క్రిస్టియన్ మతం స్వీకరించిన దళితులకు రిజర్వేషన్లు వర్తించవని సుఫ్రీం కోర్టు చెప్పిన తీర్పు  చట్ట వ్యతిరేకం మరియు రాజ్యాంగ వ్యతిరేకం, ముఖ్యంగా ప్రజా వ్యతిరేకం.రాజ్యంలోని ముఖ్య అంగమైన న్యాయ వ్యవస్థ దళితులకు వ్యతిరేకంగా కుల ఫ్యూడల్ పునాది పై నిర్మితమై పనిచేస్తుందో ఏ విధంగా వారి పట్ల కక్ష్య సాధింపు మరియు అణచివేత చర్యలకు పాల్పడుతుందో ఈ తీర్పు ద్వారా మరోసారి రుజువైంది.ఇంతకు ముందు విద్యా సంస్థలలో కుల వివక్షత అరికట్టడానికి ఉద్దేశించిన యూజిసి నిబంధనల పై కూడా స్టే విధించింది.అందుకే మనువాద బ్రాహ్మణీయ కుల భావజాలంతో పనిచేస్తున్న న్యాయ వ్యవస్థ దళితులను నిరంతరం అణగదొక్కుతూ,అవమానిస్తుందో,వివక్షత పాటిస్తుందో ఆ కుల వ్యవస్థనే రద్దు చేయాలనే డిమాండ్ మరోసారి రంగం మీదకు వచ్చింది.మార్చి 30 న జరిగిన ప్రెస్ మీట్ లో మిత్రుడు మంద కృష్ణ మాదిగ,అంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఈ డిమాండ్  చేశారు.ఇది పాత డిమాండే.పెరియార్ కాలం నాటిది,సరైంది.వర్గ దోపిడీ వ్యవస్థతో పెనవేసుకున్న కుల వ్యవస్థ మన ప్రజల స్వేచ్ఛ,సమానత్వం,సామాజిక న్యాయానికి,సోదరభావానికీ,ఐక్యతకు,అభివృద్ధికి,స్వయం గౌరవానికి అడ్డంకిగా ఉంది.పీడితులపై పీడక కులాల దోపిడికీ,అంతులేని హింసకు,ఆధిపత్యానికి అదనపు సాధనంగా ఉంది.అన్ని కులాల ప్రజల్లో కుల తత్వాన్ని రెచ్చగొట్టి,కుల విభజనను సృష్టించి,కులాలను మరింత బలోపేతం చేసి బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజాన్ని బలోపేతం చేయడానికి కుల వ్యవస్థ దోహదం చేస్తుంది.అందుకని కుల వ్యవస్థ రద్దు నేటి తక్షణ ఆవశ్యకత.సాంప్రదాయవాదులు కుల వ్యవస్థను సమర్ధిస్తూ సమాజ ప్రగతిని వెనుకకు నెట్టే తిరోగమన చర్యలకు పాల్పడుతుంటే,ప్రగతిశీలవాదులు ఇంటా బయటా కుల వ్యతిరేక చైతన్యాన్ని పెంచడంలో అనేక పరిమితులు విధించుకుంటున్నారు.పుట్టుక-పెళ్ళి-చావు ఆ పైన కూడా మనువాద బ్రాహ్మణీయ సంస్కృతినే పాటిస్తున్నారు. కుల వ్యవస్థ నిర్మూలనా పోరాటం బలంగా లేకపోవడానికి కారణం భావజాల దారిద్య్రమే.ఈ నేపధ్యంలో సుఫ్రీం కోర్టు తీర్పు వెనకనున్న మూల కారణాన్ని అర్థం చేసుకుని పరిష్కారానికి కృషి చేయడం,కుల వ్యవస్థను రద్దు చేయమని పోరాడటం నేటి సామాజిక శక్తుల బాధ్యత.

మన దేశపు కులాధారిత ఉత్పత్తి సంబంధాలలో వర్గ పోరాటం మరియు ప్రత్యేక పీడనలకు వ్యతిరేకంగా అనేక ప్రజాస్వామిక పోరాటాల ఫలితంగా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. సామాజిక కార్యకలాపాలలో పాల్గోంటున్న ప్రజల మధ్య పరస్ఫరాధారిత,సహకార సంబంధాల వల్ల దీని వెన్నంటి భావజాల/సిద్ధాంతం,రాజకీయ, సాంస్కృతిక రంగాలలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.చారిత్రకంగా సామాజిక ఉత్పత్తి క్రమంలో నెలకొన్న శ్రమ విభజన ముతక రూపమైన జాత్యహంకార లక్షణాలు గల వర్ణ వ్యవస్థకు మతం,రాజ్యం,రాజకీయ ఆధిపత్యాన్ని జోడించి అదనపు విలువ దోపిడీ పటిష్టంగా అమలు జరిగేది ప్రాచీన కాలంలో.ఈ విధానాన్నే మధ్య యుగ ప్యూడల్ గుప్తులు, ముస్లిం పాలకులు, బ్రిటిష్ వలసవాదులు ఈ కుల వ్యవస్థను సామాజిక/సాంఘిక సాధనంగా అధ్బుతంగా వినియోగించుకున్నరు. కుల వ్యవస్థ పీడితులైన దళిత,వెనుకబడిన కులాల పోరాటాలను బ్రాహ్మణవాద/హిందూ మతోన్మాదులు తప్ప కమ్యూనిష్టులు మరియు సామాజిక విప్లవకారులైన పూలే, పెరియార్, అంబేద్కర్ మొదలగు మహానీయులు కుల వ్యవస్థ నిర్మూలన కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ముఖ్యంగా అంబేద్కర్, వైస్ రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో కార్మిక ప్రతినిధిగా ఉండి దళితుల అభివృద్ధి కోసం రిజర్వేషన్ విధానాన్ని ప్రతిపాదించారు. 1936 లో లబ్ధిదారులకు గుర్తించడం కోసం అంటరాని కులాల ప్రజలను షెడ్యూల్ కులాలు అనే పరిపాలన పరమైన తరగతి కిందికి తెచ్చాడు. మరాఠీ భాష నుండి పూలే రూపొందించిన దళిత భావనను అంబేద్కర్ సమర్ధవంతంగా వినియోగించి బ్రాహ్మణవాద వ్యతిరేక పోరాటాలను ముందుండి నడిపించాడు.

1947 తరువాత సాంఘిక వెలి అనేది ప్రధానంగా లేని ఆదివాసులను ఎస్టీలుగా, వెనుకబడిన కులాలను బిసిలుగా గుర్తించడంతో పాటు అంటరానితనం ప్రాతిపదికన 1800 కులాలను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చితే రిజర్వేషన్లు అమలు చేయకుండా నాటకాలు ఆడుతున్నవి నేటి మనువాద ప్రభుత్వాలు.రిజర్వేషన్ లు ఆచారాల పేరుతో హిందూ కుల వ్యవస్థకు గుర్తింపు నివ్వడం,కుల వ్యవస్థను నిషేధించాలనే డిమాండును నిర్లక్ష్యం చేయడం ఆ తదనంతరం అనేక దుష్ఫలితాలకు దారి తీసింది. ఎస్సీ,ఎస్టీ, బిసీ కేటగిరీల నిర్మాణం చేసి కుల వ్యవస్థ నిర్మూలన కోసం సాగాల్సిన అంటరాని దళిత,వెనుకబడిన కులాల ఉద్యమాలను అమలు జరుగని రిజర్వేషన్ ల కోసం కులాలు, ఉప కులాల ప్రాతిపదికన చీలిపోయి తన్నుకు సచ్చే చీలిక వాదానికి పునాది రాజ్యాంగ సభ ద్వారానే ప్రారంభమయింది. విద్యా,ఉద్యోగ రంగాలలో కొద్దిపాటిగా మొదటి తరానికే ఉపయోగపడ్డ రిజర్వేషన్ లు ఒకనాడు అసాధారణ స్థితిలో అరుదుగా కల్పించినట్లుగా ఉంటే నేడు ఇవి పాలకవర్గాల అమ్ముల పొదిలో ఎన్నికలు,ఓట్లకోసం అణగారిన కులాలను, తెగలను చీల్చి తమ పాలనాధిపత్యం, అణచివేత,దోపిడీ కోసం కుల వ్యవస్థను బలోపేతం చేసే అస్త్రాలుగా తయారయ్యాయి.

మరోవైపు భూస్వాములను,ధనిక రైతులను బలోపేతం చేసిన భూసంస్కరణల చట్టం, సామ్రాజ్యవాద ప్రేరేపిత హరిత విప్లవం,నూతన ఆర్థిక విధానాల పేరుతో అమలవుతున్న ప్రైవేటీకరణ గ్రామీణ ప్రాంతాలలో కుల-వర్గ సంబంధాలను మౌళికంగా కాకపోయినా గణనీయమైన మార్పులకు గురి చేశాయి.ఈ పధకాల వల్ల వాస్తవంలో భూమిని దున్నే దళిత బహుజనులు భూమి హీనులుగా,వ్యవసాయ కూలీలుగా,వలస కూలీలుగా మార్చబడ్డారు.చేతి వృత్తులు ధ్వంసం చేయబడ్డాయి.సాంప్రదాయ అగ్రవర్ణ పాత భూస్వాములకు తోడు భూస్వామ్య పెట్టుబడిదారులు,రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ రూపంలోని కొత్త భూదందా గాళ్ళు, రౌడీలు,గుండాలు,మాఫియా చీకటి వ్యాపారస్తులు, రెవెన్యూ, పోలీసు మొదలగు వారు నేడు కొత్త భూస్వామ్య వర్గంగా రూపొందారు. భూస్వామ్య వ్యవస్థ రూపం మారి సారం కొనసాగుతుంది. అనగా అత్యధిక భూములు నేటికీ కొద్ది శాతంగా ఉన్న అగ్రకుల భూస్వాముల వద్దే కేంద్రీకృతమైనాయి.ప్రజాస్వామ్యమూ లేదు, ఉన్నదంతా మూకస్వామ్యం,నిరంకుశత్వం.ఈ పరిణామాలన్నీ గ్రామాలలో సాంప్రదాయిక అగ్రవర్ణ బ్రాహ్మణ,రాజపుత్ర,వైశ్య భూస్వాముల స్థానంలో కమ్మ,రెడ్డి,వెలమ,వెల్లాలి,ఒక్కలిగ, లింగాయత్, యూపిలోని యాదవ్, భూమిహార్, జాట్, బీహార్ లోని కుర్మి,మహారాష్ట్రలోని మరాఠా,పటేల్ పాటిదార్,గుజ్జర్ తదితర శూద్ర అగ్రకులాలకు చెందిన భూస్వాములు,ధనిక రైతుల ఆధిపత్యం నెలకొల్పడానికి దారితీసింది. తమ స్వంత శ్రమతో పాటు రిజర్వేషన్ లు ఇతర పోరాట ఫలితాల ద్వారా స్వయం గౌరవం, అభివృద్ధి కోసం తపిస్తున్న దళితులను నూతన కులాధిపత్య వర్గాలు టార్గెట్ చేశాయి.ఇంతకు ముందు వ్యక్తిగత స్థాయిలో ఉండే అణచివేత, ద్వేషం నేడు దళితులందరికీ గుణపాఠం చెప్పే లక్ష్యంతో సమిష్టి రూపం తీసుకుని కారంచేడు,చుండూరు, వేంపెంట,ప్యాపిలి, లక్ష్మింపేట తదితర చోట్ల దళితుల సామూహిక హత్యలకు దారితీశాయి.రిజర్వేషన్ ల వల్ల లబ్ధి పొంది కొద్దిగా ఎదిగిన దళిత,వెనుకబడిన కులాలలోని సంపన్న వర్గం వివిధ ప్రాంతాల్లో పార్టీలు,సంఘాలుగా నిర్మాణం అయినా, కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాధికారంలోకి వచ్చినా ఈ హత్యాకాండకు వ్యతిరేకంగా బ్రాహ్మణేతర దళిత బహుజనోద్యమానికి నాయకత్వం వహించడంలో విఫలమైంది.ప్రధానంగా కుల వ్యవస్థకు మూలమైన భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో దీన్ని రక్షిస్తున్న సామ్రాజ్యవాద,దళారీ బడా పెట్టుబడిదార్ల వ్యతిరేక పోరాటం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల నిర్వీర్యమైంది. ఓట్లు,సీట్ల కోసం బ్రాహ్మణీయ భూస్వామ్య పాలకులతో రాజీ బేరాలలో మునిగి అవినీతిమయంగా తయారైంది.

ఈ సందర్భంగా ప్రైవేటీకరణ వల్ల దళిత బహుజనులు మరింత దారిద్ర్యంలోకి నెట్టబడ్డారు.భూమి హీనుల సంఖ్య పెరగడం,చేతి వృత్తుల ఆధార జీవితాలు ధ్వంసం కావడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గడం, రిజర్వేషన్లు గరిష్ట స్థాయికి పడిపోవడం లేదా అసలే అమలు జరుగకపోవడం జరిగింది. రిజర్వేషన్ల వల్ల దళిత వెనుకబడిన కులాలు,ఆదివాసీలు రాజ్యం పై ఆధారపడే దుస్థితి నెలకొంది. రాజ్యాంగం ద్వారా శాంతియుతంగా సమానత్వాన్ని సాధించగలమన్న భ్రమలను నెలకొల్పింది.కుల బేధాలు,వివక్షత ఉండకూడదు అనే సూత్రానికి రిజర్వేషన్లు ఉండాలి అనే సూత్రానికి తాత్కాలికంగానే తప్ప పొత్తు కుదరడం లేదు. మన రాజకీయ ఆర్థిక వ్యవస్థలో సామ్రాజ్యవాద చొరబాటు,ఆధిపత్యం పెరిగి అవకాశాల లేమితో తపిస్తున్న దళిత బహుజనుల మధ్య పోటీ పెంచి వారి ఉద్యమాన్ని చీల్చగలిగింది.మరోవైపు కుల ప్రాతిపదికపై కుల స్థిరీకరణను బలోపేతం చేసింది. దీనికి భూస్వామ్య ఉత్పత్తి సంబంధాలే, ఆర్థిక పునాదే కుల వ్యవస్థ యొక్క ప్రాథమిక సంబంధాలుగానున్నా,అదే సమయంలో ఈ సంబంధాలలో భాగంగానే కుల వ్యవస్థకు కుల సంబంధాలు,ఆర్థిక సంబంధాలు,సూత్రాలు కూడా పనిచేస్తున్నాయి. ప్రధాన ఉత్పత్తి సాధనమైన భూమి పై యాజమాన్యపు హక్కు భూస్వామ్య ప్రభువులు, అధికారులకే అనుభవించే హక్కు ఇతరులకు నిషేధించబడేవి.అనువంశిక శ్రమ విభజన (శ్రామికుల విభజన కూడా) వ్యవసాయానికి చేతి వృత్తులను బంధించి సేవా వృత్తులుగా మార్చడం,శ్రమకు తగ్గ ఫలితం స్థానంలో బిచ్చంగా కుల లేదా మత ధర్మంగా అమలు జరుగడం,శారీరక-మేధో శ్రమల మధ్య  విభజనను,ఎక్కువ-తక్కువ,అంటరాని-అంటదగ్గకులాల విభజనగా మార్చిన ఈ సామాజిక సంబంధ సూత్రాలు నేటికీ కొనసాగుతున్నాయి.ఈ ప్రత్యేక కుల ఉత్పత్తి సంబంధాలు కుల ధర్మం, బ్రాహ్మణీయ లేదా హిందూ మత ధర్మంగా కొనసాగి భూస్వామ్య దోపిడీ సంబంధాలలో అదనపు కుల దోపిడీ సంబంధాలు చేరి అధనంగా అదనపు విలువను కొల్లగొట్టడానికి,ప్రజల ఐక్యత -పోరాటాలను నిరోధించి, రాజ్య అణచివేతకు ప్రత్యేక పనిలేకుండా చేయడానికి దోహదపడ్డాయి.పడుతున్నాయి.ఇవి కాల క్రమంలో సామ్రాజ్యవాదుల చొరబాటు, ప్రజా పోరాటాల వల్ల ఈ బ్రాహ్మణీయ కుల భూస్వామ్య సంబంధాలలో కొన్ని గమనించ దగ్గ మార్పులు వచ్చాయి.కుల ఆర్థిక సంబంధాలు బలహీన పడ్డాయి.అయితే కుల ప్రత్యేకతలు అయిన అంతర్వివాహం,ఎక్కువ-తక్కువలు, అంటరానితనం మొదలగునవి నేటికీ కొనసాగుతున్నాయి.మొత్తం మీద ఈనాటి కులాలు మధ్య యుగాలలో వలే బ్రిటిష్ కాలంలో వలె పుక్కిటి పురాణాలు,మనుధర్మ శాస్త్రంలో పేర్కోన్నట్లు సాంప్రదాయిక కులాల వలె కాకుండా కొన్ని మార్పులతో,రాజ్యాంగ పరమైన హిందూ కులాలుగా మార్పుకు గురైనట్లు కనపడుతున్నా, వాస్తవంలో రూపం తగ్గట్టు సారం మారలేదు.సాంసృతికంగా కులాలు మరింత గడ్డ గట్టుకుపోయాయి.కుల భూస్వామ్య ఆర్థిక పునాది మౌళిక మార్పులకు గురి గాకపోవడం, ఆధ్యాత్మిక ఫాసిజం పెచ్చరిల్లడం వల్ల కుల వ్యవస్థ కొనసాగుతుంది.డెబ్బై సంవత్సరాల అనంతరం కూడా ఆస్తికి,అధికారానికి దూరం చేయబడుతున్న దళిత బహుజనుల్లో పెరుగుతున్న అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు శక్తులు కులతత్వాన్ని, హిందూ మతతత్వాన్ని,నకిలీ భరత జాతితత్వాన్ని రెచ్చగొడుతున్నాయి.ఈ కుట్రలకు ప్రతిస్పందనగా నిరుపేద,మధ్య తరగతుల విద్యావంతులైన యువతరం మరియు ప్రగతిశీల శక్తుల్లో కుల ఆర్థిక సంబంధాలు లేదా సూత్రాలలో వచ్చిన మార్పు మేరకు కుల,మత ప్రాతి పదికపై అస్తిత్వాల గుర్తింపు పట్ల విముఖత పెరుగుతుంది. కుల వ్యవస్థ నిర్మూలన కావాలనే చైతన్యం పెరుగుతుంది. కులం వద్దు-మతం వద్దు అని నినదిస్తున్నారు.వాస్తవానికి వారు వర్గ పోరాటంలో కూడా పాల్గొనాల్సే ఉంది.నిచ్చెన మెట్ల కులాలతో కూడిన ఫాసిస్టు హిందూమత అవసరం ఈనాటి సమాజానికి గుదిబండగా,దేశ అంతర్గత భద్రతకు ప్రమాదంగా మారిందనే ఆలోచనలు పెరుగుతున్నవి.వీటి అభివృద్ధి నిరోధక ఫాసిస్టు స్వభావాన్ని గణనీయ సంఖ్యలో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.కులం,మతం విడదీయరానివని, హిందూ మతం అనే ఫాసిస్టు కట్టడం అసలు మతమే కాదనే చైతన్యం పెరిగిన నేపథ్యంలో కుల,మత రహిత గుర్తింపు కావాలని, అసలు కుల వ్యవస్థనే రద్దు చేయాలనే డిమాండ్ ఊపందుకోవడం ఆహ్వానించదగ్గది.

పురుషాధిపత్య నిమ్నోన్నత నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను వదిలించుకోకుండా హిందూమతం ప్రజాస్వామీకరించబడి సాధారణ మతంగా మారే అవకాశం లేదని అంబేద్కర్ ఏనాడో చెప్పాడు. అది సాధ్యం కాదని కూడా గట్టిగానే చెప్పి దాని నిర్మూలన కోసం పోరాడాలన్నారు. కుల ఆధారిత వృత్తులు, ఆచారాల ముసుగులో కుల వ్యవస్థ అస్తిత్వాన్ని గుర్తిస్తున్న ఇండియా రాజ్యాంగాన్ని పెరియార్ 26 నవంబర్ 1957 న ఇరవై వేల మందితో కలిసి దహనం చేశారు. రాజ్యాంగంలోని 25,26 వ సెక్షన్లను సవరించడానికి అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టగా నెహ్రూ, పటేల్,రాజేంద్ర ప్రసాద్ తదితర బ్రాహ్మణవాద ఫ్యూడల్ శక్తులు వ్యతిరేకించడంతో తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. పెరియార్ ఇంకా ముందుకు వెళ్ళి కుల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని 17 వ అధికరణంలో (ఆర్టికల్) అస్పృశ్యత నిషేధించబడింది ‘ అన్న వాక్యంలోని అస్పృశ్యత అను పదాన్ని తొలగించి ‘కులం నిషేధించబడింది ‘ అని పేర్కోనాలని 9 డిసెంబర్ 1973 లో జరిగిన మూఢ నమ్మకాల నిర్మూలనా మహాసభలో ప్రకటించారు. కుల నిర్మూలనా పోరాటంలో ఆటంకంగా ఉంటున్న ప్రతి చట్టపరమైన అడ్డంకులను తొలగించాలనేది ఆ మహనీయుని ఉద్దేశం. నేడు కూడా 17 వ అధికరణానికి సవరణ చేసి కుల వ్యవస్థను రాజ్యాంగం ద్వారానే రద్దు చేయాలనే డిమాండ్ పెరుగుతుండడం గమనార్హం.మనుషులు ఆకలితో చస్తున్నా పట్టించుకోకుండా పశువులను,పాములను పూజించాలనే హిందూ మత ఉన్మాదం పెరుగుతున్న నేపధ్యంలో వివక్షత,అంటరానితనం రద్దు కావాలంటే కుల,మత గుర్తింపును తిరస్కరిస్తూ క్రూరమైన ఈ కుల వ్యవస్థను రద్దు చేయాలని పోరాడడం న్యాయమైనదే.అయితే ఫ్యూడల్ వ్యవస్థతో పెనవేసుకున్న కులవ్యవస్థ దాన్ని రక్షిస్తున్న సామ్రాజ్యవాదంలను అంతమొందించినప్పుడే కుల వ్యవస్థ సంపూర్ణంగా రద్దు అవుతుందనేది గమనించాలి.

బ్రాహ్మణవాద వ్యతిరేక భక్తి ఉద్యమాల అనంతరం ఒక వంద సంవత్సరాలకు పైగా సాగిన దళిత వెనుక బడిన కులాల ఉద్యమం సుసంపన్నమైన అనుభవాలెన్నింటినో మన ముందుంచింది.జాత్పాత్ తోడక్ మండలి, దళిత పాంథర్స్ పోరాటం, ఆర్య సమాజ్,అనేక కుల వివక్ష వ్యతిరేక పోరాటాలు అనేక హక్కులు సాధించినా, కుల వ్యవస్థను నిర్మూలన చేయలేకపోయాయి.ఇందుమూలంగా హిందూ మత సంస్కరణ,ప్రజాస్వామీకరణ సాధ్యం కాదని అందులో మహిళ,దళిత,వెనుకబడిన కులాల ఆత్మగౌరవం,రిజర్వేషన్లు కూడా దక్కని దుస్థితి నెలకొనడం వల్ల కుల వ్యవస్థ రద్దు చేయబడాలనే డిమాండ్ ఈ మిత్రుల నుండి ముందుకు రావడం హర్షణీయం.
తేదీ. 1-4-2026.

Leave a Reply