నిఘా వలయంలో బస్తర్ గ్రామాలు

మాలినీ సుబ్రమణ్యం

2026 ఫిబ్రవరి 26

మావోయిస్టుల తిరుగుబాటును అంతం చేసేందుకు మార్చి 31వ తేదీని గడువుగా కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో పూర్వ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలోని ప్రజల జీవితాలను భద్రతా బలగాలు పర్యవేక్షిస్తున్నాయి.

ఛత్తీస్‌గఢ్: చుత్వహి గ్రామంలో ఇళ్ళకు అంకెలను కేటాయిస్తున్న భద్రతా బలగాలు

చుత్వహి గ్రామంలోని దాదాపు ప్రతి ఇంటికి ఒక నంబర్ ఉంటుంది; భద్రతా బలగాలు లావుపాటి ఇంగ్లీష్ అక్షరాలతో గోడలపై పెయింట్ చేసాయి.

“మమ్మల్ని గుర్తించడానికి ఈ నంబర్లను ఉపయోగిస్తారు” అని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మారుమూల ఉన్న ఈ గ్రామ నివాసి భీమా కోసా చెబుతున్నాడు.

“నేను నంబర్ 12 నుండి వచ్చాను,” అని ఆయన నవ్వుతూ అంటే, చుట్టుపక్కల వారు చిరునవ్వులు చిందించారు. “నేను 36 నుండి” అని మరొకరు తోడవడంతో నవ్వులు ఎక్కువయ్యాయి.

అయితే, ఈ ఇంటి నంబర్ల ప్రక్రియ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం గురించి చర్చ మొదలవగానే ఆ నవ్వులు మాయమయ్యాయి.

“ఒకవేళ గ్రామస్థుడిని అడవిలోనో లేదా మార్కెట్‌లోనో భద్రతా బలగాలు ఆపితే, తన ఇంటి నంబర్ చెప్పమని అడుగుతారు. ఒకవేళ వారు – ముఖ్యంగా వృద్ధులు – ఆ నంబర్ గుర్తుంచుకోలేకపోతే వారిని సెక్యూరిటీ క్యాంపుకు తీసుకువెళతారు” అని కోసా అన్నాడు.

గత రెండేళ్లుగా, కేంద్ర పారామిలటరీ బలగాల సెక్యూరిటీ క్యాంపులు బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. మార్చి 31 నాటికి మావోయిస్ట్ తిరుగుబాటును అంతం చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విధించిన గడువును చేరుకోవడానికి భద్రతా బలగాలు వేగంగా పనిచేస్తూండడంతో నిషేధిత మావోయిస్ట్ పార్టీకి కంచుకోటలుగా భావించే ఈ ప్రాంతాలు, ఇప్పుడు రాజ్య నియంత్రణలోకి వస్తున్నాయి.

తమ ఇంటి నంబర్‌ను గుర్తుకు తెచ్చుకోలేక నిర్బంధానికి గురైన వ్యక్తిని, కుటుంబ సభ్యులు లేదా ఆ గ్రామం నుండి ఎవరైనా వచ్చి ఆ నంబర్‌ను ధృవీకరించే వరకు సమీపంలోని సెక్యూరిటీ క్యాంపులో ఉంచుతారని ఆదివాసులు తెలిపారు. విడుదల చేయడానికి ముందు వారి పేరును జాబితాతో సరిచూస్తారు.

“సాధారణంగా ఈ ప్రక్రియకు ఒక గంట సమయం పడుతుంది” అని మాడ్వి కోసా తెలిపారు. చుత్వహి గ్రామానికి చెందిన కొందరు నాతో మాట్లాడటానికి ఒక ఇప్ప చెట్టు (మహువా) కిందకు చేరారు.

ఇంటి గోడపై ఉన్న ’35’ అనే అంకెను చూసి, ఆ సంఖ్యలను అంత పెద్ద అక్షరాలతో ఎందుకు రాశారని అడిగితే, “డ్రోన్ నుండి స్పష్టంగా కనిపించాలి కదా” అన్నారు.

భద్రతా బలగాల డ్రోన్లు గ్రామంపైన ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరం తిరుగుతుండటంతో, తమ ఇళ్లను, ముఖ్యంగా అతిథుల రాకపోకలను నిశితంగా గమనిస్తున్నారని స్థానికులు నమ్ముతున్నారు. అతిథులు వచ్చిన కొద్దిసేపటికే తరచుగా భద్రతా సిబ్బంది ఇంటికి వచ్చి, ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చారు? అని అడుగుతున్నారని గ్రామస్తులు అన్నారు.

సరిగ్గా అప్పుడే ఒకరు సంజ్ఞ చేయడంతో మా మాటలకు అంతరాయం కలిగింది. ఆ ఊరికి వచ్చిన ఒక సిఆర్‌పిఎఫ్ సిబ్బందిలోని ఒకతను నేను ఎవరినని అడిగాడు. నా వివరాలు చెప్పాక, అక్కడి నుండి వెళ్ళిపోయారు.

తరువాత నేను చుత్వహి క్యాంప్ కమాండెంట్ ఇన్‌స్పెక్టర్ ఎస్.ఆర్. పటేల్‌తో మాట్లాడితే, డ్రోన్ల ద్వారా వ్యక్తిగత ఇళ్లను పర్యవేక్షిస్తున్నామన్న వార్తను నిరాకరించాడు. “డ్రోన్ కెమెరాల ద్వారా కేవలం ఇంటి పైకప్పుపై ఉన్న సంఖ్యలను మాత్రమే చూడగలం, గోడలపై ఉన్న వాటిని కాదు,” అని స్పష్టం చేసాడు.

గ్రామ నివాసులు

చుత్వహి వంటి అంతర్గత గ్రామాలపైన “నిశిత నిఘా” అవసరమని బీజాపూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర యాదవ్ అన్నాడు. బీజాపూర్ జిల్లా ఉసూర్ బ్లాక్‌లోని తాల్పేరు నది ఒడ్డున ఉన్న ఈ గ్రామాలు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టుల నీడలో ఉన్నాయని, కొన్ని గ్రామాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు పోలీసు నిఘా వర్గాలు ధృవీకరించాయని, అందుకే అప్రమత్తంగా ఉండటం అవసరమని ఆయన అన్నాడు.

అయితే, న్యాయశాస్త్ర నిపుణులు దీనిని ప్రశ్నిస్తున్నారు. “సాధారణ పౌరులపైన సామూహికంగా, విచక్షణారహితంగా నిఘా పెట్టడం అనేది ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించిన ‘గోప్యత హక్కు’ను ఉల్లంఘించడమే అవుతుంది” అని అభిప్రాయపడ్డ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయవాది షాలిని గేరా, “పోలీసులు అటువంటి చర్యలు చేపట్టాలంటే “బలమైన, సహేతుకమైన కారణాలు ఉండాలని, సాధారణంగా న్యాయపరమైన లేదా శాసనపరమైన పర్యవేక్షణ అవసరమని” వ్యాఖ్యానించింది.

పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్‌లో పనిచేస్తున్న ఆమె”ప్రతి ఒక్కరినీ అనుమానితులుగా పరిగణించడం అనేది మన నేర న్యాయశాస్త్రానికి మూలస్తంభమైన ‘నిర్దోషిత్వం’ అనే సూత్రానికి విరుద్ధం” అని తెలిపింది.

భద్రతా బలగాలు కూలదోసిన అమరుల స్థూపం

ఆకాశంలో డ్రోన్‌లు

 డ్రోన్ల నిఘా పట్ల భయాందోళన వ్యక్తం చేస్తున్నది కేవలం చుత్వహి గ్రామస్తులు మాత్రమే కాదు.

 పలు సెక్యూరిటీ క్యాంపులను తప్పించుకుని తన సోదరుడిని కలవడానికి చుత్వహికి వచ్చిన సుక్మా జిల్లా రాయగూడెం గ్రామానికి చెందిన రాకేష్ మాడ్వి, “మా గ్రామంలోని మొత్తం 104 ఇళ్లను డ్రోన్ల ద్వారా గుర్తించేలా పెద్ద అక్షరాలతో సంఖ్యలు వేశారు” అని చెప్పాడు.

ఒకరోజు ఉదయం, గ్రామంలోకి వచ్చిన భద్రతా సిబ్బంది తమ స్మార్ట్‌ ఫోన్‌లను అడిగి, గత సాయంత్రం తాము ఏమి చూస్తున్నాము అని ప్రశ్నించడంతో దిగ్భ్రాంతికి గురయ్యామన్నాడు. “మీరు నక్సలైట్ వీడియోలు చూస్తున్నారు కదా” అని సిబ్బంది తమతో అన్నట్లు మాడ్వి గుర్తు చేసుకున్నాడు.

“డ్రోన్ నిఘా ఇప్పుడు ఒక కొత్త సాధారణ అంశంగా మారిపోయింది” అని మాడ్వి అన్నారు.

చుత్వహికి సమీపంలో ఉన్న తుమిర్‌గూడ గ్రామంలో జోగా మాడ్వి మాట్లాడుతూ, ఈ నిఘా కారణంగా స్నేహితుల, బంధువుల ఇళ్లకు వెళ్ళడం కష్టమైపోతోందన్నాడు. కొన్ని నెలల క్రితం, ఉసూర్ బ్లాక్‌లోని పెరంపల్లి గ్రామంలో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్ళినప్పుడు, ఉదయాన్నే సిఆర్పిఎఫ్ సిబ్బంది తలుపు తట్టి ఆయన ఎవరు? ఎందుకు వచ్చారు? అని అడిగారు.

ఆధార్ కార్డును చూపించినప్పటికీ వారు సంతృప్తి చెందలేదు. కొన్ని వారాల క్రితం జోగాకు చికిత్స చేసిన సిఆర్‌పిఎఫ్ నిర్వహిస్తున్న ఫీల్డ్ హాస్పిటల్ డాక్టర్‌తో ఫోన్లో భద్రతా సిబ్బందిని మాట్లాడిస్తే అతను జోగా తుమిర్‌గూడ నివాసి అని ధృవీకరించాడు. భద్రతా సిబ్బంది వెళ్ళిపోయిన వెంటనే జోగా తన గ్రామానికి తిరిగి వచ్చేసాడు.

ఒక ఇంటి గోడ పైన బెటాలియన్ నంబరు

“మా కుటుంబ సభ్యులు బస్తర్ అంతటా ఉన్నారు. గతంలో, మేం ఎప్పుడైనా ఎవరినైనా కలుసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు, వేరే గ్రామం నుండి ఎవరైనా కుటుంబ సభ్యులు మా ఇంటికి వస్తే, తప్పనిసరిగా పోలీసు క్యాంపుకు సమాచారం అందించాలి” అన్నాడు.

చుత్వహికి చెందిన మరో నివాసి ముడాం పాలే, “ఇంట్లో పెళ్ళి జరిగితే, మేము ముందుగానే క్యాంపుకు సమాచారాన్ని, హాజరయ్యే అతిథుల జాబితాను ఇవ్వాల్సి ఉంటుంది.” అని తెలిపాడు. అంతేకాకుండా, “ముఖ్యంగా చీకటిపడ్డాక ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళకూడదని” భద్రతా బలగాలు తమను హెచ్చరించాయని పాలే జోడించాడు.

యాభై ఐదు ఏళ్ల సోడి రాజా సీజనల్ ‘తొర్ర’ విత్తనాలు దంచడంలో బిజీగా ఉన్నాడు. ఆ సమయంలో గ్రామస్థులు ఒకరు ఆయనను చూపిస్తూ… మద్యం మత్తులో సెక్యూరిటీ క్యాంప్ పక్కనుంచి వెళ్ళినందుకే భద్రతా సిబ్బంది ఆయనను రెండుసార్లు చెంపదెబ్బలు కొట్టారని చెప్పాడు.

ఒక సందర్భంలో, రాత్రి 8 గంటల సమయంలో చుత్వహిలోని మంజపారాలో జరిగిన ఒక పెళ్ళి నుండి రాజా తిరిగి వస్తున్నాడని అతని కుమారుడు వివరించాడు. క్యాంప్ సిబ్బంది ఆయనను పిలిచారా? అని నేను అడిగితే, “వాళ్ళు హిందీలో ఏదో అన్నారు – నాకు అర్థం కాలేదు,” అని సోడి రాజా గోండీ భాషలో సమాధానమిచ్చాడు. తల పైకెత్తి క్లుప్తంగా చెప్పి, మళ్ళీ తన పనిలో నిమగ్నమయ్యాడు.

కేవలం పెళ్ళిల్లే కాకుండా, సమీప గ్రామాల నుండి ప్రజలు హాజరయ్యే అన్ని సామాజిక కార్యక్రమాలు — అంటే పుట్టుకలు, చావుల గురించి కూడా క్యాంప్‌కు తెలియజేయాల్సి ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఆంక్షలు అత్యవసర పరిస్థితులకు కూడా వర్తిస్తున్నాయి. “ఎవరైనా అనారోగ్యం పాలైతే, ముఖ్యంగా పాము కాటు లేదా ఏదైనా పురుగు కుట్టినప్పుడు, మేము దగ్గరి గ్రామం నుండి ‘గునియా’ ను(వైద్యుడిని) పిలుస్తాం. దాన్ని కూడా వారు ఎలా ఆపుతారు? ఎవరైనా చనిపోతే పరిస్థితి ఏమిటి?” అని కోసా ప్రశ్నించాడు.

బీజాపూర్, పామేడు మధ్య బస్సులు

పండుగలు;ని మీద వెళ్లడంపై నిఘా

భద్రతా వలయంలో చిక్కుకున్న స్థానికులు, తమ ఆదివాసీ సమాజ జీవనంలో అంతర్భాగమైన స్థానిక పండుగలు జరుపుకోవడంలో కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలిపారు. చుత్వహి ఇప్పుడు పరిపాలనాపరంగా తర్రెమ్ గ్రామ పంచాయితీలో భాగంగా ఉన్నప్పటికీ, గ్రామస్తులు తమ వార్షిక జాతర లేదా ‘కర్సాద్’ను గుండంలోనే జరుపుకుంటారు, ఎందుకంటే వారి ‘దేవగుడి’ (గ్రామ ఆలయం) అక్కడే ఉంది. పరిపాలనా యంత్రాంగంలో జరిగిన మార్పులు ఈ జాతరపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు.

అయితే, సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటైనప్పటి నుండి, గ్రామస్తులు తమ ‘పండమ్’లు లేదా వ్యవసాయ పండుగల గురించి, గ్రామంలోకి ఎంతమంది వస్తున్నారు అనే సమాచారాన్ని ముందుగా ఇవ్వాల్సి వస్తోంది.; అలాగే ఇతర చిన్న గ్రామాలు, గూడేలనుండి వస్తున్న బంధువుల జాబితాను కూడా వారు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రతి సంవత్సరం, ఈ గ్రామం నాలుగు ప్రధాన పండుగలను జరుపుకుంటుంది — మొదటిది ఏప్రిల్‌లో ఇప్ప పూలు వికసించే ముందు, రెండవది మే నెలలో వర్షాకాలపు పంట కోసం విత్తనాలను వేరు చేసే ముందు, మూడవది ఆగస్టులో విత్తనాలు నాటే ముందు, చివరగా అక్టోబర్-నవంబర్ కాలంలో పంట కోత తర్వాత.

ప్రతి పండుగకు గ్రామమంతా ఒక బహిరంగ ప్రదేశంలో చేరుతుంది — అక్కడ అందరూ కలిసి వంటలు చేసుకుని విందు ఆరగిస్తారు, ఇప్ప సారాయి తాగుతూ రాత్రంతా నృత్యం చేస్తారు. యువతీ యువకులు ఒకరి నడుముపై ఒకరు చేతులు వేసుకుని, లయబద్ధంగా ఊగుతూ బృందగానం చేస్తూ నృత్యం చేస్తారు. తెల్లవారుజాము వరకు సాగే ఈ వేడుకలు వారి సామూహిక ఆనందానికి ప్రతీకగా నిలుస్తాయి.

పండుగల సమయంలో భద్రతా దళాలు తమను నేరుగా ఇబ్బంది పెట్టవని గ్రామస్తులు స్పష్టం చేశారు. “కానీ వారు కొంత దూరం నుండి మమ్మల్ని గమనిస్తూ నిలబడతారు” అని లింగ చెప్పారు. ఇలా చేయడమే  తమ స్వేచ్ఛకు, వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నట్లు అనిపిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామ యువతులు, బాలికలు

మావోయిస్టుల హయాంలో ఆంక్షలు

దీనికి విరుద్ధంగా, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు, అలాగే సామూహిక వేట వంటి వాటికి మావోయిస్టులు తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని గ్రామస్థులు పేర్కొన్నారు.

అయితే, మావోయిస్టుల హయాంలో కూడా తాము కొన్ని ఆంక్షలను ఎదుర్కొన్నామని వారు వెంటనే జోడించారు. సరైన కారణం లేకుండా ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్లకూడదని, అలా వెళ్తే తమను అనుమానంతో చూసేవారని వారు తెలిపారు.

చుత్వహి గ్రామస్థులు 2024 మే నెలలో జరిగిన ఒక ఘటనను గుర్తు చేసుకున్నారు. సమీపంలో సెక్యూరిటీ క్యాంపు ఏర్పాటైన రెండు నెలల తర్వాత, పోలీసులకు సమాచారం అందిస్తున్నారనే అనుమానంతో ‘జోగా మాడ్వి’, ‘హుంగా మాడ్వి’ అనే ఇద్దరు అన్నదమ్ములను మావోయిస్టులు అపహరించి చంపివేశారు. దీనిపైన ఎటువంటి ‘జన అదాలత్’ (ప్రజా కోర్టు) నిర్వహించలేదు. అటు వారి కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.

ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీల్లో పిల్లలు చేరడాన్ని మావోయిస్టులు అడ్డుకోనప్పటికీ, వార్షిక సెలవుల్లో మాత్రం వారు గ్రామంలోనే ఉండాలని ఆదేశించేవారు. “ఒక మావోయిస్టు నాయకుడు నేను గ్రామం దాటి వెళ్ళకుండా నిషేధం విధించడం వల్ల నా విద్యా సంవత్సరంలో ఒక ఏడాదంతా నష్టపోయాను” అని హైస్కూల్ పూర్తి చేసిన ఒక యువకుడు ఆవేదనతో చెప్పాడు.

పోలీసులకు సమాచారం వెళ్తుందనే ఉద్దేశంతో మావోయిస్టులు మొబైల్ ఫోన్ల వినియోగంపై కూడా ఆంక్షలు విధించారు. అలాగే, కూలీ పనుల కోసం గ్రామస్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లే రోజుల సంఖ్యను కూడా వారు నియంత్రించేవారు.

వరి కోతలు పూర్తవడంతో, చుత్వహి తదితర అటవీ గ్రామాల నివాసితులు ప్రతి ఏడాదిలాగే పొరుగున ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు “కూలీ” పనుల కోసం వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. సాధారణంగా గ్రామస్థులు 20 నుండి 90 మంది వరకు బృందాలుగా వెళ్తుంటారు.

అయితే, తేడా ఏమిటంటే ఇప్పుడు వారు తమ పనిస్థలాలకు వెళ్లే ముందు తప్పనిసరిగా సమీపంలోని సెక్యూరిటీ క్యాంపులో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

2024లో తమ గ్రామం వద్ద సెక్యూరిటీ క్యాంపు ఏర్పాటైనప్పటి నుండి ఈ పద్ధతి మొదలైందని కొండపల్లి సర్పంచ్ మనీష్ ఆసం తెలిపాడు. కూలీ పనికి వెళ్లే వారి వివరాలను అందించడం, అలాగే వారు తిరిగి వచ్చాక క్యాంపుకు సమాచారం ఇవ్వడం గ్రామ పెద్ద బాధ్యత అని ఆయన వివరించారు.

బస్తర్‌లోని సాముదాయిక సంస్థ అయిన ‘సర్వ ఆదివాసీ సమాజ్’ అధ్యక్షుడు ప్రకాష్ ఠాకూర్ మాట్లాడుతూ, ఇటువంటి ఆంక్షలు ఆదివాసీల జీవనాన్ని అడ్డుకుంటున్నాయని అన్నారు. “ఆదివాసీల జీవనశైలి సామూహికమైనది. మా గ్రామాలను పర్యవేక్షించడానికి సెక్యూరిటీ క్యాంపులను ఉపయోగించడం అనేది మా స్వేచ్ఛను హరించడమే కాకుండా, మా ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది” అని ఆయన అన్నారు.

“ఇలా చేయడం అంటే గ్రామ నివాసితులందరినీ మావోయిస్టులుగా ప్రకటించినట్లే ” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఫోటోలన్నీ – మాలినీ సుబ్రమణ్యం

తెలుగు: పద్మ కొండిపర్తి

https://scroll.in/article/1090988/house-numbers-drones-family-registers-bastar-villages-under-web-of-surveillance

Leave a Reply