్న అగ్రకులాల విద్యార్ధులు,అధ్యాపకులకు స్వర్గ లోకం నరకలోకంగా మారిపోయినట్లు అయిపోయింది. ‌.తమ ఏక చత్రాధిపత్యానికి,అరాచకత్వానికి బ్రేక్ పడుతుందనే కడుపుమంటతో ఆగ్రహాంతో వీధుల్లోకి దిగినరు.భూమ్యాకాశాలు బద్ధలైనట్లు వీరంగం చేస్తున్నరు.వీరితో పాటు యూపి, బీహార్, డిల్లీ, రాజస్థాన్ మొదలగు ప్రాంతాల్లో అర్ ఎస్ ఎస్ – బిజెపి ఆధ్వర్యంలోని అగ్రకులాలు యూజిసి నియమాలను రద్దు చేయాలని రోడ్ల మీదకు వచ్చి విధ్వంసానికి,హెచ్చరికలకు పాల్పడుతున్నరు.తాము ఎన్నో అరాచకాలు, అబద్ధాలు ఆడి, విధ్వంసాన్ని సృష్టించి ఏర్పాటు చేసుకున్న తమ స్వంత ఫాసిస్టు ప్రభుత్వమే తమకు అన్యాయం చేసిందని జంధ్యాలను ప్రదర్శిస్తూ శాపనార్ధాలు పెడుతున్నారు.తమ కళల రాజు మోదీని కులం పేరు పెట్టి ‘తెల్లి ‘ ని నమ్మరాదని పేరు పెట్టి దూషిస్తున్నరు.మోదీ దిష్టి బొమ్మను తగులబెట్టి చెప్పులతో కొడుతున్నరు.ఫాసిస్టు అగ్రకుల మూకలు చేస్తున్న ఈ హడావిడికి తోడుగా నిలిచిన సుఫ్రీం కోర్టు ఈ నిబంధనల పై స్టే విధించింది.ఆర్ఎస్ఎస్-బిజెపి పాలిత ఉత్తర భారత ఫాసిస్టు సవర్ణ అగ్రకులాలకు ఆగ్రహం తెప్పించి, ఉద్యమాలకు పూనుకునేంతగా ఈ నోటిఫికేషన్లలో ఏముంది? వీరి వాదన ప్రకారం అగ్రకులాలకు ద్రోహం జరుగనుందా? యూజిసి చెబుతున్నట్లు కుల వివక్షతను అరికట్టి క్యాంపస్ లో సమానతా వాతావరణాన్ని సాధించగలరా? యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వ ప్రోత్సాహక) నిబంధనలు-2026. ఎస్సీ, ఎస్టీ, సామాజికంగా ,విద్యాపరంగా వెనుకబడిన తరగతులు-ఓబిసి, ఆర్ధికంగా బలహీన తరగతులు-ఇడబ్ల్యుసి,వికలాంగుల యొక్క మతం, జాతి, లింగం,బాష,పుట్టిన స్థలం, కులం,వైకల్యత ప్రాతిపదికన జరిగే వివక్షతను అరికట్టాలని నిబంధనలు రూపొందించింది.అందుకోసం సమానత్వ కమిటీలు,సమానం అవకాశాల కేంద్రాలు, సమానత్వ దళాలు, హెల్ప్ లైన్లు వంటి వ్యవస్థను ప్రతిపాదించింది.ముఖ్యంగా కుల ఆధారిత వివక్షతను నిర్వచించేటప్పుడు అది ఎస్సీ,ఎస్టీ,ఓబిసిలకు మాత్రమే వర్తిస్తుందని 3 (సి) లో స్పష్టంగా పేర్కొనడాన్నీ వివాదం చేస్తున్నారు.వివక్షత అంటే ఏమిటి అని 3 (ఇ) లో నిర్ధిష్టమైన వివరణ ఇచ్చింది.వివక్షత నిర్మూలించడానికి ఈక్విటీ మరియు వివిధ కమిటీలలో పది మంది సభ్యులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేసేటప్పుడు దీని చైర్మన్ గా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉంటాడు. సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుడు , నాన్ టీచింగ్ మెంబరు , ఇద్దరు సివిల్ సొసైటీ సభ్యులు, ఎస్ సి, ఎస్ టి, ఒబిసి, మహిళ, వికలాంగుల, ప్రతినిధులు ఉంటారు.ఈ కమిటీలు నిరంతరం వివక్షతను నిర్మూలించి,సమానత్వాన్ని ప్రోత్సహించే పనిలో ఉంటాయి.బాధితుల ఫిర్యాదుపై నిర్ధిష్ట చర్య తీసుకోవడానికి 24 గంటలలోపు సమావేశమౌతుంది.సీరియస్ కేసులను 15 రోజులలో పరిశోధించి యూజిసికి రిపోర్టు ఇస్తుంది.వారం రోజులలో చర్యలు కూడా చేపడుతుంది.ఈ కమిటీ సంవత్సరానికి రెండు సార్లు సమావేశమౌతుంది.ఫిర్యాదుల పరిష్కారం, వివక్షను అడ్డుకునే మెజర్స్,అవేర్నేస్ ప్రచారం చేపడుతుంది.ఈ విధంగా చేయకుండా ఉల్లంఘనలు జరిగిన పక్షంలో ఆ యూనివర్సిటీకి,విద్యా సంస్థకు యూజిసి ఫండ్ ఆపేస్తుంది.గుర్తింపును రద్దు చేస్తుంది.ప్రోగ్రామ్స్ ను సస్పెండ్ చేస్తుంది. కౌన్సెలింగ్ ను ఇస్తుంది. విద్యార్థులకు కావలసిన తగు సహాయ సహకారాలు అందిస్తుంది. ఈక్విటీ స్కాడ్స్, అంబాసిడర్ లను ఏర్పాటు చేస్తుంది.అంతేగానీ అరెస్టు చేసి అక్రమ కేసులు మోపి జీవితాంతం జైల్లో నిర్భంధించదు.ఉరిశిక్షలు వేసి అమలు జరుపదు.ఇంత సున్నితమైన ఇలాంటి ప్రతిపాదనలకు వ్యతిరేకంగా సవర్ణ అగ్రకులాలు రెచ్చిపోయి నిరసనలకు, దూషణలకు దిగారు.దళితులు, ఆదివాసీలు,ఒబిసిలకు, ఇతరులకు న్యాయం జరుగుతుంది కానీ మాకు ఏమైనా జరిగితే ఏమిటి అని నేరస్తుల తరపున ప్రశ్నిస్తున్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన సమానత్వ సూత్రాలను వికృతీకరించ మాట్లాడటం, ఆందోళన చేయడం మొదలు పెట్టారు.కులాధారిత వివక్ష జాబితా నిర్వచనంలోనూ,విచారణ కమిటీలోనూ మాకూ స్థానముండాలని అనగా నేరస్థుడే బాధితుడిగా, న్యాయమూర్తిగా ఉండాలనే విచిత్ర,వితండవాదానికి, హింసాత్మక చర్యలకు దిగుతున్నారు.కులాధారిత వివక్షకు వ్యతిరేకంగా నిర్ధిష్ట చర్యలు తీసుకోవాలనే స్పిరిట్ నే దెబ్బతీస్తున్నారు.సవర్ణులకు దళిత బహుజనుల పై వివక్షతకు,అంటరానితనానికి పాల్పడే హక్కును నిలుపుకోవాలని వాదిస్తున్నారు.బ్రాహ్మణ,బనియా, రాజపుత్ర వర్ణాలు “సవర్ణ సమాజ్ కోఆర్డినేషన్ కమిటీ” ని,”చాత్ర పంచాయతీ” అనే విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఆందోళనలు సాగిస్తున్నారు. బిజెపి నాయకుల బెదిరింపులు, రాజీనామాల మధ్య వినీత్ జిందాల్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చేపట్టిన సుఫ్రీంకోర్టు 19 జనవరిన యూజిసీ నిబంధనల పై అప్రజాస్వామికంగా స్టే విధించి నిరంకుశంగా వ్యవహరించింది.మార్చి 23 న వాదనలు వింటామని దింపుడు కళ్ళం ఆశ చూపింది. ఆ రకంగా బహుజన సమాజపు కులాధారిత వివక్షత వ్యతిరేక చెల్లదని,యూజిసి ప్రతిపాదిత నిబంధనలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.పిడికెడు మంది సవర్ణులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్ ఎస్ ఎస్,మోదీ – షాల ధ్వయం ఈ నిబంధనల ద్వారా ఏ ప్రయోజనాన్ని ఆశించి తీసుకొచ్చారో భారత బహుజన సమాజం అర్థం చేసుకోవాల్సి ఉంది.కుల అస్థిత్వాన్ని కప్పిపుచ్చి,హిందువులం బంధువులం,గంగ సింధు బింధువులం,హిందువులంతా ఒక్కటేనని వాస్తవ విరుద్ధమైన తప్పుడు నినాదాలిస్తూ,అదే సమయంలో అగ్రవర్ణ/అగ్రకులతత్వమే జాతీయవాదంగా,బహు జాతులను వ్యతిరేకించడమే నిజమైన దేశ భక్తిగా చెలామణీ చేస్తున్నారు.దళితులు, ఆదివాసీలు,అణగారిన కులాల్లో అగ్రకులతత్వాన్ని,కుహనా దేశభక్తిని, కుహనా జాతీయ వాదాన్ని రెచ్చగొట్టి మెజారిటీ సాధించి తమ ఫాసిస్టు పాలనాధిపత్యాన్ని నిలుపుకోజూస్తున్న వీరికి కులపీడితుల్లో జనాభా రీత్యా అత్యధికులైన వెనుకబడిన కులాలను నిలబెట్టుకోకపోతే వారి మెజారిటీవాద రాజకీయాలకు మనుగడ ఉండదు.దేశంలో నానాటికీ తీవ్రరూపం తీసుకుంటున్న సామాజిక, ఆర్థిక,రాజకీయ,సాంస్కృతిక సంక్షోభంంతో పాటు ఈ సంవత్సరం ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికలు సమీపిస్తున్నాయి.అందుకోసమే సవర్ఢ అగ్రకులాల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా బిసిలను తమ వైపుకు తిప్పుకొనే ఎత్తుగడల్లో భాగంగా ఈ కులాధారిత వివక్ష వ్యతిరేక నిబంధనలు తీసుకొచ్చారు.ఆర్ ఎస్ ఎస్ – బిజెపిలకు కులాల సమానత్వ నినాదం రాజకీయమైతే, కులాల అసమానత్వం జీవనాడి వంటిది.అందుకని వెనుకబడిన కులాల ప్రజలు దళిత,ఆదివాసీ ప్రజలతో, ప్రజాస్వామికవాదులతో ఐక్యం కావాలి.హిందూత్వ ఫాసిస్టు కార్పోరేట్ రాజ్యం నెలకొల్పడానికి వీరు వెస్తున్న ఎత్తుగడలను అర్ధం చేసుకోవాలి. యూజిసి కొత్త నిబంధనల రద్దుకోసం కుట్రలు చేస్తున్న సవర్ణ అగ్రకుల దురహంకారానికి వ్యతిరేకంగానూ మరియు సుఫ్రీంకోర్టు విధించిన స్టేను తక్షణమే ఎత్తివేయాలని బహుజనులు, ప్రజాస్వామికవాదులు పోరాడాలి.

ఆనంద్.
తేదీ. 2-2-2026.

Leave a Reply