ఎప్స్టీన్ ఫైల్స్… సంచలనం కాదు.. వ్యవస్థల శవపరీక్ష!” జెఫ్రీ ఎప్స్టీన్… ఇది కేవలం ఒక నేరగాడి పేరు కాదు, చట్టాన్ని చుట్టచుట్టి జేబులో పెట్టుకున్న ఒక వికృత వ్యవస్థకు చిహ్నం. ఫిబ్రవరి 2026 నాటికి వెలుగులోకి వచ్చిన 6 మిలియన్ల పేజీల పత్రాలు, మనం గొప్పగా చెప్పుకునే ‘నాగరిక లోకం’ ముసుగును చీల్చి పారేస్తున్నాయి. ఇవి కేవలం అరాచకాల జాబితా కాదు. అధికారం ఉంటే అమానుషత్వాన్ని కూడా అలంకారంగా మార్చుకోవచ్చని నమ్మే ‘ఎలైట్’ వర్గాల అంతర్గత డైరీ. ధనం ముందు న్యాయదేవత కళ్లు గంతలు కట్టుకున్న వైనానికి, పెట్టుబడిదారీ సమాజం సృష్టించిన ఈ ‘మృగ సామ్రాజ్యం’ ఒక నిలువెత్తు సాక్ష్యం. ఇది గతం గురించి చెబుతున్న కథ కాదు.. మన భవిష్యత్తుకు ఇస్తున్న భయంకరమైన హెచ్చరిక!
చీకటి సామ్రాజ్యపు క్రూరత్వం:
ఈ ముసుగు వెనుక జరిగిన హింస కేవలం లైంగిక వేధింపులకే పరిమితం కాలేదు. అది శారీరక చిత్రహింసల (Extreme Violence) పర్వం. వెలుగులోకి వచ్చిన ఫోటోలు, వీడియోలు చూస్తుంటే.. నాగరికత ముసుగులో ఎంతటి అడవి మృగాలు దాగి ఉన్నాయో అర్థమవుతుంది. రష్యన్ బ్యాలెరినా ఓల్గా వంటి వారి అదృశ్యం, విచారణలో దొరికిన అస్థిపంజరాల ఛాయాచిత్రాలు ఈ నెట్వర్క్ ఎంతటి క్రూరమైనదో, ఎంతటి అమానుషమైనదో చాటిచెబుతున్నాయి. సాక్ష్యాలను మాయం చేయడం, అడ్డువచ్చిన వారిని అంతం చేయడం ఈ వ్యవస్థకు వెన్నతో పెట్టిన విద్య. ఈ భయానక వాస్తవాలు మనకు ఇస్తున్న హెచ్చరిక ఒక్కటే—అధికారం, అపరిమితమైన సంపద జవాబుదారీతనం లేని చోట అమానుషత్వానికి అడ్డదారిగా మారుతాయి. మన మౌనం ఈ మృగాలకు మరో బాధితురాలిని ఎరగా వేయడమే అవుతుంది.
పిరమిడ్ తరహాలో పసిమొగ్గల వేట:
ఎప్స్టీన్ కేవలం ఒక నేరగాడు మాత్రమే కాదు, అమాయకత్వాన్ని దోచుకోవడానికి ఒక క్రూరమైన ‘బిజినెస్ మోడల్’ను రూపొందించిన మృగం. నిరుపేద కుటుంబాలకు చెందిన మైనర్ బాలికల నిస్సహాయతను గుర్తించి, వారికి పెద్దమొత్తంలో డబ్బు ఎరవేసి తన వికృత సామ్రాజ్యానికి హంటింగ్ గ్రౌండ్‌గా మార్చుకున్నాడు. అంతటితో ఆగక, ఆ బాలికలనే పావులుగా వాడుకుంటూ, మరికొంతమంది మైనర్లను తన వద్దకు తీసుకువచ్చేలా ఒక అమానుషమైన ‘పిరమిడ్ పద్ధతి’కి తెరతీశాడు. స్నేహం పేరుతో, డబ్బు ఆశ చూపి ఒక పసిబిడ్డ ద్వారా మరో పసిబిడ్డను ఈ నరకకూపంలోకి లాగడం నాగరిక సమాజం ఊహించలేనంతటి వికృత పరిణామం. ఒక అబద్ధం వెనుక మరో అబద్ధాన్ని అల్లి, వ్యవస్థల కళ్లు గప్పి చేసిన ఈ వికృత వేటలో వేలాది జీవితాలు చిధ్రమైపోయాయి.
ఎప్స్టీన్ తన ప్రైవేట్ దీవిని, విలాసవంతమైన భవనాలను కేవలం భోగ విలాసాల కేంద్రాలుగా కాదు, అమాయకత్వాన్ని బలితీసుకునే కబేళాలుగా మార్చేశాడు. తొమ్మిదేళ్ల పసిబిడ్డ నుంచి నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వరకు.. ప్రతి ఒక్కరినీ ఈ ‘ఎలైట్’ మృగాలు కేవలం అనుభవించే “వస్తువులుగా”, ప్రాణం లేని “ఫర్నిచర్” లాగా పరిగణించడం మానవ నాగరికతకే ఒక మాయని మచ్చ. సభ్య సమాజం తలదించుకునే అత్యంత ఘోర విషాదం. మానవత్వంపై చెరిగని గాయంలా మిగిలిన దారుణం.
న్యాయం ఎవరి కోసం?:
విచారణ సంస్థలైన ఎఫ్.బి.ఐ, న్యాయశాఖ తీరు చూస్తుంటే, చట్టం కేవలం సామాన్యుడిని అణచివేసే ఆయుధంగానే కనిపిస్తోంది. శక్తివంతుల పేర్లను ‘రెడాక్ట్’ (మరుగున పరచడం) పేరుతో తొలగించి, బాధితుల వేదనను నడిరోడ్డుపై పడేయడం వ్యవస్థల నైతిక పతనానికి పరాకాష్ట. డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్ వంటి అగ్రరాజ్య నేతల పేర్లు వందల సార్లు వినిపించినా, విచారణ సంస్థలు వారిని తాకడానికి కూడా భయపడుతున్నాయంటే అవి పాలకుల ‘జేబు సంస్థలుగా’ మారిపోయాయని అర్థమవుతోంది. 2008లోనే నేరగాడని తేలినా, మరో దశాబ్దం పాటు ఎప్స్టీన్ యథేచ్ఛగా అరాచకాలు కొనసాగించగలిగాడంటే, అది వ్యవస్థల మందకొడితనం కాదు.. అతనికి అధికార కేంద్రాల నుంచి అందిన అపవిత్ర రక్షణ కవచం. ఇది న్యాయంపై సామాన్యుడికి ఉన్న చివరి నమ్మకాన్ని కూడా బలితీసుకుంటోంది.
‘గేట్స్’ పర్యటన – ఆతిథ్యమా? ఆందోళనకరామా?:
అంతర్జాతీయంగా ఎప్స్టీన్ ఫైల్స్ చిచ్చు రేపుతున్న వేళ, ఫిబ్రవరి 2026లో బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన దేశీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ‘రెడ్ కార్పెట్’ పరిచి ఘనస్వాగతం పలకడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2008లో మైనర్ల అక్రమ రవాణా కేసులో ఎప్స్టీన్ దోషిగా తేలిన తర్వాత కూడా, 2011 నుంచి గేట్స్ అతనితో పదేపదే సమావేశమవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎప్స్టీన్ ఫైల్స్ రాసిన ఈమెయిల్స్‌లో గేట్స్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వికృత కోణాలు, అక్రమ సంబంధాలు, చివరకు తన భార్య మెలిండాకు తెలియకుండా యాంటీబయోటిక్స్ ఇవ్వాలనే ప్రస్తావనలు ఉండటం జుగుప్స కలిగిస్తోంది. “భారతదేశాన్ని ఒక ప్రయోగశాలగా (Laboratory), భారతీయులను గినియా పిగ్స్‌లా గేట్స్ భావిస్తున్నారు” అంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు సామాన్యులను ఆలోచింపజేస్తున్నాయి.
అధికారం ముందు తలవంచిన నైతికత…మన బిడ్డల భద్రత ఎవరి బాధ్యత?:
ఎప్స్టీన్ ఫైల్స్‌లో గేట్స్ పేరు, అతనితో ఉన్న అపవిత్ర బంధం వెలుగులోకి వచ్చిన తరుణంలో.. మన ప్రభుత్వాలు అవేవీ పట్టనట్టుగా అతనికి ‘రాజ మర్యాదలు’ చేయడం వ్యవస్థల నైతిక పతనానికి నిదర్శనం. గేట్స్ ఫౌండేషన్ బాలికల సాధికారత కోసం పనిచేస్తున్నామని చెబుతున్నా, దాని అధిపతే ఒక పిల్లల వేటగాడితో (Child Molester) స్నేహం చేయడంపై సభ్య సమాజం మండిపడుతోంది. “సొంత భార్యే అసహ్యించుకుని విడాకులు ఇచ్చేంతటి మురికి సంబంధాలు ఉన్న వ్యక్తికి, మన పాలకులు పెద్దపీట వేయడం మన బిడ్డల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడమే” అని మేధావులు హెచ్చరిస్తున్నారు. కేవలం టెక్నాలజీ, పెట్టుబడుల పేరుతో ఇలాంటి ‘వివాదాస్పద ఎలైట్ వర్గాలను’ ప్రోత్సహించడం అంటే.. మన నైతిక విలువలపై రాజీ పడటమే. అధికార కేంద్రాల్లోకి ఇలాంటి వ్యక్తుల చొరబాటును నిరోధించకపోతే, రేపు న్యాయం కేవలం ధనవంతుల జేబులో బందీగా మారుతుంది.
డబ్బు మూటల కంటే బిడ్డల భవిష్యత్తే ముఖ్యం! పాపపు చరిత్ర ఉన్నవారికి ‘రాజమర్యాదలు’ చేయడం మన నైతిక పతనానికి నిదర్శనం. ప్రశ్నించే సమాజమే—నేరగాళ్లకు సింహస్వప్నం!”
నిఘా నీడలో నీచ క్రీడ.. ఎప్స్టీన్ వెనుక మొసాద్ ‘హనీ ట్రాప్’ కుట్ర?:
ఫిబ్రవరి 2026 నాటి ఎఫ్‌బీఐ నివేదికలు ఒక భయంకరమైన కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. జెఫ్రీ ఎప్స్టీన్ కేవలం ఒక నేరగాడు మాత్రమే కాదు, అతను ఇజ్రాయిల్ నిఘా సంస్థ ‘మొసాద్’ కోసం పనిచేసిన ఒక శిక్షణ పొందిన గూఢచారి అనే ఆరోపణలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కోట్లాది డాలర్ల విలువైన ఆ విలాసవంతమైన దీవి, ప్రైవేట్ జెట్లు ఒక సామాన్యుడికి ఎలా సాధ్యం? అనే ప్రశ్నకు సమాధానం—అది ఒక దేశం పన్నిన వ్యూహం కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికన్ సెలబ్రిటీలు, రాజకీయ ఉద్దండులు ఆ దీవిలో చేసిన వికృత చేష్టలను రికార్డ్ చేసి, వారిని బ్లాక్మెయిల్ చేయడం ద్వారా అగ్రరాజ్యాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ఇజ్రాయిల్ ఈ ‘హనీ ట్రాప్’ వేదికను వాడిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇజ్రాయిల్ సైనిక సంస్థలకు ఎప్స్టీన్ నిధులు సమకూర్చడం, మాజీ ప్రధాని ఎహుద్ బారక్ వంటి వారితో సన్నిహిత సంబంధాలు నెరపడం ఈ అనుమానాలను నిజం చేస్తున్నాయి.
యూరోప్‌ను కుదిపేస్తున్న ‘సిగ్గుచేటు’ ఫైల్స్:
ఎప్స్టీన్ ఫైల్స్ కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. అవి యూరప్ ఖండాన్ని, ముఖ్యంగా నార్వే వంటి శాంతియుత దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇవి కేవలం నేరాలు కావు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఒక అంతర్జాతీయ నేర సామ్రాజ్యపు కుట్రలని (Crimes against Humanity) నిపుణులు అభివర్ణిస్తున్నారు. నార్వే మాజీ ప్రధాని థోర్బ్జోర్న్ జగ్ల్యాండ్, నోబెల్ కమిటీ మాజీ అధిపతి వంటి ఉన్నత వ్యక్తులు ఎప్స్టీన్ నేరస్థుడని తెలిసినా అతనితో సాన్నిహిత్యం నెరపడంపై ‘తీవ్ర అవినీతి’ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా, నార్వే రాజకుటుంబానికి చెందిన క్రౌన్ ప్రిన్సెస్ మెట్టె-మారిట్ అమానుష నేరగాడైన ఎప్స్టీన్
తో స్నేహం చేయడం ఆ దేశ గౌరవాన్ని మంటగలిపింది. రాజవంశంపై ప్రజలకున్న అపారమైన నమ్మకాన్ని ఈ ఫైల్స్ బద్ధలు కొట్టాయి. ఓస్లో ఒప్పందాల వెనుక ఉన్న కీలక దౌత్యవేత్తలకు ఎప్స్టీన్ తన వీలునామాలో 10 మిలియన్ డాలర్లు వదిలివెళ్లడం చూస్తుంటే, అధికారం వెనుక ఉన్న ‘చీకటి లావాదేవీల’ లోతు అర్థమవుతోంది.
అంతర్జాతీయ విస్తరణ, అగ్రనేతల అసలు ముఖచిత్రం!:
ఒక వైపు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) చీఫ్ బోర్గే బ్రెండే వంటి ప్రపంచ ఆర్థిక వేత్తలు, మరోవైపు దుబాయ్ లాజిస్టిక్స్ దిగ్గజం అహ్మద్ బిన్ సులయెం వంటి కుబేరులు ఎప్స్టీన్ వలలో చిక్కుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. “ఎప్స్టీన్ శక్తివంతులైన వ్యక్తులను ఒక సేకరణలా (Frequent flyer points) పోగుచేసుకున్నాడు” అన్న విశ్లేషకుల మాటలు అక్షర సత్యం. ఈ ప్రభావం భారతదేశాన్ని కూడా తాకింది; 2017 ప్రధానమంత్రి మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఎప్స్టీన్ జోక్యం ఉందన్న ఆరోపణలు దేశంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పారదర్శకత లేని అధికార కేంద్రాలు, నైతికత లేని రాజకీయ సంకల్పం కలిసి అభాగ్యులైన బాలికల జీవితాలతో ఎంతటి క్రూరమైన వ్యాపారం చేశాయో చెప్పడానికి ఈ పాపపు పద్దులే నిదర్శనం. ప్రతిష్టాత్మకమైన పదవుల్లో ఉండి అమానుష నేరగాళ్లతో విందులు చేసిన ఈ ‘ఎలైట్’ వర్గాల నైతిక పతనం, రేపు ప్రపంచ వ్యవస్థల భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తోంది.
దేశ భద్రతకే ముప్పు!
ప్రపంచాన్ని శాసించే దేశాధినేతలు, మేధావులు ఒక గూఢచారి పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకోవడం నైతిక పతనానికే కాదు, ప్రజాస్వామ్య మనుగడకే గొడ్డలిపెట్టు. ఒక విదేశీ నిఘా సంస్థ కోసం మన సొంత నేతలు అమాయక బాలికల జీవితాలను బలిపీఠం ఎక్కించారనే వాస్తవం గుండెను కోసేస్తోంది. ఎప్స్టీన్ ద్వారా ఇజ్రాయిల్ తన అంతర్జాతీయ ప్రయోజనాల కోసం రష్యా వంటి దేశాలతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకోవడం, మన నాయకుల ‘గుట్టు’ను ఆయుధంగా మార్చుకోవడం చూస్తుంటే.. అధికారం ఎంతటి నీచానికైనా ఒడిగడుతుందని అర్థమవుతోంది. ఇది కేవలం వ్యభిచార కూపం కాదు, వ్యవస్థలను కూల్చేసే ఒక భయంకరమైన రాజకీయ కుట్ర. ఈ నిజాన్ని గుర్తించి మనం మేల్కొనకపోతే, దేశ భవిష్యత్తు అజ్ఞాత శక్తుల చేతుల్లో బందీగా మారిపోతుంది.
రాజకీయ సంకల్పం మారకపోతే.. మన బిడ్డల భవిష్యత్తు శూన్యం!
ఎప్స్టీన్ ఫైల్స్ కేవలం గతంలో జరిగిన నేరాల రికార్డులు కావు, అవి మన భవిష్యత్తుకు ఇస్తున్న మరణ శాసనాలు. డబ్బుతో న్యాయాన్ని, వ్యవస్థలను, చివరకు మనుషులను కూడా కొనవచ్చనే ‘పెట్టుబడిదారీ కుళ్లు’ ఉన్నంత కాలం.. పేదరికం నిరంతరం దోపిడీకి గురవుతూనే ఉంటుంది. కేవలం కొత్త చట్టాలు తీసుకురావడం వల్ల మార్పు రాదు. విచారణ సంస్థలు రాజకీయ రంగును వదిలేసి, స్వతంత్రంగా పనిచేసే ‘రాజకీయ సంకల్పం’ పుట్టినప్పుడే ఇలాంటి మృగాల సామ్రాజ్యాలు కూలిపోతాయి. మీడియా కూడా టీఆర్పీల వేటను ఆపి, పాలకుల తప్పులను నిలదీసే సాహసం చేయాలి. లేదంటే, ఈ వ్యవస్థాగత వైఫల్యం రేపు మన బిడ్డల ప్రాణాలను మరో మృగం నోటికి అందించే ప్రమాదం ఉంది. మేల్కోవాల్సింది ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రశ్నించడం మర్చిపోయిన ఈ సమాజం కూడా!
పోరాటం వ్యక్తులపై కాదు.. వ్యవస్థపై!
ఎప్స్టీన్ చనిపోయి ఉండవచ్చు, కానీ అతడిని కాపాడిన ఆ ‘అపవిత్ర వ్యవస్థ’ ఇంకా ఊపిరి పోసుకునే ఉంది. ఎలైట్ వర్గాలకు ఒక చట్టం, సామాన్యుడికి మరో చట్టం ఉన్నంత కాలం మానవత్వానికి రక్షణ లేదు. మూసివేసిన తలుపులు ఎప్పటికీ మూసి ఉండవు. నిజం ఎంత ఆలస్యంగా వచ్చినా దానికి తలుపులు తెరవాల్సిందే. మనం నేడు మౌనం పాటిస్తే, రేపు మరో పేరుతో, మరో రూపంలో ఇలాంటి మృగాలే పుట్టుకొస్తాయి. మౌనం నేరస్తుడికి రక్షణ కవచం.. ప్రశ్నించడమే బాధితుడికి అసలైన న్యాయం!




